Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- NOT DO OR DIE.. DO ONLY
దేశంలో ప్రముఖ విద్యావేత్తలు, మానసిక శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, వారి పిల్లలు.. అంటే విద్యార్థులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలతోనే కాక విద్యారంగం పట్ల ఆసక్తి.. ఆందోళన ఉన్నవారందరూ సమావేశమైన ఒక పెద్ద భవనంలోని ఒక కిక్కిరిసిన హాలు. విద్య, రాష్ట్ర విద్యా విధానం, ఉన్నత విద్య, ఎవరి బాధ్యత ఎలా వుండాలి, ఎంతెంత ఉండాలి... ఇలా అనేక అంశాల మీద తెలుగులో, ఇంగ్లీష్‌లో అద్భుత ప్రసంగాల ప్రవాహం. చప్పట్ల హోరు.
ఒక ప్రముఖ పాఠశాల తన 7, 8, 9, 10 వ తరగతుల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఓ పెద్ద విద్యా సదస్సు అది. ఒక ప్రముఖ విద్యావేత్త విద్యార్థులను కేంద్రంగా చేసుకుని ప్రసంగం ప్రారంభించి, చక్కగా మాట్లాడి చివరగా వారితో సంభాషిస్తూ వారి ప్రశ్నలకు సమాధానాలిస్తూ, తాను ప్రశ్నలు వేస్తూ పరస్పర సంభాషణం చేస్తూ. పిల్లల్ని.. ''చదువైన తరువాత మీరు ఏం కావాలనుకుంటున్నారు?'' అని అడుగుతున్నాడు.
డాక్టర్.. లాయర్.. బిజినెస్ మాన్.. ఇలా విద్యార్థులు సమాధానాలిస్తున్నారు. ఒక విద్యార్థి.. ''I want to be alive when I finish my education'' అన్నాడు.
అంతే హాలంతా నిశ్శబ్దమైపోయింది. నిర్ఘాంత పోయింది. కొద్దిసేపు ఎవరికీ మాట పెగల్లేదు.
''..... చిన్నప్పటి నుండి మాకు ఒత్తిడే. స్కూల్లో చేరే ముందు ప్రవేశ పరీక్ష.. ఇంటర్వ్యూ ఉంటుంది. దానికి మా అమ్మానాన్నలు మమ్మల్ని తయారు చేస్తారు. ఆ తరువాత మోయలేనన్ని పుస్తకాలు, చదవలేనంత సిలబస్.. అనాలోచితంగా, హడావిడిగా నిర్ణయించే సిలబస్, దాని మీద పట్టు తెచ్చుకుని పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు... మేమెంత జాగ్రత్త తీసుకుంటున్నామో చూడంటూ ఆ సబ్జెక్టుల్లో నిష్ణాతులతో బోధన. వీటితో అర్థ సంవత్సరం పూర్తవుతుంది. ఇక మేము.. గ్రహింపు శక్తి ఉన్నవాళ్లు కొత్త విషయాలను త్వరగా నేర్చుకుంటారు. అయినా సరే.. తల్లిదండ్రులు మాకు ట్యూషన్స్ పెట్టిస్తారు. వాళ్ల బాధ్యతలు.. ఉద్యోగాలు చేస్తూనే మమ్మల్ని ట్యూషన్ దగ్గర దించటం చేస్తారు. మేము పొందే ర్యాంకులు.. గ్రేడ్స్ గమనిస్తూ వుంటారు. ఇక పాఠశాలలు తపన.. కషి.. మేము బాగా చదువుకుని, మంచి ఉద్యోగాలు పొంది ఉన్నత దశకు చేరుకునిగొప్పగా స్థిరపడాలని వారి తపన.. ఆరాటమే వారింత ఒత్తిడికి గురవుతూ మమ్మల్ని గురి చేస్తున్నారు. వీటికితోడు మా ఇతర పోటీదారులను Peers చూసి వారినధిగమించాలని మాకై మేము తెచ్చిపెట్టుకునే ఒత్తిడి. ప్రవేశ పరీక్షలు.. మంచి యూనివర్సిటీలు.. మంచి కోర్సులు.... Do or Die అన్నట్టుగా.... ఇలా ఒక ప్రవాహంలా.. ఒక్కొక్కచోట వరదలా.. జలపాతంలా.. మరొక చోట ఊబిలా... మమ్మల్ని అంటిపెట్టుకునే వుండే ఈ ఒత్తిడిని శారీరకంగా.. మానసికంగా... తట్టుకుని.. నిభాయించుకుని.. తెప్పరిల్లి బతికి బట్ట కట్టినప్పుడు కదా.... ''What do you want to be?'' అన్న మీ ప్రశ్నకు ప్రశాంతంగా మనసు విప్పి మీకు జవాబిచ్చేది.
''AM I WRONG IN ANSWERING YOUR QUESTION? I DO NOT MEAN ALL THE STUDENTS FEEL THE WAY I DO. STRESS IS THRUST UPON US, ISN’T IT?''
ఆ విద్యా సదస్సులో ఆ విద్యార్థి ఉదంతం ఇక్కడ ఎందుకు ఉదహరించవలసి వచ్చింది? - ఎందుకంటే.. ఒత్తిడి విద్యార్థుల జీవితంలో ఎలా అంతర్భాగమయ్యిందో స్పష్టం చేయటం కోసమే. చదువుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. చిన్నప్పుడు కాన్వెంట్లోకి అడుగుపెట్టబోయే ముందు నుండి ప్రారంభమయ్యే ఈ ఒత్తిడి విద్యార్థి జీవితమంతా అతని వెన్నంటే వుంటోంది.
ఇది తప్పనిది, తప్పించుకోలేనిది అయ్యింది. చదువు పూర్తయిన తరువాత ఉద్యోగాల వేటలో కూడ మీ వెన్నంటే ఉంటుంది. కాదంటారా?
ఈ ఒత్తిడి మీ ఒక్కరికే కాదు మీ స్నేహితుల్లో కొంత మందికి ఉండచ్చు. మీ నగరంలో చాలామందికి ఉండవచ్చు. అలా దేశం దష్ట్యా చూస్తే చాలా మందికి ఉంటుంది. ఊపిరి తీసుకోవటం ఎంత సహజమో ఒత్తిడితో వుంటూ ప్రయాణం చేయటం విద్యార్థులకే కాదు, అనేకమందికి తప్పటం లేదు. అది మనం జీవన శైలిగా ఒక విడదీయలేని భాగమై పోయింది.
మిత్రులారా, ఈ విషయం మనస్సులో సదా పెట్టుకోండి. ''డిమాండ్‌కు మించిన సప్లై ఉంటే ఏ వస్తువులకు మంచి ధర రాదు. ఇది ప్రాధమిక ఆర్ధిక సూత్రం. ఇది వ్యాపారానికే కాదు. అన్నీ రంగాలకు.. ఇంకా లోతుగా చూస్తే జీవితానికి అన్వయించుకోవచ్చు. కెరీర్, ఉద్యోగాల విషయంలో చూసినా ఆ ఆర్ధిక సూత్రం వర్తిస్తుంది కదూ..! ఉద్యోగాలు తక్కువ.. వాటికి పొటీపడేవారి సంఖ్య చాలా.. చాలా ఎక్కువ. Cut-throat Competition... ఒక్కొక్క ఉద్యోగానికి ఎంతమంది పోటీ పడతారో.. పడవలసి వస్తుందో మీకు తెలియంది కాదు. ఇక్కడ... ఇక్కడే మీ చదువు సారం వ్యక్తమయ్యేది. ఒత్తిడే నేపథ్యంగా సాగే మీ లేదా నేటి విద్యాకాలంలో చదువు ద్వారా మీరు పొందిన జ్ఞానాన్ని, వివేచనను, విచక్షణను చూపించాలి.
ఇది పోటీ ప్రపంచం. పోటీ అనగానే ఒత్తిడి ఉంటుంది. ఈ నాణానికి రెండు ముఖాలు.
కొందరికి ఒత్తిడి ఒక అద్భుత చోదకశక్తి, ప్రేరకం.
''ఒత్తిడిలో చాలా పనులు చక్కగా చేయగలం. మేము చేసాం'' అనే వాళ్ళున్నారు. ఇది ఒక దష్టి.
''ఒత్తిడి మాలో ఒక భయాన్ని.. ఆందోళనను కలిగిస్తుంది. దాని వల్ల చేయగలిగిన పనులు చేయలేపోతున్నాం. నెర్వెస్నెస్ వస్తుంది. దాంతో మా శక్తి యుక్తుల్ని సరిగానే కాదు, పూర్తిగా ఉపయోగించలేకపోతున్నాం''' అనే వాళ్ళు ఉన్నారు.
అవునా.. కాదా..? పోటీ లేని రంగమే లేదు నేటి ప్రపంచంలో. పోటీ అనివార్య మైనది కనుక, పోరాడక తప్పదు కనుక శక్తి మేరకు పోరాడాలి. ప్రయత్నం గట్టిగా చేయాలి.
వ్యాపార రంగంలో తరచూ వినిపించే మాట SWOT. తమ అమ్మకాలు ఎలా ఉన్నాయో.. తమ ఉత్పత్తులకు మార్కెట్ ఎలా వుందో... పోటీ సంస్థలలో ఏది తమకు గట్టి పోటీ ఇస్తుందో. దాని నుండి వచ్చే ప్రమాదాలేమిటో వీటిని తెలుసుకునేందుకు ప్రతి సంస్థ తనను విశ్లేషంచుకుంటూ ఒక అంచనా వేసుకుకోవటాన్నేSWOT ANALYSIS అంటారు.
SWOT ANALYSIS :
SWOT... ఈ ఆక్రోనిమ్... లోని మాటల అర్ధం తెలుసుకుందాం.
S.... STRENGTHS
W.. WEAKNESS
O.. OPPORTUNITIES
T.. THREATS.
దీన్ని మనబలాబలాలను తెలుసుకుని మనం గురించే ఒక స్వీయ అంచనా వేసుకునేందుకు ఒక సాధనంగా వాడుకోవచ్చు. జీవితంలో స్థిర పడేందుకు అవసరమైన ఉద్యోగం సంపాదించుకునే క్రమంలో ఏర్పడే ఒత్తిడిని తొలగించు కోవటానికి ఉపయోగించుకోవచ్చు. దానివల్ల భయం తొలగి, ధైర్యం వస్తుంది. అప్పుడు పోటీకి తయారుకాగలం.SWOT ANALYSIS ను ఎలా మనం ఉపయోగించుకోవచ్చో చూద్దామా ?
1. STRENGTHS :
ఏ పని చేయాలనుకున్నా ముందు శక్తి సామర్ధ్యలు ముఖ్యం. తెలివితేటలు, చురుకు దనం, పట్టుదల, కష్టపడే మనస్థత్వం, ఆశావహ దక్పధం, వేగవంతమైన విషయావగాహన, విశ్లేషణా శక్తి, త్వరితమైన సమస్యా పరిష్కార శక్తి, క్రమశిక్షణ మెదలైనవి. వీటన్నిటికి మించి మన శక్తి మీద నమ్మకం. వీటిని వీడకూడదు. వీటి కలయికే మన అంతర్గత బలం. ఇది మనకు తెలిసినంత బాగా ఇంకెవరకూ తెలియదు. ఇది నిజంగా మనకుందా, ఉంటే ఏ స్థాయిలో ఉన్నదనేది గుర్తించగలిగేది ప్రప్రధంగా మనమే. దీని వెన్నుదన్ను వల్లే కదా మనం చదువులో రాణించేది. అలాగే మనమనుకున్న లక్ష్యం చేరటానికీ ఇదే మనల్ని నడిపించేది. అలాగే ఈ ఉద్యోగాల వేట పోటీలో కూడ ఇది అతి ముఖ్యమైన పాత్ర వహించేది. ఈ అంతర్లీన శక్తే మనకి ఉద్యోగాల పోటీ పరీక్ష కు వెళ్లేందుకు పెద్ద అండగా నిలబడుతుంది. మనం రాయబోతున్న పోటీ పరీక్ష కనుగుణంగా మన శక్తి యుక్తుల్ని వినియోగించే నైపుణ్యం, చూపు వుండాలి. అలా ఎప్పటికప్పుడు యుద్ధాన్ని బట్టి తంత్రాన్ని మార్చినట్టుగా మన తెలివితేటల్ని మార్చుకుంటూ ఉపయోగించుకోవాలి.
మీ ఈ యుద్ధ తంత్ర నైపుణ్యమే మిమ్మల్ని మీ తెలివి తేటలతో సమానమైన వారి నుండి నుండి వేరు చేసేది. ఈ నేర్పరితనమే మీకోక ప్రత్యేకతనిచ్చి మీతో పాటు ఉద్యోగానికి పోటీ పడే వారి సంఖ్యను కొద్దిగా తగ్గిస్తుంది. ఇది మీ ప్రథమ విజయం.
2. WEAKNESSES :
మీ బలహీనతలలో మొట్టమొదటిది మీ బలం ఏమిటో మీకు తెలియకపోవటం. తెలుసుకోలేకపోవటం. అస్పష్టత, అపనమ్మకం. మీ శక్తి మీద మీకు ఒక స్థిరాభిప్రాయం లేక డోలాయమాన స్థితిలో ఉండటం. ఒకసారి ''నాకు తెలివితేటలు వున్నా వాడగలనా..!?'' అని. మరొకసారి ''నాకు తెలివి తేటలున్నాయా..?'' ఇలా మీ మనస్సు ఊగిస లాడుతుంది. ఇది మీలో ఉన్నట్లయితే తక్షణమే ఆ రకమైన ఆలోచనాసరళిని పారద్రోలండి. అప్పుడే మీరు ఉద్యోగ పోటీ పరీక్షలో పాల్గొన గలరు.
DRIVE THAT DEVIL OUT. మీలో కొంతమందికి పట్టుదల, క్రమశిక్షణలు ఉండవు. సోమరితనం, అనాసక్తత. ఇవేకాక మిమ్మల్ని మీరు అతిగా, అర్ధరహితంగా విమర్శించుకునే అలవాటు ఉండచ్చు. ఒకవేళ ఉంటే తక్షణమే దాన్ని వదలిపెట్టండి. నిరాశావాదం, సిగ్గరితనం, ఇంత మందితో నేను పోటీ చేసి నెగ్గుకు రాగలనో లేదోనన్న అనుమానం.. ఇటువంటి బలహీనమైన మన:స్థితిలో మీరు పోటీ పరీక్షలలో అసలు పాల్గొనగలరా? ఒకవేళ పాల్గొన్నా మీరు విజయం సాధించగలరా..!? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి? ఏ సమాధానం వచ్చింది..?
ఇప్పుడు చెప్పండి మిత్రులారా.. మిమ్మల్ని మీరు మార్చుకోవాలా వద్దా..? ఉద్యోగాలకు తగ్గ టెక్నికల్ నాలెడ్జి.. ఇంటర్నెట్.. కంప్యూటర్.. వుందా? లేకపోతే అది ఒక బలహీనతవుతుంది. మీరు అప్లై చేస్తున్న ఉద్యోగాలు, వాటి అర్హతలు తెలుసుకోండి. అవి మీకు కొరవడితే /లేకపోతే వాటిని పొందండి. అన్నిటి కన్నా మీలోని పెద్ద బలహీనత.. మనమీద, మన బలం మీద విశ్వాసం లేకపోవటం. విశ్వాసం మీకు అనంతమైన బలాన్నిస్తుంది.
3. OPPORTUNITIES :
''ఆకాశం నీ హద్దురా...
అవకాశం మరవద్దు రా..''
అన్న వేటూరి సుందర రామమూర్తి చెప్పిన మాటలు మనస్సులో పెట్టుకోండి. ప్రతిభ ఉన్నవారికి అవకాశాలు లెక్కపెట్ట లేనన్ని. మీకున్న ప్రతిభను చక్కని ఆలోచనతో, ప్రణాళికతో, వ్యూహాత్మకంగా ఉపయోగించు కోగలగాలి. అది సాధన ద్వారా చేకూరుతుంది.
4.THREATS :
అంతర్గతం.. బాహ్యమని రెండు రకాలు.
ఉద్యోగం పోటీ పరీక్షకు కావలసిన మానసిక సంసిద్ధతత మీలో లేకపోవటం. దీన్నే విపులంగా. బలహీనతలు.. అన్న రెండో పాయింట్ దగ్గర వివరించాను.
బాహ్యమైనవి అంటే తోటి పొటీదారులు.. వారి తెలివి తేటలు... ఉద్యోగాన్ని ఎలాగైనా కొట్టాలని తయారుచేసుకున్న యుద్ధ తంత్రం. నియమబద్ధమైన ప్రెపరేషన్.. అన్నిటికీ మించి వారి ఆత్మవిశ్వాసం.
ఇలా SWOT ANALYSIS ని మీ ఈ ఉద్యోగాల పోటీ పరీక్షలకు అన్వయించుకుని మీరు విజయం సాధించవచ్చు.
కొంతమంది తమ తెలివి తేటల మీద, సూక్ష్మ గ్రాహత్వం మీద మితిమీరిన విశ్వాసం కలిగి వుంటారు. ఇది ఇంతా అని చెప్పలేనంత ప్రమాదకరమైనది. ఎంతో హాని చేస్తుంది. ఇది ఉన్నవాడు ఖచ్చితంగా కొలువు కొట్టవలసినవాడైనా రాదు. అలా జరిగినవేళ అతడికి తన మీద తనకే విశ్వాసము పోతుంది. నైరాశ్యానికి గురై పోటీ పరీక్షలంటేన బెరుకు.. భీతి ఏర్పడుతుంది.
అందుకే మిత్రులారా.. విశ్వాసం కావాలి.. అతి విశ్వాసం వద్దు.
డార్విన్ చెప్పిన ఈ మాటలు చూడండి. ఈ పోటీ ప్రపంచంలో మిమ్మల్ని ఎలా మలుచుకోవాలో తెలుస్తుంది.
''మారుతున్న పర్యావరణానికి అనుగుణంగా తాను మారుతూ మనగలిగేవాడు, మనగలిగే జాతి బలమైనది.''
- బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు