Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శంకరయ్య శంకర్రావు కావడానికి చాలా యేళ్ళే పట్టింది. సీనయ్య శ్రీనివాసరావు కావడానికీ అన్నేళ్ళే పట్టేయి. అయితే ఇద్దరి స్నేహమూ చాలా ఏళ్ళుగా కంటిన్యూ అవుతూ వచ్చింది. శంకర్రావుగా శంకరయ్య రిటైరయ్యేడు. సీనయ్య శ్రీనివాసరావుగా విశ్రాంత జీవి అయ్యేడు. రిటైరవక పోవడానికి ఇద్దరూ వంశపారపర్యంగా రాజకీయ నాయకులు కాదు మరి. రిటైర్మెంటు లేని పదవులు నిర్వహించడం లేదు కదా.
రిటైరయ్యేక శంకర్రావుకు ఏదో ఒకటి చెయ్యాలని ఉండేది. శ్రీనివాసరావుకు ఏంచెయ్యాలా అనే ఆలోచన పెదప్దగా ఉండకపోయేది. ఓ నాడు 'పబ్లిక్ పార్కు' 'ప్రైవేట్ పార్కు'గా మారే సమయం దగ్గర పడుతుంటే తన మనసులోని మాట బైటపెట్టాడు శంకర్రావు. తను కాలేజీలో ఉన్నప్పుడు కవిత్వం రాసే వాడినని ఈ విశ్రాంత జీవనంలో మళ్ళీ రాసి ప్రఖ్యాత కవినైపోవాలని ఉందని.. లోపలికి వస్తున్న జంటల వైపు చూస్తున్న శ్రీనివాసరావు ఉలిక్కి పడ్డాడు. రిటైరైన వారంతా, కవులై పోతున్నారిదో సరికొత్త 'ట్రెండు' అనుకున్న శ్రీనివాసరావు ౖ'ఇప్పుడు అందరూ కవులేరా. వినేవాడూ చదివేవాడూ మిగల్లేదు మరి. ఏం సాధిద్దామనుకుంటున్నావు? ప్రభుత్వ భజన గీతాలు ఒక వేళ రాయగలిగి ఏదైనా సర్కారీ కవి సమ్మేళనంలో జాగా సంపాదిస్తే ఓ శాలువా రెండు వేల రూపాలయలు సంపాదిస్తావు. అదే ఇప్పుడు కవుల 'మార్కెట్ వాల్యూ'. కానీ ఉరేరు ఈ వృత్తిలో రాబడికంటే పోబడీ చేతబడీ ఎక్కువ. 'డ్రైనేజీ స్కీములేక డేంజర్‌గా' మారుతున్న ఈ రంగంలో నిలదొక్కుకోవడం అంత 'ఈజీ' కాదు. 'తెలుగు నేల కవుల్ని ఈనుతున్నదే కాని సారవంతమైన కవిత్వాన్ని కాదు' అంటూ 'గుడ్‌నైట్' చెప్పాడు శ్రీనివాసరావు. గుడ్‌నైట్ చెప్పుకున్నారు కానీ ఇద్దరికీ అది 'బ్యాడ్ నైట్' అయ్యింది. ఆస్తమా కారణంగా శ్రీనివాసరావుకు నిద్రపట్టలేదు. కవి కావాలనన్న 'ఆంగ్జయిటీ' తో శంకర్రావు కునుకెయ్యలేదు.
కలం పట్టుకున్న శంకర్రావు కాగితం మీద అక్షరాల విత్తనాలను వెదజల్లలేక పోయాడు. రాయడానికి ఓ 'ఊపు' ఓ 'సునామీ' రావడానికి లోగడ తను రాసిన మీగత తరకల్ని పుస్తకంగా వెయ్యాలనుకున్నాడు. తను రాసిన కవితల్లో 'ఆదివారం వస్తే పార్టీ ఇస్తా, సోమవారం వస్తే మరేదో ఇస్తా, మంగళవారం వస్తే ఇంకేదో ఇస్తా' అన్న కవిత 'గొప్ప'గా ఉందనిపించి కవితా సంపుటికి అదే పేరు పెట్టాడు. కవిత్వాన్ని అచ్చు వేసే వాడు అంకితం పుచ్చుకునే నాథుడూ లేదు కనుక కవులు పుస్తకాల అచ్చుకోసం 'కొంప కొల్లేరు' చేసుకుంటున్నారని వద్దు వద్దని ఎవరు వారించినా వినిపించుకోలేదు. రేపు ఏదైనా 'అవార్డో రివార్డో' వస్తే అదంతా నీకే అని భార్యకు నచ్చజెప్పాడు. అవార్డులు సంపాదించే రహస్యం తెలీని శంకర్రావు. తనను ప్రసిద్ధ లేక ప్రఖ్యాత కవిని చెయ్యాలని శ్రీనివాసరావును కోరాడు శంకర్రావు. ఉచిత సలహాలు యివ్వడానికి శ్రీనివాసరావు 'రడీ' అయిపోయేడు. ఎవరి పుస్తకాన్ని వారే 'మార్కెట్' చేసుకోవాలి. అందరు ఎవరి పుస్తకాన్ని వారే 'హంగార్భాటం'గా ఆవిష్కరింప చేసుకోవాలి. ఆ విషయం పత్రికల్లో రావాలి, 'లైక్'లు కుప్పకూలాలి అనగా పడాలి' అన్నాడు శ్రీనివాసరావు ఉచితంగా.
సభకు అధ్యక్షుడిని, విశిష్ట అతిథుల్ని, ఆత్మీయ అతిథుల్ని, వక్తల్ని బతిమాలి బామాలి, సభానంతర కార్యక్రమం ఆశపెట్టి ఒప్పించారు మిత్రిలిద్దరు. ఫొటోలకు, హాలు బుకింగుకూ, స్నాక్సుకు, పత్రికల వారికీ కలిపి పదివేలు ఖర్చవుతుందన్నాడు నిర్వాహకుడు. 'మెడకు పడ్డ కవిత్వం కరవక తప్పదు' అన్నాడు శ్రీనివాసరావు. వెర్రి నవ్వు నవ్వాడు కాబోయే కవి శంకర్రావు.
ప్రసిద్ధులు కాని కవులే లేరు కదా తెలుగులో. చాలా మంది ఫోన్ నెంబర్లు సంపాదించి ఫోను చేశాడు, వాట్సాప్పులో కార్డు కూడా పెట్టాడు శంకర్రావు. తప్పక వస్తామని నమ్మబలికేయి కవి కోకిలలు. కొంత మంది పుంగవులు మాత్రం వస్తే ఇస్తా పుస్తకం ఫ్రీగా ఇస్తామనగా 'ఇస్తే వస్తా'మని అన్నారు. కవులు కవులే అవుతారు కాని ప్రేక్షకులు కాలేరు. వస్తామని నమ్మబలికిన వారెవరూ సభకు రాలేదు. బంధువులూ, మిత్రులూ ముఖం చాటెయ్యలేక వచ్చి మొబైళ్ళు చూసుకుంటూ కూర్చున్నారు. శంకర్రావు తెలుగు కవిత్వానికి అంది వచ్చిన మణిపూస అని 'వస్తే ఇస్తా' లో మీగడతరకలు తెలుగు తల్లికి విశిష్ట నైవేద్యం అని పొగిడారు వక్తలు అతిథులు.
పుస్తకాల వాళ్ళు కవిత్వం అమ్ముడు పోదు కనక తీసుకోం అన్నారు. మిత్రులు కవిత్వం అర్థం చేసుకోగలిగేంత గొప్ప వారు కామని 'వస్తే ఇస్తా' ఉచితంగా ఇచ్చినా వద్దంటే వద్దన్నారు.
ఇల్లంతా సామాన్లు పరిచి కప్‌బోర్డులన్నీ 'వస్తే ఇస్తా'లు నింపే శంకర్రావు వంటి కవులు కవిత్వం రాయకుండా పుస్తకం వేయకుండా ఉండగలరా? అసలు కవిత్వానికి, పుస్తకానికి మంచి రోజులు వస్తాయా మళ్ళీ;!!
-చింతపట్ల సుదర్శన్, 9299809212