Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వితంతు వివాహలు జరగాలని ఎందరో సంఘసంస్కర్తలు స్త్రీల పక్షాన నిలబడి పోరాడారు. మన తెలుగుదేశంలో వీరేశలింగం పంతులు, బెంగాల్లో రాజా రామ్మోహన్ రారు ఈ విషయంలో ఎంతో కషి చేసిన విషయం మనకు తెలుసు. కాని వితంతు వివాహాలను ఆమోదించిన ప్రదేశాలలో ఆ వివాహాల మాటున స్త్రీలపై జరిగిన అత్యాచారం, దోపిడి గురించి తెలుసుకుంటే బాధ కలిగించే చాలా విషయాలు బయటపడతాయి. ప్రపంచం అంతటా కొన్ని తెగలలో భర్త చనిపోయిన స్త్రీ అతని సోదరున్ని వివాహం చేసుకోవాలనే ఒక పద్ధతి ఉంది. దీన్ని అంగ్లంలో లెవిరేట్ మారేజ్ అంటారు. ఇండొనేషియా, జపాన్, కొరియా, మరొకొన్ని ఆఫ్రికా దేశాలలో ఈ పద్ధతి ఎన్నో తరాల నుంచి నడుస్తూ ఉంది.
మన దేశంలో పంజాబ్ హర్యానా రాష్ట్రాలలో కొన్ని చోట్ల ఈ పద్ధతి పాటిస్తారు. హర్యానాలో దీన్ని లట్టా ఓఢ్నా అని పంజాబ్‌లో చాదర్ ఢక్నా అని పిలుస్తారు. ఈ వివాహం ఆ ఇద్దరికి ఇష్టమా లేదా అని పక్కనపెట్టి తప్పకుండా కుటుంబం కోసం జరగవలసిన సాంప్రదాయంగా పాటిస్తారు. చాలా సందర్భాలలో ఆ మరిది వదిన కన్నా ఎన్నో ఏళ్ళూ చిన్నవాడిగా ఉంటాడు. అయినా ఈ వివాహం జరగవలసిందే. ఆ తరువాత అతను మరో వివాహం చేసుకోవచ్చు కాని వదిన మాత్రం అతనికే సొంతం అవుతుంది. ఇలా జరిగిన వివాహాలలో ఆస్థి విషయంలో ఆమెకు ఆమె పిల్లలకే ప్రాధ్యాన్యత ఉంటుంది. ఆ రెండో భార్య పిల్లలకు ఆస్థి హక్కు ఉండదు. ఇది ఆ వితంతువుకు సమాజం ఇచ్చే హక్కు. కొన్ని రాజ కుటుంబాలలో ఈ సాంప్రదాయం ఉన్నట్లు మనకు ఉదాహరణలు ఉన్నాయి. గ్రీకు నాటకాలలోనూ ఈ సాంప్రదాయాన్ని చూసాం. భారతదేశంలో ఈ రెండు రాష్ట్రాలలో ఈ పద్ధతి ఎంత అనాగరికంగా పాటించేవారంటే ఒకవేళ మరిది ఈ వివాహానికి అంగీకరించకపోతే ఆ వదిన పెద్ద మనుషుల ముందు అతని ముఖంపై ఉమ్మి అవమానిస్తుంది. అతని చెప్పులలో ఒకటి తీసి పడేస్తుంది. ఊరంతా అతన్ని చెప్పులేని వాడుగా పిలిచి అవమానిస్తారట.
ఇది ఒక రకంగా వితంతువుల రక్షణ కోసం ఏర్పడిన సాంప్రదాయం అని చెబుతారు. కాని దీనికి ముఖ్య కారణం, భర్త ఆస్థి కుటుంబంలోనే కలిసి ఉండాలనే ఆలోచన. హిందూ చట్టం 1956లో వితంతువులను భర్త ఆస్థికి వారసులను చేసింది. దీనితో ఇలాంటి వివాహాల సంఖ్య ఇంకా పెరిగింది. భూమి ఆస్థిగా ఉన్న అన్ని తెగలలో ఈ సాంప్రదాయాన్ని పాటించారు. ఇది ఒకప్పటి అనాగరిక చర్య అనుకునే వారికి ఒక ఆశ్చర్యపరిచే ఉదాహరణ ఇక్కడ ఇవ్వదలచాను.
పంజాబ్ ప్రాంతంలో ఎక్కువ మంది సైన్యంలో చేరతారని మనకి తెలుసు. సైన్యంలో భర్త మరణిస్తే ప్రభుత్వం భార్యకు కాంపెన్సేషణ్, పెన్షన్ అందిస్తుంది. చనిపోయిన సైనికుడి పిల్లల ఎదుగుదల కోసం ఈ డబ్బు అందిస్తుంది ప్రభుత్వం. కాని ఆమె ఏ కారణంగానైనా భర్త సోదరుడిని కాకుండా మరొకరిని వివాహం చేసుకుంటే ఈ డబ్బు ఆమెకు అందదు. ఇది పంజాబ్ ప్రభుత్వ రూలు ఇప్పటికి కూడా.. ఆశ్చర్యంగా లేదు...
సిఖ్ రెజెమింట్, 11వ బెటాలియన్‌కి చెందిన మేజర్ రమన్ దాదా మే 1999న అసాంలో మిలిటంట్ల కాల్పుల్లో మరణించారు. అతనికి ప్రభుత్వం మరణానంతరం కీర్తి చక్ర ఇచ్చి గౌరవించింది. అతని భార్య అంజనీ దాదాకు పంజాబ్ ప్రభుత్వం గాలెంటరీ అవార్డు కింద డబ్బు ఇవ్వడం మొదలెట్టింది. 2005కి అది నెలకు 13,860 అయింది. ఇదే సంవత్సరం ఆమె పునర్వివాహం చేసుకున్నారు. తన భర్త సోదరున్ని కాకుండా మరొకరిని వివాహం చేసుకున్నందుకు ఆమెకు ఆ పెన్షన్ నిలిపివేయబడింది. 2021లో కూడా ఆమె ఈ పెన్షన్ కోసం మళ్ళీ ప్రభుత్వాన్ని అభ్యర్ధించినా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమె అభ్యర్ధనను తోసి పుచ్చింది. 2011లో ఆమె తన రెండవ భర్త నుండి విడిపోవలసి వచ్చింది. మొదటి భర్తతో ఆమెకు ఒక కొడుకు, రెండవ భర్తతో ఒక కుమార్తె కలిగారు. ఆరొగ్యం పాడయిపోయి ఆమె పెన్షన్ కోసం మళ్ళీ మళ్ళీ తిరగవలసి వస్తుంది. కాని ఇప్పటికి ఆమెకు ఆ పెన్షన్ మంజూరు కాలేదు. ఆమె భర్త సోదరుడిని లేదా అదే కుటుంబంలో భర్తకు సోదరుడి వరుస అయిన ఎవర్ని ఆమె వివాహం చేసుకున్నా ఈ పెన్షన్ ఆగేది కాదట. పంజాబ్‌లో వితంతు వివాహాల పద్ధతి గురించి ఈ సంఘటన ఆలోచింప జేస్తుంది. (ఈ సమాచారం అంతా ఇప్పుడు నెట్ లో లభిస్తుంది)
ఈ సాంప్రదాయంపై 1962లో రాజెందర్ సింగ్ బేడి ''ఎక్ చాదర్ మైలీ సీ'' అన్న నవలను ఉర్దూ భాషలో రాసారు. ఇది తరువాత హిందీ, ఇంగ్లీషు, బెంగాలీ భాషలలోకి అనువాదమయింది. 1965లో దీనికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. దీన్ని సినిమాగా తీయాలని ఆయన మొదట ప్రయత్నించినప్పుడు గీతా బాలిని హీరోయిన్గా తీసుకోవాలనుకున్నారు. కాని ఆమె హఠాత్ మరణం తరువాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. తరువాత 1986లో ఈ కథను తీసుకుని హేమామాలిని ముఖ్యపాత్రలో నటించగా హిందీలో ఇదే పేరుతో సినిమా తీసారు బేడి. సుఖవంత్ దద్దా దీనికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో పంజాబ్ జాట్ కుటుంబాల స్త్రీల జీవితాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.
సినిమా నాయిక రానో అందమైన స్త్రీ. ఆమెకు ఆత్మగౌరవం, ధైర్యం ఎక్కువ. ఆమె భర్త త్రిలోక్ సింగ్ టాంగా నడిపిస్తూ ఉంటాడు. వీరికి ఇదరు పిల్లలు. రానో ఎంత తెలివైన స్త్రీ అయినా ఆమె స్థానం ఆమె భర్త తరువాతే. ఆమె తీసుకొచ్చిన కట్నం, ఆమె పిల్లలు, ఆమె మనసు, శరీరం వీటన్నిటిపై హక్కు ఆమె భర్తదే. త్రిలోక్ పక్కా పురుషాహంకారి. ప్రతి రోజు తాగడం, అసహ్యకరమైన బూతులు ఉపయోగించడం, తాగుడు మానమంటుందని భార్యని కొట్టడం, తనకు కావలసినవి అధికారంతో సొంతం చేసుకోవడం అతని నైజం. అత్తగారైన జిందా సింగ్ కొడలిని నిరంతరం సతాయిస్తూ ఉంటుంది. గుడ్డివాడైన మామగారికి కోడలిపై ఎంతో సానుభూతి కాని ఏమీ చేయలేని పరిస్థితి. తన నిస్సార జీవితంలో ఉత్సాహం నింపుకుని జీవించడం అలవాటు చేసుకుంటుంది రానో. అన్ని కష్టాల మధ్య కూడా నవ్వుతూ గడుపుతుంది. ఆమెకు అన్ని రకాలుగా సహయంగా ఉంటాడు మరిది మంగల్ సింగ్. మంగల్ అంటే రానోకి చాలా ప్రేమ. తన కళ్ళ ముందు పెరిగిన అతడిని కొడుకులా చూసుకుంటుంది రానో. అల్లరి చిల్లరగా తిరిగె మంగల్ ఒక బంజారా యువతిని ప్రేమిస్తాడు. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకుంటారు.
త్రిలోక్ అహంకారి కాని పెద్దగా తెలివైనవాడు కాదు. ఆ ఊరిలో రాత్రి పూట రైలు దిగిన ఒక అమ్మాయిని ఊరి సత్రంలో దించుతాడు. ఆ సత్రం నడిపే ఉరి పెద్ద స్త్రీ లోలుడు. ఆమెను అక్కడ త్రిలోక్ దించినట్లు తెలుసుకున్న ఊరి పెద్దల కుమారులు ఆమెపై అత్యాచారం చేసి చంపేస్తారు. ఆమె శవాన్ని చాపలో చుట్టలా చుట్టీ, త్రిలోక్ టాంగాలో దాన్ని ఉంచి, అది ఎక్కడో పారవేయమని త్రిలోక్‌కి చెబుతారు. త్రిలోక్‌కి తన టాంగాలో శవం ఉన్నదని తెలియదు. ఈ విషయం అర్ధం చేసుకోకుండా టాంగా తోలుకుంటూ వెళ్ళిపోతాడు. అయితే ఆ చాప చుట్టలో నుండి ఆ అమ్మాయి మొహం బైటపడి దారిలో ఆమెకోసం వెతుకున్న ఆమె అన్న కంట ఆ శవం పడుతుంది. త్రిలోక్ తన చెల్లిని హత్య చేసాడని, పైగా శవం మాయం చేయబోతున్నాడని నమ్మి అతను త్రిలోక్‌ని చంపేస్తాడు.
రానో వితంతువు అవుతుంది. ఇద్దరు పిల్లల భాద్యత, ఇంటి పనుల బాధ్యత, అత్త సూటిపోటి మాటలతో ఆమె నరకం అనుభవిస్తూ ఉంటుంది. ఊరిలో మగవారి చూపుల సంగతీ మరో సమస్య. ఇంటిని నడిపించడానికి మరో ఆధారం లేదు. ఈ సమయంలో వయసుకు వచ్చిన రానో కూతురుని పెళ్ళి పేరుతో అమ్మేయాలని ఆమె అత్త అనుకుంటుంది. రానో దీన్ని ప్రతిఘటిస్తుంది. మొదటిసారి ఆమె అత్తపై తిరగబడుతుంది. మంగల్ శతవిధాలా ఇంటికోసం కష్టపడతాడు. కాని పంట చేతికి వచ్చే సమయం ఇంకా చాలా ఉంది. రానోకి తన కూతురిని ఎలా కాపాడుకోవాలో అర్ధం కాదు. ఆ ఇంటి పరిస్థితి గమనించిన ఊరి పంచాయితీ రానో తన మరిదిని వివాహం చేసుకుంటే ఆమె సమస్యలన్నీ తిరతాయని అది సాంప్రదాయం అని పరిష్కారం చెబుతారు. ఇది ఆ వదినా మరదులిద్దరికీ ఇష్టం లేని పని. కాని ఏం చేయలేని నిస్సహాయత వారిని కమ్మేస్తుంది. బిడ్డలా పెంచిన మరిదిని రానో వివాహం చేసుకోవాలి, ప్రేమించిన యువతిని మంగల్ మరచిపోవాలి. ఇద్దరికి ఊహించని శిక్ష ఇది.
ఇష్టం లేకపోయినా ఈ పెళ్ళి జరిగిపోతుంది. నాలుగు వైపులా పసుపు రాసిన ఓ పెద్ద తెల్లటి దుప్పటి (చాదర్) రానో నెత్తి మీద పంచాయితీ సమక్షంలో వేసి మంగల్ ఆమెకు భర్త అవుతాడు. ఈ కొత్త బంధంలో ఇద్దరికీ ఒకరితో ఒకరు ఎలా మెలగాలో అర్ధం కాదు. తన జీవితంలో ఈ మార్పు మంగల్ జీర్ణించుకోలేకపోతాడు. అతనిలో పెరిగిన కోపానికి కూడా రానో బలవుతుంది. ఏ కారణంగా అన్నను అసహ్యించుకునేవాడో అవే గుణాలు మంగల్లో పెరగడం మొదలవుతాయి. భర్త అనే అధికారం, తన జీవితం ఇలా అవడానికి ఎవరో కారణం అన్న కోపం అన్నీ కూడా భార్య స్థానంలో ఉన్న రానో మీదకు మళ్ళుతాయి. ఒకప్పుడు అన్న తిట్ల నుండి దెబ్బల నుండి వదినని రక్షించి అన్నను ఎదిరించిన మంగల్ ఇప్పుడు అచ్చం త్రిలోక్ లాగానే ప్రవర్తించడం మొదలెడతాడు. రానో ఇవన్నీ మౌనంగా భరిస్తూ భార్యగా అతనికి లొంగిపోతుంది. అంతకన్నా ఆమెకు మరో ప్రత్యామ్నాయం కనిపించదు.
సినిమా చివర్లో త్రిలోక్‌ని హత్య చేసిన వ్యక్తి వచ్చి రానోని క్షమాపణ కోరి ఆమె కూతురిని వివాహం చేసుకోవడం నాటకీయంగా అనిపించినా దర్శకుడు ప్రశ్నించాలనుకున్న సాంప్రదాయాన్ని, దాని కింద నలుగుతున్న స్త్రీల జీవితాలను చూపించిన విధానం, అందులోని కూరత్వం ప్రేక్షకులకు చేరుతుంది. ఈ సాంప్రదాయం కింద జీవించిన కొందరు స్త్రీలపై జరిగిన రీసర్చ్ కూడా ప్రస్తుతం నెట్లో చూడవచ్చు.
ఆస్థి అన్నది కుటుంబ జీవితంలో అతి ముఖ్యమైన విషయం అయినపుడు మానవ సంబంధాలలో ఇలాంటి విషాదాలు చాలా కనిపిస్తాయి. కాని వీటన్నిటి మధ్య నలిగిపోయింది ఎక్కువగా స్త్రీలు. ఆ విషయాన్ని సూచించే ఈ సినిమా పంజాబ్ జాట్లలో ఎన్నో ఏళ్లుగా సాంప్రదాయంగా వస్తున్న ఈ విధానం వెనుక దాగున్న విషాదాన్ని, స్త్రీ పురుషల అసహాయతను చూపిస్తుంది. రానో పాత్రలో హేమామాలిని నటన ఆకట్టుకుంటుంది. త్రిలోక్గా కుల్భూషన్ కర్భందా, మంగల్గా రిషీ కపూర్ బాగా నటించారు.
- పి.జ్యోతి, 9885384740