Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎల్లప్పుడు ఆకాశమంతా మేఘాలతో నిండి ఉంటుంది కాబట్టి రవీంద్రనాథ్ ఈ రాష్ట్రానికి 'మేఘాలయ' అని పేరు పెట్టారని చెప్పారు. దాదాపు 8 - 9 నెలలు మేఘాలతో నిండి వర్షం పడుతూనే ఉంటుందట. కొండలు, అరణ్యాలు, ఎక్కడ చూసినా జలపాతాలతో పచ్చదనంతో నిండి పరిశుభ్రంగా అతి తక్కువ కాలుష్యంతో అలరారుతూనే ఉంటుంది. ఎక్కడకు వెళ్ళినా నీటి సవ్వడి, పక్షుల కిలకిలా రావాలతో వేరే లోకంలో ఉన్నట్లుంటుంది. ప్రకృతిని ఆస్వాదించే వారికి భూమిపై ఉన్న స్వర్గమే మేఘాలయ.
అతి తక్కువ సమయంలో నిర్ణయించుకుని నలుగురం ఎండలతో మండుతున్న హైదరాబాదులో బయలుదేరి గౌహతిలో విమానం దిగుతుండగానే చిరుజల్లు స్వాగతం పలికింది. అప్పటి నుంచి వచ్చే వరకు రోజులో అనేకసార్లు వర్షం పడుతూనే ఉంది. గౌహతిలో ఇరుకు రోడ్లు విపరీతంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. మేం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌కు కారులో బయలుదేరాము. దారి పొడవునా కొండలు, అడవులు, చెట్లు, పువ్వులు చూసుకుంటూ మధ్యలో ఉమియమ్ లేక్‌లో బోటింగ్ చేశాం. చుట్టూ ఎత్తైన కొండలు వాటిపై పైన్ చెట్లు, దిగువన మధ్యన పెద్ద లేక్ ఎంత సేపున్నా అక్కడ నుంచి కదలాలనిపించదు. రాత్రికి షిల్లాంగ్‌లో బస. రాత్రంతా చిన్నగా వర్షం పడుతూనే ఉంది. షిల్లాంగ్ కూడా చిన్న పట్టణం. చిన్న రోడ్లు. చిన్న చిన్న ఇళ్లు. ప్రతి ఇంటి ముందు రంగురంగుల పూల మొక్కలు చూడముచ్చటగా ఉన్నాయి. రాష్ట్రం మొత్తం చూసినా శుభ్రంగానే ఉంది. మహిళలపై దాడులు చాలా తక్కువట. ఎత్తుగా పెరిగిన చెట్లు, ఇళ్లు కలిసి కొండలపై తమాషాగా కనిపిస్తాయి.
ఉదయం బయలుదేరి వెళ్తూ ఎలిఫెంట్ వాటర్ ఫాల్స్ దగ్గర ఆగాం. ఒకటే మూడు స్థాయిలలో వేరువేరుగా కనబడుతూ కనువిందు చేస్తుంది. వర్షాల బాగా పడుతుండడం వలన జలపాతాలు నిండుగా, శబ్దంతో దూకుతున్నట్లున్నాయి. పై నుంచి చిరుజల్లు, జలపాతాల నుంచి వచ్చే తుంపర్లలో తడుస్తూ ఉంటాం. అక్కడ నుంచి మేఘాలయ రాష్ట్ర గిరిజన జాతి పవిత్రంగా భావించే 'సాక్రెడ్ ఫారెస్ట్' చేరాం. విశాలంగా వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ స్థానిక భాష ఖాసి. ఖాసి తెగకు చెందిన గిరిజనులు ఈ అడవిని పవిత్రంగా భావిస్తారు కనుక దాని ఆ పేరు వచ్చింది. అక్కడ ఉన్న గైడ్ అడవి లోపలికి తీసుకెళ్ళి 3 - 4 గంటలు తిప్పి తీసుకు వస్తాడు. అడవి అంతా వందల సంవత్సరాల నాటి చెట్లతో నిండి ఉంటుంది. వేల రకాల ఔషధ మొక్కలున్నాయి. అక్కడి గిరిజనులు నిలువుగా ఎత్తుగా ఉన్న రాయిని మగ దేవునిగా, అడ్డంగా వెడల్పుగా ఉన్న రాతిని స్త్రీ దేవతగానూ పూజిస్తారు. ప్రధానంగా మాంసాహారం ఎక్కువ. అడవిని ఎంత పవిత్రంగా భావిస్తారంటే ఎవరూ అడవిలోని అకులను కానీ, పువ్వులను కాని బయటకు తేకూడదని నియమం. ఒక రకంగా మంచి ఆచారమే. లేకపోతే మన నాయక వ్యాపారులు అడవిని మొత్తం ధ్వంసం చేస్తారు. చాలా చెట్ల ఉపయోగాలు, వాటి శాస్త్రీయ నామాలు చెప్పాడు గైడ్. రాత్రికి చిరపుంజి చేరాం.
చిరపుంజికి దగ్గరలో మార్గ మధ్యంలో ఒక మనోహరమైన దృశ్యం కనపడుతుంది. చుట్టూ కనుచూపు మేర అంతులేని కొండల సమూహం నుంచి అక్కడక్కడ సన్నగా జలపాతాలు కిందికి జారుతూ దూరంగా కనపడతాయి. అన్నీ కలిపి 'డాకి' నదిగా, బంగ్లాదేశ్‌కు ఏర్పడుతుంది. పైనుంచి కిందకు, దూరంగా చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది. చిరపుంజిలో చూస్తుండగానే మేఘాలు కమ్మేసి, ఎదుట దూరంగా ఏదీ కనిపించకుండా అయిపోయి, కొంచెం సేపు వర్షం పడగానే అంతా మామూలుగా అవుతూ ఉంటుంది.
మరునాడు ఉదయం Mawsmai గుహల దగ్గరకెళ్ళాం. విశాఖలోని బొర్రా గుహలలో లాగానే వంగి సన్నగా ఇరుకుగా ఉండే దారిలో నుంచి వెళ్ళి బయటకు రావాలి. పై నుంచి నీరు పడుతూ కిందంతా తడిగా నీళ్ళతో ఉంటుంది. చీకటిగా ఉంటుంది. అక్కడక్కడా దీపాలుంటాయి. కాని చాలా మంది భయపడి వెనక్కి వచ్చేస్తారు. కాని కొంచెం కష్టపడి జాగ్రత్తగా బయటకు వచ్చాక చాలా సరదాగా నవ్వుకోవచ్చు. మధ్యాహ్నాం తరువాత Wei saw dong వాటర్‌ఫాల్స్‌కు వెళ్ళాము. చిన్న గ్రామానికి దారి కూడా సరిగా లేదు. మధ్యలో చిన్న మెట్టుంటాయి. అక్కడ నుంచి వెదురు కర్ర సాయంతో కిందకి దిగాలి. కొంత దూరం దిగినాక రాళ్ళే మెట్లులాగా ఉంటాయి. తరువాత మట్టి మెట్లు లాగా ఉంటుంది. పై నుంచి వర్షం అక్కడే అసలు కథ మొదలయింది. కట్టెలతో నిచ్చెన మెట్లలాగా పేర్చారు. కిందికి దిగుతూ ఉండాలి. చాలా మంది వెనుకకు మళ్ళిపోయారు. మేము ధైర్యం చేసి దిగాం. సుమారు గంట పడుతుంది. చాలా భయంగానూ ఉంటుంది. కిందకెళ్ళాక మంచి జలపాతం పెద్ద పెద్ద రాళ్ళ మధ్య నుంచి పడుతూ చాలా శుభ్రంగా ఉంటుంది. ఒక్కోసారి నీళ్ళు మెరుస్తూ స్పష్టంగా ఉంటాయట. కొద్దిసేపుండి మళ్ళీ ఎక్కడం మొదలుపెట్టాలి. పగలే సూర్యుడు, నక్షత్రాలు కనిపించాయి. కాని నేనయితే ఛాలెంజింగ్ గానే తీసుకుని దాదాపు పాకుతున్నట్లు పైకి వచ్చా. ఎవరెస్టు ఎక్కినట్లు ఫీలయ్యాం. ఎంతగా కష్టపడ్డామో అంతగా ఆనందించాం. పైకి వచ్చాక కానీ నొప్పులు తెలియవు.
మరునాడు Kynrem జలపాతం దగ్గరకెళ్ళాం. 200 అడుగుల ఎత్తు నుంచి పడుతుంటుంది. 200 అడుగుల ఎత్తు నుంచి పడుతుంటుంది. మొదలయ్యే దగ్గర చూపించి, కిందకు వెళ్ళి పడే ప్రదేశం చూస్తే బాహుబలిలో జలపాతం గుర్తొస్తుంది. కాని అవి గ్రాఫిక్స్. ఇది నిజం. అద్భుతంగా ఉంటుంది. దగ్గరల్లోని జలపాతాలు అడవులు చూసుకుంటూ బంగ్లాదేశ్ సరిహద్దుకు వెళ్ళాం. బిఎస్ఎఫ్ జవానులుంటారు. అక్కడ ఉంటే ప్రజలు పనుల కోసం అటు నుంచి ఇటు వస్తూ వెళుతూ ఉంటారు. దగ్గర్లోనే 'డాకి' నదిలో బోటింగ్ అనిర్వచనీయమైన ఆనందాన్నిచ్చింది. మధ్య నదిలో వెళుతూ ఉంటే పడవలో నుంచి కనుచూపు మేర రెండు పక్కల కొండలు, చెట్లు ఆశ్చర్యంగా చూస్తుంటాము. బంగ్లాదేశ్ పడవలు దిగువకు వెళ్తాయట. మన దేశ పడవలు ఎగువకు వస్తాయి. గంటసేపు తిప్పి తీసుకొచ్చారు. అక్కడ నుంచి అడవి ఘాట్ రోడ్డు ప్రయాణం చేస్తూ ఇండియా - బంగ్లాదేశ్ సరిహద్దు కంచెను చూస్తూ సాయంత్రానికి ఒక చక్కని గ్రామాన్ని చేరాం. పేరు 'మౌలినాంగ్'. జనాభా ఉన్నారు. ఆసియాలోనే పరిశుభ్రమైన గ్రామంగా 2003లో అవార్డు వచ్చిందట. మద్యం, గుట్కా, ప్లాస్టిక్ వినియోగం ఉండదు. విపరీతంగా చెట్లుంటాయి. కాని తారు రోడ్లు అత్యంత శుభ్రంగా ఉంటాయి. సోలార్ సిస్టమ్‌తోనే వీధిలైట్లు, ఇంట్లో కూడా వెలుగుతుంటాయి. ఏసీ అవసరం ఉండదు. ఫ్యాన్లు మాత్రం సరిపోతాయి అన్నారు. పిల్లలంతా ఇళ్ళ ముందు ఆడుకుంటున్నారు. గ్రామీణ పట్టణ వాతావరణం కలసి ఉంది. అక్కడ టూరిస్టులని తప్ప ప్రైవేటు వాహనాలను లోపలికి రానివ్వరు. కోవిడ్ ఆ గ్రామంలో ఎవరికీ రాలేదట. వ్యాక్సిన్ కూడా ఎవరూ తీసుకోలేదు. మాకు భోజనం పెట్టిన హోటల్ అమ్మాయి మాత్రం షిల్లాంగ్‌లో రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకుందట. ఎవరికి చెప్పినా తీసుకోరు అని చెప్పింది. మేఘాలయలో పెళ్ళయిన ఆడ పిల్లల దగ్గరకే భర్తలు వచ్చి ఉంటారట. ఆడవాళ్ళు వెళ్ళి ఉద్యోగం పని చేసుకు వస్తారట. భర్తకు ఉద్యోగం లేకపోయినా ఇంట్లో ఉండి ఇంటి పనులు పిల్లలను చూసుకుంటాడట. అది వాళ్ళ అలవాటు. తప్పుగా కూడా అనుకోరు. బాగుంది కదూ! రాత్రికి అక్కడే ఉన్నాం.
మరునాడు మూడు గంటలు ప్రయాణం చేసి Wahrew నదిపై ఉన్న వెదురుతో చేసిన వంతెన దగ్గరకు వెళ్ళాం. అంటే ఒక 45 నిమిషాలు కొండపై ఉన్న రాళ్ళతో ఏర్పాటు చేసిన మెట్లపై నుంచి కిందకు దిగాలి. చుట్టూ ఎత్తైన కొండలపై పెద్ద చెట్లు, పెద్ద పెద్ద రాళ్ళ నుంచి వేగంగా ప్రవహించే నదిపై మూడు అంచెలుగా కట్టిన వంతెన దానిపై నడుస్తుంటే కొంచెం కదులుతూ భయపెడుతుంది. దాటి వెళ్ళి కొంత సేపు చూసి వెనక్కి వచ్చేయాలి. ఇంకో రెండున్నర గంటలు వెళితే చాలా బాగుంటుంది అన్నాడు గైడ్. అప్పటికే వర్షంలో చాలా కష్టపడి వచ్చాము. ఇక ముందుకు వెళ్ళలేమని వెనక్కి వచ్చేశాం. అక్కడ నుంచి బయలుదేరి LAITLUM GRAND CANYON అనే ప్రదేశానికి వచ్చాం. చాలా దూరంగా కొండలు, మేఘాలు కిందికి దిగిపోయి ఉంటాయి. సూర్యాస్తమయం చూడడం గొప్ప అనుభూతి అంట. మాకు కొంచెమే కనిపించింది. సినిమా షూటింగ్‌లు బాగా జరుగుతాయట. రాత్రికి షిల్లాంగ్ చేరి, మరునాడు గౌహతి నుంచి హైదరాబాద్ వచ్చాం. ఆరో రోజులు ఎక్కడ వృథా కాకుండా చాలా కష్టపడి ఎంతో మధురమైన, సాహసవంతమైన జ్ఞాపకాలు మిగిల్చుకున్నాం. మళ్ళీ మళ్ళీ కుదరవు ఇటువంటివి. వచ్చినపుడే సార్థకం చేసుకోవాలి. స్నేహితులతో కలిసి వెళితే యాత్రను బాగా ఆస్వాదించవచ్చు.
- డా|| శారద, 9966430378