Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవును, పెద్ద తప్పే! దాన్ని ఇప్పటి దాకా చెప్పలేదు. ఎందుకంటే, చెప్పుకుంటానంటే, ఆ తప్పుని శాంతంగా భరించిన వాళ్ళే నన్ను వ్యతిరేకిస్తూ వచ్చారు. ''మా మాట వినండి!'' అన్నారు. ''అలా చెయ్యలేను. నా తప్పుకి నేను సిగ్గు పడుతున్నాను'' అన్నా, వారు వినలేదు. ఇక వారి మాట వినాల్సి వచ్చింది.
ఇప్పుడు చెప్పెయ్యాలని ఎందుకు అనుకుంటున్నానంటే, ఇప్పుడు నేను అనారోగ్యంతో మంచం మీదే వుంటున్నాను. ఇంకా వుంటానో లేదో తెలీదు. ''ఇది, జబ్బే కాదు'' అంటారు డాక్టర్లు. నేను దాన్ని వొప్పుకోడం లేదు. కాబట్టి, ఇప్పటికైనా నా తప్పుని పశ్చాత్తాపంతో చెప్పుకోకపోతే, నేనెలాంటి మనిషినో బైటికి ఎలా తెలుస్తుంది? నేను పోతే, నా తప్పుని తెలిసిన మా ఇంటి వాళ్ళు కూడా దాన్ని చెపుతారో లేదో! అందుకే ఇప్పుడే చెప్పెయ్యాలని నా నిర్ణయం.
ఈ విషయం మొదలు పెట్టాలంటే, ఎమ్.వీ. భద్రం గారూ, ఆయన భార్య లక్ష్మి గారూ నాకు చేసిన సహాయాలతో ప్రారంభించాలి.
1965లో అనుకుంటా, నాకు 'బలి పీఠం' నవలకి సాహిత్య అకాడమీ ప్రకటించిన అవార్డు వచ్చింది. అప్పుడు నాకు మార్క్సిజం ద్వారా తెలిసే 'డబ్బు' సంగతులూ, అవార్డుల సంగతులూ, ఏ మాత్రమూ తెలీవు. ఇప్పుడైతే నాకా అవార్డూ రాదు, వచ్చినా దాని వేపు నేను చూడను.
అప్పుడైతే, విశాఖపట్నంలో వున్న నేను, నాకు పెళ్ళి జరిగిన వ్యక్తితో హైదరాబాదు వచ్చి, ఒక హోటల్లో దిగాం.
ఆ రోజే ఎమ్.వీ. భద్రం గారు, నా పుస్తకాల్ని ఇష్టపడే పాఠకుడిగా, నన్ను చూడాలని ఆ హోటల్కి వచ్చారు. కొంత సేపు మెచ్చుకుంటూ మాట్లాడారు. ''అమ్మా, మీరీ ఫంక్షన్ అయిపోయాక హోటల్ని ఖాళీ చేస్తారు కదా? మా ఇంటికి వచ్చెయ్యండి! నేనే వచ్చి తీసుకు వెళ్తాను. నాలుగు రోజులు వుండి వెళ్దురు గాని'' అన్నారు.
అటువంటి పాఠకుడితో నాకు అప్పుడే మొదటి పరిచయం.
ఆ రోజు భద్రం గారింటికే వెళ్ళాం. అక్కడ భోజనాల మర్యాదలూ అవీ భద్రం గారి భార్య, లక్ష్మి గారే స్వయంగా చూశారు. నేను, పుస్తకాల అలమారు దగ్గిర కూర్చుని అవన్నీ చూడడమే చేస్తూ గడిపాను.
అక్కడ రెండు రోజులు వున్నామో లేదో గుర్తు లేదు. వెళ్ళి పోయేటప్పుడు భద్రం గారు బుట్టల నిండా పళ్ళు ఇచ్చి పంపించారు.
నేనేదో మంచి రచయిత్రినని భద్రం గారికి ఆ నాటి నించీ ఈ నాటికీ గాఢ నమ్మకం!
అప్పుడప్పుడూ ఉత్తరాల పలకరింపులు జరిగేవి.
నేను వైజాగ్ సంబంధాన్ని పూర్తిగా తెంపుకుని, పిల్లలతో సహా మా పల్లెటూరు వచ్చేశాక, తండ్రిగా నా పిల్లల హక్కుదారు, గాలి దుమారం లాగ వచ్చి, వచ్చిన ఆటోలోనే పిల్లల్ని తీసుకు పోయాడు! ఇది 1970 ప్రాంతాల్లో.
ఆ సంగతి నేను భద్రం గారికి రాశాను. ''అక్కడికి ఇక వెళ్ళను. పిల్లల్ని వదల్లేను. వాళ్ళు వాడి దగ్గిర పెరగ్గూడదు. నేనేం చెయ్యాలి? మా వాళ్ళకి ప్రేమలు వున్నాయి గానీ, డబ్బుల్లేవు'' అని రాశాను.
భద్రం గారు వెంటనే, ''మీరు మా ఇంటికి వచ్చెయ్యండి! బెంగ పడొద్దు!'' అన్నారు.
భద్రం గారింటికి వచ్చేశాను. నా కంటి వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్ళ వలిసి వచ్చింది. నా దగ్గిర 4 బంగారపు గాజులున్నాయి గానీ, డబ్బుగా, ఒక్క పైసా కూడా లేదు!
నేను వైజాగ్లో వున్న రోజుల్లోనే నాకు పాఠకుడిగా వున్న 'గాంధీ' అనే అబ్బాయి హైదరాబాదులోనే చదువుతున్నాడు. అప్పుడప్పుడూ, నాతో మాట్లాడాలని భద్రం గారింటికి వస్తూ వుండే వాడు. నేను ఆస్పత్రిలో వున్నప్పుడు కూడా అతను నాకు సహాయం చేయడం కోసం ఆస్పత్రికి వస్తూ వుండేవాడు. ఆ కంటి వైద్యం నాకేమీ మేలు చేయలేదు.
నన్ను మళ్ళీ రమ్మని పిలవడానికి, వైజాగ్ అతను భద్రం గారింటికి వస్తే, 'రానని' చెప్పేశాను.
నా పుస్తకాలన్నీ, అతని ప్రచురణ పేరుతో, ఒక అద్దె గదిలో పెట్టేశాడు. అది ఎలా జరిగిందో నా కసలు ఇప్పుడు గుర్తు లేదు.
భద్రం గారు, అతన్ని అడిగారు, ''మీరు, ఆమె రాసిన పుస్తకాలు ఆమెకి ఇచ్చెయ్యండి!''
అతను, ''అలాగే, తీసుకు వెళ్ళండి!'' అన్నాడు.
రెండు రోజుల్లోనే భద్రం గారు అక్కడికి వెళ్తే, వాటిని ఇవ్వనన్నాడు! ''ఆ పుస్తకాలు, మా నాన్న పేరుతో ప్రచురణ జరుగుతున్నాయి. మీరు కోర్టుకు వెళ్ళండి!'' అన్నాడు.
భద్రం గారు వచ్చి, ఆ సంగతి చెప్పి, ''కోర్టుకి వెళ్ళ వలిసిందే'' అన్నారు.
తర్వాత, నేనూ, భద్రం గారూ కోర్టు కోసం వైజాగ్ ప్రయాణం! ఆ ఖర్చు, భద్రం గారిదే. అక్కడ, భద్రం గారి చుట్టాలింట్లో దిగడమూ, ఒక లాయర్ని చూడడమూ, అయ్యాయి. కోర్టుకి వెళ్తూ వుండగా, రావిశాస్త్రి గారి ఆఫీసు కనపడితే, భద్రం గారు అక్కడికి నన్ను తీసుకెళ్ళారు. అక్కడ రావిశాస్త్రి గారికి సంగతంతా తెలిసి, చలసాని ప్రసాదు గారికి చెప్పారు. అప్పుడు, కష్ణాబాయి గారూ, ప్రసాదు గారూ, భద్రం గారి చుట్టాల ఇంటికి వచ్చి, ''మీకేదైనా అవసరం అయితే, మా ఇంటికి వచ్చి వుండండి'' అన్నారు.
అంతకు ముందే, భద్రం గారి తండ్రి పోయారని వార్త వచ్చింది. భద్రం గారు నన్ను కష్ణాబాయి గారి ఇంటికి అప్పజెప్పి, వెనక్కి వెళ్ళి పోయారు.
నేను, కష్ణాబాయి గారి ఇంటిలో వుండడం కొన్ని నెలల దాకా జరిగింది. అక్కడ, చలసాని ప్రసాద్ కూడా నాకు చాలా సహాయంగా వున్నారు. ఈయన కోర్టుకి కూడా వెళ్ళి ఏవేవో కాయితాలు తెచ్చేవారు.
చివరికి కోర్టు వాళ్ళు, 'ఆ పుస్తకాలు ఏ అద్దె గదిలో వున్నాయో, ఆ తాళాల్ని బద్దలు గొట్టి ఆ పుస్తకాలు ఆమెకి అప్పగించాలి' అని రాసి ఇచ్చారు.
ఆ అద్దె గది మీద దాడి చేసి, ఆ పుస్తకాల్ని లారీలో ఎక్కించి, సీ శాండ్లో వున్న ఒక గదిలోకి మార్చే పని చలసాని ప్రసాద్ గారు చేశారు.
వాటిని వెంటనే తీసుకు వెళ్ళమని 'అరుణా పబ్లిషింగ్' వారికి ఫోన్ చేశాను.
పుస్తకాలన్నీ విజయవాడకి మారిపోయాయి. వాళ్ళు, 'ప్రతీ నెలా మీకు 500 రూపాయలు పంపుతాం' అని చెప్పారు.
భద్రం గారైతే, నా పుస్తకాలు తెలిసిన వారు గానీ, కష్ణాబాయి గారూ, చలసాని ప్రసాద్ గారూ, నా పేరు విని వున్న వారు మాత్రమే. స్నేహితులు కారు అప్పటికి. అయినా, అందరి వల్లా నాకు చాలా సహాయాలు జరిగాయి.
ఇక అంత వరకూ జరిగిన కాలంలో, నాకూ, గాంధీకీ నమ్మకాలు పెరగడం మొదలైంది. అతను నా దగ్గిరికి తరుచుగా రావడం భద్రం గారికి నచ్చేది కాదు. ఒకసారి గాంధీతో మందలింపుగా అన్నారట! ''ఆవిడ, పెద్ద సమస్యలో వున్నారు. పిల్లల కోసం చాలా దిగులుగా వున్నారు. ఏ పొరపాట్లు జరిగినా జరుగుతాయి. మీరిలా రాకూడదు'' అన్నారు.
ఆ సంగతి నాతో గాంధీ, భద్రం గారి మీద చిన్న విమర్శగా చెప్పాడు. నేను, గాంధీని వెంటనే వ్యతిరేకించాను. ''భద్రం గార్ని అలా అపార్ధం చేసుకోకూడదు. ఆయన నా క్షేమం ఆలోచించి అలా మాట్లాడి వుంటారు. ఇది, ఆయన చేసే హెచ్చరిక కూడా. అలాగే తీసుకోవాలి'' అన్నాను.
అలాంటి రోజుల్లో, లక్ష్మి గారు నాతో, ''గాంధీ, చాలా మంచి కుర్రాడిలా వున్నాడు. మీ కన్నా చిన్నవాడు. అయితే యేం? పెళ్ళి కాని వాడు. మీరిద్దరూ సుఖంగా బ్రతకగలరనిపిస్తోంది'' అన్నారు.
నేను నవ్వి, ''నేనూ, అతనూ, అలాగే అనుకుంటున్నాము. మీకు చెప్పాలనే అనుకుంటున్నాను. ఒక్కటండీ! ఇది నిజం కాకపోతే, ఇక నా జీవితంలో ఏమీ వుండదు. నా పిల్లల్ని తన పిల్లలలాగే చూడగలడనే గాఢ నమ్మకం నాకు. ఇక వాళ్ళని తెప్పించుకునే మార్గం చూడాలి'' అన్నాను.
ఆ మార్గం ఎప్పటినించో తెలిసి వున్నదే. వైజాగ్ అతనికి ఉత్తరం రాశాను. ''నా కోసం గానీ, పిల్లల కోసం గానీ, మీరు ఏ మాత్రమూ, ఒక్క పైస అయినా ఇవ్వనక్కర లేదు. పిల్లల్ని నేనే పెంచుకుంటాను'' అని రాశాను.
దానికి జవాబు రాశాడు. ''పిల్లలకి అయినా డబ్బు ఇచ్చే సమస్య లేదు. అదే కాదు, వాళ్ళని నా దగ్గిరికి ఎప్పుడూ పంపకూడదు. పంపితే, ఇటూ అటూ వాళ్ళ రైళ్ళ టిక్కట్ల ఖర్చు నువ్వే పెట్టుకోవాలి'' అని!
అన్నిటికీ ''అలాగే'' అని ఒప్పుకున్నాను.
ఇక, నాకూ గాంధీకీ అద్దె ఇల్లు కావాలి. అది చూశాడు. నేనూ చూశాను. చాలా నచ్చింది. అక్కడికి చేరే ప్రయత్నాల్లో వున్నాము.
ఆ రోజుల్లోనే నా తప్పు జరగడం! ఒక రోజు నేను ఏదో చదువుతున్నాను. లక్ష్మి గారు వంట గది గుమ్మంలో నిలబడి నాతో ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారనని నేను చూడనే లేదు.
ఆవిడ అన్నారు. ''మీ బంగారపు గాజులు నాలుగూ మీ పెట్లో వున్నాయి; మీరు వేసుకోవడం లేదు. వేసుకోరు కదా? వాటిలో రెండు మా జ్యోత్స్నకి ఇవ్వండి! మా దగ్గిర ఇప్పుడు డబ్బు లేదు. డబ్బు వున్నప్పుడు మీ డబ్బు మీకు ఇచ్చేస్తాం'' అన్నారు.
అప్పుడు నేనేమంటాను? ఏమనా? ''ఏంటీ, మీరు నన్ను ఇంత ఇదిగా అడగాలా? నేనేం చేసుకుంటాను ఆ గాజులు? ఎప్పుడో తీసేసి లోపల పడేశాను. మీకు ఒకసారి చూపించాను. ఇంత అడగడం ఎందుకండీ? జ్యోత్స్నని రానివ్వండి. రెండేమిటి? నాలుగూ దాని చేతులకు నేనే తొడుగుతాను. అలాగే లక్ష్మి గారూ! నాకీ ఆలోచనే లేదు ఇప్పటిదాకా'' అన్నానా?
ఇలాంటి మాటలే అని వుంటానని, పాఠకులందరూ అనుకుంటారు కదా? ఇది, ఇంకొకరి సంగతైతే, నేనైనా అలాగే అనుకుంటాను! కానీ, నేనలా అనలేదు.
ఆవిడ అలా నించుని వుంటే, నేనేం ఆలోచించానో, ఆవిడ ఆ గాజుల్లో రెంటిని కొంటామంటున్నారు. నన్ను అమ్మ మంటున్నారు! నేను అమ్మాలి! భద్రం గారు వాటిని కొంటారు! - ఈ ఆలోచన ఎంతో సేపు పోతే బాగుండేది. ఎంతో సేపు కాదు. ఒక పది సెకండ్లే. నేను లక్ష్మిగారితో, ''ఇప్పుడు వాటిని నేను అమ్మడం ఎందుకండీ? మాకూ ఆడపిల్ల వుంది కదా? దాని కోసమే వుంచుతాను. అమ్మడం ఎందుకూ? మీరే చెప్పండి!'' అన్నాను! దీన్ని రాయడానికి నేను సిగ్గు పడుతున్నాను. విచార పడుతున్నాను. ఎన్ని పడ్డా, రాయవలిసిందే కదా?
ఆ మాటలు అన్న తర్వాత కూడా, ''ఇదేమిటి, ఇలా అన్నాను!'' అనే రెండో ఆలోచన రాలేదు.
ఆ రోజు, ఆవిడ, అలా అడిగిన తర్వాత, నా నీచమైన జవాబు విని, సహించలేక వేరే గదిలోకి వెళ్ళిపోయారు. అది నాకు అప్పుడు గ్రహింపుకి రాలేదు. మా మధ్య మాటలు మరీ ఎక్కువగా ఎప్పుడూ వుండవు. ఆవిడ పుస్తకాలు చదవరు. ముగ్గురు పిల్లలు. వాళ్ళ పనులే.
ఆ పూటే కాదు, 2, 3 రోజుల దాకా గతంలో లాగ మాటల్లేవు. అదీ అర్ధం కాలేదు నాకు. నేను, నా రచనల్లో చాలా బాగా రాస్తానని పాఠకులు అంటారు. కానీ, కతగ్యతగా, మర్యాదగా, ప్రవర్తించడం ఆ క్షణాల్లో నాకు చేత కాలేదు.
అప్పటికి నేను నా గాజులూ అవీ తీసేశాను గానీ, నగల మీద ఆడవాళ్ళు ఏం నేర్చుకోవాలో అది చేత కాలేదు.
మాకు అద్దె ఇల్లు ప్రారంభమై, కొన్ని సామాన్లు కొనుక్కో వలిసి వచ్చింది. నా పెట్లో అడుగున కొన్ని సంవత్సరాలు పడి వున్న 2 సూత్రాలూ, నాలుగు గాజులూ, వుంగరం; గాంధీకి ఎమ్మేలో వచ్చిన గోల్డ్ మెడలూ - అన్నీ అమ్మేస్తే, ఇంటికి కావలసిన కనీసపు సామాన్లు దొరికాయి!
లక్ష్మి గారికి నా మీద కోపంగా వుందనే సంగతి నాకు తర్వాత అర్ధమైంది. ''మా ఇంటికి రండి!'' అని అడిగితే, ఆవిడ రాలేదు.
వెంటనే ఆవిణ్ణి కలిసే ప్రయత్నం చేశాను. భద్రం గారికి పెద్ద వుత్తరం రాశాను, నా తప్పు గురించి. ''సాయంత్రమే లక్ష్మి గారి దగ్గిరికి వస్తాను'' అని రాశాను.
అలాగే వెళ్ళాం. లక్ష్మి గారు లేరు ఇంట్లో! ''ఆమెకి ఏదో పని వచ్చి వెళ్ళారు'' అన్నారు భద్రం గారు.
లక్ష్మి గారికి నిజంగా కోపం- అని అప్పుడు
ఇంకా అర్ధమైంది. ఆ మర్నాడు, వారికి చెప్పకుండానే వెళ్ళాం.
లక్ష్మి గారు వంటింట్లో వున్నారు. అది వంటల టైము కాదు. అక్కడికి తప్పుకున్నారు.
నేను అక్కడికి వెళ్తోంటే నా కళ్ళు సిగ్గుతో ద్రవించాయి. ''లక్ష్మి గారూ! మీ క్షమాపణ కోసం వచ్చాను. మీరు నా మీద ఇంత కోపం చూపించడమే చాలా న్యాయం! మీరు మీ చేత్తో కాఫీ ఇస్తేనే, మీరు నన్ను క్షమించినట్టు అనుకుంటాను. లక్ష్మి గారూ! మీ కుటుంబంలో అందరూ చేసిన సహాయాలు నాకు తెలీవా? ఆ రోజునే మీరు నన్ను మందలించి, 'మీకు డబ్బు ఇచ్చేస్తామని చెప్పినా, అది కొనడమా? అది అమ్మడమా? మా సహాయాలేవీ మీకు అర్ధం కాలేదా? ఇలాగేనా మీరు రాసేది?' అని మీరు నన్ను తిడితే, నేను అప్పుడే ఆ తప్పులోనించి బైట పడనా?'' అన్నాను.
ఆవిడ అప్పటికీ శాంతించలేదు. నాకిక క్షమాపణ దొరకదనే అనుకుంటూ నిలబడి ఏడ్చాను.
ఆవిడ కాఫీ గ్లాసు టేబుల్ మీద పెట్టి, ''ఏడవడమెందుకు? వూరుకొండి! వూరుకొండి!'' అనడం మొదలెట్టారు.
ఆ తర్వాత నేను భద్రం గారికి మళ్ళీ రాశాను. ''ఈ ఉత్తరాన్ని లక్ష్మి గారి చేతికి కూడా ఇవ్వండి! అవును, నేను నా స్వభావానికే వింతగా ప్రవర్తించి మిమ్మల్ని గాయ పరిచాను'' అన్నాను.
''వొద్దమ్మా! అవన్నీ వొద్దు! తొందరపాటు వల్ల ఏవో జరుగుతాయి. వాటి కోసం జన్మంతా బాధ పడతామా?'' అంటారు భద్రం గారు.
లక్ష్మి గారిని, ఆ తర్వాత చాలాసార్లు కలిశాను. కలిసినప్పుడల్లా, నా తప్పు గురించి చెప్పుకునే దాన్ని. దానికి ఆవిడ, ''ఆ మాటలు ఇప్పుడెందుకు?'' అనేవారావిడ.
నిజమే. చేసిన తప్పు చేసేసి, ''క్షమించండి, క్షమించండి'' అంటే, క్షమించే వాళ్ళు అంత తెలివి తక్కువగా, అంత కోపం లేకుండా వుంటారా? ఉండాలా?
ఇప్పుడు నా అనారోగ్య పరిస్తితుల్లో, 90 ఏళ్ళ భద్రం గారు, గాంధీకి ఫోను చేసి, ''మీరు రంగనాయకమ్మ గారి విషయంలో ఇంతకాలమూ శ్రద్ధగానే వున్నారు. అదే చాలదు. ఇప్పుడు ఆవిడ పట్ల మరింత శ్రద్ధ అవసరం. ఆవిడ మార్క్సిజాన్ని వివరించే పని చాలా చేశారు. ఇప్పటికీ ఆవిడ ఆరోగ్యంగా వుండడం చాలా అవసరం'' అన్నారు. అంటే, భద్రం గారూ వాళ్ళు, నా తప్పుల్ని ఈ నాటికీ మనసులో పెట్టుకోలేదు. కానీ, నేను చేసిన తప్పు నన్ను వదలడం లేదు.
- రంగనాయకమ్మ