Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్ధిపేట జిల్లా, చేర్యాల మండలంలోని సలాక్ పూర్ పాటిగడ్డమీద కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు అహౌబిలం కరుణాకర్, మహమ్మద్ నసీర్, ఎన్.కిరణ్ కొత్త వీరగల్లు శిల్పాన్ని గుర్తించారు. నల్లరాతిలో చెక్కిన ఈ శిల్పం అర్థపద్మాసన స్థితిలో కూర్చున్న వీరునిది. మణిపట్ట కిరీటం, చెవులకు కుండలాలు, కంఠాన రుద్రాక్షమాల, హార గ్రైవేయకాలు, భుజకిరీటాలు, వక్షబంధం, వీరశృంఖల, బొడ్లో చురకత్తి, వస్త్రమేఖల, అర్థోరుకం, కాళ్ళకు 5 వరుసల కడియాలు వీరుని ఆహార్యం. కుడిచేతిలో ఖడ్గం, ఎడమచేయి విరిగిపోయి వుంది.
వీరుని శిల్పానికి కొద్ది దూరంలో గుర్రం అర్థశిల్పం వుంది. ఈ గుర్రం నిశ్చలస్థితిలో వుంది. దాని వీపున ఉన్న జీనుకు కుడివైపున ఒరలో పట్టాకత్తి కనిపిస్తున్నది. ఈ రెండు శిల్పాలకు సంబంధముంది. వీరుడా గుర్రాన్ని నిలిపిన చోటుకు దూరంగా ఆత్మార్పణ చేసుకోవడానికి ముందు ఇష్టదైవ ప్రార్థనకు (Prayer before death) కూర్చున్నట్లున్నది. స్థపతి, చరిత్రకారుడు శివనాగిరెడ్డిగారు వీరుని శిల్పం రాష్ట్రకూటుల కాలం, శైలి అని నిర్థారించారు.
జంట శిల్పాల వీరగల్లు గతంలో మరెక్కడా లభించని కొత్తశిల్పం. వీరగల్లులలో ఆత్మార్పణ వీరగల్లులు ప్రత్యేకమైనవి. శైవమతంలోని వీరభక్తికి నిదర్శనాలవి. 'బొందితో కైలాసం' అనే సామెత వీరివల్లనే పుట్టినట్లుంది.
శివసాయుజ్యం కోరిన భక్తులు తమ దేహంలోని అష్టాంగాలను నరికి, కోసుకుని దేవునికి అర్పించడం... శూలారోహణం చేసి ప్రాణాలివ్వడం... పెద్దఎత్తు నుంచి బండరాళ్ళు ఈటెల మీదికి దూకి చనిపోయే బహత్ పాతాలు. వెదురుగడకు జుట్టు ముడికట్టి తల నరుక్కునే సిడితల ఇవన్నీ వీరభక్తిలో భాగాలు... ఒకప్పటి శైవంలో పుట్టుకొచ్చిన ఆత్మార్పణ సంస్కతి. అట్లా దేవునికి తమ ప్రాణాలను వివిధ పద్ధతుల్లో అర్పించిన వారిని ఆత్మార్పణ వీరులన్నారు
ఆ పాటిగడ్డ మీదనే శాతవాహన కాలంనాటి కుండపెంకులు, చిత్తుడుబిల్ల, డాబర్, సన్నముక్కు గొట్టాలు నూరుడు రాళ్ళు లభించాయి.
క్షేత్ర పరిశోధన, ఫోటోగ్రఫీ:
అహౌబిలం కరుణాకర్, 9398654646,
మహమ్మద్ నసీర్, కిరణ్ కొత్తతెలంగాణ చరిత్రబృందం సభ్యులు
విషయ వ్యాఖ్య :
శ్రీరామోజు హరగోపాల్, 9949498698,
కన్వీనర్, కొత్తతెలంగాణ చరిత్రబృందం