Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంతిలా తన చుట్టూ తాను తిరిగే ఈ భూమ్మీద గిరగిరా తిరిగే కాలాలు మూడే అయినా కొందరి గుండెల్లో రైళ్ళు పరుగెత్తించేదీ విమానాలు ఎగిరెగిరి పడేట్టు చేసేదీ ఓటి ఉంది. అదే ఎన్నికల కాలం! ప్రభుత్వం ఉద్యోగంలో చేరిన వాడికి పాతిక ముప్ఫయేళ్ళ దాకా ఢోకా ఉండదు కానీ అదేమిటో ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడే వాళ్ళకు మాత్రం ఐదేళ్ళే ఖాయం చేశారు ఎన్నికల కోసం ఖర్చు పెట్టిందంతా రాబట్టుకుని నాలుగో ఎనిమిదో పన్నెండో రాళ్ళు వెనకేసుకునే టయానికి వచ్చిపడతయి బంగాళాఖాతంలో వాయు గుండాలు, భూమ్యాకాశాలు ఒకటి చేసే సునామీలు భూకంపాలు అని వాపోయేవాళ్ళ తలల మీద పిడుగులు కురిపించే కాలం ఒకటి ఉంది అదే ఎన్నికల కాలం!!
ఎండాకాలం కాకపోయినా ఎండలో ఎంతో చురుకుంది అనుకుంటూ అడుగులు వేస్తున్నవాడు అడుగులు తడబడ్తున్నయని ఓ చెట్టు కింద అరుగు మీదకి చేరాడు కాస్సేపు శాంతంగా విశ్రాంతి తీసుకుందామని. అప్పటికే అక్కడో మనిషి ఆల్రెడీ శాంతంగా విశ్రాంతిని అనుభవిస్తున్నట్టున్నాడు అరుగు మీద కూచుని. కొత్తగా వచ్చిన వాడ్నీ వాడి చేతిలో వస్తువునీ చూసి పాతగా వచ్చినవాడడిగాడు 'ఎవరు నువ్వు? ఏమిటది?' అని. జ్యోష్యం చెప్పేవాడ్ని చేతిలో ఉన్నది చిలక డబ్బా. 'ఎన్నికల కాలం కనక ఎండ చురుక్కుమంటున్నదని ఇటువచ్చా'నన్నాడు చిలుక వోనర్.
ఫక్కుమన్నాడు మనిషి పళ్ళు బయటపెట్టి. 'ఇంకా చిలకనే నమ్ముకున్నావా బాబూ' అన్నాడు. 'నేను నమ్ముకున్నట్టే నా చిలకను నమ్ముకుని భవిష్యత్తు చెప్పించుకునే వాళ్ళు పట్నంలో ఉన్నారు. ఇది వరకు నమ్మకం లేక పోయినా ఎన్నికల కాలం కదా. దేన్నయినా నమ్మే వాళ్ళున్నారు' అన్నాడు చిలక జ్యోష్యుడు. 'అవు... అవు' అంది పంజరంలో చిలక తియ్యతియ్యగా ముద్దుముద్దుగా.
ఆ దారిన పోతూ అప్పుడే అక్కడికి వచ్చినవాడు ముఖాన్న విబూది రేఖలు వేళ్ళకి ఉంగరాలు ఉన్నవాడు నోరు బార్లా తెరిచి నోరారా నవ్వేడు. ఇక నవ్వలేనని అనుకునేదాకా నవ్వి 'నువ్వూ నీ చిలకా ఎవర్రా నమ్మేది. ఈ లేటెస్టు కాలంలో. గెలుపూఓటమి మంచీ చెడూ డబ్బూ దస్కం అన్నీ గ్రహాలే చూసుకుంటయి. శుక్రుడు ఎక్కడున్నాడో బుధుడు ఏ ఇంట్లో సెటిలయ్యాడో నీ చిలక చెప్పగలదా? నా శాస్త్రం చెబుతుంది. ఈ ఎన్నికల కాలంలో కొందరి గుండెల్లో పరుగెత్తే రైళ్ళకు 'పరిహారాల' ఎర్రజెండా చూపగలిగేది నేనే' అన్నాడు ఆ దారిన పోతూ అప్పుడే అక్కడికి వచ్చిన పండిత జ్యోతిష్యుడు.
దారన్నాక చెట్టు నీడన్నాక ఎవడో ఒకడు వస్తాడు పోతాడు. అలాగే మరొకడు వచ్చాడు. వస్తూనే 'రైజయ్యాడు'. 'ఎక్కడ ఉన్నాయో తెలీని గ్రహాలు వాటికి గృహాలు ఒక కొంప నుంచి మరో కొంపలో దూరడాలు అంతా వట్టిదే. మనిషి భూతభవిష్యత్ వర్తమానాలు వాడి హస్తరేఖల్లో ఉంటయి. అరచేతిని పరీక్షించి ఈ ఎన్నికల కాలంలో ఎవరు ఎక్కడ్నించి పోటీ చేస్తే గెలుస్తారు ఎవరికి మంత్రి అయ్యే యోగం ఉంది అన్నది చెప్పగలవాడెవడైనా ఉన్నాడూ అంటే అది నాలాంటి 'పామిస్టే' హస్తరేఖా గణకుడే' అన్నాడు అక్కడికి వచ్చిన వాడు.
'చెప్పావులే గప్పాలు. చేతిలో గీతలు నుదుటి మీద రాతలు అంతా ఉత్తి గ్యాసే. చొల్లు కబుర్లు మానేసి నా దారికి రావాలి అందరూ. అంతా సంఖ్యల్లోనే ఉంది. ఏ నంబరు ఎవరికి 'సూటవు'తుంది ఏ నంబరుకు ఏది కలపాలి ఏది తీసిపారెయ్యాలి పేర్లలో ఉన్న దోషాలేమిటి వాటిని ఎలాగ 'ఖతమ్' చెయ్యాలి ఎక్కడ దీర్ఘాలు తీసెయ్యాలి ఎక్కడ అక్షరాలు ఒత్తి ఒత్తి పలకాలి వీటి మీద సర్వం ఆధారం. కుక్కుటేశ్వర్రావును కుక్కటేశ్వర్రావు అని పెట్టుకోమన్నాను. ఎన్నికల్లో గెలిచాడు. ఈ ఎన్నికల్లోనూ ఎంతో మందిని పేర్లు మార్చినంబర్లు కూర్చి గెలిపించడానికి వెళ్తున్నాను' అన్నాడు అక్కడికి వచ్చిన సంఖ్యా శాస్త్రవేత్త.
'ఇదిగో ఎన్నికల కాలం కదా నమ్మకాల్ని 'క్యాష్' చేసుకుందామని పట్నం బయలుదేరాం కదా. ఎవరి బిజినెస్సు వాళ్ళది ఎవరి పొట్ట తిప్పలు వాళ్ళదే. ఇది చేస్తే గెలుస్తామా అది చేస్తే గెలుస్తామా దీన్ని నమ్ముదామా లేకదాన్నా అని గందరగోళంలో ఉంటారు, నాయకులం కావాలని కలలు కనేవాళ్ళు. కొందరు చిలకను నమ్మొచ్చు. కొందరు గ్రహాల్ని కొందరు గీతల్ని మరికొందరు సంఖ్యల్నీ నమ్మవచ్చు. మనలో మనం పోటీ పడవద్దు. ఒకళ్ళకొకళ్ళం సపోర్టుగా ఉండాలి' అన్నాడు పండిత జ్యోతిష్యుడు.
'మనం ఎవరమో ఏం చెయ్యబోతున్నామో చెప్పుకున్నాం కానీ మనందరి కంటే ముందు ఈ చెట్టుకింద అరుగు మీద కూచున్నవాడెవడో తెలియదు' అన్నాడు చిలక జ్యోతిష్యుడు. 'ఎవర్రా నువ్వు?' అనడిగారందరూ ఒక్క గొంతుకతో.
మీరెవ్వరూ చెయ్యలేని పని చెయ్యగలను. నన్ను ఈ ఎన్నికల కాలంలో దేవుడంటారు. నాయకుల్ని గెలిపించేది మీ విద్యలు కాదు నేనే. చిరునవ్వు నవ్వుతూ అన్నాడు ఆ మనిషి... నేను... నేను... ఓటర్ని!!!
-చింతపట్ల సుదర్శన్, 9299809212