Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పదహారేళ్ల వయస్సంటే, బుగ్గలు ఇంకా పాలుగారుతూనే ఉంటాయి. పద్దెనిమిదేళ్ల వయస్సులో నూనూగు మీసాలతో, అప్పుడప్పుడే శరీరంలో వస్తున్న మార్పుల వలన సిగ్గు, బిడియంతో ముడుచుకుపోతుంటారు. మరి ఇలాటి పిల్లలు అత్యాచారాలు, హత్యలు చేయగలుగుతున్నారంటే నమ్మశక్యం కాదు. ఎప్పుడు అటువంటి సంఘటనలు విన్నా అత్యాశ్చర్య పోవడం ఒక అలవాటుగా చేసుకున్నాం. అయితే దానికి కారణాలు ఏమిటన్నది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. సంప్రదాయ, పాశ్చాత్య పోకడల కలబోతల పెంపకాల మధ్యలో పిల్లలు అయోమయంలో పడుతున్నారు. వారికి స్పష్టత నివ్వవలసిన బాధ్యత తల్లిదండ్రులు, స్కూల్స్, ప్రభుత్వానికి ఉంది.
పిల్లల్లో నేర ప్రవత్తి పెరుగుతూ వెళ్తుండటంతో ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు భయభ్రాంతులకు లోనవుతున్నారు. వాస్తవానికి 'పిల్లలు' నిర్వచనాన్ని, వారు నీచమైన నేరాలకు ఒడిగట్టినప్పుడు సడలించవలసి వస్తోంది. కొంతకాలానికి ఇక మొత్తానికే 'పిల్లల' వయసును 18 నుంచి ఇంకా తగ్గించ వలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. బాల నేరస్తులు ఏ స్థాయిలో పెరుగుతున్నారో ఎన్సిఆర్ బి చెప్పిన డేటా చూస్తే అర్థం అవుతోంది. 2019లో పోక్సో చట్టం, 2012 కిందకి వచ్చే నీచమైన నేరాలు 5413 జరిగితే అందులో 1885, 2021లో జరిగిన 5740 నేరాలలో 1668 బాల నేరస్తులు చేసినవి. ఇండియన్ పీనల్ కోడ్ కింద పిల్లలుగా చెప్పబడుతున్నవారి మీద 43,506 నేరాలు జరిగితే అందులో 28,830 నేరాలు బాల నేరస్తులు చేసినవిగా ఉంటున్నాయి. వీరిలో బందంగా కలిసి నేరాలు చేసేవారే ఎక్కువ. చట్టాలెన్ని ఉన్నా నేరాలలో 25 శాతం ఉన్న బాలనేరస్తులకు వీటి కింద శిక్ష పడదు. కాని రేప్, లైంగిక దాడి లేదా హత్యలలో పాల్గొన్న 16 నుంచి 18 ఏళ్ల వయస్సు ఉన్న వారిని కూడా పోక్సో చట్టం కింద అడల్ట్ గానే పరిగణించే అవకాశం ఈ చట్టం కల్పిస్తుంది. రక్షణ, భద్రత విషయంలో భారతదేశం 64 దేశాలలో 60వ స్థానంలో ఉంది. ఒరిస్సా, ఉత్తర ప్రదేశ్ లో బాలనేరస్తులు ఎక్కువ. మధ్య ప్రదేశ్ లో అత్యధిక సంఖ్యలో జువెనైల్ రేపిస్టులు ఉన్నారు. పిల్లల్లో పసితనాన్ని కాలరాస్తున్న పరిస్థితులు చాలానే ఉండొచ్చు. పేదరికం, నిరక్షరాస్యత, సరిగా బడికి వెళ్లకపోవడం, నాసిరకం విద్యా ప్రమాణాలు, ఇంట్లో హింసాత్మక ప్రవత్తులను చూస్తుండటం, వారు పెరుగుతున్న సామాజిక పరిస్థితుల్లో హింస, చెడు సావాసాలు, సామాజిక, ఆర్థిక తారతమ్యాలు, వారు కూడా లైంగిక హింసకు లేదా ఇతర హింసలకు గురికావడంతో మానసికంగా బండబారిపోతారు. ఇవన్నీ పేద, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు పెద్ద సంఖ్యలో బాలనేరస్తులుగా మారడానికి దారితీసే పరిస్థితులు. ఢిల్లీలో అత్యధిక క్రైమ్ రేట్ ఉంది. ఒక్క ఢిల్లీనే కాదు పట్టణ ప్రాంతాలలో మురికి వాడలలో పిల్లలపై తల్లిదండ్రులగా శ్రద్ధ చూపలేరు. ప్రేమరాహిత్యం, ఆత్మన్యూనతతో పెరుగుతున్న పిల్లల్లో, సమాజంలో తమకు విలువ లేదని అర్థమవుత ఎన్న కొద్దీ తెగింపు, సమాజంపై తిరుగుబాటు ఆరంభం అవుతుంది. వైటెనర్ పీల్చడం, గంజాయి ఇలాటివి సర్వ సాధార ణంగా అలవాటుగా ఉంటాయి. మత్తులో జోగుతుంటారు. ఏమాత్రం నైతిక విలువలు తెలియని ఓపెన్ కల్చర్లో పెరిగే ఆ పిల్లల్లో పసితనం ఎక్కడ ఉంటుంది. రాక్షస ప్రవత్తి మేల్కొంటుంది. ఈ వర్గం ప్రజల నుంచి బయటకు వచ్చే బాల నేరస్తుల పట్ల బాధ్యత ఎవరు వహించాలి. పిల్లల్ని కనడమే తప్ప పెంచడం రాని పేద తల్లిదండ్రులా లేక వారిని బడి బాట పట్టించే పటిష్టమైన యంత్రాంగం లేకపోవడమా...??
బాల నేరస్తులు ఎక్కువగా బయటకు వచ్చే రెండవ వర్గం ధనికుల పిల్లలు. వీరు చదువుకునే స్కూళ్లలో లక్షల ఫీజులే కాదు వీరి జేబుల్లోనూ లక్షల రూపాయలుంటాయి. అందరూ ఒకరిని మించిన ధనికులు ఇంకొకరు. బందంలో తానే గొప్ప అని నిరూపించుకోవడానికి ఈ పిల్లల్లో తహతహ ఉంటుంది. గంజాయి చాలా మామూలు విషయం. డ్రగ్స్ కూడా అంత కష్టమేమీ కాదు. వందల వేల కోట్లకు తాము అధిపతులమని తెలిసాక ఇక చదువుపై నిర్లక్ష్యం ఏర్పడుతుంది. పోర్న్, విచ్చలవిడి పచ్చి బూతుల పాశ్చాత్య సంగీతం, మితిమీరిన ఫ్యాషన్ పోకడల తర్వాత ఇక మిగిలింది సెక్స్. రకరకాల మాధ్యమాల ద్వారా కొత్తగా కనుక్కున్న ఆసక్తికరమైన అంశం అది. దీంట్లో తప్పొప్పులు, పరిమితులు ఏవీ తెలి యవు కేవలం కొత్తగా నేర్చుకున్నదాని అంతు చూడాలి. తన తల్లిదండ్రుల దగ్గర డబ్బు, పలుకుబడి ఉంది. ఆడ పిల్లలు సిగ్గుపడి బయటకు చెప్పరు కాబట్టి తామేం చేసినా చెల్లుతుందనే ధీమా ఏర్పడుతుంది. తాము చేసేది చట్టరీత్యా తప్పు అని వారికి తెలియదు. ఒక అమ్మాయిని తన అంగీకారం లేకుండా ముట్టుకోకూడదని తెలియదు. అలా చేస్తే తర్వాత చట్టానికి చిక్కితే పర్యవసానం ఎలా ఉంటుందో అవగాహన ఉండదు. యుక్త వయసులో జరిగే అడ్రినలిన్ ప్రవాహంలో కొట్టుకుపోతున్న పిల్లలకు ఈ చట్టాలపై అవగాహన లేదు అని ఈమధ్య ఒక జడ్జి గారు అన్నది వాస్తవ పరిస్థితులకు అ ద్దం పడుతుంది.
ఇక మధ్య తరగతి వర్గానికి వస్తే వారికి చాలావరకు పిల్లలే ప్రపంచం. వారి ప్రతి కదలికపై వీరికి అవగాహన ఉంటుంది. అయినా పిల్లలు వీరి చేతి నుంచి కూడా జారిపోతున్నారు. పాతకాలంలో మాదిరి పిల్లల్ని పూర్తి కట్టడిలోనూ ఉంచలేరు. పాశ్చాత్యుల మాదిరి పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేరు. పేరెంటింగ్ ఎలా చేయాలో తెలియని అయోమయంలో పెద్ద లుంటే, పిల్లలు శారీరక శ్రమతో కూడిన ఆటలు మానేసి డిజిటల్ ప్రపంచంతో పెనవేసుకుపోతున్నారు. మోర్టల్ కంబాట్, పబ్ జీ, రోబ్లాక్స్ ఇలాటి గేమ్స్ అన్నీ హింసాత్మకమైనవి. ఆరు ఏడేళ్ల వయసు నుంచే డిజిటల్ ఆటల్లోని ఉన్మాదిలో తనని తాను చూసుకుంటున్నారు. గన్ తో మనుషుల్ని కాల్చి రక్తం పారించడం ఆనందం. ఆటల్లో కొన్ని అడల్ట్ గేమ్స్ కూడా ఉంటాయి. అందులో యధేచ్ఛగా లైంగిక చర్యలలో పాల్గొనే జంటలు కనిపించడం చాలా సాధారణం. అవి బొమ్మలే కావచ్చు అది ఆటనే కావచ్చు కాని పిల్లలు సున్ని తత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. స్త్రీ పురుషుల మధ్య ఉండవలసినది అందమైన బంధం అని తెలుసుకునే వీలు ఉండటం లేదు. ఆడపిల్ల అంటే అమ్మలా ఉంటుందనే అందమైన ఊహలు పొందుపరచుకోవాల్సిన ప్రాయంలో అమ్మాయి అంటే సెక్స్ భాగస్వామి మాత్రమే అనే అభిప్రాయాలు ఏర్పడటం నేరతత్వానికి దారి తీస్తాయనడంలో సందేహం లేదు. అరచేతిలో ఇంటర్నెట్ యుగంలో ఎంత జాగ్రత్తగా పెంచినా పిల్లలు బయట ప్రపంచంలో ఎలా మెలుగుతున్నారో వారిలో
ఏ ఆలోచనలు నడుస్తున్నయో తల్లిదండ్రుల అంచనాలకు అందట్లేదు. అయితే చిన్న వయసు నుంచే తీసుకున్న కొన్ని జాగ్రత్తలు పిల్లల్ని నేరాలు చేయకుండా ఆపుతాయి. అమ్మాయిలకు చిన్నప్పటి నుంచి ఇంటా బయటా ఎలా మెలగాలి అని నూరిపోస్తారు కదా అలానే మగపిల్లలు పితస్వామ్య భావ దారిద్య్రాన్ని వంటబట్టించుకోకుండా చూడాలి. చిన్నప్పటి నుంచి ఆడ, మగ వేరు కాదని నూరిపోస్తుండాలి. తండ్రి ఎలా ఉంటే మగపిల్లలు అలానే నకలు చేస్తారు. ఇది తిరుగులేని నిజం. మగ జెండర్ ఆధిపత్య జెండర్ అని, ఆడపిల్లలు అంటే సెక్స్ సింబల్ అనే భావజాలం ఏర్పడ కుండా చూడాలి. మగపిల్లలు ఏడవకూడదు లాటివిరుద్దకుండా జెండర్తో సంబంధం లేకుండా పిల్లలు వారి భావావేశాల ను తల్లిదండ్రులతో పంచుకునేంత స్నేహం చేయాలి. ప్రేమించాలి. ఇది వారిలో హింస ప్రబలకుండా చేస్తుంది. ఆలోచనల్లో సున్నితత్వం పెరిగినప్పుడు వివేకం పెంపొందుతుంది. ఇతరుల పట్ల సానుభూతి పెరుగుతుంది. తప్పు ఒప్పుల బేరీజు వేసుకోగలుగుతారు. యుక్తవయసులో ఆడ,మగ మధ్య ఆకర్షణ అనివార్యం . అయితే పిల్లలు తమకు తెలి యనిది ఏదో ఉంది అది ఛేదించాలి అనే ఉత్సుకతతోనే తమలో ఉరికే ఉత్సాహానికి తప్పు అర్థం వెతుక్కుంటారు. ఏడు ఎనిమిదేళ్ల వయసు నుంచే మగ, ఆడ శరీరాలు, వాటిలో వచ్చే మార్పులు, పిల్లలతో ఓపెన్ గా మాట్లాడాలి. టీనేజ్ లో రాబోయే మార్పులు, ఆలోచనలు అన్నిటి గురించి విపులంగా చెప్పాలి. వారంతట వారు తెలుసుకునే ముందుగానే సెక్స్ పట్ల అవసరమైన మేరకు తల్లిదండ్రులు అవగాహన కల్పించాలి. ఆడపిల్లల శరీరాల వంక చూడటం, వారి అనుమతి లేకుండా ముట్టుకోవడం చట్టరీత్యా నేరం, అటువంటివి చేస్తే భవిష్యత్తు నాశనం అవుతుందని స్కూళ్లలో, ఇంట్లో తెలియ చెప్పాలి. పెద్దలతో పాటు పిల్లలు కూడా నీళ్లు తాగినంత సులువుగా వాడుక భాషగా బూతులు మాట్లాడేస్తున్నారు. ఆడపిల్లల శరీరాన్ని కించపరచే పదాలు, మాటలు సంస్కారహీనత్వం అని అది గొప్పతనం కాదని స్పష్టత వచ్చినప్పుడు ఉరకలేసే యవ్వనం, వారిలో భావుకత్వాన్ని పెంచి మహిళ పట్ల ప్రేమను, గౌరవాన్ని పెంపొందిస్తుంది. టీనేజ్ లో మగపిల్లలకు ఆడపిల్లలు స్నేహితులుగా ఉండటం చాలా అవసరం. అమ్మాయిలతో సౌకర్యవంతంగా మాట్లాడి మంచి స్నేహం చేయగలిగితే ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో అబ్బాయిలు పెరుగుతారు. మన చుట్టూ చెడు ఉండవచ్చు, ఇంటర్నెట్, ఒటిటిలు సెక్స్, వయొలెన్స్ గుప్పించవచ్చు కాని మైంలో తనకేం కావాలో స్పష్టత ఉంటే పిల్లలు నేరస్తులుగా మారకుండా స్వచ్ఛంగా ఉంటారు.
-శ్రీదేవి కవికొండల