Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూర్వం గిరిజన లంబాడీలు సంచార జీవనం చేసేవారు. రాజవంశీయులైన వీరి ప్రధాన వత్తి వ్యాపారం. ఒక చోట నుంచి మరో చోటికి ముత్యాలు, రత్నాలు, ఉప్పు, జొన్నలు వ్యాపారం చేస్తుండే వారు. రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల ఎడ్లబండినే వీరి వాహనమైంది. సంచార జీవనంలో భాగంగా పశువులను సైతం వీరి వెంట తీసుకుని వెళ్లేవారు.ఈ క్రమంలో పశువులు గాలికుంటు, ఇతర రోగాలబారిన పడి మతి చెందేవి. కాగా రోగాలు రాకుండా పశువులను కాపాడమని గిరిజనులు సీత్లాభవానికి పూజించే వారు.
సీత్లా పండుగ నేపథ్యం
లంబాడీ గిరిజనులు పశువులను ఆధారంగా చేసుకుని జీవించేవారు. ఈ క్రమంలో తండా పెద్ద (నాయక్) కలలో సీత్లామాత ప్రత్యక్షమై నన్ను ప్రతిష్టించి, పూజిస్తే పశువులకు ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుతానని వాగ్దానం చేస్తుంది. దివి నుంచి భువికి దిగివచ్చిన మేరమా, తోళ్జా, మంత్రళ్, కంకాళి, హీంగ్లా, ద్వాళంగర్ దేవతల్లో చిన్నది సీత్లాభవాని. ఏడుగురు అక్కచెల్లెళ్లకు ఒక తమ్ముడు (లుంక్డియా). ప్రతి ఏటా సీత్లాపండుగ సందర్భంగా లంబాడీ గిరిజనులు దేవతలను పూజించి, పశు సంపదను కాపాడమని పూజిస్తారు. అయితే ఏడుగురు అక్కచెల్లెళ్లలో ఆరుగురిని తమ తమ ఇళ్లలో పూజిస్తారు. కానీ దీనికి భిన్నంగా సీత్లామాతను అడవిలో ప్రతిష్ఠ చేసి పూజ చేస్తారు. పశువుల మందను అడవిలో మేపేందుకు తీసుకెళ్ళి దారి తెలియక లుంక్డియాతో సహా అక్కడే మాయమై, రాయిగా మారిందని పెద్దలు అంటారు.
పండుగ ఎప్పుడు జరుపుకుంటారు
వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందు సీత్లాపండుగ జరుపుకుంటారు. తొలకరి చినుకుకు మొలిచిన పశుగ్రాసం తినడం వల్ల జీవాలు రోగాల బారినపడుతాయి. అందుకే పశువులను కాపాడి, సకాలంలో వర్షాలు సమద్ధిగా కురవా లని, పాడి పంటలు, పశుపక్షాదులు, పిల్లజెల్ల ఆరోగ్యంగా ఉండాలని సీత్లా మాతను పూజిస్తారు. ప్రతిఏటా జూలై నుంచి ఆగస్టు మాసంలో వచ్చే మంగళవారం రోజు మాత్రమే గిరిజనులు భక్తి శ్రద్ధలతో సీత్లాభవానికి పూజలు చేస్తారు.
పూజ జరుపుకునే విధానం
పునర్వసు (పెద్ద పుసాల) కార్తె ఆరంభంలో వచ్చే మంగళవారం రోజు ఊరికి దూరంగా ఏర్పాటు చేసిన ఏడు రాళ్లను (దేవతల ప్రతిమలు) గేరు ప్రత్యేకమైన రంగు పూస్తారు. వాటిని తూర్పు వైపు చూసేలా ప్రతిష్ఠిస్తారు. ఈ ఏడు రాళ్లకు ఎదురుగా పడమర వైపు చూసేలా లుంక్డియాను నెలకొల్పుతారు. ఈ విధంగా ప్రతిష్ఠ చేసిన రాళ్లను వర్షాకాలంలో దొరికే పూలతో అలంకరిస్తారు. అలాగే గిరిజనులు తమ ఇళ్లలో ముందు రోజు నానాబెట్టిన జొన్నలు, పప్పు ధాన్యాలతో గుగ్గిళ్ళు వండి (వాసోడి) నైవేద్యం పెడతారు. ఇంట్లో వండిన బెల్లం అన్నం (లాప్సీ), గంగాజలంతో పూజలు చేస్తారు. ఉల్లిపాయ, ఎండుమిర్చి, కానుకలు సమర్పిస్తారు. అలాగే పిల్లా పాపలతో పచ్చగా ఉండాలని, వానాకాలం సీజన్ లో వచ్చే వ్యాధులు దూరం కావాలని వేడుకుంటారు. తమ పశువులను అడవి జంతువులు, క్రూర మగాల బారిన పడకుండా కాపాడమని పూజిస్తారు. అటవీ సంపద కనుమరుగు కాకుండా రక్షించమని సీత్లామాతను ప్రార్థిస్తారు. గిరిజన లంబాడీ మహిళలు గుంగ్టో, పూల్యగోణ్ణో ధరించి డప్పు చప్పుళ్లతో నత్యం చేస్తూ, పాటలు పాడుతూ సీత్లామాతను పూజిస్తారు. అనంతరం గొర్రెపోతును బలిచ్చి దాని పేగును సీత్లాభవాని నుంచి లుంక్డియా వరకు సాగదీసి కడుతారు. అలా పరిచిన పెద్ద పేగు పై నుంచి ఆవులను, ఎడ్లలను, గొర్లను దాటిస్తారు. ఈ సమయంలో నైవేద్యంగా తెచ్చిన గుగ్గిళ్లను పశువులపై చల్లుతారు. ఇలా చల్లడం వల్ల పశువులకు ఎలాంటి రోగాలు రాకుండా సీత్లామాత కాపాడుతుందని గిరిజనులు నమ్మిక. సాయంకాలం వేళ బంధువులు, స్నేహితులు, తోబుట్టువులతో గిరిజన తండాల్లో పండుగ సందడి నెలకొంటుంది.
- ఇస్లావత్ దేవేందర్, 9652249371