Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీనియర్ కవయిత్రి, రచయిత్రి అయిన డా.నన్నపురాజు విజయశ్రీ తెలంగాణ చరిత్రపై బృహత్తర గ్రంథం రచించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్కు వీరాభిమాని. ఆమె కేసీఆర్ను కేంద్రంగా చేసుకుని ఈ గ్రంథాన్ని రచించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కె.సి.ఆర్. వేసిన దారులు పేరిట వెలువడిన ఈ పుస్తకంలో చారిత్రక తెలంగాణ మొదలుకొని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, ఆ తరువాత సమకాలీన తెలంగాణ (ఈ ఏడాది జనవరి మాసం) దాకా ఈ గ్రంథంలో పొందుపరిచారు. పుస్తకం చదువుతున్న క్రమంలో చరిత్రలో నిలిచిపోయిన సంఘటనలు అన్నీ వాస్తవ దృశ్యాలై కదలాడతాయి.
పుస్తకాన్ని తీర్చిదిద్దిన క్రమాన్ని గమనిస్తే... చరిత్ర అంతటినీ అంశాలవారీగా విభజించి తెలంగాణ పరిణామ క్రమాన్ని విశదపరచడం కనిపిస్తుంది. ఇది పాఠకులకు సులభతరంగా ఉండే అంశం. విజయశ్రీ వత్తిరీత్యా ఉపాధ్యాయురాలు కావడంతో ఈ ప్రక్రియను అవలంబించారని అర్థమవుతుంది. తెలంగాణ చారిత్రక పరిణామ క్రమం, తెలంగాణ సంస్కృతి సంప్రదాయం, తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం, తెలంగాణ గత పాలకులు, తెలంగాణ కోరుకోవడానికి గల కారణాలు, 1969 ఉద్యమం నుంచి గుణపాఠాలు, నైజాం రాజ్యం హైదరాబాద్ స్టేట్లోని జిల్లాలు, ప్రగతిపథంలో తెలంగాణ సంక్షేమ పథకాలు తదితర అనేక అంశాలను ఆమె విభజించి వాటి గురించి ఎంతో చక్కగా విశ్లేషణ చేసారు.
తెలంగాణకు సంబంధించిన సమస్త చరిత్రను పుస్తకంగా రూపొందించడానికి విజయశ్రీ లోతైన అధ్యయనం చేసినట్లు పుస్తకం చూడగానే అర్థమవుతుంది. ఈ పుస్తకాన్ని చరిత్రకారులు, పాఠకులు మాత్రమే కాదు సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
(తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కె.సి.ఆర్. వేసిన అడుగులు, రచయిత : నన్నపురాజు విజయశ్రీ, పేజీలు : 784, వెల : రూ.600/-. ప్రతులకు : రచయిత్రి మొబైల్ 9100439884 నెంబరులో సంప్రదించవచ్చు.)
- నస్రీన్ ఖాన్, 9652432981