Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూర్తి పేరు తిరువనరంగం హయగ్రీవాచారి. వరంగల్ జిల్లాలోని ధర్మ సాగరంలో జనవరి 1 1916 సం.లో జన్మించాడు. తల్లి ఆండాలమ్మ, తండ్రి శ్రీనివాసచార్యులు. ఇతను వరంగల్ ప్రభుత్వ పాఠశాలలో మెట్రిక్ చదివాడు. 1937 లో మాధ్యమిక విద్యను అభ్యసించాడు.
స్వాతంత్య్రోద్యమం
బాల గంగాధరతిలక్ ను ఆదర్శ స్వాతంత్య్ర సమరయోధుడిగా భావించి జాతీయోద్యమంలోకి ప్రవేశించాడు. 1937 లో మాధ్యమిక విద్యను అభ్యసించినపుడే స్వాతంత్య్ర సమరంలోకి పూర్తిగా దిగాడు. కాంగ్రెసును సంస్థాన ప్రభుత్వం నిషేధించిందని తెలియగానే సత్యాగ్రహానికి పూనుకున్నాడు. నాడు సత్యాగ్రహం చేసి అరెస్టు కాబడ్డాడు. స్వాతంత్య్రోద్యమం చేసి జైలుకు వెళ్ళిన కాళోజి, పెండ్యాల రాఘవరావు, పొట్లపల్లి రామారావులకు, హయగ్రీవాచారికి జైలులోనే పరిచయం అయ్యింది. మహాత్మాగాంధీ ఇచ్చిన క్విట్ ఇండియా ఉద్యమ పిలుపు ఆనాడు దేశంతో పాటు హైదరాబాదు సంస్థానంలో కూడా అలజడిని సష్టించింది. ఈ ఉద్యమంలో పాల్గొని వేలాది మంది అరెస్టు అయ్యారు. ఆయా జిల్లాల్లో ప్రముఖంగా ఉన్న నాయకులు బయట తిరగరాదనీ నిజాం ప్రభుత్వం ఆంక్షలు జారీ చేసింది.
మహాత్మాగాంధీ 1946 ఫిబ్రవరి 5 న వరంగల్ కు వస్తారనగా ఆయనకు స్వాగతం పలకడానికి, ఉద్యమ సహాయానికి గాను సేకరించిన విరాళాలను ఆయనకు సమర్పించడానికి ఎం.ఎస్. రాజలింగం, ఎస్. చంద్రమౌళి, బి. రంగనాయకులతో పాటు హయగ్రీవాచారి కూడా వెళ్ళాడు. గాంధీకి స్వాగతం పలికిన వీరంతా 15000 రూపాయలను విరాళంగా ఇచ్చారు. వీరితో పాటు చందా కాంతయ్య అనే అతను ఒక హారాన్ని, ఐదు వేల రూపాయల నగదును సమర్పించాడు. వరంగల్ లో జరిగిన స్వాతంత్య్రోద్యమంలో హయగ్రీవాచారికి అత్యంత సన్నిహితంగా ఉన్న అడ్లూరి అయోధ్య రామయ్య కూడా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నాడు.
జాతికి నాయకుడిగా పరిగణింపబడిన మహాత్ముణ్ణి చూడడానికి ఖమ్మం, వరంగల్ ప్రాంతాల ప్రజలు బారులు తీరారు. అలా గాంధీ 1946 ఫిబ్రవరి 5 న ఖాజీపేట సభలో ఆంధ్రులను ఉద్దేశించి 'ఇక్కడ అస్పశ్యత తొలగాలి, అస్పశ్యులను దేవాలయాలలోకి అనుమతించాలి, ఖద్దరు ధరించాలి, పరభాషను విస్మరించి మన భాషను మాట్లాడాలి' అని ప్రసంగించాడు.
జాతీయ భావాలను ఖద్దరు చొక్కాలాగా తన మనసుకు ధరించుకున్న హయగ్రీవాచారికి భారత సంస్కతి అన్నా, హైందవ సంప్రదాయమన్నా అమితమైన పూజనీయ భావం ఉండేది. నాడు ఆర్య సమాజం తన హిందూ మతరక్షణ సిద్ధాంతాలలో నుండి హైదరాబాదు స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నది. ఈ సమయంలో ఆర్య సమాజం చేస్తున్న ఉద్యమాన్ని ఇతను ఇతర ప్రాంతాలకు వ్యాపింపచేశాడు.
హయగ్రీవాచారి వరంగల్ పురపాలక సంఘానికి తొలి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1957లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ధర్మసాగర్ నియోజక వర్గం నుండి శాసన సభకు గెలిచాడు. తెలంగాణ ప్రాంతీయ సంఘానికి 1962లో అధ్యక్షుడిగా నియామకం అయ్యాడు. ఇలా మరల 1962 లో ధర్మ సాగర్ నుండి, 1972 లో స్టేషన్ ఘనపూర్ నుండి, 1978 లో హన్మకొండ నియోజక వర్గం నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఇతను పి.వి. నరసింహారావు మంత్రివర్గంలో పంచాయతీ రాజ్ శాఖకు మంత్రిగా వ్యవహరించాడు. ''1978లో మర్రి చెన్నారెడ్డి మంత్రిగణంలో బాలల అకాడమీ, భారతీయ వైద్యం, సంగీత కళాశాలల శాఖలను నిర్వహించాడు'' (స్వాతంత్య్ర సమరంలో ఆణిముత్యాలు, పుట 188). అలాగే స్వాతంత్య్ర సమరయోధుల సంస్థకు అధ్యక్షుడిగా ఉన్నాడు.
భారత చరిత్రను గమనిస్తే, ఎవరైతే అహింసా సిద్ధాంతాలను విశ్వసించి, వాటి మార్గంలోనే నడుస్తూ, వాటి చేతనే స్వాతంత్య్రాన్ని సాధించిన వారున్నారో వారిలోనే కొందరు హింసా మార్గంలో కన్ను మూశారు. నాడు మహాత్మాగాంధీ అయినా, హయగ్రీవాచారి అయినా స్వాతంత్య్ర సాధనకు ఈ అహింసనే ప్రధాన సాధనమని నమ్మారు. ఆలస్యమైనా అదే బాటలో స్వాతంత్య్రాన్ని సాధించారు. కానీ దేశాన్ని మాతమూర్తిగా భావించిన గాడ్సే తుపాకీకి గాంధీ, సమాజానికి హాని కారకులైన నక్సలైట్ల తుపాకీలకు హయగ్రీవాచారి లు బలయ్యారు. ఏ అహింసా వాదం శాశ్వతంగా ఉండాలని కోరుకున్నారో అదే అహింసావాదులు హింసావాదుల చేతిలో కన్నుమూశారని చెప్పడం దీని ఉద్దేశ్యం.
హయగ్రీవాచారి కేవలం స్వాతంత్య్ర సమరయోధుడే కాదు. సాహిత్య రచయిత కూడా. కాని అంతగా పేరు ప్రఖ్యాతులు పొందలేని కథా రచయిత. ''1932లో హయగ్రీవాచారి ఇతరులు కలిసి ఆంధ్ర విద్యార్థి సంఘమును స్థాపించి దాని ద్వారా 'వ్యాసలత' అను దానిని వెలువరించారు'' (వరంగల్ జిల్లా కథా సర్వస్వం). ఇతను 'లలిత' అనే కథను రాశాడు. ఇది టి. శ్రీ రంగస్వామి సంపాదకత్వంలో వచ్చిన వరంగల్ జిల్లా కథా సర్వస్వంలో ఉంది.
- ఘనపురం సుదర్శన్, 9000470542