Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహాభారతంలో ద్రౌపది గురించి ప్రస్తావన వచ్చిన ప్రతి సారి ఆమెను ఐదుగురి భర్తల భార్యగా ఆశ్చర్యంగా చెప్పుకుంటాం. చాలా మంది దష్టిలో ఇది ద్రౌపది అనే ఆ నాటి ఓ స్త్రీ జీవితం. కాని మన దేశంలో ఇప్పటికీ ఈ పద్ధతిని కొన్ని తెగలలో పాటిస్తున్నారని, అభినవ ద్రౌపదులు ఈ కలి యుగంలోనూ ఉన్నారని, ఉంటున్నారని చాలా మందికి తెలియని విషయం. ఉత్తారాఖండ్‌లోని జౌన్సార్-బవార్ అనే ప్రాంతంలోని కుటుంబాలలో ఈ సాంప్రదాయాన్ని ఎక్కువగా పాటించేవారు. పర్వత ప్రాంతంలో నివసించే ఈ తెగవారిలో ఒక్క స్త్రీ, అన్నదమ్ములందరికీ భార్య అవడం అన్నది అక్కడి సమాజం ఆమోదించిన సాంప్రదాయం. అరుణాచల్ ప్రదేశ్, డెహ్రాడూన్, దక్షిణాన నీలగిరులలోని టోడా తెగలో, ఇంకా కేరళ ప్రాంతంలో కుడా ఈ పద్ధతి కొన్ని జాతుల మధ్య ఉంది. హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నావుర్ జిల్లాలో ఈ పద్ధతి ఇప్పటికీ ఉన్నదనే కొందరు అంటారు. ముప్పై సంవత్సరాల క్రితం దాకా ఈ ప్రాంతం, దేశంలోని ఇతర ప్రాంతాలకు, రవాణా సౌకర్యాలు లేని కారణంగా అందుబాటులో లేనందున ఆ పాత ఆచారాలు చాలాకాలం సాగాయని చెబుతారు. ఈ ప్రాంతంలో పాండవులు కొంతకాలం నివసించారని, ఇక్కడ ఉండగానే వారి వివాహం జరిగిందని చెబుతారు. ఇప్పటికీ ఆప్రాంతపు ప్రజలు పాండవుల ద్వారా ఈ బహుభర్తల సాంప్రదాయం తాము స్వీకరించామని చెప్పుకుంటారు. ఈ రోజుకీ కూడా ఈ సాంప్రదాయం పాండవుల వారసత్వం పేరున ఇంకా సాగుతూనే ఉంది.
1988లో టిబెట్ యూనివర్సిటీ, 753 టిబెట్ కుటుంబాలలో ఒక సర్వే నిర్వహిస్తే, 13 శాతం ఈ బహుభర్తల సాంప్రదాయాన్ని పాటిస్తున్నారని తెలిసింది. నైజీరియా, కెన్యా, చైనా, దక్షిణ అమెరికా దేశాలలో కూడా ఈ సాంప్రదాయం కొన్ని తెగల మధ్య ఇంకా నిలిచే ఉంది. ఈ పద్ధతిని అక్కడి ప్రజలు ఇంకా పాటించడానికి ముఖ్య కారణం, కుటుంబ ఆస్తి భూమిగా ఉండడం, చాలా తక్కువ భూమి సాగుకు ఉండే కుటుంబాలలో మగపిల్లలందరూ వివాహం చేసుకుని విడిపోతే వారందరికి ఆ భూమి ముక్కలుగా దక్కితే ఆ కుటుంబాల పోషణ కష్టమవుతుంది. అందుకనే ఇంటికి పెద్దవానికి పెళ్లి చేస్తే ఆ స్త్రీ ఆ ఇంట అన్నదమ్ములందరికీ భార్య అవుతుంది. ఆమె పిల్లలు కుటుంబపు ఉమ్మడి ఆస్థి అవుతారు. ఇలా వారి జీవనం సజావుగా సాగుతుందని నమ్మి ఆ పద్ధతిని ఇప్పటికీ అక్కడ ఆచరిస్తున్నారు. ఇక మరో ముఖ్యమైన, గమనించవలసిన విషయం ఈ తెగలలో అమ్మాయిలు తక్కువగా ఉండడం, దీని వలన పెళ్ళి కాని అబ్బాయిల సంఖ్య పెరిగిపోతుంది. అందుకని అమ్మాయి దొరికితే ఆమె తల్లిదండ్రులకు డబ్బు ఇచ్చి ఆ పిల్లను ఉమ్మడి భార్యగా తెచ్చుకుంటారు ఈ తెగల వారు. అమ్మాయిల కొరత ఇంత ఉన్నా కూడా అ సమాజంలో అమ్మాయిలంటే చులకన భావమే. వీరికి ప్రత్యేకమైన హక్కులు ఏమీ ఉండవు. కొన్ని సందర్భాలలో ఆ స్త్రీని ఆ అన్నదమ్ములు, తమకు పిల్లలు పుట్టాక మరో కుటుంబానికి కూడా అమ్మేసిన కథలున్నాయి. ఆమె పిల్లల మీద మాత్రం సర్వ హక్కులూ పురుషులవే. టిబెట్ ప్రాంతంలో ఇలాంటి స్త్రీల జీవిత కథలు చాలా ఇళ్ళల్లో వినిపిస్తాయి. భూమిని నమ్ముకుని జీవించే వారి సంఖ్య తగ్గుతున్న కొద్దీ ఈ సాంప్రదాయం భారతదేశంలో సహజంగా అంతరిస్తున్న దాఖలాలు ఆ ప్రాంతాలలో కనిపిస్తున్నాయి కుడా.
హిమాచల్ ప్రాంతంలో ఈ సాంప్రదాయానికి సంబంధించిన ఒక జానపద కథ ఆధారంగా తీసిన మొదటి హిమచల్ చిత్రం ''బ్రిణ''. ఈ సినిమా 2016లో వచ్చి ఎన్నో ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడింది. పవన్‌కుమార్ శర్మ ఈ సినిమాకు దర్శకులు. మాత్రు, చింతామణి అనే భార్యాభర్తలకు రజ్జో, లాహులా అని ఇద్దరు ఆడపిల్లలు. రజ్జో వివాహం అక్కడి సాంప్రదాయం ప్రకారం నలుగురు అన్నదమ్ములతో జరుగుతుంది. గర్భవతి అయిన రజ్జో నలుగురు భర్తల శారీరిక అవసరాలు తీర్చే జంతువుగా జీవిస్తుంటుంది. తన జీవితం పట్ల అమెలో చాలా కోపం, అసహనం ఉంటాయి. తన చెల్లెలు లాహులా జీవితం తనలా కాకూడదని అనుకుంటూ ఉంటుంది. రజ్జో పెద్ద భర్త ఖేక్రాంకు కొన్ని అప్పులుంటాయి. అవి తీర్చలేక తన బంధువుకు అతని తమ్ముళ్ళకు తన మరదలినిచ్చి వివాహం చేయిస్తానని ఒప్పుకుంటాడు. ఇంటికి వచ్చి మామ చింతామణిని అడుగుతాడు కూడా. మామ చింతామణికి కూడా చాలా అప్పుంటుంది. అతనికి అప్పు ఇచ్చిన జమిందారు తన పెళ్ళి లాహులాతో జరిపించమని చింతామణిని అడుగుతాడు. అతనికి ఇద్దరు అన్నదమ్ములు. అమ్టే లాహులాని వారు ఉమ్మడి భార్యగా కోరుకుంటారు. కాని లాహులా అంటే చింతామణికి ప్రాణం. తన బిడ్డ అంత పెద్ద వయసున్న నలుగురికి భార్య అవడం అతనికి ఇష్టం ఉండదు. ఆ ఉరిలో షివ్ అని ఓ యువకుడు ఉంటాడు. అతని పెద్ద అన్న భార్యను పంచుకోవడానికి నిరాకరించినందుకు షివ్ని కుటుంబం నుండి, ఊరి నుండి వెలి వేస్తారు. ఆ సాంప్రదాయం అంటే నచ్చని షివ్ ఒంటరిగా జీవిస్తూ ఉంటాడు. లాహులాని అతను ప్రేమిస్తాడు. లాహులా కూడా అతన్నే వివాహం చేసుకోవాలనుకుంటుంది. తన అక్క రజ్జోకు ఈ విషయం చెబుతుంది కూడా. రజ్జో అప్పుడే ఇద్దరికీ పెళ్ళి చేసి దూరంగా పంపించేయాలనుకుంటుంది. కాని లాహులా తల్లిదండ్రుల అనుమతి లేకుండా ఈ పెళ్ళి చేసుకోనని అనడంతో రజ్జో నిస్సహాయంగా ఉండిపోతుంది. ఈలోగా వీరి తల్లి మాత్రు తానుగా జమిందారి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబంతో లాహులా పెళ్ళి నిశ్చయించుకుని వస్తుంది. నలుగురి భర్తల నడుమ నలిగిపోయే కూతురి భవిష్యత్తుని అడ్డుకోవాలని తండ్రి ఎంత ప్రయత్నించినా ఆమె పడనివ్వదు. దీనికి కారణం ఆమె కూడా అదే విధంగా నలుగురికి భార్య అయి ఇన్ని సంవత్సరాలు జీవించడం. ఆమె పెద్ద కొడుకు మత్తు మందులకు అలవాటు పడి ఎటో వెళ్ళిపోతాడు. అతనికి ఆ ఇంటి ఆస్థి మిగిల్చాలని ఆమె తపన పడుతూ ఉంటుంది. ఎప్పటికి అయినా కొడుకు దగ్గరే తానుండాలని, అతను తిరిగి వస్తాడని ఆమెకు నమ్మకం. కాని ఆ కొడుకుపై చింతామణికి పెద్దగా ప్రేమ ఉండదు. లోలోపల ఆ కొడుకు తన అన్న సంతానమని అతనికి కోపం. లాహులా పుట్టే సమయానికి అన్నలు మరణించారు కాబట్టి ఆమె తన కూతురే అని అతని నమ్మకం. ఇది కూడా లాహులా పట్ల అతని ప్రేమకు ఓ కారణం.
చివరకు లాహులా పెళ్ళి జమిందారుతో జరిగిపోతుంది. పెళ్ళికి ముందు రజ్జో తల్లిదండ్రులకు షివ్ గురించి చెప్పి ఈ పెళ్ళి ఆపు చేయాలని ప్రయత్నించినా లాహులా తాను ఎవరినీ ప్రేమించలేదని రజ్జో ప్రయత్నాలకు అడ్డుపడుతుంది. చెల్లిని రక్షించలేక రజ్జో మౌనంగా ఉండిపోతుంది. ఈ లోపు రజ్జో భర్త పై అతని ప్రత్యర్థులు దాడి చేస్తారు. లాహులాతో వివాహం జరిపిస్తానని చెప్పి మోసం చేసావని అతన్ని, అతని తమ్ముళ్ళని చంపాలని వస్తారు. ఖెక్రాం ఈ సమస్యను పరిష్కరించడానికి ఒక ఉపాయం చెబుతాడు. రజ్జో ఇప్పుడు గర్భవతి అని, ఆమె కడుపున ఓ బిడ్డ పుట్టే దాకా ఆగమని, ఆమె తమకు వారసుడిని ఇస్తే, ఆ బిడ్డను తాము తీసుకుని ఆమెను వారి కుటుంబానికి అప్పజెపుతానని మాట ఇస్తాడు. ఉమ్మడి భార్యగా ఉన్న రజ్జో ద్వారా తమకు సంతానం కలిగాక ఇక ఆమెతో మాకు పని లేదన్నట్లుగా మాట్లాడే అతని మాటలు ఆ ప్రాంతంలో కొన్ని స్త్రీల జీవితాలలో నిజంగా జరిగిన సంగతులే అని తెలిసుకున్నప్పుడు ఎంతో బాధను మనలో కలిగిస్తుంది.
లాహులా పెళ్ళి రోజున పల్లకీలో అత్తవారింటికి వెళుతున్నప్పుడు మధ్యలో ఒక చోట పల్లకీ ఆపి ఆమె కిందకు దిగుతుంది. ఈ సాంప్రదాయం స్త్రీలకు ఎంత నరకప్రాయమో చెపుతూ తమలాంటి అమ్మాయిలు ఈ పద్ధతికి నిరసనగా ప్రాణ త్యాగం చేస్తే తప్ప ముందు తరాలలోని ఆడపిల్లల జీవితాలు బాగుపడవని ఆ ఊరి వారందరినీ తమ జీవితాలతో ఆడుకునే హక్కు వారికి ఎవరిచ్చారని ప్రశ్నిస్తూ, ఆ ఊరిపై కోపంతో ఈ సాంప్రదాయంపై అసహ్యంతో తాను ప్రాణత్యాగం చేస్తున్నానని కొండపై నుండి దూకి మరణిస్తుంది. ఆమెతో పాటు ఆమె వెంట నడిచిన షివ్ కూడా అక్కడే దూకి మరణిస్తాడు.
లాహులా ఊరివారందరితో మాట్లాడిన విషయాలను గమనిస్తే గురజాడ వారి పూర్ణమ్మ గుర్తుకు వస్తుంది. అదే భాధ, అదే వ్యధ, కుటుంబం పట్ల అంతే ప్రేమ లాహులాలోనూ కనిపిస్తాయి. తల్లిదండ్రుల పట్ల ప్రేమ కారణంగా వారి నిర్ణయాన్ని కాదనలేక ముసలి భర్తతో జీవించలేక పూర్ణమ్మ మరణిస్తే, లాహులా కూడా ఉమ్మడి భార్యగా ఉండలేక ప్రాణ త్యాగం చేస్తుంది. ఈ సంఘటన తరువాత ఆ చుట్టుపక్కల తీవ్రమైన కరువు రావడంతో ఇది లాహులా ప్రాణత్యాగం వల్ల వచ్చిన విపత్తు అని నమ్మి ఆమె పేరు మీద ప్రతి సంవత్సరం ఓ ఉత్సవం నిర్వహిస్తున్నారు ఆ తెగలోని వ్యక్తులు.
సినిమాలో మందాకినీ గోస్వామి, సంజరు మిశ్ర, యశ్పాల్ శర్మ లాంటి బాలీవుడ్ కళాకారులు ముఖ్య పాత్రలలో కనిపిస్తారు. బ్రిణ అంటే రుణం అని అర్ధం. ఈ రుణం తీర్చడానికి ఆడపిల్లను ఓ కుటుంబంలో ఉమ్మడి భార్యగా పంపే సాంప్రదాయాన్ని చూపిస్తూ, మరో పక్క ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతే ఇదే పద్ధతి ప్రపంచమంతా వచ్చే సూచనలు ఉన్నాయని ఉదాహరణలతో సహా నిరూపించే ప్రయత్నం చేస్తారు దర్శకులు. ఆడపిల్లల సంఖ్య తక్కువున్న చోటులోనే ఈ పద్ధతి ఇప్పటికీ సాగుతుంది. 1956లో వచ్చిన హిందూ వివాహ చట్టం ఈ భహుభర్తల సాంప్రదాయాన్ని ఆమోదించదు. కాని ఇంకా కొన్ని చోట్ల ఈ పద్ధతి పాటింస్తున్న ఆనవాలున్నాయి.
ఇలాంటి సాంప్రదాయాల గురించి ఇప్పుడు చర్చించుకో వలసిన అవసరం రావడానికి మరో కారణం ఉంది. భ్రూణ హత్యల సంఖ్యలో పెరుగుదల. మన దేశంలో సగటు జనాభాలో ఆడపిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పడుతున్నప్పుడు మగవానికి భార్య దొరికే అవకాశాలు తగ్గిపోతున్నప్పుడు ఈ పాత సాంప్రదాయాలు మళ్ళీ తిరిగి సమాజంలో పుంజుకునే అవకాశం ఉంది. ఈ విషయంపై దష్టిలో పెట్టుకుని నేడు ఈ సమస్యను అధ్యయనం చేయాలనే ఉద్దేశంతోనే ''బ్రిణ'' సినిమా తీసానని దర్శకులు పవన్ కుమార్ శర్మ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
- పి.జ్యోతి, 9885384740