Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాలుగేళ్ళు ఆడింది ఆటగా పాడింది పాటగా గడిచిపోయేయి. కాలు మీద కాలు వేసుక్కూచుని దర్జా దర్పమూ హోదా అన్నీ వాడేశాడు. అనేకసార్లు అనేకమందికి అనేక హామీలు యిచ్చి మరిచేపోయాడు. బయటకి వెళ్తే మందీ మార్బలమూ కార్చలమూ గన్మెన్లూ బాక్సర్లూ అంగరంగ వైభోగంగా గడిచిపోయింది.
అయిదేళ్ళ అయిస్క్రీం క్రమంగా కరిగిపోయి ఇక పుల్ల కనిపించడం మొదలయింది. మళ్ళీ అయిదేళ్ళ అయిస్క్రీం సంపాదించడానికి మనసులో గుబులూ ఒంట్లో వొణుకూ మొదలైపోయేయి. కన్ను మూసినా తెరిచినా 'ఈవీఎమ్'లే కనపిస్తున్నయి. ఓట్లు తోరణాల్లా వేలాడ్తున్నయి. ఎన్నికలంటే మాటలు కాదు గదా! అదో మహా యజ్ఞం. దానికి బోలెడు డబ్బు ఖర్చు చెయ్యాలి. సంపాదించిందాంట్లో అంతో ఇంతో ఎంతో ఖర్చు పెడ్తే మళ్ళీ అయిదేళ్ళలో ఇబ్బడిముబ్బడిగా సంపాదించుకోవచ్చు. బినామీ ఆస్తులు పోగెయ్యవచ్చు. ఒక్కసారి పదవి అనే 'డ్రగ్' అలవాటయ్యాక అదిలేకపోతే ఎవరైనా గంగ వెర్రులెత్తిపోతారు. ఏదో ఒకటి కాదు ఏదయినా చేసి మళ్ళీ పదవిలోకి వస్తే తప్ప మనుషులు కాలేరు. బంగార్రాజు ఆలోచన్లకి బ్రేక్ పడింది ఆత్మారాం రావడంతో.
ఆత్మారాం బంగార్రాజుకు స్నేహితుడు, తత్వవేత్త, బోధకుడే కాదు బంగార్రాజు స్వంతానికి ఉన్నది ఒక్క ఎడమ భుజమే. ఆ రెండో భుజానికి స్వంతదారుడు ఆత్మారామే మరి.
'ఏమిటి 'గోల్డెన్ కింగ్' సీరియస్‌గా చించుతున్నావు?' అనడిగాడు ఆత్మారాం. అతను బంగార్రాజును ముద్దుగా పిలిచే పిలుపుతో.
'ఏం లేదులేవోయి' అన్నాడు బంగార్రాజు ఏం లేదులే అన్నట్టు తేలిగ్గా.
'నువ్వు ఏం లేదంటున్నావుగానీ నీ ముఖంలో ముడతలూ, నుదుటి మీది గీతలూ చూస్తే తెలుస్తుందిలే సీరియస్‌గా ఆలోచిస్తున్నావని' అన్నాడు నవ్వుతూ ఆత్మారాం.
'బట్టతల ఉన్నవాడు భాగ్యవంతుడే కాదు తెలివైనవాడవుతాడని నిన్ను చూస్తే అనిపిస్తుంది' అన్నాడు బంగర్రాజు ఆత్మారాం తలమీది టెన్నిస్ గ్రౌండ్ కేసి చూస్తూ.
'బట్టతల ఉన్న నేనే కాదు పిట్టగూడు లాంటి జుట్టున్నవాడు కూడా మేధావే' అని నిన్ను చూస్తే అనిపిస్తుంది. లేకపోతే ఎలెక్షన్ ఎలెక్షన్కీ పార్టీ మార్చే తెలివి ఎవరికుంటుంది'అన్నాడు ఆత్మారాం బంగార్రాజు తల్లోకి గుచ్చిగుచ్చి చూస్తూ.
'పదవి ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం కాదు. ఎన్నికల్లో గెలవడం ముఖ్యం కాని ఎలా గెలవడం అన్నది కాదు' అన్నాడు బంగార్రాజు తలగోక్కుంటూ.
'నీ బాధ నాకర్థం అయ్యిందిలే. రెగ్యులర్‌గా పార్టీలు మారుతుండడం వల్ల మనకు కార్యకర్తలు బలం అంతగా లేదు. నాకు తెలీదా? మన ప్రాబ్లంకు పరిష్కారం కనుక్కొచ్చాను. బయలుదేరు' అన్నాడు ఆత్మారాం బట్టతలను అరిచేత్తో తడుముకుంటూ.
ఇద్దరూ బయలుదేరి ఓ చోటకి వచ్చారు. బయట ''కార్యకర్తలు లభించుదురు'' అన్న బోర్డు చూస్తూ లోపల్కి నడిచారు. ఆ కార్యాలయం నడిపే ఆయన ఎదుట కూర్చున్నారు. ఆత్మారాం తాము ఎందుకు వచ్చిందీ చెప్పాడు.
''మేమున్నదే కార్యకర్తలను సప్లై చెయ్యడానికి! 'కార్యకర్తలు కావలెను' అనే 'రిక్వెస్టు'తో ఇప్పుడిప్పుడే ప్రజానాయకులు వస్తున్నారు. మీరు తొందరగా వచ్చారు కాబట్టి మీకే ప్రిఫరెన్స్. చెప్పండి ఎంత మంది కార్యకర్తలు కావాలి ఎలాంటి కార్యకర్తలు కావాలి' అనడిగాడు సప్లయర్.
'ఎలాంటి అంటే?' అనడిగాడు తెలివైన ఆత్మారాం. 'కార్యకర్తల్లో రకరకాలు, గ్రేడ్లు, ర్యాంకులుంటాయి. వాటిని బట్టే రేట్లూ ఉంటయి' అన్నాడు భ్రమించే కుర్చీలో కూర్చున్న వాడు.
కాస్త వివరంగా చెప్తే మాకు కావల్సిన కార్యకర్తలు ఎందరో ఏ రకమో చెప్పగలుగుతాం. రేటు మాట్లాడుకోగల్గుతం' అన్నాడు ఆత్మారాం. అవునవున్నట్లు తల ఊపాడు బంగార్రాజు.
'మా కార్యకర్తల వివరాలు ఏ కార్యకర్తకు ఎంత రేటు ఉంటుందో వివరించే 'బ్రోచర్' అచ్చులో ఉంది కనక నేనే చెప్తాను. వినండి సార్ అంటూ మొదలెట్టాడు తిరిగే కుర్చీని తిరక్కుండా ఆపిన కార్యకర్తల సప్లయర్.
జండాలు పట్టుకుని గుంపులో నడిచేవారు, జండాలు పట్టుకోటంతోపాటు గొంతు చించుకుని మీ ఓటు 'మాకే మాకే మాకే' అని అరిచేవారు, బైకుల మీద ఊరేగింపులు చేసేవారు, ఆటోల్లో తిరుగుతూ మైకుల్లో ఓట్లడిగేవారు, లారీ మీద డాన్సులు చేస్తూ ఓటు అడిగేవారు, కార్యకర్తల్లో రకాలు. మీటింగులకు జనాలను లారీల్లో ఎక్కించుకు వచ్చే సూపర్వైజర్లు, ప్రతి పక్షం పార్టీ వాళ్ళు ఎదురైతే రాళ్లు విసిరేవాళ్లు ఉన్నారు. వీరి రేటు కొంచెం ఎక్కువే ఉంటుంది. వీళ్లు కాక ఇంటింటికీ వెళ్ళి ఆడవాళ్ళకు బొట్టుపెట్టి ఓటడిగే ఆడవాళ్లు, మాకే ఓటేయండి వేస్తే ఇది చేస్తాం అది చేస్తాం పొడిచేస్తాం అనే కరపత్రాలు పంచేవాళ్ళు, ఇళ్ళల్లో చంటిపిల్లలు కనబడితే బలవంతంగా ఎత్తుకుని వాళ్ళ ముక్కు చీదే వాళ్ళని కూడా సప్లరు చేస్తాం. ఓటర్ స్లిప్పులు పంచేవాళ్ళు పోలింగ్ బూత్‌లకు వెళ్ళేవాళ్ళకు మీ ఎన్నికల గుర్తు సైగ చేసి చెప్పేవాళ్ళు,మీరు గెలిస్తే బాణా సంచా కాల్చేవారు, భుజాలకెత్తుకుని ఊపేవారు ఇలా చాలా మంది కార్యకర్తల్ని సప్లై చేస్తాం. 'పిండి కొద్దీ రొట్టె డబ్బుకొద్దీ సేవలు' అంటూ ఊపిరి పీల్చుకున్నాడు కార్యకర్తల సప్లయర్.
'మీ బ్రోచర్ తయారయ్యాక పంపండి. ఏ రకం కార్యకర్తలు ఎంతమంది కావాలో 'ఆర్డర్' చేస్తాం. మాకు కొంచెం 'డిస్కౌంటు' ఇవ్వాలి సుమా' అన్నాడు ఆత్మారాం.
'తప్పకుండా! కాకపోతే కండిషన్సు అప్లై అవుతాయి. కార్యకర్తలకు మందూ, బీరూ, బిర్యానీ ఇప్పించాలి. మీ దగ్గరికి వచ్చిన కార్యకర్తకు ఖాళీగా ఉన్నప్పుడు మరోపార్టీ కార్యకర్తలుగా వెళ్ళడానికి అనుమతి ఉంటుంది. వాళ్ళకి 'పార్టీ' బేధాలుండవు. పొద్దునో జండా సాయంత్రం ఓ జండా పట్టుకుంటారు. మీలాగే వాళ్ళూ 'మరి' అంటూ నవ్వాడు తిరుగుడు కుర్చీవాడు.
పార్టీ జండా, సీటూ తెలిశాక 'ఆర్డర్' ప్లేస్ చేస్తాం అంటూ బయల్దేరారు బంగార్రాజూ, ఆత్మారాం.
-చింతపట్ల సుదర్శన్, 9299809212