Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆస్టిజమ్ (మూగవ్యాధి) సంబంధ ఆస్పర్జర్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న తొమ్మిది ఏండ్ల మెక్సికన్ బాలిక ప్రపంచంలోనే అత్యంత ఐక్యూ (ఇంటలిజెన్స్ కోషంట్, ప్రజ్ఞా సూచిన) కలిగిన అరుదైన వ్యక్తిగా పేరు గడించడం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలుగజేస్తున్నది. ఇప్పటికే పాఠశాల విద్య పూర్తి చేసిన బాలిక ప్రస్తుతం రెండు విశ్వవిద్యాలయాల్లో సిస్టమ్స్ ఇంజనీరింగ్, మాథమాటిక్స్ ప్రధానంగా ఇండిస్టియల్ ఇంజనీరింగ్ డిగ్రీలను ఏకకాలంలో అభ్యసిస్తుండడం విశేషం, అభినందనీయం.
మెక్సికో నగరానికి చెందిన తొమ్మిది ఏండ్ల బాలిక 'అదారిటీ పెరేజ్ సాంచేజ్' వ్యక్తిగతంగా ఆస్టిజమ్ వర్గ అనారోగ్యంతో బాధ పడుతున్నప్పటికీ, అన్ని అవాంతరాలను అధిగమిస్తూ 162 ఐక్యూను కలిగి ఉండడం గమనించారు. ప్రపంచ మేటి శాస్త్రజ్ఞులు ఆల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్‌లు గరిష్టంగా 160 ఐక్యూను ప్రదర్శించడం గత ఘన చరిత్ర. ఆ అపూర్వ మేధావులను అధిగమిస్తూ 9 ఏండ్ల పెరేజ్ సాంచేజ్ 162 ఐక్యూను సాధించడం అబ్బురంగా తోస్తున్నది. సాధారణంగా 130 ఐక్యూ కలిగిన వ్యక్తులనే అద్భుత మేధావులుగా పరిగణించే దశలో 162 ఐక్యూను 9 ఏండ్ల పెరేజ్ ప్రదర్శించడం అసాధారణం, అనన్య సామాన్యం.
ఆస్టిజమ్ వర్గంలోని ఆస్పర్జర్ సిండ్రోమ్ అనారోగ్యంతో కారణంగా బడిలో తోటి మిత్రుల నుంచి ఎన్నో అవమానాలు, అవహేళనాలు ఎదుర్కొన్నది. పెరేజ్ మానసికంగా విద్యాలయం వెళ్లడా నికి భయపడుతూ తీవ్ర మాన సిక ఒత్తిడికి లోనయ్యేది. పది మందితో సులభంగా కలువలేని పెరేజ్‌ను చూసి తన స్నేహితులు 'వీర్డో', 'ఆడ్ బాల్' అంటూ హేళన చేసే వారు. పాఠశాలలో నిద్ర పోవడం, తరగతి చదువుల పట్ల అనాసక్తత ప్రదర్శించడంతో తల్లి 'నల్లెలీ సాంచేజ్' వైద్య నిమిత్తం ఇంట్లోనే ఉంచుకోవడంతో బాలికలోని అద్వితీయ మేధస్సు, అత్యంత ఐక్యూలను గమనించింది. ఇంటిలో కూర్చొని పీరియాడిక్ టేబుల్ (ఆవర్తన పట్టిక)ను కంఠస్థం చేసి అందరినీ ఆశ్చర్య పరచడం జరిగింది. అపూర్వ మేధో సంపత్తితో 3వ ఏట చదవడం, 5వ ఏట ప్రాథమిక పాఠశాల, 6వ ఏట మిడిల్ స్కూల్, 8వ ఏట ఉన్నత పాఠశాల చదువులు పూర్తి చేసింది. ప్రస్తుతం తన 9వ ఏట మెక్సికో విశ్వవిద్యాలయాల్లో ఏకకాలంలో సిస్టమ్స్ ఇంజనీరింగ్, గణితశాస్త్ర సంబంధ ఇండిస్టియల్ ఇంజనీరింగ్ డిగ్రీలను అభ్యసిస్తున్నది. ఉన్నత విద్య అభ్యసిస్తూనే తన జీవిత అనుభవాలను 'డూనాట్ గివ్ అప్ (పోరాటాన్ని ఆపకు)' అనే ఆత్మకథ పుస్తకం రచించగా ఫోర్బ్స్ మెక్సికో 100 అత్యంత ప్రతిభగల శక్తివంతమైన మహిళల జాబితాలో చోటు దక్కించుకుంది.
భవిష్యత్తులో అరిజోనా యూనివర్సిటీ లో చేరి అంతరిక్ష శాస్త్రం అభ్యసించి వ్యోమగామి కావాలనే తీవ్ర వాంఛను వ్యక్తం చేస్తున్న పెరేజ్ సాంచేజ్ అంతరిక్షంలో విహరించడానికి ఉవ్విళ్లూరుతున్నది. ఇప్పటికే అరిజోనా విశ్వవిద్యాలయ అధ్యక్షులు రాబర్ట్ సి. రాబిన్స్ ప్రవేశ ఆహ్వానం పొందిన పెరేజ్ సాంచేజ్ ఉన్నత చదువులు పూర్తి చేసి అత్యుత్తమ వ్యోమగామ (ఆస్ట్రోనాట్)గా సేవలు అందించాలని కోరుకుందాం. పెరేజ్పై మనస్ఫూర్తిగా దీవెనలు కుమ్మరిద్దాం.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి,
9949700037