Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అది ఓ పార్కు. నేల ఆకుపచ్చ కోటు తొడుక్కుంది. భూమి కడుపులో దాక్కున్న వేర్ల మీద నిటారుగా నిలబడ్డ చెట్లున్నవి. పైకి ఎదిగే శక్తి లేక కొన్ని నేల మీద పొరలుగా నిలబడ్డవి ఆకుల గుంపుల్ని మోస్తూ. పాదాలు తమను తొక్కి వెళ్ళిపోయేక ఒళ్ళు విరుచుకుంటూ నిలబడే గడ్డి పరకలున్నవి.
అది ఓ పార్కు. నడవడానికి కొందరు వస్తారు. గాలి పీలవడానికి కొందరొస్తారు. గాలి పీలిస్తూ నడవడానికి కొందరొస్తారు. పొద్దున్నా సాయంత్రం అక్కడంతా కోలాహలం చురుగ్గా వుంటుంది. గాలి గంతులేస్తుంటుంది. కొమ్మల సందుల్లోంచి సూర్యుడు వస్తూ పోతూ ఉంటాడు.
అది ఓ పార్కు. నడిచి అలసిపోయేవాళ్ళు కూచోడానికి అక్కడక్కడా వీపులున్న సిమెంటు బెంచీలున్నయి. వాటికి తమ వీపులు ఆనించి కూర్చున్న మనుషులున్నారు. కొందరు తమలో తాము మాట్లాడుకుంటున్నారు. కొందరు పక్క వాళ్ళతో మాట్లాడ్తున్నారు. గాలిలో మాటలు ఈదులాడుతున్నవి.
వాకింగ్‌కు వచ్చే వాళ్ళు అలసిపోయినప్పుడు గుండెలు వేగంగా పని చెయ్యలేక లబోవ్ దిబోవ్ మంటున్నప్పుడు అరవై డెభ్భై ఎనభై కేజీల బరువుని అరుగుల మీద కూచోబెడ్తారు అవున్న వాళ్ళు.
పార్కు గేటు దాటి వచ్చాడో సూటూ బూటూలో దాచుకున్న బాడీవాలా. ఎర్రగా బుర్రగా ఉన్నోడు కూడా ఎత్తుగా ఉన్నాడు. లావు సరేసరి అది బలుపే మరి. కాస్సేపు ప్రశాంతంగా కూచుందామనుకున్నాడేమో ఖాళీ బెంచీని వెదుక్కురమ్మని కళ్ళకి చెప్పినట్టున్నాడు. అవి చూపుల్ని పురమాయించేయి. ఒకే ఒక్క బెంచీ ఖాళీగా వుంది.
భారీ బాడీని మోసుకుంటూ వెళ్ళి దభీలుమనే చప్పుడుతో దాని మీద కూచున్నాడు. సరిగా ఆ టైంకే పార్కులో మరో బెంచీ ఖాళీగా లేకపోవడం వల్ల చెరో రెండు కాళ్ళూ ఉన్న మరో ఇద్దరు ఆ బెంచీని ఆక్రమించారు.
ఆ ఇద్దరూ 'లోక్లాసు' వాళ్ళల్లా అనిపించి కొంచెం పక్కకు జరిగి మరికొంచెం ముడ్చుకు కూచున్నాడు సూట్‌వాలా. సూట్ వాలా పక్కన ఉన్న వాడు నోట్లో నాలుక లేకపోయినా ఒట్టిమాటలు మాటాడ్డం బాగా అలవాటైన వాడు. ఊరికే ఉండలేక 'తమరెవరు సార్! ఈ పార్కుకి ఎప్పుడూ రాలేదే' అన్నాడు.
నేనసలు ఇలాంటి పార్కుకి రాను. కారు రిపేరు కదా వచ్చాను. నేనొక 'రిచ్ ఫెలోని' అన్నాడు రిచ్ ఫెలో. ఉంగరాల చేతిని పైకెత్తి వాటిల్లో రాళ్ళు ఫక్కున నవ్వేట్టు ఊపుతూ.
'అలాగా సార్! నేనో మధ్య తరగతి మనిషిని. మిడిల్ క్లాస్ మ్యాన్ని' అన్నాడు బెంచీ మధ్యనున్నవాడు. ఆ పక్కనే నల్లచారల మాసిన బుష్ షర్ట్ వేసుకున్నవాడు ఆపుకోలేని నవ్వు నవ్వాడు.
'నువ్వెవరోరు!' అన్నాడు రిచ్మాన్ చిరాగ్గా. 'నేనా? నన్ను చూస్తే తెలీడంలా. పేదవాణ్ణి. వెరీ పూర్ మ్యాన్ని' అన్నాడు పాపం పేదవాడు. ముగ్గురికీ మాటలు కలిశాయి. మాటలు ఎలెక్షన్ల గురించి సాగాయి.
'ఏ పార్టీ గెలుస్తుందో నన్నడగండి. ఎలెక్షన్ ఫండు యిచ్చేది మేమే. అసలు గవర్నమెంటంటే మేమే. పారిశ్రామిక వేత్తలం కంట్రాక్టర్లం బిజినెస్ మెన్లం. కోట్లు కూడబెడ్తాం. బ్యాంకులు కొల్లగొడ్తాం. బడా బాబులం కింగ్ మేకర్సుము' అంటూ ఊగిపోయాడు రిచ్ ఫెలో.
'ఏం మాట్లాడ్తున్నారు సార్? పేదోడు లేకపోతే ప్రభుత్వం అడ్రసు ఎక్కడుంటుంది సార్. సబ్సిడీలు హీమీలు ఎవరిస్తారు? పథకాలు ఎవరికి అమలు చేస్తారు. ఇళ్ళు ఎవరికి భూములు పంచేదెవరికి పెళ్ళిళ్ళెవరికి చేస్తారు. ఫించన్లెవరికిస్తారు. పిల్లల్ని కనే తల్లులెక్కడ దొరుకుతారు. ఏ ప్రభుత్వానికైనా అండా దండా ఆధారం మేమే. మేం ఓట్లేస్తేనే లీడర్లు వాళ్ళకు పదవులు, కార్లు విమానయాత్రలు కోట్లూ నోట్లూ' అని ఊపిరి పీల్చుకున్నాడు పేదవాడు.
'నిజమే! ప్రభుత్వాలు నిలబెట్టేదీ కూల్చేసేదీ మీరే! మేం ఓట్లు వేస్తే వేస్తాం లేకుంటే లేదు. అందరం వేరు వేరుగా ఆలోచించి వేరేవేరేగా ఓట్టు వేస్తాం. మీలా ప్రభుత్వాలు ఏర్పాటు చెయ్యలేం కానీ వాటిని మోసేది మాత్రం మేమే. బిల్లులు కడతాం. పన్నులు కడతాం. బుద్ధిగా బ్యాంకులోన్లు తీరుస్తాం. బ్యాంకులు లూటీ చేసిపోయిన వాళ్ళ డబ్బూ కడతాం. ధరలూ చార్జీలూ పెరిగాయంటూ కిక్కురుమనం. పేదవాళ్ళ పథకాల కోసం, కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం ప్రభుత్వాలు అప్పుల పాలయితే ఆ అప్పు తీరుస్తాం. ఏడుస్తాం. మొత్తుకుంటాం. చప్పున చల్లార్తాం' నిట్టూరుస్తూ నిలబడ్డాడు మధ్య తరగతి మనిషి.
'ఎప్పుడూ మా మీద ఏడుపే మీకు. మాలాగా డబ్బు సంపాదించాలని ఆశ మీకు. కానీ త్రిశంకు స్వర్గంలో వేలాడ్డం తప్ప పైకి రాలేరు కిందికి జారిపోరు.' అంటూ లేచి వెళ్ళిపోయాడు ఉంగరాల వేళ్ళున్న చేయి ఊపుకుంటూ సంపన్నుడు.
మధ్యన వేలాడ్డం మీ ఖర్మ! పేదవాళ్ళవడమంత అదృష్టం లేదు. మేం లేకపోతే ప్రభుత్వాలకు పనే ఉండదు. ఏ పార్టీ మీటింగైనా, లారీల్లో వెళ్ళేది మేమే. ఎలక్షన్లల్లో గెలవాలనుకున్న వాళ్ళు యిచ్చే ఉపన్యాసాలన్నీ చేసే వాగ్దానాలన్నీ మరి మా కోసమే కద. వాళ్ళు ఓట్లు అడుక్కోవడం మమ్మల్నే కద. వాళ్ళకు మా మీద ఉన్న నమ్మకం మీ మీద లేదు. మీ కోసం ఏం చేసినా వాళ్లకు కల్సిరాదు. అదే మేమయితే నమ్మకంగా ఓట్లు వేస్తాం. మాకు ఏమేం ఇస్తారో హామీ యిచ్చి మందూ మాంసం నోట్లూ యిస్తే గొఱ్ఱెల మందల్లా ఓట్లు వేస్తాం కలసికట్టుగా. మాకు చదువు అక్కర్లేదు. పనీ వద్దు. ఐదేళ్ళకొక్కసారి ప్రభుత్వాలను నిలబెడ్తాం. ఎవరైనా సరే పేదరికాన్ని భద్రంగా కాపాడుకోవల్సిందే. పేదరికం ఉంటేనే పార్టీలు ప్రభుత్వాలు నిలబడేది. ప్రభుత్వాలు ఏర్పడేది అన్నాడు పేదవాడు, పేదవాడయినందుకు సంబర పడుతూ.
ఆకాశంలో నల్లమబ్బు బెలూన్ని తెల్ల మెరుపు ఒక్కటి సూదిలా గుచ్చింది. వర్షం మొదలవడంతో పార్కులో జనం బయటకు పరుగెత్తారు.
-చింతపట్ల సుదర్శన్, 9299809212