Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తప్పనిసరై తపతి కుటుంబమంతా స్నేహితుల గహ ప్రవేశానికి రానూ పోనూ వందమైళ్ళు, వెళ్ళి వచ్చేసరికి అంతా డీలా పడిపోయారు. జోరున వర్షం కురుస్తున్నా ప్రయాణ బడలిక, ఎక్కువ నీరు తాగితే బాత్రూం ప్రాబ్లంస్, అందుకే అంతా దాహం బిగపట్టుకుని ఇల్లు చేరగానే దాహంతోనూ, ఆకలైతోనూ బడలిపోయారు.
''అమ్మా! నాకు షర్బత్'' అని కేకేశాడు కొడుకు కుమార్. వాడు ఎంత చలైనా నిమ్మ షర్బత్తు మాత్రమే తాగుతాడు. వాడి ఫేవరెట్ జ్యూస్ అది.
''నాకు బత్తాయి రసం'' అంది కూతురు బాసంతి. ఆమెకు బత్తాయి రసమే మహా ఇష్టం. అన్నం కూడా మానుకుని రోజూ తాగుతుంది.
''నాకు కమ్మని మజ్జిగ'' అన్నాడు హజ్బెండ్ ఆనంద్. ఆనంద్ పల్లెలో పుట్టి పెరగటాన మజ్జిగ అతని ముఖ్య పానీయం. ఆఫీసుకూ మజ్జిగ సీసాతోనే వెళతాడు.
''అమ్మారు! నాకు రాత్రి వార్చిన గంజిలో ఒక చిటికెడు ఉప్పు వేసి ఇవ్వమ్మా!'' అంది అత్త అనసూయమ్మ. ఆమె పల్లెలో పాలేర్లకు ఇస్తూ గంజితో మైత్రి చేసేసుకుంది. రెండు పూటలా ఆమెకోసం అన్నం వార్చి గంజి చేస్తుంది తపతి.
''తపతమ్మా! నాకు కాస్త కష్టమైనా రాగి జావ ఇవ్వు తల్లీ!'' బలహీనంగా అన్నారు మామగారు మాణిక్యరావు. ఆయనకు స్నేహితుడు షుగర్ జబ్బు. అందుకే రాగి సంకటి, రాగి జావ ఆయన ఆహారం.
అందరి అరుపులూ విని తపతి తడబడకుండా వంట గదిలోకి చిరునవ్వుతో వెళ్ళింది.
''ఇన్ని రసాలేంటే అక్కా! నీవు మరీ వీళ్ళ రుచులకు బానిసవై పోయావు. అందరికీ ఒకటే ఐతే తేలిక కదా! ఇలా నేర్పావేంటే వీళ్ళకు..' అంటూ నసుగుతూ వెనకాలే వచ్చింది తపతి చెల్లెలు తనూజ.
ఇప్పుడైతే హార్లిక్స్, బోన్విటా, బూస్ట్ లాంటి అనేక రకాల రెడీమేడ్ పౌడర్స్, కోకో కోలా, మజ్జా, ఫాంటా, పెప్సీ వంటి (ప్రమాదకరమైనవని తెలీకుండానే తాగే) జ్యూసులు వస్తు న్నాయి కానీ, పూర్వం అంబలి అనే అన్నం నుండీ వార్చిన గంజిలో ఉప్పు, కాస్త మజ్జిగా పోసుకుని తాగి పొలం పని మధ్యాహ్నం వరకూ చేసేవారు రైతులు.
ఇంటికి ఎవరు వచ్చినా నేడు కాఫీ కానీ టీ కానీ ఇస్తున్నాం, పూర్వం అతిధి మర్యాదగా మజ్జిగ లేక మంచి తీర్ధం ఇచ్చేవారు.
కొన్ని పానీయాలు అన్ని కాలాల్లో తాగితే బలానికి బలం, ఇంట్లో చేసుకుంటే పరిశుభ్రతతో పాటుగా చౌక కూడా. అందుకే తపతి అన్నీ ఇంట్లోనే చేసి అందరికీ ఎవరికి ఇష్టమైనది వారికి అందిస్తుంటుంది.
కొన్ని పానీయాలు ఎలా చేసుకోవాలో తపతినడిగి చేసేసుకుందామా!
రాగి జావ
దీన్నె రాగి మాల్ట్ అని సీసాల్లో పొడి మర్కెట్లో వస్తు న్నది. ఐతే ఇంట్లో చేసుకుంటే స్వచ్ఛత, రుచీ రెండూ అధికంగానే ఉంటాయి. శ్రమైనా మన ఆరోగ్యం కోసం తప్పదుకదా!
రాగి పొడి : రాగులను కడిగి ఆరపోసి, నీడలో ఆరాక వేయించి గుండపట్టాలి. దాన్లో మనకు ఇష్టమైతే ఏలకులను వేసుకుని చల్లారాక సీసాలో పోసుకుని, ఉదయమూ, సాయంకాలమూ కూడా కాఫీ, టీలకు బదులు తాగితే బలమే బలం!. చల్లనీటిలో కలిపి, వేడినీటిలో పోసి ఒక పొంగు రాగానే పంచదార, పాలుకానీ; ఉప్పూ మజ్జిగా కానీ కలుపుకుని తాగితే అరవై ఏళ్ళ వారు ఇరవై ఏళ్ళ వారిలా పరుగులు తీస్తారు.
రాగులు లేక తమిదల్లోని పోషకాలు చూస్తే వదలరు. రాగి పిండిలో ప్రయోజనాలు అసంఖ్యాకం. మధుమేహం, కాన్సర్, ఎముకలు గుల్లబారడం వంటివి దరిచేరవు. అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తాయి. ఇంకా మాంసకత్తులు, ప్రోటీన్లు, ఆమ్లాలు కూడా ఉంటాయి. కనుక రాగి జావను అన్ని కాలాల్లో మజ్జిగతో కలుపుకుని తాగి బలమూ, ఆరోగ్యమూ కూడా పొందవచ్చు. అన్ని కాలాల్లోనూ ఈ జావ తాగడం ఆరోగ్యకరం. చిన్నపిల్లలకు పాలు, పంచదారతో ఇస్తే ఇష్టంగా కూడా తాగుతారు.
బార్లీ జావ
బార్లీ గింజలు మంచి పోషకాలను అందిస్తాయి. సహజమైన ఔషధంలాగా పనిచేసే ఈ బార్లీ జావను పూర్వం నుండీ జ్వరం వచ్చిన వారికి ఆహారంగా ఇవ్వమని వైద్యులు సలహా ఇచ్చేవారు. వంట్లో వేడిని తగ్గించి, శక్తినిస్తుందని చెప్పేవారు.
బార్లీ గింజల్లోని పీచు పదార్థం, జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. బార్లీలో క్యాల్షియం, ఇనుము, మాంగనీసు, మెగ్నీషియం, జింక్, రాగి వంటి ఖనిజ లవణాలు ఉంటాయి. బార్లీ గింజలు గుండె సంబంధమైన వ్యాధుల నుండీ నివారణనిస్తాయి. అధిక బరువును పెరగనీయవు. వ్యాధినిరోధక శక్తినిస్తాయి. బార్లీ శరీరంలో అధిక నీటిని తొలగించి, మూత్ర సంబంధ వ్యాధులను రానివ్వదు. ఇప్పుడు అన్నీ మార్కెట్లో లభ్యమవుతున్నా మనం చేసుకున్న వాటితో సరికాదు.
బార్లీపోడి చేసుకోవడమెలా? : బార్లీ గింజలను వేయించి పొడిచేసి ఉంచు కుని కొంచెం వాసనకు ఏలకుల పొడికూడా కలిపి వేడినీటిలో పొంగించి మజ్జిగ ఉప్పు కానీ, పంచదార, పాలు కానీ లేక నిమ్మరసం, తేనె కానీ కలుపుకొని తాగితే ఒంటి ఉష్ణోగ్రత పెరకకుండా కాపాడుతుంది. అద్భుతమైన శక్తినిచ్చే సహజ పానీయం ఇది. పిల్లలకూ పెద్దలకూ కూడా మంచి పానీయం.
సబ్జాగింజల రసం
ఇది కేవలం వేసవి పానీయమని చాలామంది అనుకుంటారు, ఐతే సబ్జా గింజలు సహజంగా ఒంట్లో ఉండే వేడిని తగ్గిస్తాయి. నీళ్లలో నానాక నల్లని గింజలు తెల్లగా సగ్గు బియ్యంలాగా ఉబ్బుతాయి.
ఈ గింజలను నీటిలో సుమారుగా 3, 4 గంటలు నానపెట్టి అవి తెల్లగా వచ్చాక నిమ్మరసం కలుపుకుని తాగితే ఒంట్లో వేడి తగ్గి శరీరానికి చల్లదనం వస్తుంది. సహజంగా కొందరి శరీర ఉష్ణోగ్రత మిగతా వారి కంటే ఎక్కువగా ఉండటం కద్దు. అదివారి శరీరపు తీరు. అలాంటి వారికి ఇది మంచి పానీయం అవుతుంది. అన్ని కాలాల్లోనూ తాగవచ్చు. మల బద్దకాన్ని నివారిస్తుంది. ఒంట్లోవేడి తగ్గటం వలన ఉత్సాహం కలుగుతుంది.
ఈ గింజల్లోని పోషకాలు, విటమిన్లు, ఐరెన్... ఇతర ఖనిజాలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఎసిడిటీ.. కడుపులో మంట తగ్గుతుంది. నానబెట్టిన సబ్జా గింజల రసంలో కొంచెం అల్లం రసం, తేనేతో కలిపి తాగితే రక్తాన్ని శుద్ధిచేసి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
తరవాణి
అద్భుతమైన చలువచేసే బలాన్నిచ్చే పానీయం. గ్రామాల్లో రైతులే కాక పూర్వం చాలా మంది పేదలే కాక ధనికులు కూడా ఈ తరవాణి అనే పుల్లనీళ్లు, రాత్రులు అన్నం వండి వార్చిన గంజిని అలా ఉంచితే, ఉదయానికి కాస్తంత పులుస్తుంది. ఇదే తరవాణి. దీనికి కొద్దిగా మజ్జిగ కొంచెం అన్నం కలిపి ఉప్పు వేసుకుని తిని పనికి వెళతారు పల్లెవారు.
ఐతే ఈ తరవాణి ఎవరైనా తాగవచ్చు. అన్నంలో గంజి కావటాన సార మంతా దానిలోనే ఉంటుంది. శరీర తాపం తగ్గి సుఖంగా ఉంటుంది. వేసవిలో ఐతే ఎండ బెట్ట కొట్టదు. ఇది పేదల ఆహార పానీయం కాదు, అందరి ఆరోగ్య పానీయం.
ఫైవ్ స్టార్ హోటల్స్‌లో 'రైస్ జింజిర్ స్టార్స్' అనో మరేదో కొత్తపేరు పెట్టి నెత్తిన మొట్టి ఒక వందో నూట యాభయ్యో బిల్ వేస్తే హాయిగా తాగుతాం లొట్ట లేసుకుంటూనూ. అదే ఇంట్లో బామ్మో, అవ్వో ఇస్తే- 'పాత చింతకాయ పచ్చడి పారబొరు' అంటాం.
రెండు అపిల్స్ కోసి జ్యూసర్లో వేసి వడకట్టి ఇస్తే అదే ఆపిల్ జ్యూస్. ఫ్రష్ జ్యూస్.
కీరా దోసలు రెండు యాపిల్స్ రెండూ కలిపి జ్యూస్ చేసి చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ తేనె, కాస్తంత అల్లం వేసుకు తాగితే ఎంత హాయిగా ఉంటుందో తాగేవారికే తెలుస్తుంది, చదివే వారికీ, వివే వారికీ కాదు.
అలాగే 2,3 టమోటాలు కాస్త వేడి నీళ్ళలో వేసి చల్లారాక జ్యూస్ తీసుకుని పంచదారో, ఉప్పో కొంచెం పెప్పర్ కూడా వేసుకుని తాగితే ఎంత హాయి?
అలాగే మనిషికి ఒకటి లెక్కన క్యారెట్స్ ఉడికించి జ్యూస్ చేసి నిమ్మ రసమో, తేనో కలుపుకుని తాగితే ఎంత ఫ్రష్! ఎంత ఆరోగ్యం! కళ్ళకెంత మంచిది!
ఒకరోజున క్యారెట్ జ్యూసైతే మరో రోజున బీట్ రూట్ జ్యూస్, ఈ లెక్కన తాగితే టైం టేబుల్ ప్రకారం చేసుకుని రాత్రి భోజనం ముందు ఒక్కో గ్లాసూ తాగి కొద్దిగా భోజనం చేస్తే ఒళ్ళెక్కడ వస్తుందీ! నైస్‌గా ఎల్లకాలం నవ యువతే!
ఇక మనింట్లోనే బత్తాయిలూ, ఆరంజిలూ, ద్రాక్ష కూడా అప్పటికపుడు ఫ్రష్‌గా రసం చేసుకుని తాగితే ఎంతారోగ్యం! అంతేకాక మనకు ఇష్టమైనంత పంచదార, లేక నిమ్మరసం, లేక తేనె, ఉప్పూ ఏది ఇష్టమైతే అది కలుపుకుని జాంజాం అంటూ తాగేయొచ్చు. ఎంతారోగ్యం! ఎంతారోగ్యం! డాక్టర్లకు పర్మినెంట్‌గా టాటా చెప్పేయొచ్చు.
ఇక దానిమ్మ జ్యూస్ మర్చిపోతే వాళ్ళమ్మైన నిమ్మ కోప్పడదూ! అంతే కాదర్రా! లలితా సహస్రనామాల్లో అమ్మవారికి 'దాడిమికుసమప్రభ' అనే నామం కనిపిస్తుంది. మరి ఆ అమ్మ కూడా కోప్పడదూ!
పండ్ల జాతుల్లో మేలైనది. తినడానికి రుచిగా ఉండేదీ, రసం తాగితే మరీ మంచిది దానిమ్మ. దీనిలో విటమిన్ -ఎ, సి, ఇ, బి5, ఉన్నాయి. మధుబీజము, రక్తబీజము, అనే పేర్లు కూడా ఉన్న దానిమ్మ రసం తాగడం వల్ల చర్మం రంగు, మెరుపూ వస్తుంది. వద్ధాప్యాన్ని పక్కనపెడుతుంది.
దానిమ్మ రసంలోని రసాయనాలు 'కొలెస్టరాల్' వల్ల జరిగే ప్రమాదాలను తగ్గిస్తుంది. రక్తపోటును తగ్గించే గుణంకూడా ఈ రసానికి ఉంది. ప్రతివారము ఒకసారి గ్లాసు దానిమ్మరసము తాగడం మంచిది. గుండె జబ్బులున్న వారికి మేలు చేస్తుంది. సినీనటి భానుమతీ రామకష్ణ తన చర్మం మెరుపుకు చిట్కా రోజూ దానిమ్మ రసం తాగటమే అని చెప్పినట్లు నా చిన్నతనంలో చదివాను.
మూత్రపిండాల సమస్యలను నివారిస్తుంది. ఖరీదు ఎక్కువైనా కనీసం వారానికోమారు ఒక గ్లాసుడు దానిమ్మరసం మన ఇంట్లో చేసుకుని తాగితే జరిగే మేలు అంతా ఇంతాకాదు.
బూడిదగుమ్మడి రసం
బూడిదగుమ్మడి అనగానే మనకు గుర్తుకువచ్చేవి 'బూడిద గుమ్మడివడియాలు' ఔనా! లేకపోతే బూడిద గుమ్మడి హల్వా! ఐతే బూడిద గుమ్మడి రసం ఉదయాన్నే త్రాగడం వల్ల,దీనిలోని కార్బొహైడ్రేట్లు, కొవ్వు అతి తక్కువ శాతం ఉండటంతో డైటింగ్ కు మంచిది. ప్రశస్తమైన ఔషధగుణాలు, పోషక లక్షణాలు ఉన్నాయి కనుకనే దానిని 'వైద్య కుష్మాం డం' అని 'వైద్య కంబళం' అని అంటారు.
పొద్దున్నే ఒక గ్లాసు బూడిదగుమ్మడి రసంలో కొంచెం నిమ్మరసం, తేనే, చిటికెడు నల్ల మిరియాలపొడి కలుపుకుని, ఉపాహారానికి అర్థగంట ముందు తాగితే శరీరంలో వేడి తగ్గి చల్లదనం వస్తుంది. చురుకుదనం పెరుగుతుంది. దీనిలో ప్రాణశక్తి అధికంగా ఉండటమే దీనికి కారణం.
మనకు ప్రకతిమాత ఇచ్చే ఇన్ని మంచి కాయల రసాలను మనకుమనమే తయారు చేసుకుని తాజా రసాలను మన ఇంటిల్లిపాదికీ ఇస్తే కలిగే ఆనందం కొలత వేయలేము.
ఇక చివరగా నిమ్మ రసం - ఒక్క ఐదు నిముషాలు చాలు తయారు చేసుకోను పట్టే సమయం. నిమ్మరసం తాగితే జరిగే మేలు చెప్పడం కంటే స్వానుభవంతో తెల్సుకోడం శ్రేయస్కరం. పంచదార వేసుకుంటే షర్బత్ గానూ, ఉదయాన్నే తేనెతో తాగితే ఆరోగ్య రసంగానూ పనిచేస్తుంది. ఊబకాయం తగ్గిస్తుంది కూడా. నిమ్మ పండులో విటమిన్ సి సమద్ధిగా ఉంటుంది. నిమ్మరసం గురించి ఎంతచెప్పిన తక్కువే! .
నిమ్మరసంలో ఉండే విటమిన్ 'సి' వలన రోగనిరోధక శక్తిని పెరుగు తుంది. నిమ్మవలన జలుబు చేస్తుందని చాలామంది భావిస్తారు. నిజానికి నిమ్మ జలుబు చేసిన వారికి చాలా మంచిది. ఆశ్చర్యంగా లేదూ!
'నిమ్మ చేసేమేలు అమ్మ కూడా చేయదనే' సామెత ఇందుకే పుట్టి ఉంటుంది.
బయట షాపుల్లో యాడాదో, రెండేళ్ళ నాడో తయారు చేసి డేట్స్ మార్చి అమ్మితే మనం ఆనందంగా కొని అద్భుతంగా ఉందని తాగే ఆపిల్ జ్యూస్, టమోటా జ్యూస్, ఆరంజ్ జ్యూస్, లెమన్ జ్యూస్, గ్రేప్ జ్యూస్ ఇంకా ఇంకా అనేకానేక జ్యూసులు నిలవ ఉంచను రసాయనాలు కలిపి అమ్మితే లొట్టలేసుకుంటూ తాగి, ఆ తర్వాత డాక్టర్ బిల్లులు కట్టుకుని బాధపడతాం.
ఈ బాధకంటే మన ఇంట్లో మనం చేసుకుని మన వారికి కాస్తంత ఓపిక, తీరిక చేసుకుని ఇస్తే ఎంత ఆరోగ్యం, ఎంత రుచి, ఎంత ఆదా. మార్కెట్లో అమ్మే రెడీమేడ్ రసాలన్నింటినీ వదిలేసి, మనం ఇంట్లో చేసుకుని ఇంటిల్లిపాదికీ ఆరోగ్యాన్నీ, ఆనందాన్నీ, సంతప్తినీ ఇద్దామా!
- ఆదూరి హైమావతి
9632503483