Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శిశువుకు తల్లి వద్దే పాలు లభించడమనేది ప్రకృతి ప్రసాదించిన వరం. శిశువులు ఆహారాన్ని తల్లినీ ఒకేసారి గుర్తిస్తున్నారు. తల్లిపాలు ఒక సంపూర్ణ పోషకాహారం. పిల్లల శరీరానికి మనసుకూ కూడా!
- రవీంద్ర నాథ్ టాగూర్
అమ్మ పాల కంటే అమృతం లేదు. అమ్మ ప్రేమకు మరేది సాటి రాదు. పసిపాపకు తల్లి పాలు దొరకడం ప్రకృతి ఇచ్చిన వరం. దేవుడు తాను అని చోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడంటారు కదా! జంతువుల్లో క్షీరదాలు అన్నీ కూడా పిల్లలకు పాలిచ్చే పెంచుతాయి. మానవుడు కూడా క్షీరదాలు విభాగంలోని వాడే. క్షేమకరమైన, పౌష్టికమైన ఆహారం పసిబిడ్డలకు అందడం కష్టం కాబట్టి ప్రకృతి ఇలాంటి ఏర్పాటు చేపింది. తల్లి వద్దే పాలు దొరికేలా అపూర్వమైన ఏర్పాటు జరిగింది. శిశువుకు తగినంత నులివెచ్చని వేడితో, సులభంగా జీర్ణమయ్యేలా బిడ్డకు ఎలా అవసరమో అలా తయారు చేయబడి ఉంటాయి. ఇంకా తల్లి పాలు తాజాగా, బాక్టీరియా, వైరస్‌లతో కలుషితం కాకుండా, ఉచితంగా, స్వచ్ఛంగా బిడ్డ నోటికి అందుతాయి. తల్లిపాల వల్ల కల్తీని నివారించవచ్చు. తల్లి పాలు తాగే వాళ్ళకు అంటు వ్యాధులు రావు.
అభివృద్ధి చెందుతున్న దేశాలలో బాటిల్ ఫీడింగ్ అనేది పిల్లల పాలిట మృత్యువు లాంటిది. పారిశ్రామికీకరణ వల్ల మహిళలు ఉద్యోగులుగా మారడం వల్ల బిడ్డలకు పాలు పట్టటం సమస్యగా మారింది. పూర్వకాలాల్లో అయితే కేవలం కిందిస్థాయి వారికి మాత్రమే చంటి బిడ్డల్ని తీసుకుని పని చేసే స్థలాలకు వెళ్ళేవారు. పొలం పనులు చేసే రైతు కూలీలు పొలం గట్టును చెట్ల కింద ఉయ్యాలలు వేసి పిల్లలను పడుకోబెట్టేవాళ్ళు. బిడ్డ ఏడ్చినపుడు వచ్చి పాలు పట్టేవాళ్ళు. ఆధునిక మహిళలకు బిడ్డలకు పాలిచ్చే అవకాశం లేకుండా పోతున్నది. ఇళ్ళకు, ఆఫీసులకు మధ్య దూరాలు ఎక్కువ ఉండటం వలన మధ్యలో ఇంటికి వచ్చి పాలు పట్టే అవకాశం కూడా లేదు. దాదాపుగా నగరాల్లో మహిళలంతా ఉద్యోగులు కావడం వల్ల పిల్లల పెంపకం వాళ్ళకు అత్యంత కష్టంగా తోస్తున్నది. చాలా మంది ఒక్క బిడ్డకే పరిమితమవటం ఇలాంటి కష్టాల కారణంగానే జరుగుతున్నది. అవసరం ఉన్న మహిళలే కాకుండా తాము చదువుకున్న చదువుకు సార్థకత కలిగించాలనో, సమాజంలో గుర్తింపు కొరకో ఉద్యోగాలు చేసే మహిళలకు పిల్లలకు పాలు పట్టటం పెద్ద సవాల్‌గా వారి ముందు నిలబడుతున్నది. ఇప్పటికి అమ్మమ్మలు పిల్లల్ని పెంచినా తర్వాతి తరానికి వాళ్ళ అమ్మమ్మలు ఉద్యోగస్తులుగా ఉంటారు కాబట్టి రాబోయే రోజుల్లో తల్లి పాలు తాగిన బిడ్డలు అరుదుగా ఉండవచ్చు. తల్లి దగ్గర పాలు తాగి పెరిగిన వారిని అద్భుతంగా, అపురూపంగా చూసే పరిస్థితులు రావచ్చు. బహుశ భవిష్యత్తులో పసిబిడ్డలకు వచ్చే వ్యాధులు పెరగటం, మరణాల రేటు పెరగడం కూడా జరగవచ్చు. ఇలాంటి పరిస్థితులను ఉహించే శాస్త్రవేత్తలు తల్లి పాల ప్రయోజనాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆశించారు.
తల్లిపాల వారోత్సవాలు జరపాలని ఎప్పుడు ఎలా నిర్ణయించారు అని దాని చరిత్ర తెలుసుకుందాం! వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO), యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (UNICEF) రెండూ కలసి తల్లిపాలు గురించి తెలియజేయాలనే ఆలోచనతో 1990లో ఒక మెమొరాండం సమర్పించారు. తల్లిపాల ప్రాముఖ్యతనూ, ప్రయోజనాన్ని జనంలోకి తీసుకెళ్ళాలని ఈ రెండు సంస్థలు భావించాయి. 1991లో ద వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఏర్పడి WHO, UNICEF లక్ష్యాలను తీర్చాలని నిర్ణయించింది.
వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అనేది కొన్ని మార్గదర్శక సూత్రాలను విడుదల చేసింది. తల్లి పాలు పుట్టిన బిడ్డలకు అవసరం, పుష్టికరం. కనీసం ఆరునెలల పాటు తల్లి దగ్గర పాలు తాగటం వలన బిడ్డకు శ్రేయస్కరం. తల్లిపాలు తాగటం వలన శిశువు చాలా అంటు వ్యాధుల నుండి రక్షింపబడుతుంది. అంతేకాక బిడ్డ రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా రూపొందుతుంది. ఫలితంగా బిడ్డ తన చుట్టూ ఉన్న బాక్టీరియా నుంచి తనను తాను రక్షించుకోగల్గుతుంది. తల్లిపాలలో బిడ్డకు కావలసిన నీరు కూడా ఉంటుంది. కొవ్వులు, కార్యొహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్, అమైనోయాసిడ్లు, ఎంజైములు, వైట్‌సెల్స్ వంటివన్నీ తల్లి పాలలో లభ్యమవుతాయి. తల్లి దగ్గర పాలు తాగటం వలన శువుకు మాత్రమే ఉపయోగాలున్నాయి అనుకుంటే పొరపాటే. తల్లికి కూడా బిడ్డకు పాలివ్వటం వలన భవిష్యత్తులో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బిడ్డ పాలు తాగకపోవడం వల్ల తల్లి రొమ్ముల్లో గడ్డలు ఏర్పడతాయి. వాటిని గంట రెండు గంటలకోసారి పిండి పారబొయ్యాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా బిడ్డ చక్కగా పాలు తాగటం వలన తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రొమ్ముల్లో వచ్చే గడ్డలు ఎక్కువ నొప్పిని కలగజేస్తాయి. తల్లి పాల వలన తల్లీ బిడ్డా ఇద్దరూ క్షేమకరం.
తల్లి నెలలు నిండక ముందే బిడ్డకు జన్మనిచ్చినపుడు వారికి పాలు ఇవ్వలేని స్థితిలో ఉంటుంది. బిడ్డ కూడా పాలను తల్లి రొమ్ము నుంచి పీల్చే శక్తిని కలిగి ఉండదు. ఇలాంటి సమయాల్లో తల్లి దగ్గర పాలను పిండి బిడ్డకు ఉగ్గిన్నెతో చుక్కచుక్క పోస్తారు. ఒక వేళ తల్లి దగ్గర పాలు వచ్చే పరిస్థితి లేనప్పుడు మిల్క్ బ్యాంక్ నుంచి పాలను తెచ్చుకోమంటారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు కావలసిన పాల కోసం ''హ్యూమన్ మిల్క్ బ్యాంక్'' లను ఏర్పాటు చేశారు. ఆధునిక నగరాల్లో, దేశాల్లో ఇవి ఏర్పాటు చేయబడ్డాయి. 2005లో మొదటిసారిగా ఇంటర్నేషనల్ మిల్క్ బ్యాంకింగ్ ఇనిషియేటివ్ స్థాపించబడింది. దీనిలో 33 దేశాలు భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. కొందరు నర్సింగ్ తల్లుల వద్ద నుంచి పాలను సేకరించి భద్రపరుస్తారు. నెలలు నిండకుండా పుట్టిన శిశువుల మరణాల రేటును తగ్గించడానికి బాటిల్ పాల బదులు ఇలా మిల్క్ బ్యాంక్ నుంచి తెచ్చిన పాలను తాగిస్తారు. ఏ జబ్బులు లేని, బిడ్డకు సంబంధం లేని ఆరోగ్యవంతమైన తల్లుల నుంచి సేకరించబడిన పాలను పాశ్చరైజేషన్ ద్వారా శుద్ధి చేసి నిలవచేసారు. అభివృద్ధి చెందిన దేశాలలో ఈ హ్యూమన్ మిల్క్ బ్యాంకుల అవసరాన్ని ఎప్పుడో గుర్తించారు.
సాధారణంగా బిడ్డ పుట్టిన గంటా రెండుగంటల లోపే పాలు తాగగలిగే సామర్థ్యం కలిగి ఉంటాడు. ప్రసవం జరిగిన వెంటనే తల్లి దగ్గర లభించే ముర్రుపాలు బిడ్డకు పట్టడం ఆరోగ్యకరం. ముర్రుపాలలో ఉండే 'కొలెస్ట్రమ్' వల్ల బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి లభిస్తుంది. ముర్రు పాలలో బాక్టీరియల్, వైరల్ యాంటీబాడీస్ ఉంటాయి. తల్లిపాలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉండి రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ సోకకుండా కాపాడుతుంది. డయేరియా వంటి వ్యాధులు కూడా సంక్రమించకుండా రక్షిస్తుంది. పిల్లల భావి జీవితంలో బి.పి. షుగర్, ఎథిరోస్కీరోసిన్, ఒబేసిటీ వంటి వ్యాధులు, తల్లి పాలు తాగిన వారికి తక్కువగా వచ్చే అవకాశాలున్నాయని పరిశోధనల్లో వెల్లడైంది.
బాటిల్‌తో పాలు పట్టటం వలన తల్లికి బిడ్డకూ ఏర్పడే అనుబంధం తక్కువగా ఉంటుంది. బాటిల్ ఫీడింగిలో పాలసీసాలు, పాల పీకలు వేడినీళ్ళలో స్టెరిలైజ్ చేయడం, తల్లి చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ఎన్నో సమస్యలుంటాయి. నీళ్ళు వేడి చేసి, పొడి వేసి, పంచదార కలిపి పాలు తయారు చేసి, వాటిని పిల్లవాడు తాగగలిగే నులి వెచ్చని పాలుగా చల్లార్చి పెట్టటం ఎంతో శ్రమతో కూడుకున్న పని. అదీ రాత్రి పూట బిడ్డకు పాలు తాగించాలంటే ఎంతో కష్టం. చాలా ప్రాంతాలలో పరిశుభ్రమైన నీరే లభించదు. నీటిని కాచి పాలు తయారు చెయ్యడం నిరక్షరాస్యులకు ఎంత కష్టం. ఒక వేళ తెలిసినా ఎన్ని నీళ్ళకు ఎంత పొడి కలపాలి అన్న అవగాహన చాలా మందికి ఉండదు. పోతపాలు తాగిన శిశువుకు సూక్ష్మజీవుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాటిల్ ఫీడింగ్ వలన ఇన్ని సమస్యలు ఉత్పన్నం అవుతాయి. కాబట్టి తల్లులు తన శిశువుకు తన పాలు ఇవ్వటానికే ఆసక్తి చూపించండి. ఉద్యోగమో, ఫ్యాషనో మరొకటో అనుకొని బిడ్డకు పాలివ్వటం మానేయవద్దు. బాటిల్ ఫీడింగ్ వల్ల మరొక నష్టం కూడా ఉన్నది. పాలపీక రంధ్రం పెద్దదయినప్పుడు... ఒకేసారి పాలు ఎక్కువగా నోట్లోకి వెళ్ళటం వల్ల ఉక్కిరిబిక్కిరై మరణించే అవకాశం ఉన్నది. అలాకాక మనం బాటిల్‌ను పట్టుకున్నపుడు కొద్దిగా పక్కకు జరిగి ముక్కులోకి పోయి తద్వారా ఊపిరితిత్తుల్లోనికి పోయి హఠాత్తుగా మరణం సంభవించే అవకాశం ఉంది. తల్లి దగ్గర పాలు తాగడం వల్ల శిశువు పీల్చినంత పాలే నోట్లోకి పోతాయి. అదనంగా పాలు నోట్లోకి వెళ్ళవు. ఒక వేళ బిడ్డ కడుపు నిండిపోతే నోట్లోంచి రొమ్మును తీసేస్తాడు. తల్లి పాలు శిశువుకు క్షేమకరం.
ఆగస్టు 1వ తేదీ నుంచి 7 తేదీ వరకు వారం రోజులు తల్లిపాల వారోత్సవాలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ వారోత్సవాలు జరుగుతాయి. ''ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్'' (ICDS) ద్వారా దేశ వ్యాప్తంగా అమ్మపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. అమ్మ పాలు తాగే శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో వజ్ర సమానమైన రోగ నిరోధక శక్తిని పొందుతుంది. ఇంతటి విశిష్టత గలిగిన పాలను బిడ్డ ఎంత వయసు వచ్చే వరకు ఇవ్వాలి? రోజుకు ఎన్ని సార్లు ఇవ్వాలి? ఎలా ఇవ్వాలి? తల్లికి పాలు సరిపోయినంతగా రావాలంటే ఏం చేయాలి? ఎక్కువ కాలం బిడ్డకు పాలివ్వాలంటే తల్లి ఎలాంటి ఆహారం తినాలి? ముర్రుపాలు ఎప్పుడు పట్టాలి ? ఎలా పట్టాలి? ముర్రుపాల విశిష్టత ఏమిటి? వగైరా అంశాలపై అవగాహన కల్పించటమే ఈ తల్లిపాల వారోత్సవాల ముఖ్యోద్దేశ్యం. బిడ్డ పుట్టిన గంట నుంచి ఆరునెలల వరకు బిడ్డకు తల్లి పాలు తప్ప మరేమి ఇవ్వకూడదు. పల్లెల్లో తక్కువ వయసులో తల్లులు అయిన వారికి అవగాహన లేమి ఉంటుంది. శిశువుకు తల్లిపాలు తేలికగా జీర్ణమవుతాయి. తల్లి దగ్గర పాలు పుష్కలంగా ఉంటే రెండేళ్ళ పాటు వరకు బిడ్డకు పాలు ఇవ్వవచ్చు. బిడ్డకు పాలు ఇచ్చేటపుడు బిడ్డ తల ఎత్తుగా పెట్టుకొని మాత్రమే పాలు పట్టాలి. అందుకే వైద్యులు బిడ్డను కూర్చున్న పొజిషన్లో ఉంచి పాలు ఇవ్వాలని సూచిస్తున్నారు. పాలిచ్చే కాలంలో తల్లి ఆహారనియమాలు పాటించాలి. కాఫీలు, కూల్డ్రింకులు తాగటం వలన బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. అమ్మ పాలు బిడ్డకు రక్ష. బిడ్డకు పాలివ్వడం తల్లికి రామరక్ష.
- డా|| కందేపి రాణీప్రసాద్