Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాత్రి రెండు దాటింది. బస్సులు లేవు. ఆటోలు లేవు. రెండు కాళ్ళ మీద నడిచి పోవల్సిందేననుకున్నాను.లారీ వాడి పుణ్యమా అని దిగాను అనుకుంటూ నడక మొదలెట్టాడు. అలా ఎంత సేపు నడిచాడో గాని కాళ్ళు కదల్నని మొండికేశాయి. ఒళ్ళు కుయ్యో మొర్రోమంది. వీధి దీపాలు వెలగడం మానేశాయి కనుక చీకటి నల్లదుప్పటిలా పర్చుకుని ఉంది.
ఈ రాత్రికి ఎక్కడో ఓ చోట కునుకు తియ్యక తప్పదు. తెల్లారాక కానీ కాళ్ళు చెప్పినట్టు వినవు అనుకున్నాడు. చీకట్లో కళ్ళు చిట్లించుకుని చూశాడు. ఏవో రెండు విగ్రహాలు పక్కపక్కనే ఉన్నవి. వాటికెదురుగ్గా ఓ అరుగు కూడా ఉన్నట్టుంది. బతుకు మనుష్యుడా అనుకుంటూ అరుగెక్కేడు. కాసేపటికే గురక మొదలెట్టేడు.
ఆకాశంలో గుంపులుగా చేరేయి నల్లటి మబ్బులు. ఒంటి నిండా ఉన్న నీళ్ళని కురిపిద్దామా వద్దా అని చర్చించుకుంటున్నట్టున్నవి. ఎక్కడో ఓ పిడుగు నే పడిపోతున్నానంటూ పెద్ద కేక పెట్టింది. నల్లమబ్బుల్లో దాక్కున్న ఓ మెరుపు తీగ పై నించి జిగేలు మంది తరువాత తళుక్కుమంది. ఆ మెరుపు అక్కడ ఉన్న రెండు విగ్రహాల మీదికి దూకేసింది.
ఓ విగ్రహంలోమ కదలిక వచ్చింది. తను నిలబడి ఉన్న చప్టా మీద నుంచి కిందికి దూకేసింది. పక్కన ఉన్న మరో విగ్రహం నెమ్మదిగా కదిలింది. దిమ్మ మీది నుంచి అదాట్టుగా కిందికి దూకలేదు కానీ నెమ్మదిగా శాంతంగా కిందికి పాకి నేల మీద నుంచుంది.
రెండు విగ్రహాలూ ఒకదానికొకటి ఎదురుగ్గా నుంచుని ఒకరినొకరు చూసుకున్నవి. తమరా అంటే తమరేనా అనుకున్నవి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కదా అన్నది ఒక విగ్రహం మనిషైనది. జండా ఎగరేసే రోజు కదా అని వచ్చానన్నది మనిషైన మరో విగ్రహం.
టమాటా రంగు లుంగీ మీద పసుపు రంగు శాలువా కప్పుకుని ఆకాశంలోకి వచ్చిన సూర్యుడ్ని చూస్తూనే తెల్లముఖం వేసింది చీకటి. ఎలాగో వచ్చాం కదా నువ్వటు వెళ్ళు నేనిటు వెళ్తానన్నది ఓ విగ్రహం ఓ వైపున నడుస్తూ. మళ్ళీ ఇక్కడే కదా కలుసుకునేది అన్నది మరో వైపు నడుస్తూ ఇంకో విగ్రహం. విగ్రహాలు రెండూ మనుషులై చెరో వైపే నడిచేయి.
బాగా తెల్లవారింది. తెల్లగా తెల్లవారింది. సూర్యుడు వైట్ డ్రస్సు వేసుకుని నిలబడ్డాడు. ఓ వైపు నడుపస్తూ వెళ్ళిన విగ్రహం మనిషిని మరో నిజం మనిషి సూటిగా చూశాడు పరకాయించి చూశాడు. కెవ్వుకెవ్వుమన్నాడు. ఆనందంతో ఉబ్బలేదు కానీ తబ్బిబ్బయ్యేడు. మీరా తమరా అని ఆశ్చర్యపోయేడు. సరిగ్గా సమయానికి వచ్చారు. రండి రండి ఇక్కడ మా కాలనీలో జండా ఎగరేస్తున్నాం. మూడు రంగుల జండా ఎగరెయ్యాలి. ఇది మీ జండానే మీరిచ్చిన జండానే అంటూ చెయ్యి పట్టుకు నడిపించుకెళ్ళిండా మనిషి జండా కర్ర పాతేసి ఉంది. జండా దానికి కట్టేసి వుంది. చుట్టూ ఉన్న కుర్చీల్లో ఫోటోలున్నవి. జనం గుమిగూడి వున్నారు. కర్ర తాటించుకుంటూ వెళ్ళిన విగ్రహం మనిషి జండా కర్ర ముందు నిలబడ్డాడు. జనం గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకు ముందు తను ఎప్పుడూ జండా ఎగరేయలేదు. ఇన్నేళ్ళకు అవకాశం వచ్చింది. దాని వెనక కారు వెనక కారులు వచ్చేయి. కార్లోంచి దిగిన మనిషి చుట్టూ జనంతో గన్నులున్న మెన్నులతో జండా దగ్గరికి వచ్చాడు. జండా ఎగరేయడానికి నన్ను పిలిచి అప్పుడే ఎగరేస్తున్నారా? అని కోప్పడ్డాడు. ఈయన ఎవరు? అంటూ కర్ర పట్టుకుని నించున్న మనిషికేసి చూశాడు పక్కన ఫొటోలో ఉన్న మనిషినీ చూశాడు. పోల్చుకున్నాడు. తమరా తమరెందుకిక్కడ. వెనక్కి జరగండి. మీది ఈ రాష్ట్రం కాదు మీరు ఏ పార్టీ లీడరూ కాదు. పార్టీయే అవసరం లేదన్నారట గడా! పైగా మీరు చేసిన పన్లు, నచ్చని వారెందరో ఉన్నారక్కడ. అందుకే కదా 'హే రామ్' అన్నారక్కడ. పుస్తకాల్లో ఫొటోల్లో ఉండవలసిన వారు విగ్రహౄలుగా నిలబడవలసినవారు ఇలా జనంలోకి వచ్చేయవచ్చునా? ఏ చేతిలో ఏ తుపాకీ ఉందో ఎవరికెరుక టీవీ వాళ్ళు వస్తున్నారు పక్కకు తప్పుకోండి. మీరు తప్పుకోలేరు శక్తి లేదు కదా. అరేరు ఈయన్నిక్కడ్నించి తప్పించండ్రా అని అరిచాడు కారులోంచి దిగిన నాయకుడు. విగ్రహం మనిషిని అక్కడికి తెచ్చిన వాడు పరారయ్యాడు. విగ్రహం మనిషిలా అడుగులో అడుగేస్తూ తను వచ్చిన చోటికి బయల్దేరేడు. మరో వైపు నుంచి నడుస్తూ వెళ్ళిన విగ్రహంను మనిషి మరో నిజం మనిషి చూశాడు. కెవ్వుమన్నాడు. చాచాజీ తమరేనా అంటూ మళ్ళీ మళ్ళీ కెవ్వుమన్నాడు. మొట్టమొదట ఎగరేసిన తమరే ఆజాదీ కా అమృతోత్సవ్ నాడు ఇలా కదలి రావడం అద్భుతం మహాద్భుతం తిరంగా జండా ఎగరెయ్యాలి రండి అంటూ చెయ్యి పట్టుకు విగ్రహం మనిషిని తీసుకెళ్ళి జండా ముందు నిలబెట్డాడా మనిషి. హస్తినాపురం దాకా వెళ్ళకపోతేనేం ఎర్రకోటపై జండా ఎగరేయకపోతేనేం ఎక్కడో అక్కడ ఎగరేస్తున్నందుకు సంతోషపడుతూ టోపి సర్దుకున్నాడు విగ్రహం మనిషి. సరిగ్గా అప్పుడే దూసుకువచ్చాయి కార్లు. కారులోంచి దిగిన మనిషి చుట్టూ జనంతో గన్నులున్న మెన్నులతో జండా ఎగరేయడానికి వచ్చాడు. అక్కడ నుంచున్న విగ్రహం మనిషిని చూసి ముఖం చిట్లించాడు. ముకం మడత పెట్టాడు. తమరెందుకిక్కడ. తమరి పార్టీ లేదిక్కడ. మాజీలు జండా ఎగరేయరాదెక్కడా. కాలం మారింది కాకా ప్రజా సేవ ఒకప్పుడు పాషన్ ఇప్పుడది ప్రొఫెషన్. పక్కకు తప్పుకోండి టీవీ వాళ్ళు వస్తారు. ఎన్నికలు దగ్గర పడ్తున్నవి. జనానికి టీవీల్లో పేపర్లల్లో కనపడుతూ వుంటే తప్ప జాబ్ సెక్యూరిటీ లేదు. దయ చేయండి విగ్రహంలో ఉంటే జయంతులకీ వర్థంతులకీ దండలేసి దండమెడతాం. పొండి అనరిచాడు కారులోంచి దిగిన నాయకుడు.
ఓ వైపు నడుస్తూ వెళ్ళిన విగ్రహం మనిషి బయలుదేరిన చోటికి వచ్చాడు. ఇంకో వైపు వెళ్ళిన మనిషి విగ్రహమూ నడిచి వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. విగ్రహాలుగా నిలబడి ఉంటేనే గౌరవం అనుకుంటూ విగ్రహాల్లోకి వెళ్ళిపోయారు.
అరుగు మీద నిద్రపోతున్న మనిషి ఉలిక్కిపడి లేచాడు. ఎదురుగ్గా ఉన్న విగ్రహాలు ఎక్కడికీ వెళ్ళలేదు. ఒకటి బోసి నవ్వులు, నవ్వుతుంటే మరొకటి పావురం ఎగరేస్తున్నది.
-చింతపట్ల సుదర్శన్,
9299809212