Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విరాటగిరి పర్వతం చుట్టు పక్కల దట్టమైన అడవి. పచ్చని చెట్లతో, పక్షుల కిలకిల రావాలతో పచ్చదనాన్ని తొడుక్కొని పెళ్లి కూతురులా ముస్తాబైంది.. దానికి పక్కనే 'వానర మెట్ట' అనే పల్లెటూరు. ప్రశాంతమైన వాతావరణం. విరాటగిరి పర్వతం నుండి జాలువారే నీటి సవ్వడి పాల నురుగులను పల్లెకు ధార పోస్తున్నట్లుగా ఉంది.
వానర మెట్టకు వచ్చిన అతిథులకు తిరిగి వెళ్ళాలనిపించదు చల్లని గాలి, పక్షుల సందడి, కాలుష్యం, మలినం లేని మనుషులు. ఆ ఊరిలో అడిమయ్యకు ఉన్న మూడు ఎకరాల భూమిలో కూరగాయల పంటలను పండించేవాడు. వాటిని ఊర్లోనే అమ్ముతూ జీవనం కొనసాగించే వాడు. ప్రశాంతంగా సాగుతున్న జీవితంలో అనుకోని ఆటంకాలు ఎదురయ్యాయి.
విరాటగిరి పక్కనే ఒక మందుల ఫ్యాక్టరీని కట్టడానికి అడవిలో ఉన్న చెట్లను నరికేశారు. పచ్చని కోకను కట్టిన విరాటగిరి అడవులు ఇప్పుడు మోడు బోయి మౌనంగా రోదిస్తుంది. అడవిలోని పక్షులు, వానరాలకు ఆవాసం కరువైంది.
పక్కనే ఉన్న చిన్న పట్టణం 'కోకాపేట' లో బంధువుల పెండ్లికి రైతు అడిమయ్య వెళ్లాల్సి వచ్చింది. రెండు రోజుల తర్వాత తిరిగి వచ్చిన రైతు తన కూరగాయల తోటకి వెళ్లి చూడగానే వానర మూక తోటలో పండిన కూరగాయలన్నిటిని తిని వేసి, తోటను మొత్తం పాడు చేసాయి. అది చూసి చాలా బాధ పడ్డాడు.
తోటకి వేసిన కంచెలో చిన్న వానరం చిక్కుకొని బాధతో విలవిలలాడింది. అది చూసిన రైతు వానరాన్ని చేతుల్లోకి తీసుకుని కాలికి ఉన్న ముళ్ళ కంపని తొలగించి గుడ్డతో కాలికి కట్టుకట్టాడు. ఐనా వానరం నడవలేక పోయింది.తనతో పాటే ఇంటికి తీసుకెళ్ళి ఊరిలో ఉన్న వైద్యునితో కాలికి కట్టు కట్టించాడు.
రైతు పొద్దస్తమానం తోట దగ్గరే ఉండి వానర మూక నుండి తోటను కాపాడుతూ, కూరగాయలు అమ్ముతూ, ఉదయం, సాయంత్రం చిన్ని వానరం బాగోగులు చూస్తూ ఉన్నాడు. వారం రోజులు గడిచింది. చిన్ని వానరం మెల్లమెల్లగా నడవడం, గెంతడం, దూకడం చేస్తుంటే అది చూసి రైతు ఆనందించాడు. అప్పటి నుంచి రైతుని వదిలి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు. అతడు ఎక్కడికి వెళ్లిన వెంట వెళ్ళేది. ఆ రైతు చిన్ని వానరానికి ముద్దుగా 'చోటా భీమ్' అని పేరు పెట్టుకున్నాడు.
ఒకనాడు ఉదయం లేసి అడిమయ్య తోట దగ్గరికి వెళ్తుంటే చోటాభీమ్ కూడా తనతో పాటే తోట దగ్గరికి వెళ్ళింది. రైతు వెళ్ళేసరికి కూరగాయల తోటలో వానర మూకను చూసి తోట నుంచి ఆ గుంపును వెళ్లగొట్టాడు. తోటనంత పాడు చేశాయని ఆ రైతు కళ్ళలో నీళ్ళు తిరిగాయి. అది చూసిన చోటా భీమ్ కూడా చాలా బాధపడింది.
వానర మూకలో ఉన్న తన తల్లిని చోటా భీమ్ చూసి ఆనందంతో తన తల్లి దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని అంతా చెప్పింది. ''మీరు ఇలా తోటను పాడు చేయడం వల్ల ఆ రైతు ఎంతో బాధ పడుతున్నాడు. తను బతకడానికి ఈ కూరగాయల వ్యాపారమే ఆధారం'' అని చోటా భీమ్ తన తల్లితో చెప్పింది.
''ఇన్ని రోజులు వాటితో వచ్చిన డబ్బుతోనే నాకు వైద్యం చేయించాడు. నాకు ఆహారాన్ని పెట్టి ప్రేమగా చూసుకున్నాడు. తను బాధ పడితే నాకు బాధ వేస్తుంది''.
''అమ్మా! నువ్వే మన వానర మూకతో మాట్లాడి ఈ తోట వైపుకు రాకుండా చేయి!'' అని చోటా భీమ్ తన తల్లిని వేడుకుంది.
తల్లి వానరం మిగతా వానరాలతో మాట్లాడి కూరగాయల తోట వైపు రాకుండా చేసింది. చోటా భీమ్ రైతు దగ్గరికి వెళ్లి జరిగిన విషయాన్ని అంతా చెప్పింది. రైతు సంతోషించి 'మనం జంతువుల పట్ల ప్రేమను చూపిస్తే అవి మన పట్ల ప్రేమను చూపిస్తాయని' వానరాల మనసుకు రైతు తన మనసులోనే కతజ్ఞతలు చెప్పుకున్నాడు. చోటా భీమ్ కూడా తన బాగోగులు చూసుకున్నందుకు రైతుకు కతజ్ఞతలు చెప్పి సెలవు తీసుకొని తన తల్లి దగ్గరికి సంతోషంగా వెళ్ళింది. రైతు ఆనందంగా కూరగాయల వ్యాపారం చేసుకుంటూ జీవించసాగాడు.
- ఎమ్.జానకీరామ్,
6305393291