Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1947 - 2022నాటికి భారత్ 75 ఏండ్ల స్వాతంత్య్రం పూర్తి చేసుకుంది. ప్రజాస్వామ్య రాజ్యంగా, ప్రపంచంలోనే అత్యున్నత లిఖిత రాజ్యాంగం కలిగి ఉన్న దేశంగా వజ్రోత్సవ వేడుకలకు నిర్వహించుకుంటోంది. ఎన్నో ఆటుపోట్లను, సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కొని, అన్నిటికీ తట్టుకొని ధైర్యంగా నిలిచింది. 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే అవి 29 రాష్టాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు అయ్యాయి. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుంచి నేటి నరేంద్ర మోడి వరకు భారత రాజకీయ ప్రస్థానం సాగింది.
75 ఏళ్ళ స్వాతంత్య్రంలో భారత్ ఎన్నో అనూహ్య విజయాలు సాధించింది. పర్యాటక రంగం వేగంగా అభివద్ధి చెందింది. వ్యవసాయ రంగంలో ఒడిదుడుకులు ఎదురైన అనుకున్న ఫలితాలు సాధించాం. కొన్ని దేశాలకు ఆహార ధాన్యాలు ఎగుమతి చేస్తున్నాం. ఇక పారిశ్రామిక రంగంలో మధ్యస్థంగా ఊగిసలాడుతున్నాం. ఇక్కడ జపాన్ను మనం ఆదర్శంగా తీసుకోవాలి. చాలా చిన్న దేశమైన జపాన్ పారిశ్రామికంగా అభివద్ధి చెందింది. నేడు అభివద్ధి పథంలో ఇతర దేశాలను శాసించే స్థాయికి వచ్చింది. మనం జపాన్‌తో పోటీ పడలేం. అయితే మన తర్వాత స్వాతంత్య్రం వచ్చిన చైనా అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందింది.
పారిశ్రామికంగా వేగంగా అభివద్ధి చెందాలనే కోరిక బలంగా ఉంది. మనకంటే వెనుక స్వాతంత్య్రం తెచ్చుకున్న దేశాలు అభివద్ధి బాట పట్టాయి. మనం అయితే వెనుకబడి పోవటానికి కారణం రాజకీయ, సామాజిక సమస్యలు. భారత్ లో ఇప్పటికి కులాలు, మతాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. కులాల రొంపిలో భారత్ ఇరుక్కుపోయింది. ఒక సామాజిక వర్గం, మరొక సామాజిక వర్గంతో పొసగక చంపుకుంటున్నాయి. అభివృద్ధికి ఇది పెద్ద అవరోధం. అలాగే మతాలు. మతం అనేది చాలా సున్నితమైన సమస్య. ఎవరు ఏ మతం అవలంభించిన, పరిత్యజించిన ఆటంకాలు ఉండరాదు. రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కు అది. భారత్ ఎక్కువగా మతాలతోనే నష్టపోతోంది. ఇలా ఈ సమస్యల వలయంలోనే భారత్ వెనక్కి పడిపోయింది. దానికి తోడు అవినీతి పెచ్చరిల్లి పోయింది. ప్రతి పనికి చేతులు తడపాల్సినదే. ఇది ఇలా ఉంటే నిరుద్యోగము, పేదరికం, పోషకాహర లేమి, జనాభా మొదలగు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. ముఖ్యంగా ఇప్పటికి సరైన పోషకాహారం పిల్లలకు అందడం లేదు. వివిధ పాఠశాలలకు చేరే కోడి గుడ్డు, అరటి పండ్లు పక్కదారి పడుతున్నాయి. నిజాయితీగా సరఫరా చేసే వారు ఎక్కడో ఉన్నారు. చాలా వరకు పోషకాహారం పిల్లలకు అందడం లేదు. ఈనాటికి పేదరికం పోలేదు.
75 ఏళ్ళ స్వాతంత్య్రంలో ఇంకా సమస్యలు చుట్టుకుని ఉన్నాయి. పేదవాడు పేద వాడుగానే ఉండిపోతున్నాడు. ఈ పరంపరలో రాజకీయాలు కూడా భారత్‌ను బాగా దెబ్బ తీశాయి. ప్రపంచంలో ఒక శాంతి కాముక దేశంగా భారత్‌కు మంచి పేరు ఉంది. అలానే ఏ దేశం కష్టాలలో ఉన్న, ఆ దేశ సార్వభౌమత్వానికి నష్టం కలిగిన అక్కడ శాంతి పునరుద్ధరణకు నడుం బిగిస్తుంది. ఆ దేశ మనుగడకు బాటలు వేస్తుంది. అలా దేశాలను సంస్కరించే స్థాయికి భారత్ ఎదిగింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో పురోగతి సాధించింది. పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసుకున్న క్షిపణులు భారత్‌లో ఉన్నాయి. అదే సమయంలో రష్యా, ఫ్రాన్స్ దేశాల సహకారంతో క్షిపణులు రూపొందించుకుని భారత్ అణు వ్యవస్థ పటిష్టమైంది అనే స్థాయికి వచ్చింది. సరిహద్దుల్లో సుశిక్షితులైన సైనిక, సాయుధ బలగాలు, క్రమశిక్షణ గల సైన్యం మన సొంతం. దేశ ఆక్రమణకు శత్రు సైనికులు అవలంభిస్తున్న వివిధ మార్గాలను పటాపంచలు చేసింది. కార్గిల్ పోరాటంలో పొరుగు దేశానికి కోలుకోలేని దెబ్బ తీసింది.
విశ్వంలోనే భారత్ కు అన్ని దేశాలతో సఖ్యత ఉంది.పాక్ , చైనాలతో కొంత వైరం ఉన్నా, దాదాపుగా భారత్ అన్ని దేశాలతో స్నేహా హస్తాన్ని
అందిస్తోంది.దేశాల ఆర్ధిక
పరిస్థితి చక్క దిద్దే పనులను కూడా భారత్ నెత్తిన పెట్టుకుంది.మాల్దీవులకు ,నేపాల్ కు శ్రీలంక ,బంగ్లాదేశ్ మొదలగు దేశాలకు ఆర్ధిక సహకారం అందించింది.ఏ దేశాన్ని భారత్ తులనాడదు.నేడు విశ్వంలో శాంతి ఉండాలి, చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారం కావాలి అని నమ్మే దేశాలలో భారత్ ఒకటి. ఇప్పటికి రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆగక పోవటానికి చర్చలు అసంపూర్తిగా ముగియడమే. ఇక భారత్ లో ఎన్నికలు కూడా ఒక ప్రహసనం, ఒక భారీ కార్యక్రమం. భారత్‌లో పెట్టె ఎన్నికల ఖర్చు ఒక చిన్న దేశాన్ని అభివద్ధి పరచవచ్చు. సువిశాల భారత్‌లో ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది.అయినా నేడు భారత్ అగ్ర దేశాలతో పోటీ పడుతోంది. భారత్‌ను అభివద్ధి చెందిన దేశంగా చూడాలని, ప్రతి రంగం అభివద్ధి చెందాలని బాపు ,నెహ్రు సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి మొదలగు నాయకులు కలలు కన్నారు. భారత్ ను అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్ళాలి అని నెహ్రు పూర్తిగా సంకల్పించారు. అందుకే నవ భారత్ నిర్మాతగా పేరు గాంచాడు. ఇప్పుడు ఈ దిశలోనే భారత్ పయనిస్తోందా!
మనం పూర్తిగా ఎదగాలంటే అన్ని రంగాలను సంస్కరించాలి. నిరుద్యోగిత పోవాలి. పేదరికం, పోషకాహార లేమిపై పంచవర్ష ప్రాణాళికలలో అధిక మొత్తంలో నిధులు
విడుదల చేయాలి. ఇవి పక్క దారి పట్టక తగిన వ్యూహం రచించాలి. ఇవన్నీ పకడ్బందీగా జరిగితే ఈ పాటికి భారత్ ఎప్పుడో అభివద్ధి చెందేది.75 ఏళ్ళ స్వాతంత్య్రంలో భారత్ అభివద్ధి చెందిన దేశంగా మనం చేసే వాళ్ళం.మరో పాతిక
సంవత్సరాలకు 100 ఏళ్ళకు మనం చేరుకుంటాం. కనీసం అప్పుడైన భారత్‌లో కులాల, మతాల, అస్థిర రాజకీయ ఘర్షణలు పోయి ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ఒక్కరు అనే విధంగా జీవించాలి. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో ఏమి సాధించాం అంటే ప్రగతి కంటే అధోగతే ఎక్కువగా కానవస్తోంది. ఇది పోవాలి.భారతీయులు అంత ఒక్కటై, దేశ నిర్మాతలై నవ భారత దేశానికి, నవ శకానికి నాంది పలుకుతూ, ప్రతి పౌరుడు దేశ ప్రగతిలో మూల స్తంభమై నిలబడాలి. కుళ్ళు సామాజిక సమస్యలు, కుళ్ళు రాజకీయాలు విడనాడితే దేశం ముందుకు పోవడం ఎంతో దూరంలో లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా ముందుడే సమస్యలు ఏవంటే నిరుద్యోగిత , పేదరికం, పోషకాహార లేమి, అధిక జనాభా వీటిపైనే మనం సమిష్టి గా యుద్ధం చేయాలి. అప్పుడే సుస్థిర అభివద్ధి సాధ్యం. ఎప్పుడైతే అభివద్ధి సాధిస్తామో అప్పుడు స్వాతంత్య్ర ఫలాలు ప్రతి ఒక్కరికి అందుతాయి. లేకపోతే స్వతంత్ర ఫలాలు ఎవరికీ దక్కని పరిస్థితి. భారత దేశ వ్యాప్తంగా అవినీతి ని మనం కట్టడి చేస్తే అద్భుతమైన ఫలితాలు చూస్తాం.తద్వారా దేశం విశేషమైన ప్రగతి సాధిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.
- కనుమ ఎల్లారెడ్డి,
93915 23027