Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పర్యాటక ప్రదేశం విశాఖ పట్టణంలో ఎన్నో పర్యాటక అద్భుతాలు వున్నాయి. వాటిలో అత్యంత ప్రముఖమైనది, తప్పనిసరిగా సందర్శించదగినది ఐఎన్ఎస్ కురుసుర సబ్‌మెరైన్. రామకృష్ణ బీచ్ రోడ్లో గజపతి రాజు మార్గ్‌లో ఈ సబ్‌మెరైన్ వుంది.
వాస్తవికంగా ఈ సబ్‌మెరైన్ 18 డిసెంబర్ 1969లో రష్యన్లు నిర్మించిన జలాంతర్గామి ఎన్.ఎస్.కురుసుర కమాండర్ ఎ.అడిట్టో ఆధ్వర్యంలో రిగా యు.ఎస్.ఎస్.ఆర్. లో ఈ జలాంతర్గామి ఆవిష్కరించబడింది. 1970లో బాల్టిక్ సముద్రం ద్వారా, ఇది విశాఖ పట్టణం చేరుకుని, అప్పటి నుంచి భారత నౌకా దళానికి సేవలిందించటం ప్రారంభించింది. ఈ సేవలు దాదాపు 31 సం||లు కొనసాగాయి. అంటే, 28 ఫిబ్రవరి, 2001 వరకు. ఈ జలాంతర్గామి పొడవు 300 అడుగులు, వెడల్పు 250 అడుగులు. ఇది ఇండో - పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో 1971 ప్రాంతంలో ప్రముఖపాత్ర వహించింది. ఈ జలాంతర్గామి ఒక ఇంజనీరింగ్ అద్భుతం.
ఇంకా ఈ జలాంతర్గామి ఇతర దేశౄలలోని నావికా విన్యాసాలలో పాల్గొంది. ఈ ఐఎన్ఎస్ కురుసుర సబ్‌మెరైన్‌కు ప్రపంచంలో రెండో స్థానం లభించింది. అనంతరం దీనిని మ్యూజియంగా మార్చారు. దక్షిణ ఆసియాలో మ్యూజియంగా మారిన మొదటి సబ్‌మెరైన్ ఇది.
ఈ జలాంతర్గామికి మూడు షాప్టులు వున్నాయి. ఒక్కొక్కటి ఆర్బ్లెడ్ ప్రొపెల్లర్ వుంటాయి. పడవలాగా వున్న ఈ సబ్‌మెరైన్‌ను మ్యూజియంగా మార్చాలనే ఆలోచన ఆడ్మిరల్ వి పస్రిచాకు వచ్చింది. దీనిని చివర స్థానానికి లాగటానికి 18 నెలల సమయం పట్టింది. ఇందుకు ఆ రోజుల్లో 55 మిలియన్ల రూపాయలు ఖర్చయ్యాయి. 9 ఆగస్టు, 2002 నుంచి ఇది మ్యూజియంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. కాంక్రీట్ పునాదిపై ఈ సబ్‌మెరైన్ నిర్మించబడింది.
ఈ జలాంతర్గామిలో రాడార్ రూమ్, సోనార్ రూమ్, కంట్రోల్ రూం, బెడ్రూంలు, కిచెన్ రూంలు, ఇంకా యుద్ధ సమయంలో ఉపయోగించబడిన వివిధ రకాలు ఆయుధాలను చూస్తోంటే ఎంతో అద్భుతం అనిపిస్తుంది.
సముద్రంలో జలంతర్గాములు ఎదుర్కొనే కష్టాలు, నావికుల జీవితం, ఆయుధ ప్యాకేజి ఇత్యాది విషయాలు, దీనిలోకి ఛాయాచిత్రాల ద్వారా అవగతం చేసుకోవచ్చు. ఏది ఏమయినా విశాఖ పట్టణం సందర్శించే ప్రతి పర్యాటకుడు విధిగా ఈ సబ్‌మెరైన్ సందర్శించి దీని గొప్పతనాన్ని తెలుసుకుంటే, ఎంతో విజ్ఞానం లభిస్తుంది. సాధారణ ప్రవేశ రుసుం ద్వారా దీనిలోకి ప్రవేశించవచ్చు.
- పంతంగి శ్రీనివాసరావు,
9182203351