Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డెబ్బై ఆరు వసంతాలు అయిన సందర్భంగా...
నాడు మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం ఏర్పడి మూడు దశాబ్దాలుగా అద్భుతమైన గ్రంథాలయ సేవలను అందిస్తున్నది. అంతే సమానంగా నిజాం రాష్ట్రంలో కూడా గ్రంథాలయ ఉద్యమం నిర్విరామంగా సాగుతున్నది. ఒకే భాష, ఒకే సాంప్రదాయం, ఒకే సంస్కృతి గల తెలుగు వారు రాజకీయ కారణాల వల్ల, భౌగోళిక కారణాల వల్ల (తెలంగాణకు నిజాం రాష్ట్ర ప్రభువులు, ఆంధ్ర ప్రాంతానికి బ్రిటిష్ వారు పరిపాలించడం) వేరువేరుగా ఉన్న వారంతా ఒక్కటమనే భావన వారి మదిలో ధృఢంగా ఉన్నది. అదేవిధంగా ఆంధ్రదేశంలో ఏర్పడిన గ్రంధాలయ సంఘం నిజాం రాష్ట్రంలోని గ్రంథాలయ సేవకులతో, గ్రంథాలయాలతో చక్కటి అనుబంధాన్ని పెనవేసుకున్నది.
1944వ సంవత్సరం ఆగస్టు నెలలో ఇల్లందులోని సింగరేణి కాలరీస్ నందు 25వ ఆంధ్ర దేశ గ్రంథాలయ మహాసభలు శ్రీ కోదాటి నారాయణరావు, శ్రీ ఆకుల లక్ష్మీనారాయణ గుప్త గార్ల తెలంగాణ ప్రాంత గ్రంథాలయ సంఘం నిర్వాహకులు, ఉత్తర సర్కారుల గ్రంథాలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారు. దీనితో గ్రంథాలయ ఉద్యమం నాడు నూతన వికాసం ప్రసాదితమైనది.
సింగరేణి కాలరీస్ నందు వెలిగిన వెలుగులు తెలంగాణ నలుమూలల వ్యాపింప చేయబడ వలేనని భావించి మరొక ప్రాంతమైన కర్నూలుకు దగ్గరగా ఉన్న అలంపూర్ తాలూకా క్యాతూరు నందు గ్రంథాలయ మహాసభను ఏర్పాటు చేశారు. దానికి ప్రధాన కారణం రాయలసీమ ప్రాంతంలో కూడా గ్రంథాలయ ఉద్యమం చక్కగా వ్యాపింప గలదని ఉద్దేశం.
నాడు పాలమూరు సంస్థానాలైన గద్వాల, వనపర్తి, కొల్లాపూర్ అనేక శతాబ్దంల నుండి ఎడతెగక సాహిత్యాన్ని, సాహిత్య ఉపాసకులకు, తెలుగు భాష సాంస్కృతికి పట్టం కట్టిన జీవగడ్డ. ఇరవై ఆరవ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభలు తెలంగాణ ప్రాంతం, క్యాతూరు నందు 1946 మార్చి 1,2,3 తేదీలలో జరిగాయి.
26వ గ్రంథాలయ మహాసభలు 4 వేల రూపాయలు ఖర్చుతో ఘనంగా నిర్వహించారు. 1946 మార్చి ఒకటో తేదీ మధ్యాహ్నం 2:30 నిమిషాలకు గ్రంథాలయ ప్రదర్శన ఆవిష్కరణతో 26వ గ్రంథాలయ మహాసభ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రదర్శన కార్యక్రమాన్ని సురవరం ప్రతాపరెడ్డి ప్రారంబించి మన దేశ విద్యా వ్యవస్థను ఇతర దేశ విద్యా వ్యవస్థ లతో పోల్చి మన విద్యా వ్యవస్థ సామర్థ్యంగా పని చేయాలి అంటే గ్రంథాలయాలు వెన్నుముకగా పనిచేస్తాయని, గ్రంథాలయ నిర్వాహకులు విద్యావస్థకు జీవనాడులని వారు ప్రసంగించారు. కావున ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు నెలకొల్పాలని కోరారు. గ్రంథాలయ మహాసభలకు మొట్ట మొదటిసారిగా ప్రత్యేక ప్రాంగణాలు ఏర్పాటు చేశారు. 5000 మంది కూర్చునే విశాల మంటపం, ప్రత్యేక నగరం గ్రంథాలయాలకు నిర్మించే ఆచారం ఇదే మొదటిసారి ద్వారాలకు అలంకార పూరితంగా జై హింద్, వందేమాతరం అని నిర్మించారు.
ముఖ్య అతిథి వచ్చిన శ్రీ రాజ బహదూర్ వెంకటరామిరెడ్డిని సాయంత్రం 6:30 నిమిషాలకు 26 ఎడ్లు గల రాతి రథంపై బ్రహ్మాండమైన ఊరేగింపుగా తీసుకెళ్ళారు. ఈ కార్యక్రమానికి రాజ బహదుర్ వెంకటరామిరెడ్డి అధ్యక్షత వహించారు. ఆహ్వాన సంఘం అధ్యక్షులుగా శ్రీ సురవరం రంగారెడ్డి ఉన్నారు. మాడపాటి హనుమంతరావు, కోదాటి నారాయణరావు, గడియారం రామకృష్ణ శర్మ తదితరులు ప్రసంగించారు.
వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ తమ చిన్నతనంలో విల్లంబులు పట్టుకుని క్యాతుర్ వచ్చిన సంగతిని గుర్తు చేసుకున్నారు. నిజాం ప్రభువుల చత్రచాయను ప్రతి గ్రామంలో గ్రంథాలయాలు ఏర్పడాలని, ఆ గ్రంథాలయాలు రైతులకు అందుబాటులో ఉండాలని, వ్యవసాయక గ్రంథాలు ఎక్కువగా ఆ గ్రంథాలయాలలో ఉండాలని ప్రసంగించారు. ప్రతి గ్రామంలో ఉన్న మహిళలు గ్రంథాలయాలను ఉపయోగించుకోవాలని, అక్షరాస్యతను పెంపొందించు కావాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి 100 రూపాయలు విరాళంగా రాజ బహదుర్ వెంకటరామిరెడ్డి ఇచ్చారు. దాతలు ముందుకు వచ్చి గ్రామాలలో గ్రంథాలయాలు నెలకొల్పాలని పిలుపునిచ్చారు.
మార్చి రెండవ తారీఖున ఉదయం 10 గంటలకు మహాసభ ప్రచార శాఖ సమావేశం మహాసభ మండపంలో నిర్వహించారు. ఈ సమావేశానికి మారేపల్లి రామచంద్రశాస్త్రి సమావేశాధ్యక్షులుగా ప్రసంగిస్తూ మూడు దశాబ్దాలుగా గ్రంథాలయాల వృద్ధికి గాడిచర్ల హరిసర్వోత్తమ రామారావు చేస్తున్న కృషిని ఉద్ఘాటించారు.
ఈ సమావేశంలోని శ్రీ భీమేశ్వర్ రెడ్డి గద్వాల సంస్థాన అధ్యక్షుడు మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న సమస్యలను వివరిస్తూ ప్రస్తుత గ్రామీణ వ్యవస్థపై గ్రంథాలయాల ప్రభావం, వాటి అవసరాన్ని నొక్కి వక్కాణించారు. అదేవిధంగా రాజ బహదుర్ వెంకటరామిరెడ్డి తాము మరుసటిరోజు హైదరాబాద్ కు వెళుతున్నందువల్ల అంత్యోఉపన్యాసాన్ని సమావేశంలో ముగించారు.
గ్రామీణుల కష్టాలను పూసగుచ్చినట్లు చెబుతూ పల్లె ప్రజలు, గ్రంథాలయ ఉద్యమం ద్వారానే తమ కష్ట నివారణ ఉపాయాన్ని తెలుసుకోవచ్చని ప్రసంగించారు. ఆహ్వానసంఘ అధ్యక్షులు శ్రీ రంగారెడ్డి గ్రామంలో బాలికల పాఠశాలను, స్త్రీలకు ఒక గ్రంథాలయాన్ని కట్టించేందుకు అంగీకరించారు. రాజ బహుదూర్ వెంకట్రామిరెడ్డి ఉర్దూ ఉపన్యాసాన్ని శ్రీ మాడపాటి హనుమంతరావు తెలుగులోకి అనువదించారు. ఈ సమావేశంలో మహమ్మద్ గ్యాజి ఆంధ్ర భాషా, గ్రంథాలయ ఉద్యమం గూర్చి మాట్లాడుతూ తెలుగు నాటి 1945 నాటికి 200కు పైగా గ్రంథాలయాలు స్థాపించారని, నిజాం రాష్ట్రంలో 170 గ్రంథాలయాలు పాలకుల ఆదరణ లేకపోయినా స్థాపించడం హర్షణీయం అని గ్రంథాలయాల పని తీరును, గ్రంథాలయ సేవకుల సేవానిరతిని కొనియాడారు.
సాయంత్రం సమావేశాలు శ్రీ పాతూరి నాగభూషణం అధ్యక్షతన ఏర్పాటు చేశారు. దీని తర్వాత నిజాం రాష్ట్రాంధ్రా సారస్వత పరిషత్ మహబూబ్ నగర్ జిల్లా శాఖ సమ్మేళనం సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, గడియారం రామకృష్ణ శాస్త్రి, సుప్రసిద్ధ కవులు పండితులు ప్రత్యేకంగా లోకనంది శంకర్ నారాయణ రావు పాల్గొన్నారు.
మార్చి మూడవ తేదీన ఉదయం 9 గంటలకు వయోజన విద్యాశాఖ సమావేశం శ్రీ గోపరాజు రామచంద్రరావు అధ్యక్షతన సభా మండపంలో ఏర్పాటు అయ్యారు. శ్రీ కొర్రపాటి సుబ్బారావు, కోదాటి నారాయణరావు, శ్రీ రామలింగారెడ్డి తదితరులు వయోజన విద్య ప్రాముఖ్యతను, వయోజన విద్య ఏ విధంగా పల్లె ప్రాంతాలకు ఉపయోగ పడుతుంది, వయోజన విద్యా కార్యక్రమాbలను ఏ రూపంలో (బుర్ర కథ, హరి కథ, గోడ పత్రికలు రేడియోల ద్వారా) ప్రజలకు తీసుకెళ్లాలి అనే వాటి మీద చర్చించారు. శ్రీ గాడిచర్ల హరిసర్వోత్తమరావు గ్రంథాలయాలు వయోజన విద్యా ప్రచారంలలో అక్షరాస్యత ప్రచారం విస్తృతమైన గ్రంథాలయ సేవకు అవసరం అని, గ్రంథాలయాల ద్వారా అక్షరాస్యత పెరుగుతుంది అని, పాలకులు, ఉన్నతులు గ్రంథాలయాలకు ఆదరణ కలిపించాలని, శ్రీ మారపల్లి రామచంద్ర శాస్త్రి అక్షరాస్యత ప్రచారానికి గ్రంథాలయాలు విధిగా తోడ్పడాలని ప్రసంగించారు.
ఆయ్యంకి వెంకట రమణయ్య చెవి ద్వారా కంటే కన్ను ద్వారా విజ్ఞాన ప్రచారం చేయడం ఎక్కువ ఉపయోగం అయిన పద్ధతిగా రుజువైందని వయోజన విద్యా కేంద్రాలలో గ్రంథాలయాలు, పఠన కేంద్రాలు లేకపోతే ఆ కార్యక్రమం నిరర్ధకమవుతుందని సెలవిచ్చారు. ఈ సమావేశంలోనే జనవరి 25, 26, 27 తేదీల్లో బరోడాలో జరిగిన అఖిల భారత గ్రంథాలయ మహాసభలకు ఆంధ్రదేశ ప్రతినిధిగా వెళ్లిన శ్రీ జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి మహాసభకు సంబంధించిన విశేషాలను ప్రసంగించారు. బరోడా రాష్ట్రంలో గ్రంథాలయాలకు ప్రభుత్వం, అక్కడ ఉన్న పెద్దలు సహాయ సహకారాలు అందిస్తున్నారని, ఆంధ్రదేశంలో ప్రభుత్వ, ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండానే గ్రంథాలయ ఉద్యమం, గ్రంథాలయాల స్థాపన ఉవ్వెత్తున జరుగుతున్నదని ప్రసంగించారు. నాకు తెలిసి భారతదేశంలో జరిగిన గ్రంథాలయ ఉద్యమంలో బరోడా తరువాత అంతటి మహోన్నత స్థానం నిజాం రాష్ట్ర గ్రంథాలయాలకు, తెలుగు నాట గ్రంథాలయాలకు చెల్లిందని ఉద్ఘాటించారు.
ముగింపు సమావేశం లో తెలంగాణ కార్యాలయ పక్షాన కోదాటి నారాయణరావు ప్రసంగిస్తూ తెలంగాణ ప్రాంతంలో గ్రంథాలయాల ఆవశ్యకతను, గ్రంథాలయాల స్థితిగతులను, ప్రభుత్వ ఆదరణ ఏ విధంగా ఉన్నది, గ్రంథాలయాల ఎదు ర్కొన్న విపత్కర పరిస్థితులను వివరించారు. మద్రాసు నుండి వెలబడుతున్న బాల అనే పిల్లల మాసపత్రిక ప్రత్యేకంగా గ్రంథా లయాలు విధిగా తెప్పించు కోవాలని గ్రంథాలయ నిర్వాహకులను మహాసభ ప్రతినిధులు కోరారు.
ఈ సమావేశాలకు 75 మంది ప్రతినిధులు ఆంధ్రదేశం, నిజాం రాష్ట్రం నుండి హాజరు కాగా, దాదాపు 4000 మంది సభికులు క్యాతూర్ మహాసభలకు హాజరయ్యారు. ఆలంపూర్ యవక సంఘం, గద్వాల, కర్ణాటక చరక సంఘం వారు, ఆయుర్వేద ఫార్మసీ వారు, ఖద్దరు ఔషధ ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. మంచి నూలును తీసిన రోషమ్మ (గద్వాల) అను స్త్రీని ఆహ్వాన సంఘం సత్కరించింది. ఈ మహాసభల సందర్భంగా విరాళాల రూపంలో సేకరించిన 4 వేల రూపాయలను గ్రంథాలయాల ఉన్నతికి కేటాయించాలని నిర్ణయించారు.
హైదరాబాద్ కేంద్ర రాష్ట్ర గ్రంథాలయంలో అన్ని దేశభాషలకు ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ తెలుగు, మహారాష్ట్ర, కర్ణాటక, భాషలకు సరైన గుర్తింపు ఇవ్వలేదని వరంగల్, ఔరంగాబాద్, గుల్బర్గా పట్టణాలలో తెలుగు, మహారాష్ట్ర, కన్నడ భాషలకు సంబంధించిన ప్రత్యేక గ్రంథాలయాలు ప్రభుత్వం వారు ఏర్పాటు చేయాలని కోరారు. హైదరాబాద్ బ్రాడ్ కాస్టింగ్ స్టేషన్లో గ్రంథాలయ ఉద్యమ ఉపన్యాసాలకు బొత్తిగా స్థానం ఇవ్వకపోవడం విచారకరం తెలుగులో గ్రంథాలయ ఉద్యమం, వయోజన విద్య ఉపన్యాసాలకు స్థానం ఇవ్వాలని కోరారు.
ఈ సభకు అధ్యక్షత వహించిన శ్రీ రాజ బహుదూర్ వెంకట్రామ రెడ్డి , సురవరం ప్రతాపరెడ్డి, సురవరం రంగారెడ్డి,. శ్రీ మారం నర్సింగారెడ్డి, గడియారం రామకృష్ణ శర్మ తదితరులు ఈ సమావేశ విజయవంతానికి కృషి చేశారు. వీరితో పాటు గద్వాల్ నుంచి వచ్చిన యువక విజ్ఞాన సమితి, మహాసభ స్వచ్ఛంద సేవాదళ సభ్యులు, క్యాతూరు చుట్టు ముట్టు ఉన్న పల్లె ప్రజల అందరూ, ఉత్తర సర్కారు నుండి విచ్చేసిన గ్రంథాలయ సేవకులు విజయానికి కృషి చేశారు.
1946 నాటికి ఆంధ్ర దేశ గ్రంథాలయ సంఘం నందు 80 తెలంగాణ గ్రంధాలయాలు సభ్యత్వం తీసుకోవడం గమనార్హం.
- డా|| రవి కుమార్ చేగొని, 9866928327