Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అతను నిత్యాగ్నిహోత్రుడు ఇది అందరూ అనేమాట. అన్న మాటే. ఉన్న మాటే! అతను పంచెకట్టని పౌరాణికుడు. అతను చెప్పేది వట్టి కట్టుకథలలని గిట్టని వారి మాట. అతనే నిత్యానందుడు... సార్థక నామధేయుడు. ఇది అందరూ చెప్పుకునే మాట. ఒప్పుకునే మాట.
నిత్యానందుడు సన్నగా ఉంటాడు. అతని మీసకట్టూ సన్నగానే ఉంటుంది. జుత్తు నుదిటిపై పడుతూ ఉంటుంది. దాన్ని అప్పుడప్పుడూ కుడిచేత్తో పైకనుకుంటూ ఉంటాడు. అతని తండ్రి భూస్వామి. నవంబర్ వన్ కాంట్రాక్టర్. తల్లిదండ్రులకు అతనొక్కడే కొడుకు. అతను పాడిందే పాట.
నిత్యానందుడు రాజనీతి శాస్త్రంలో పరిశోధన చేసాడు. డాక్టరేట్ పట్టా తెచ్చుకొన్నాడు. ఆ పై మహామంత్రి చేతుల మీదుగా స్వర్ణపతకం! అతని తండ్రికి రాజకీయంగా ఎంతో పలుకుబడి ఉంది. ఆ కారణంగా ఏ యూనివర్శి టీలోనైనా లెక్చరర్‌గా అతనికుద్యోగం దొరికేది. అది కాకపోతే మరే ఉద్యోగమైనా అతి సులభంగా లభించేది. కానీ అతనికుద్యోగం చేయడమిష్టం లేదు. ఎన్ని తరాలైనా తరగని ఆస్తి! కాబట్టి చెయ్యాల్సిన కర్మ తనకేం పట్టిందనే అభిప్రాయం అతని పేగుల్లో జీర్ణించుకుపోయింది. ఎప్పుడూ అతని చుట్టూ ఐదారుగురు స్నేహితులుంటారు.
వారికతను టీ తాగిస్తాడు. టిఫెన్లు పెట్టిస్తాడు.
సిగరెట్లిస్తాడు. సినిమాలు చూపిస్తాడు.
మందుకొట్టిస్తాడు. విందులిస్తాడు.
వినోదాల్లో ముంచేసి ఉక్కిరిబిక్కిరి చేస్తాడు.
ఆ రోజు సూర్యుడింకా చీకటి దుప్పటి కప్పుకోలేదు. చుక్క కన్నెల కన్నుకొట్టడానికి చంద్రుడింకా రాలేదు. ఆకసంలో కొంగలు బారులు తియ్యలేదు. పశువులను తోలుకొని పసుల కాపరులింకా ఇళ్లకు మర్లలేదు. వీధరుగుల మీద అమ్మలక్కల ముచ్చట్లు మొదలుకాలేదు.
తమ ఇంట్లో డ్రాయింగ్ రూంలో మిత్రబృందంతో పరివేష్టితుడై నిత్యానందుడు సిగరెట్టు ముట్టిచ్చి రింగురిగులుగా పొగ వదులుతూ కొత్త పురాణం మొదలుపెట్టాడు.
ఇది లత్కోర్ పురాణం ఆరంభం
******
అలవైకుంఠపురం కాదు. అది అమరావతి. ఆ పురిలో అదే ఇంద్రసభ. ఆ సభలో తమ తమ ఆసనాలపై మునులున్నారు. వారికెదురుగా ఉన్న ఆసనాల్లో దేవతలున్నారు. స్వర్ణ సింహాసనంపై ఇంద్రుడున్నాడు. ఆయన పక్కన శచీదేవి లేదు. వజ్రాయుధముంది. ఎప్పుడే రాక్షసరాజు ఎక్కడొచ్చి తన మీద పడతాడో ఎక్కడ తన పదవి ఊడిపోతుందో అనే భయం వల్ల ఇంద్రుడు ఎల్లవేళలా వజ్రాయుధం పక్కనే ఉంచుకొంటాడు.
పదవిలో ఉన్నవాడు ఎల్లకాలం పదవిలోనే ఉండాలను కొంటాడు. పదవి లేనివాడు దాని కోసం పాట్లు పడుతుంటాడు. పదవీ పక్కింటి మిటారి పెదవీ ఒక్కలాటివే. ఆ రెండూ సులభంగా దొరకవు. ఇందుకు ఎమ్మెల్యే అప్పల నర్సయ్యే మంచి ఉదాహరణ.
''పురాణం మొదట్లోనే పిట్ట కథా'' సందేహాల్రావు అడిగాడు. ''ఇది అన్ని పురాణాల్లాటి కాదు. ఈ లత్కోర్ పురాణం పట్టకథతోనే మొదలవుతుంది. చెయ్యి ఇయ్యని రాజకీయ నాయకుడూ. పిట్ట కథలు లేని పురాణమూ ఉండవు. అప్పల నర్సయ్య వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. ప్రతీసారీ ఈ సారి మంత్రి పదవి ఖాయమనుకొంటే ఈ సారి మంత్రి పదవి ఖాయమనుకొనేవాడు. కానీ అతకికా పదవి దక్కలేదు. నాలుగు సార్లూ అతను నిబ్బరంగా ఉన్నాడు. ఐదోసారీ మంత్రి పదవి రాకపోవడంతో అతను గాలిపోయిన సైకిల్ ట్యూబ్ లాగయ్యాడు. అతనికి గుండెపోటు వచ్చింది. ఆస్పత్రికి తీసుకొని పోయేలోపల అతను హరీమన్నాడు.
ఆయనగారి అంతిమ యాత్ర మొదలైంది. దింపుడు కళ్లెం వద్ద పాడె దించారు.
''మిమ్మల్ని వాణిజ్య శాఖ మంత్రిగా నియమించారు'' అని ఒక చెంచా అప్పల నర్సయ్య శవం చెవిలో చెప్పాడు. అప్పటివరకూ శవమైయున్న అప్పల నరసయ్య అమాంతంగా లేచి కూచున్నాడు. పదవీ కాంక్ష అలాంటిది.
ఇక అసలు కథలోకొస్తాను. సిల్క్‌స్మిత డాన్సు కోసం ఎదురుచూసే సినీ ప్రేక్షకుల్లాగ ఇంద్రసభలో అందరూ అప్సరసాంగన నృత్యం కోసం ఎదురుచూస్తున్నారు.
మహేంద్రుని ఆజ్ఞ మేరకు మేనక సభా ప్రవేశం చేసింది.
ఆమె అందమైన నవ్వులా ఉంది.
మెరుపు తీగకు పూసిన పువ్వులా ఉంది.
లేలేత సూర్యకాంతిలా ఉంది.
చూపుల్ని ఆకర్షించే అయస్కాంతంలా ఉంది.
వీణా వేణు మృదంగ సహకారంతో రాగ భావ తాళ యుక్తంగా పాడే తుంబురుని గానానికి మేనక అతి మనోహరంగా నాట్యం చేస్తోంది...
అందరూ మైమరచి ఉన్న ఆ సమయంలో
''పాహిమాం, పాహిమాం, రక్షమాం, రక్షమాం'' అంటూ ఆయన సభలోకొచ్చాడు.
తుంబురుని గానమాగిపోయింది. మేనక నృత్యం నిలిచి పోయింది. అందరూ విసుక్కొంటూ వొచ్చినాయన వైపు చూసారు. వచ్చినవాడు ఫల్గుణుడు కాదు, అగ్నిదేవుడు. ఆయనెందుకో బాధపడుతున్నాడు.
''నీకేమైంది?'' అగ్నిని ఇంద్రుడడిగాడు.
''అజీర్తి ప్రభూ!''
''అజీర్తి ఎందుకొచ్చింది?''
''మీకు తెలియదా మహేంద్రా''
''ఈ మధ్య నారదుడు రాలేదు. ఆయనొస్తేనే కదా మాకు అన్ని విషయాలు తెలిసేది.''
''ఏం చెప్పమంటావు దావా! భూలోకంలో లత్కోర్ అనే మంత్రి ఉన్నత పదవీ ప్రాప్తి యాగం చేస్తున్నాడు. మంత్రాలు చదువుతూ టన్నులకొద్దీ నెయ్యిని రుత్విక్కులు యజ్ఞగుండంలో కుమ్మరిస్తున్నారు. ఆ నెయ్యి మూలంగా నాకు అజీర్తి పట్టుకొంది.
ఉన్నత పదవీ ప్రాప్తి అనే మాట వినగానే
ఉత్త పుణ్యానికే ఇంద్రుడులిక్కి పడ్డాడు.
ఆందోళన చెందాడు. ఆలోచనలో మునిగాడు.
ఆకరికి దేవగురువు బృహస్పతి వైపు చూసాడు.
ఆ చూపులోని ఆంతర్యాన్ని గ్రహించి - ''మీ పదవికొచ్చిన ప్రమాదమేమీ లేదు. మంత్రికి మహా మంత్రి పదవే ఉన్నత పదవి'' అని దేవగురువన్నాడు.
అగ్ని వైపుకేసి చూస్తూ-
''ద్వాపర యుగంలో ఇలాగే నువ్వు అజీర్తితో బాధపడ్డావు కదా'' అని ఇంద్రుడన్నాడు.
''అవును దేవా! అప్పుడంటే కృష్ణార్జునుల సహకారంతో ఖాండవ వన్నాన్ని దహించాను. దాంతో నా అజీర్తి తగ్గింది''
''ఇప్పుడూ అదే పని చేస్తే సరి''
''ఇప్పుడు అడవులెక్కడున్నాయి. ఉన్న ఒకట్రెండు అడవుల్ని డోంగీ బాబాలు కబ్జా చేసారు. వాటిలోని మూలికలతోనూ, మొక్కలతోనూ మందులు చేసుకొని అమ్ముకొంటున్నారు. కోట్లు సంపాదిస్తున్నారు.''
''అశ్వనీ దేవతల దగ్గరకు వెళ్లలేక పోయావా''
''అదీ అయ్యింది. వాళ్లు నా అజీర్తికి తమ వద్ద మందులేదన్నారు''
''దేవగురూ అగ్ని అజీర్తి తగ్గే మార్గమేదీలేదా?'' బృహస్పతిని ఇంద్రుడడిగాడు.
''ఎందుకు లేదు. ఉంది''
''అదేమిటీ?''
''ఉన్నత పదవీప్రాప్తి యాగం చేస్తున్న లత్కోర్ మంత్రి రెండు రోజుల్లో మహా మంత్రి అవుతాడు. మహా మంత్రి కాగానే యాగం నిలిపేస్తాడు. యాగం నిలిచిపోవడంతో అగ్ని అజీర్తి తగ్గిపోతుంది.''
బృహస్పతి అలా చెప్పగానే ఆనందంతో వెలుగుతూ అగ్ని మాయమయ్యాడు.
అగ్ని రాకతో ఆగిన మేనక నృత్యం తిరిగి మొదలైంది. [తరువాయి వచ్చేవారం...]
- తెలిదేవర భానుమూర్తి
******
రచయిత గురించి.... :
తెలిదేవర భానుమూర్తి సొంత ఊరు బోన్గిరి. 1953 జనవరి 16వ తేదీన అక్కడే జననం. యాదగిరి గుట్ట; ఆర్మూర్, బోన్గిరిలలో విద్యాభ్యాసం. సర్దార్ పటేల్కాలేజీలో బి.ఎస్.సి. ఎక్స్టర్నల్ క్యాండేట్‌గా ఎం.ఏ. తెలుగు లిటరేచర్, 1968 నుంచి రచనా వ్యాసంగం, తొలినాళ్ళలో కవిత్వ రచన, 1969 నుంచీ తెలంగాణా మాండలికంలో రచనలు, 1984లో భాను పేరుతో ఊరోల్లు (తెలంగాణ మాండలిక కవితా సంకలనం). 1990లో పలుకుబడి (తెలంగాణ మాండలికంలో రాజకీచఅయ వ్యంగ్య రచన) 1991లో చల్నేదోబాల్కిషన్ (మాండలికంలో హాస్య, వ్యంగ్య కథానికలు). ఆక్సిజన్ బార్ (వ్యవహారికంలో కథా సంకలనం) గిల్లిదండ (మాండలికంలో రాజకీయ వ్యంగ్య రచన) గులేర్ (హాస్య, వ్యంగ్య కథానికా సంకలనం) ఇంత వరకూ వెలుగు చూశాయి. 1984 నుంచి రాజకీయ వ్యంగ్య రచనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనాడు, ఉదయం, వార్తతో పాటు హెచ్ఎం టీవీలో జర్నలిస్ట్‌గా పని చేశారు. (తెలిదేవరకు స్వంత శైలి, స్వంత నడక స్వంతకం ఉంది. అది విశిష్ట లక్షణం. ఎంత చిన్న వాక్యం చూచినా భానుమూర్తిది అని చెప్పగలం అని ఆక్సిజన్ బార్ ముందుమాటలో దాశరథి రంగాచార్య అభిప్రాయపడ్డారు.