Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహిళలకి ఆపదలు రావద్దని కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా గౌరమ్మను పూజిస్తాం. కానీ ఒకప్పుడు నవాబులు, భూస్వాములు పెత్తందారీ తనలో నలిగిపోయిన తెలంగాణ గ్రామీణ సమాజంలోని మహిళల బ్రతుకులు దుబ్బరంగా ఉండేవి నవాబులు భూస్వాములు అకత్యాలకు నలిగిపోయిన వారిని, ఇంకా వారు పెట్టె బాధల్ని తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వారిని తలచుకొని తోటి మహిళలు విచారించేవారు. వారికోసం ప్రత్యేకంగా పూలను పేర్చి ''బతుకమ్మా! బతుకు!'' అంటూ దీవిస్తూ పాటలు పాడేవారు. బతుకమ్మ బతుకో...ఉయ్యాల'' పాటల వెనుక ఉన్న అసలు కథ ఇదేనని మా అమ్మ నా చిన్నప్పుడు చెప్తుండేది. ఈ రెండు కథలని ఆధారం చేసుకుని అప్పటి నుంచి ఆడపడుచులంతా తమకు మంచి భర్తను ప్రసాదించమని బతుకమ్మను పూజించడం ఒక ఆచారంగా, సంప్రదాయంగా మారింది. ఈ పండుగ ఆశ్వయుజ మాసంలో అమావాస్య రోజు నుంచి అష్టమి రోజు వరకు అంటే శరన్నవరాత్రులు అమ్మవారు పూజలందుకుంటుంది. ఈ తొమ్మిది రోజులు కూడా స్త్రీలు సకల సౌభాగ్యాలు కలగాలని చెప్పి అందరూ పట్టు చీరలు, నగలు ధరించి ప్రసాదాలు, పూలు, చీరలు అన్నీ తెచ్చి ఎంతో సంతోషంగా అమ్మవారికి సమర్పిస్తారు.
ఎంతో ఆకర్షణీయంగా అందాల హరివిల్లులా, ఎంతో శోభాయమానంగా ఉండే గౌరీ దేవికి ఎంతో ఇష్టమైన తొమ్మిది రకాల పూలతో అంటే తంగేడు, చామంతి, రుద్రాక్ష, గుమ్మడి, బీర, చామంతి, బంతి, గడ్డిపూలు, గన్నేరు, పూలను సేకరించి ఒక పళ్లెంలో గుండ్రంగా కళాత్మకంగా రంగురంగుల బతుకమ్మలను తీర్చిదిద్దుతారు. దీనిపై పసుపు ముద్ద నుంచి గౌరీమాతగా కొలుస్తారు. తొమ్మిది రోజుల పాటు తొమ్మిది పేర్లతో బతుకమ్మ పూజలందుకుంటూ అమ్మ వేయి వెలుగుల కాంతులీనుతూ ఎంతో అందంగా కనిపిస్తుంది. మొదటిరోజున 'ఎంగిలిపూల బతుకమ్మ''గా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఇది అమావాస్య రోజున మొదలవుతుంది. దీనిని పెద్దల అమావాస్య అని కూడా పిలుస్తారు. ఈ రోజు పెద్దలకు బియ్యం ఇస్తారు. అమ్మవారికి నైవేద్యంగా నువ్వులు, బెల్లం, నూకలు కలిపి ప్రసాదంగా సమర్పిస్తారు. రెండవ రోజున ''అటుకుల బతుకమ్మ'' గా నిర్వహిస్తారు. ఈ రోజు పప్పులు, బెల్లం, అటుకులు కలిపి ప్రసాదంగా పెడతారు. మూడవ రోజు ''ముద్దపప్పు బతుకమ్మ''గా అమ్మవారు మనకు దర్శనమిస్తారు. ఈరోజు ముద్దపప్పు, బెల్లం కలిపి నివేదన చేస్తారు. నాలుగవ రోజున నానబెట్టిన బియ్యాన్ని ప్రసాదంగా పంచుతారు. ఐదవ రోజు ''అట్లబతుకమ్మ''గా పూజిస్తారు. ఈరోజున గౌరీదేవికి ఉప్పుడు బియ్యంతో చేసిన అట్లు ప్రసాదంగా పెడతారు. ఇక ఆరవ రోజున ''అలకల బతుకమ్మ''గా ఆడతారు పాడతారు. ఈ రోజున ప్రసాదాలు ఏమీ ఉండవు. ఇక ఏడవ రోజున ''వేప కాయల బతుకమ్మ''గా అమ్మవారిని కొలుస్తారు. ఈ రోజున సకినాల పిండిని వేపకాయల్లాగా చేసి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఎనిమిదవ రోజున ''వెన్నముద్ద బతుకమ్మ''గా కొలుస్తారు. ఆపై ఆడతారు. ఈరోజు వెన్న, బెల్లం, నువ్వులు, ఆవునెయ్యి కలిపి నివేదించి ప్రసాదంగా స్వీకరిస్తారు.
ఇక చివరి రోజున అంటే తొమ్మిదవ రోజున ''సద్దుల బతుకమ్మగా అమ్మవారిని పూజిస్తు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఆడపడుచులంతా అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చి ఎంతో హుషారుగా ఆటలాడుతూ, పాటలు పాడతారు.
- పింగళి భాగ్యలక్ష్మి, 9704725609