Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాదరాయణుడి మెదడు ఒక ఆలోచనల పుట్ట. పాముల పుట్టలో ఒకటీ రెండు బుసులుంటయేమోకాని ఈ పుట్టలో అనేక ఆలోచన్ల పాములు బుసకొడుతుంటయి. అవసరం వచ్చినప్పుడవి మరింత రెచ్చిపోతయి. బాదరాయణుడికి అవసరముంటే అదీ ఇదీ కాదు ఎన్నికలే! ఎన్నికల్లో గెలవడానికి తిరుగులేని పథకాలు ఆ బుర్రలోంచి బయటకి దొర్లుకుంటూ వస్తయి. మాయా యంత్రమూ తంత్రమూ కుతంత్రమూ గజకర్లగోకర్ల విద్యలూ లేనివాడు రానివాడు ఎన్నికలకు అసలు పనికిరాడు అని బాదరాయణుడి ప్రగాఢ విశ్వాసం. అందుకే ఎప్పటికప్పుడు కొత్త పథకాల ఉచ్చులో బిగించి జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేసి ఓట్లు లాగేసుకుంటాడు.
ఎప్పటిలాగే ఎన్నికలకు కొన్ని నెలల వ్యవధి ఉండగానే బాదరాయణుడు బుర్రను కెలికాడు. దాంట్లో వేలుపెట్టి కలియ తిప్పాడు. అప్పుడొచ్చిందో ఆలోచన. అప్పుడు తళుక్కుమన్నదిట ఓ అద్భుత పథకం.
అమ్మలదినం అమ్మమ్మలదినం నాన్నల దినం తాతల దినం అక్కచెల్లెండ్ల దినం అన్నదమ్ములదినం స్నేహితుల రోజు ప్రేమికుల రోజు, దెయ్యాల రోజు వంటివి జనజీవన స్రవంతిలో కలిసి ప్రవహిస్తుండటం మామూలే కదా! పుట్టిన రోజులు కేకులు కోసీ దీపాలార్పీ కేకలు వేస్తూ జరుపుకోవడం కూడా సర్వసాధారణమే కదా. వేళ్ళకి ఉంగరాలు, ముంజేతికి బ్రాస్లెట్లూ మెడల్లో బంగారపు పలుపు తాళ్ళూ ఉన్నవాళ్ళకేనా పుట్టినరోజులు హ్యాపీబర్త్డేలు గజమాలలు షాంపేన్లు. పేదవాళ్ళు పుట్టలేదా వాళ్ళకు పుట్టిన రోజులు అక్కర్లేదా అన్న ఆలోచనల బాదరాయణుడి మెదడులోంచి మెరుపులా బయటికి వచ్చింది.
అదే పుట్టిన రోజు పథకం. ఓటు హక్కున్న ప్రతి పేదవాడూ పుట్టినరోజు జరుపుకునే అవకాశం కల్పిస్తే ఓట్లు అవే రాలిపడతయి. వచ్చిన ఆలోచనను తక్షణం అమలులోకి తెచ్చాడు. బాదరాయణుడు అదే పుట్టినరోజు పథకం. పుట్టిన రోజు జరుపుకోవడానికి కేకు కొనాలి, స్వీట్లు కావాలి, కొత్త డ్రస్సుండాలి, కొవ్వొత్తులు కావాలి ఆపైన 'మజా' కూడా కావాలి. వీటన్నింటికీ అయ్యే ఖర్చును లబ్ధిదారులకు అందించడమే పుట్టిన రోజు పథకం. సంవత్సరమంతా పుట్టిన్రోజులు ఉండనే ఉంటయి. పుట్టిన తేదీ తెలిపే సర్టిఫికెట్ సమర్పిస్తే చాలు పుట్టినరోజు పథకానికి కేటాయించిన డబ్బు పుట్టబోయే వాళ్ళకు అందించబడుతుంది. జనం ఎగబడ్డారు పుట్టిన్రోజులు చేసుకోవడానికి. అయితే పథకాలన్నింటిలోనూ 'స్కాం'లున్నట్టు గానే ఈ పథకంలోనూ చొరబడ్డవి. కొందరు పుట్టిన తేదీ, పుట్టిన వారం, పుట్టిన తిథి వంటివాటితో మూడేసి పుట్టిన్రోజుల డబ్బు కొట్టేయ్యకపోలేదు. అలా కొట్టేసే దమ్ములు ఎవరికుంటుంది బాదరాయణుడి కార్యకర్తలకు తప్ప. ఖజానా ఖాళీ అయితే పన్నులు ఉండవా ఓట్లు కుప్పలుగా పోగయితే చేయడానికి అప్పులుండవా అనుకున్నాడు బాదరాయణుడు.
బాదరాయణుడి ఈ పథకం పురుషులకే పరిమితమవడంలో మతలబున్నది. మగాళ్ళు ఎవరికి వేయమంటే వారికే వేస్తారు గదా అమాయక మహిళలు అనుకున్నాడు బాదరాయణుడు.
బాదరాయణుడిలాంటి వాడే గోల రాయణుడు. ఆ బుర్రా ఓ పుట్టే ఆ పుట్టలో ఆలోచనలే బుసకొట్టే పాములు. ఆడవాళ్ళ పుట్టుకకు విలువే లేదా, ఆడపిల్ల పుట్టిందంటే తండ్రులు మొగం మాడ్చడమా అసలు ఆడది కొంపలో జొరబడ్డాకే అది ఇల్లవుతుంది కదా. మగవాడి బతుకు బండిని లాగేది మహిళే కదా. బయట పులి అయిన మగాడు ఇంట్లో పిల్లే కదా. అసలు అనుకుంటారు కానీ ఆడవాళ్ళు చెప్పిన గుర్తుకే మగాళ్ళ ఓట్లు పడతయి అని అనుకున్న గోలరాయణుడూ ఓ పథకం ప్రకటించాడు. అదే మెట్టినదినం. పుట్టిన దిన్నాన్ని ఢ కొట్టడానికే ఈ మెట్టినదిన పథకం. ఏ రోజున ఆడవాళ్ళు మగరాయుడి ఇంట్లో కుడికాలు పెట్టి ప్రవేశించారో ఆ రోజే అధికార బదలాయింపు జరిగిపోయింది. అందువల్ల ఆ రోజున మెట్టిన దిన వ్రతమో లేక హోమమో జరుపుకోవడానికి తాంబూలాలూ, రిటర్న్ గిఫ్టులూ యివ్వడానికి అయ్యే ఖర్చును ఓటు హక్కు ఉన్న ఆడవాళ్ళందరికీ యివ్వడమే ఈ పథకం. పన్నులు పెంచయినా, అప్పులు చేసైనా ఆస్తులు తెగనమ్మయినా ఈ పథకం అమలు చెయ్యాలనుకున్నాడు గోలరాయణుడు. పథకాలన్నాక 'స్కాములు' మామూలే. మెట్టని వాళ్ళు కూడా మెట్టిన దినం జరుపుకుంటే తప్పేమిటి. నేడోరేపో మరో ఎలక్షన్కో మెట్టకపోరు గదా.
బాదరాయణుడి అనధికార సైన్యం పుట్టిన రోజు పథకం ప్రచారం చెయ్యడానికి ఊరేగింపులు జండాలూపడాలు చేయసాగారు. గోలరాయణుడి కార్యకర్తలు మెట్టిన రోజు పథకం ప్రచారం చెయ్యడానికి ర్యాలీలు, పాదయాత్రలు మొదలుపెట్టారు.
పుట్టిన దినమా? మెట్టిన దినమా? ఏది గొప్ప అన్న చర్చలు చేయసాగినవి టీవీలు. పుట్టిన రోజుకు భర్త, మెట్టిన రోజుకు భార్య డబ్బు తీసుకుంటే వోటు వేరేవేరేగా వెయ్యాలా? ఎవరి పథకం ఎక్కువిస్తే వారికివ్వాలా? ఎవరు ముందు ఇస్తే వారికెయ్యాలా అని ప్రజలు తర్కించుకోసాగారు.
పుట్టిన దినమా? మెట్టిన దినమా? వీరి దినమా? వారి దినమా? ఏ పథకం గెలుస్తుందో ఎవరో 'ఓకుమార్' మాత్రమే చెప్పగలడా? పథకాలు వేసి ప్రజల్ని వలలో వేసుకోవడం తప్ప మరో మార్గమేలేదా?
-చింతపట్ల సుదర్శన్, 9299809212