Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాల సాహిత్యం అనగానే గేయాలు, కథలు, కవితలు, కొన్ని నవలలు, నాటకాల వంటివి మనకు గుర్తుకు వస్తాయి. అడపాదడపా విజ్ఞానశాస్త్ర రచనలు కనిపిస్తాయి. బాలల కోసం చరిత్రను చెప్పినవాళ్ళను వేళ్ళమీద లెక్కించవచ్చు. ఆ కోవలో మనకు కనిపించే వారిలో పండితులు, విమర్శకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగుశాఖ పూర్వ ఆచార్యులు ఆచార్య అమరేశం రాజేశ్వరశర్మ కనిపిస్తారు.
సెప్టెంబర్ 5, 1930న కామారెడ్డి సమీపంలోని చిన్న మల్లారెడ్డిలో జన్మించారు ఆచార్య అమరేశం రాజేశ్వరశర్మ. తల్లి దండ్రులు శ్రీమతి సరస్వతి, శ్రీ రాజలింగ సభాపతి. కామారెడ్ది, సీతారాంబాగ్ ఉభయ వేదాంతవర్ధని కళాశాల, విజయనగర మహారాజ సంస్కృత కళాశాల, కొవ్వూరు ఆంధ్ర గీర్వాణపీఠాల్లో చదువుకుని, తొలుత ఉపాధ్యాయులుగా, వివేకవర్ధని కళాశాల ఉపన్యాసకులుగా, కాకతీయ విశ్వవిద్యాలయం డీన్‌గా, అటు తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా, తెలుగుశాఖ అధ్యక్షులుగా, ఎమిరటస్ ప్రొఫెసర్‌గా సేవలం దించారు. పండితులు, పరిశోధకులు అయిన ఆచార్య అమరేశం 'నన్నెచోడుని కవిత్వము' పేర కుమార సంభవంపై సాధికారిక పరిశోధనా గ్రంథం వెలువరించారు. తరువాత 'వేదం వేంకట రాయశాస్త్రి రూపక సమాలోచనం', 'అహోబిల పండితీయాంధ్ర వివరణము', 'వైకృత చంద్రికా వివరణము', 'ఆంధ్ర వాకరణ వికాసము' మొదలగునవి వీరి ప్రామాణిక విమర్శా గ్రంథాలు. పండితకవి అయిన ఆచార్య అమరేశం రాసిన గేయ ప్రబంధం 'సాయి సచ్చరిత్ర ముక్తావళి'. ఇవేకాక వివిధ సంచికలు, సంకలనాలకు సంపాదకత్వం వహించారు. వాటిలో 'పోత్న భాగవత పంచ శతి నీరాజనము', 'పోతన పంచశతి స్మారిక' వంటివి ప్రముఖంగా పేర్కోదగినవి. ఇఏవకాక వీరి రేడియో ఉపన్యాసాలు, వివిధ సదస్సుల్లో సమర్పించిన పత్రాలు, పలు విజ్ఞాన సర్వస్వాల కోసం కూర్చిన వ్యాసాలు వీరి పాండిత్య ప్రతిభకు తార్కాణాలుగా నిలుస్తాయి. మౌళిక రచనలు, పరిశోధనా గ్రంథాలతో పాటు 2014లో ఆచార్య అమరేశం తన ఆత్మకథను 'ఆత్మనివేదనం' పేరుతో తెచ్చారు. ఇది ఆయన ఆత్మకథ అనడం కంటే 1930 నుండి 1950 వరకు ఆనాటి తెలంగాణ జీవితాలకు, అనేక అంశాలు, సంఘటనలకు, ఆనాటి భ్రాహ్మణ సామాజిక జీవితానికి చిత్రిక అనవచ్చు.
ఆచార్య అమరేశం పలు సంస్థలను స్థాపించడమేకాక వాటిని నిమద్ధతతో నడిపించారు. వాటిలో వీరు కామారెడ్డిలో స్థాపించి నడిపిన ప్రాచ్య విద్యా పరిషత్తు ఒకటి. ఈ సంస్థ ద్వారానే వీరి అన్ని రచనలు ప్రచురించబడ్డాయి. చరిత్ర రచన చేయడం కష్టమైన పనే కాదు, అందుకు అనేక ఆకరాలు, ఆధారాలు అవసరం. అందులోనూ చరిత్రను నాటికలుగా, పిల్ల లకు అర్థం అయ్యేట్టు చెప్పడం మరీ కష్టం. ఆచార్య అమరేశం ఈ కష్టమైన పనిని అత్యంత సులభంగా చేసి చూపించారు తన రేడియో నాటికల సంపుటి 'చరిత్ర పుటలు'లో. ఇది నాలుగు నాటికల సంపుటి. ఇవన్నీ ఆకాశవాణి ద్వారా పిల్లల కోసం ప్రసారమయ్యాయి.
ఆకాశవాణి నిజామాబాద్ వారి కోరకపై స్థానిక చరిత్రను నాటికలుగా రాసేందుకు పూనుకున్న ఆచార్య అమరేశం బోదన చరిత్రను 'పౌదన-|', 'పౌదన-||' పేరుతో రెండు నాటికలుగా కూర్చారు. మూడవ నాటిక నిజామాబాదుకు సంబంధించిన అనేక శాసనాలు, చరిత్రకు సంబంధించిన నాటిక 'ఇందూరు'. నాలుగవది కాకతీయులకు సంబంధించిన 'కౌలాస దుర్గము' నాటిక.
పండిత పరశోధకులైన ఆచార్య అమరేశం ముద్ర ఆయన నాటికల్లోనూ కనిపిస్తుంది. ఇవి పిల్లల కోసం రాసినప్పటికీ ఎంత సులభంగా కనిపిస్తాయో, అంతే ప్రౌఢంగా ఉండడం వీటి లోని విశేషం. నిజామాబాదుకు పూర్వం అశ్మక దేశం అనిపేరు. ఈ ప్రాంతానికి సంబంధించిన గొప్ప చరిత్రను ఇక్కడి పిల్లలకు వారసత్వ సంపదగా అందించే దిశగా ఆధునిక తెలంగాణలో జరిగిన గొప్ప ప్రయత్నాల్లో వీరి నాటికల సంపుటి ఒకటి. ఇందులో ఆయన క్రీస్తు పూర్వం నుండి బహుమనీ సుల్తానుల పాలన వరకు పిల్లల కోసం చక్కగా, తక్కువ నిడివిలో కొండ అద్దమందు అన్నట్లు వివరిస్తారు.
ఈ నాటికలకు ముందుమాట రాస్తూ, ప్రముఖ చరిత్రకారులు డా. పి.వి. పరబ్రహ్మశాస్త్రి 'దృశ్య కావ్య రూపక భేదం ఏమీ తెలియని పిల్లలకు చరిత్రను తెలుసుకోవాలనే అభిరుచి కలిగిస్తూ, చారిత్రక సత్యాలను నిరూపించడం శర్మగారి ధ్యేయం' అంటారు. మరోచోట... 'డా. అమరేశం రాజేశ్వరశర్మగారు బాల చారిత్రక సాహిత్యానికొక వినూతన పుస్తకాన్ని చేరుస్తున్నందుకు అభినందిస్తున్నాను' అంటూ ఈ బాల చారిత్రక రచనకు కితాబు నిచ్చారు. తెలంగాణ మహోన్నత చరిత్రలో భాగమైన అశ్మక ప్రాంతంపు చరిత్రను బాలలకు గొప్ప 'సోయి'తో అందించిన బాల చరిత్రకారులు ఆచార్య అమరేశం రాజేశ్వరశర్మ. తొంబై రెండేళ్ళ వయస్సులో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న వారు నిండు నూరేళ్ళు జీవించాలని బాలలోకం జేజేలు పలుకుతున్నది.
- డా|| పత్తిపాక మోహన్, 9966229548