Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అమ్మలగన్న యమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ'... అంటూ సాగే ఈ భాగవత పద్యం వినని వారుండరు. చదవని విద్యార్థి ఉండడు. పలుకని ఏ ప్రవచనకర్త గళమూ ఉండదనటం అతిశయోక్తి కాదు. ఈ ఆదిశక్తి తల్లులందరికి తల్లి. లక్ష్మీ, సరస్వతి, పార్వతులకే మూలమైన తల్లి. 'మా యమ్మ' అని ఆర్తితో పిలుస్తూ నమస్కరించగానే ప్రేమతో తన కరుణా దృక్కులను భక్తులపై ప్రసరించి అక్కున చేర్చుకునే తల్లి దుర్గ. స్త్రీని దేవతగా, ఆదిశక్తిగా కొలిచిన, కొలిచే ఉదాత్తమైన సంస్కృతి మాది. ఆ గొప్ప భావనకు వారసులం మేమని మనం సగర్వంగా చెప్పుకుంటాం. మహాకావ్యాలలో కవులు స్త్రీమూర్తుల గురించి చెప్పిన విషయాలు తరచూ మనమాటల్లో, ఉపన్యాసాలలో అలవోకగా మన పెదవులపై జాలువారు తుండటం ఓ నిత్య క్రతువు. అతి సాధారణ దృశ్యం.
ఎంతటి గొప్ప భావన ! ఎంతటి గొప్ప స్థానం!! ఎంతటి విలువ !!! ఇంకెవరూ ఇంతటి విశిష్టతను స్త్రీలకు ఇవ్వలేదని ఒకింత గర్వం మనకు. కాని వాస్తవిక దృష్టితో చూసినపుడు పురుషులు వారికంతటి గౌరవాన్ని, విలువను ఇస్తున్నారా? భావన చేసిన ఉదాత్తమైనంతగా, సాహిత్యంలో వారిని చిత్రీకరించినంత గొప్పగా ఆచరణలో పురుషుల వర్తన ఉంటున్నదా? లేదన్నది సుస్పష్టం. నిస్సందేహం. కారణం!? పురుషాధిక్య సమాజం కనుక. ''స్త్రీలు మాకన్నా శారీరకంగా దుర్భలురు, వారి ఉత్పాదకశక్తి మా కన్నా తక్కువ.'' అన్న ఆలోచన పురుషుల్లో ఆదిమానవ దశ నుండి ఉండటం. ఆడ, మగ కాయకష్టం చేసేచోట ఇచ్చే కూలి నుండి, పెద్ద పెద్ద ప్రైవేటు కార్యాలయాలలో సైతం జీతం విషయంలో వత్యాసం, వివక్ష ఉంది. దాని వల్లే కుటుంబంలో భర్త అధిపత్యం, యజమాన్యపు హోదా.
ఒక దశలో ఈ పితృస్వామిక స్వామిక వ్యవస్థ మాతృస్వామిక వ్యవస్థగా మారింది. అది కొద్ది కాలం మాత్రమే. తరువాత మళ్లీ పితృస్వామిక వ్యవస్థ అలా వచ్చి స్థిరపడింది. ప్రస్తుతం భారతదేశం ఇదే కొనసాగుతోంది.
స్త్రీలు విద్యలో గొప్పగా రాణిస్తూ, ఆలోచనలో, ఉత్పా దక శక్తిలో మగ వారితో దీటుగా పనిలో, గనిలో, కార్ఖానా లలో పని చేస్తు న్నారు. అయినా ఆడ వారిని సమానులుగా చూసే దృష్టి, వైనం మగవారిలో రాలేదు. మగవారిలో యుగయుగాలుగా వేళ్ళూనుకున్న ''మేము స్త్రీల కన్నా గొప్పవారం'' అన్న ఆలోచన, అహంకారం ఆ నిజాన్ని ఒప్పుకోనివ్వటం లేదు. అసలు ఆ ఆలోచనకే వారు తావివ్వటం లేదు. దీనిలో ఆవగింజంతైనా నిజం లేదు. ఏకపక్ష వాదన ఇది. కేవలం ఆరోపణ మాత్రమే. ఈ భావనలు, ప్రవర్తన కొన్ని తరాల క్రితం ఉండేవన్న మాట నిజమే. కాని, వారికి సమాన హోదా, గౌరవం, ప్రతిపత్తి, స్వేచ్ఛా స్వాతంత్య్రాలు, రిజర్వేషన్స్ వచ్చాయి. అన్ని రంగాలలో మాతో సమానంగా పోటీ పడుతున్నారు. మా కన్నా గొప్ప గొప్ప పదవులు చేపడుతున్నారు. దేశాధ్యక్షులయ్యారు.'' అంటూ పురుష సమాజం మహిళలను సమానంగా చూస్తున్నాం అని తమ ప్రవర్తనను ఎంతగా సమర్థించుకున్నా, దానిలో ఉన్నది కొద్దిపాటి వాస్తవమే. వారు చెప్పేవన్నీ, మహిళ లకు రాజ్యాంగం ఏర్ప రచినవే. అవి వారి హక్కుగా వచ్చినవి. అయితే దీనికి కొందరు హృదయ సంస్కారులైన మగ వారు కృషి చేసారు. వారి మానవీయ తకు విశాల దృష్టికి, పోరా టానికి దేశ ప్రజ మొత్తం.. ఆడ, మగ వారన్న బేధం లేకుండా రుణపడి ఉంటుంది. వారు శ్లాఘనీయులు, ప్రాతఃస్మరణీయులు.
చదువుకున్న వారిలో ఈ వివక్షత తక్కువగా ఉండచ్చు. లేదా ఉండకపోవచ్చు. అందరిని ఒకే గాటను కట్టలేం. అయితే దేశంలో కీలకమైన, అత్యంత ముఖ్య శాఖలలో పనిచేసిన మహిళలు, ఐ.ఏ.యస్., ఐ.పి.యస్., ఉన్నత స్థాయిలోని మహిళా ఉద్యోగులు తమ తోటి పురుష ఉద్యోగులు తమను అవమానించేవారని, తమ మీద అత్యాచారాలు చేసే యత్నం చేసారన్న మహిళా అధికారుల ఆరోపణలు దేశంలో ఎంత సంచలనం సృష్టించాయో మనకందరకు తెలుసు. పార్లమెంట్లో, శాసనసభల్లో మహిళలకు జరిగిన పరాభవం అలనాటి మహాభారత దుశ్శాసన పర్వానికి భిన్నంగా ఉందా? ''అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడవగలిగిన రోజు దేశానికి నిజంగా స్వాతంత్య్రం వచ్చినట్టు..'' అన్న మహాత్మా గాంధీ మాటలు మనం మరచిపోయామా? ఆడవాళ్లు అర్ధరాత్రి ఒంటరిగా అన్న మాటటుంచి, వాస్తవపరిస్థితి ఎంత భయానకంగా ఉందో చూస్తుంటే మనసు అతలాకుతలమవుతోంది. దేశరాజధాని ఢిల్లీలో అత్యధిక రేప్ రిపోర్టులు రావటం ఎంతో క్షోభని కలిగిస్తోంది. దీనికితోడు యాసిడ్ దాడులు, తమను ప్రేమించని యువతులను పట్టపగలే కత్తులతో, బ్లేళ్లతో దాడి చేసి వారి ప్రాణాలను కబళిస్తున్న మగక్రూర మృగాలు, వావి వరుస, వయసు చూడక తమ తల్లుల, అమ్మమ్మల వయసున్న వారిని సైతం కాముకత మైకంలో, ఉన్మాదంలో కన్ను, మిన్ను కానక అత్యాచారాలు చేస్తున్న మగ మృగ రాక్షసుల హేయమైన, హీనమైన చర్యలు దినపత్రికలలో, ఎలక్ట్రానిక్ మాధ్యమాలలో ప్రసారం కావటం ఓ దిన చర్య అయ్యింది.
''ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత
లోకంలో రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో మరో
మహాభారతం... ఆరవ వేదం
మానభంగ పర్వంలో... మాతృహృదయ నిర్వేదం, నిర్వేదం..'' అన్న కవి వేటూరి సుందరరామమూర్తి గీతం నేటి మహిళల నిస్సహాయ పరిస్థితిని మనముందు దృశ్యమానం చేసింది. సభ్య సమాజం, చదువుకున్న వారిని సిగ్గుతో తల దించుకునేటట్టు చేసింది. కళ్ళ వెంట నీళ్లను జలజల రాలేటట్టు చేయలేదా! ఇది మానవత్వానికే తీరని మచ్చ. దీన్ని కాదనగలమా!!
పాకంలో, పరిపాలనలో, కవనంలో, కథనంలో, కదనంలో మహిళలు మగవారితో దీటుగా, కొన్ని సందర్భాలలో వారి కన్నా మెరుగుగా ఉంటూ జేజేలు అందుకుంటున్నా, స్త్రీలకు వారు పొందతగిన గౌరవం, విలువ, స్థానం పురుష పుంగవులు ఇవ్వటం లేదన్నది నిర్వివాదాంశం.
నడవటంలో, కూర్చోవటంలో, నవ్వటంలో, మాట్లాడటంలో ఆడపిల్లల, మగపిల్లల విషయంలో ఎంతో వివక్షత సమాజంలో ఒకప్పుడుచాలా ఎక్కువగా ఉండేది. ''ఏమిటి, మగపిల్లాడిలా గట్టిగా మాట్లాడుతున్నావు? పెద్దగా నవ్వుతున్నావు? నలుగురిలో కూర్చునే తీరు, మాట్లాడే పద్ధతిదేనా? రేపు పెళ్ళై అత్తగారింటికి వెళ్ళవలసిన దానివి. కుదురు, అణకువ నేర్చుకుని మసలుకో.'' ఇలా తల్లిదండ్రులు ఆడపిల్లలు కూర్చున్న తీరును, మాట్లాడే తీరును శల్య పరీక్ష చేస్తూ విమర్శిస్తుండే వారు. అసలు ప్రవర్తన అభ్యంతరకరమైనది, ఆక్షేపణీయమైనది అయినపుడు మగా, ఆడా అన్న తేడా ఎందుకు వస్తుంది? అది ఎవరిలో ఉన్నా తప్పే కదా! ఈ ధోరణి సమాజం డెబ్భైవ దశకము నుండి తగ్గుతూ వచ్చింది. ఆడ పిల్లలను మగపిల్లలతో పాటు సమానంగా చూడటం, వారితో పాటుగా ఉన్నత చదువులు చదివించటం సామాజిక వర్గాలన్నిటిలోనూ చూస్తున్నాం. అంతేకాదు, ఆడపిల్లల చదువుల్లో, ఆటల్లో, పాటల్లో కొలువుల్లో మగపిల్లల్ని దాటి ముందుకు వెళ్ళటం గమనిస్తున్నాం.మంచి ఉద్యోగాలు సంపాదించుకుని చక్కని ఆర్ధికంగా భద్రత పొందుతున్నారు. అయినా వివక్షకు అవమానాలకు గురవుతూనే ఉన్నారు?
గత మూడు నాలుగు దశాబ్దాలుగా తల్లిదండ్రులు ఉన్నత విద్యావంతులవుతున్నారు. ఇది ఎంతో హర్షించదగ్గ మార్పు. భార్యాభర్తలిరువురు సమాన విద్యావంతులు, సమాన హోదా ఉన్న ఉద్యోగాలే చేస్తూనే ఉన్నా, కొందరు భర్తలు మాత్రమే వారిని గౌరవిస్తున్నారనటం కాదనలేని వాస్తవమా? ఇలా ఎందుకో జరుగుతోంది అన్న సమాధానం కోసం తలలు బద్దలు కొట్టుకోవలసిన అవసరం లేదు. సమాధానం అలా తటాలున తడుతుంది కనుక. ఏమిటది? మగవారికి తాము ఆడవారి కన్నా అధికులమన్న ఆలోచనే. అది మగవారి మనసుల్లో సీసపు మేటవేసి దుర్బధ్యమైంది. ఆ భావన నీరు పల్లానికి వెళ్ళటమంత సహజంగా, పగలు రాత్రుళ్ళు ఏర్పడటమన్నంత సహజమైంది. దేశం విద్యారంగంలో గణనీయమైన మార్పు సాధించినా ఆ భావన మారలేదన్నది సుస్పష్టం. మగవారు తమ అధిక్యతను జన్మహక్కుగా భావిస్తున్నారు! కర్ణుడి కవచకుండలాలంత సహజమైనవిగా భావిస్తున్నారు.
మహిళలకు మనమెంతటి అగ్ర స్థానాన్నిచ్చామో పాశ్చాత్యులకు చాటటానికి వేదాలను ప్రామాణికంగా తీసుకుంటాం. వేదకాలంలో మహిళలు మగవారితో సమంగా జ్ఞానసముపార్జన చేసే వారని చెపుతాం. వేదాధ్యయనం స్త్రీ, పురుషులు కలసి చేసేవారని, చర్చల్లో స్త్రీలు పాల్గొని పురుషుల మీద విజయాలు సాధించే వారని ఎలుగెత్తి చాటుతాం. ఈ సందర్భంగా జ్ఞానమూర్తులైన గార్గీ, మైత్రేయిలను ఉదాహరించటం మానం. గార్గీ అనే మహిళ వేదాలను, ఉపనిషత్తులను ఆపోసన పట్టి అనేకమంది రుషి పుంగవులను జ్ఞానచర్చలో ఢ కొనేది. తన తండ్రి నుండి పొందిన జ్ఞానం, లోతైన అవగాహనాశక్తి, ఆత్మవిశ్వాసం, స్థైర్యం తో యాజ్ఞ వాల్క మహర్షితో తలపడి పోటాపోటీగా వాదించి అతని పాండిత్యాన్ని నిగ్గుతేల్చిన నారీ జ్ఞానమూర్తి గార్గీ.
యాజ్ఞవల్కని భార్య మైత్రేయి ఋగ్వేదంలో కొన్ని ఋక్కులను చెప్పిందని, తన భర్త జ్ఞాన, వ్యక్తిత్వ వికాసాలకు ఈమె చేసిన జ్ఞాన చర్చలు, వాదన ప్రతివాదనలు ఎంతగానో తోడ్పడ్డాయని ఎంతో గౌరవ భావనతో చెపుతాం. త్రిమూర్తులను శిశువులుగా చేసి వారు పెట్టిన పరీక్షలో నెగ్గిన గొప్ప ఋషీమణి అనసూయ. భర్త సత్యవంతుని ప్రాణం పొందే యత్నంలో సూర్యాస్తమయాన్ని నిలువరించి ముల్లోకాలను గజగజ లాడించిన పతివ్రతా శిరోమణిగా సావిత్రిని పేర్కొంటూ స్త్రీలకు ఇంతటి ఘనమైన స్థానాన్ని ప్రపంచంలో ఏ జాతి ఇవ్వలేదని మనం ఛాతిని ఉప్పొంగిస్తూ అతిశయంగా చెపుతుంటాం.
ప్రపంచంలో జ్ఞానవీచికలు ప్రసరించటానికి ముందే మన దేశం ఎనలేని జ్ఞానాన్ని ఆర్జించి, దాన్నిజగత్తుకు పంచిందని ఈ దేశంలో పుట్టినందుకు గర్వపడటం, ఒకింత అహంభావానికి లోనవటమూ మనకు పరిపాటే. నిజమే. మనమందరం గర్వించాలి. అయితే ఒక విషయాన్ని మనం సదా గుర్తుంచుకోవాలి. ఏ జాతి కేవలం దాని గతకాలపు కీర్తి, ఘనతల మీదే మనుగడ సాగించలేదు. అంతటి గొప్ప సంస్కృతిని, దాని మహిమను వారసత్వ సంపదగా పొందిన ఏ దేశ ప్రజైనా / ప్రజలైనా వాటిని తమ నడవడిలో చూపాలి.
''భావములోన బాహ్యం నందున...'' అని అన్నమయ్య కీర్తించినట్టుగా మనసులో ఉన్న భావం మన నడతలో వ్యక్తమవ్వాలి. అప్పుడే కదా స్త్రీలకు మన మిచ్చిన విశిష్ట స్థానం, పూజార్హత లోకానికి విధితమై మన అద్భుతమైన సంస్కృతి పట్ల మన మీద పశ్చిమ దేశీయుల మనసుల్లో ఒక గౌరవభావం కలిగేది. ఏ దేశ ప్రజలైనా తమ వారసత్వ సంపదను సంరక్షించి తమ ప్రతిభా వ్యుత్పత్తులతో సుసంపన్నం చేసే, చేయగలిగే మార్గం ఆచరణ ఒక్కటే కదూ !
ప్రతి పురుషుని విజయం వెనుక స్త్రీ ఉంటుంది.ఆమె తోడ్పాటు ఉంటుంది. పురుషులు కార్యోన్ముఖులను చేయటం లోనూ, ఏకాగ్రత వీడకుండా లక్ష్య సాధన వైవు అడుగులు వేసేటట్టు చేయగలిగే గురువు, సలహాదారు ఓ తల్లి, భార్య, చెల్లి, ఓ మిత్రురాలు ఇలా ఎవరైనా కావచ్చు. రాజుల కాలంలో వీరులు యుద్ధానికి వెళ్లేసమయంలో వారిని ప్రోత్సహిస్తూ స్త్రీలు మంగళ హారతులిచ్చి పంపేవారు. 13వ శతాబ్దానికి చెందిన ఖడ్గ తిక్కన కాటమరాజుపై పోరుకు వెళ్లి, ఓడిపోయి వచ్చిన వేళ ఆతని భార్య చానమ్మ అతనిలో పౌరుషం రగల్చటానికి అతడు స్నానం చేయటానికి మంచం అడ్డుపెట్టి, పసుపు ముద్ద పెట్టిందట. ఆమె చేసిన పని విడ్డూరంగానే ఉన్న అది చేయగల కార్యాన్ని ఆమె ఆశించిన ఫలితాన్నిచ్చింది. భార్య చర్యకు సిగ్గుపడి, ధైర్యాన్ని పుంజుకుని సమరాంగణోత్సహంతో రణభూమికి మరలి వీరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు. అటువంటి వీర నారీమణులున్న దేశం మనది.
అలాగే జిజియాబాయి తన కుమారుడైన శివాజీకి స్వరాజ్య భావనను వివరించి, స్వరాజ్య కాంక్షను ప్రోదిచేసి, రగిల్చి అతణ్ణి యోధుడిగా మలచింది. అతడు మరాఠా సామ్రాజ్య స్థాపన చేసి ఛత్రపతి శివాజిగా పేరు పొందాడు. మహాభారతంలో కుంతీ మాత తన భర్తను కోల్పోయింది. తన కుమారులను పెంచే బాధ్యతను స్వీకరించి తనకు, తన కుమారులకు అన్యాయం చేసిన కౌరవుల మధ్యలో నిస్సహాయరాలిగా ఉంటూ తన కాలాన్ని గడిపింది. వారు రాజ్యాన్ని కోల్పోయి అరణ్యాల పాలైనప్పుడు వగచింది. అనేక బాధలను అనుభవించింది. ఇవన్నీ చేసింది మాతృమూర్తిగా ఉన్న ఒక స్త్రీ అని గుర్తుంచుకోవాలి.
మన సంస్కృతి, దేశ ఔన్నత్యాన్ని గొప్పగా చెప్పే వేళ శివుని అర్ధ నారీశ్వరత్వం గురించి తప్పక చెపుతాం. శివ పార్వతులు ఏకరూపులైన శరీరమది. ప్రతి పురుషుడిలో స్త్రీ సున్నితత్వం, ప్రేమ, లాలన, ప్రేమ ఉంటాయి. అదేవిధంగా, ప్రతి స్త్రీలో పురుషుడి ధైర్య, స్థైర్యాలు, ఒక రకమైన కరకుదనం ఉంటాయి. వీటి మేళవింపే ఈ అర్ధనారీశ్వరత్వ భావన. వివాహనంతర వచ్చే వ్యవస్థ సంసారం. భార్యా భర్తలిద్దరు తమ తమ విబేధాలను పక్కకు పెట్టినప్పుడేఈ సంసార సాగరాన్ని చక్కగా ఈదగలరు. దీన్ని చెప్పేదే ఈ అర్ధనారీశ్వరావతార తత్వం. మా భారతీయ చింతన ఇంత గొప్పది స్త్రీలకు సమాన హోదా, గౌరవం అనే భౌతిక పరిధులను దాటి అర్ధ శరీరాన్నే ఇచ్చిన ఆ పార్వతీ పరమేశ్వరులు మా భారతీయదంపతులకు ఆదర్శం.
సష్టి, శక్తుల అపురూప సంయోగమే ఈరెండిటి అర్ధ శరీరాల ఏకరూపుఅంటూ ఈ భావనలను మాటల్లో, రాతల్లో గొప్పగా ప్రదర్శిస్తాం. కాని చేతల్లోకి వచ్చేసరికి ఏమవుతోంది? అలా ఎంతమంది మసలుకుంటున్నారు? అలా భార్య భర్త లిరువురు నడచుకోగలిగిన నాడే మనం ఆరాధించే దేవతా మూర్తులకు నిజమైన భక్తిని చూపించినట్టు. ప్రముఖ ఆంగ్ల కవి, సాహితీ విమర్శకుడు, తత్వవేత్త కోల్రిడ్జి (Coleridge) ఈ స్త్రీ పురుషుల మేధో పరమైన, మనస్తతత్వ లక్షణాల మేలు కలయికే androgynous mind అన్నాడు. వర్జినియా వుల్ఫ్ అనే 20 వ శతాబ్దపు ఆంగ్ల నవలా రచయిత్రి దీన్నే best mind అని పేర్కొంది.
ఎంత అద్భుతమైన భావన, కలయిక అర్ధనారీశ్వరతత్వం. భార్యభర్తల అనుబంధం, అనురాగం, అన్యోన్యతల గురించి మాట్లాడే సందర్భాలలో దీనిని ఉదాహరణగా చూపుతాం. కాని ఎంతమంది అలా ఉండగలగుతున్నాం !? కనీసం అలా ఉండే ప్రయత్నం చేస్తున్నామా?
ఇంతటి దీర్ఘ ఘన చరిత్ర, ఉదాత్తమైన సంస్కృతి, మహా కావ్యాలు ఉన్న మనం దేశంలో వరకట్న వేధింపులు, గృహ హింసను నిలువరించే చట్టాలు వచ్చాయి. ఆడపిల్ల సాక్షాత్తూ లక్ష్మి అన్న భావన స్థానంలో ఆడ శిశువులను foetus లో అంతం చేసే క్రూరమైన మనస్తత్వం వచ్చింది. కోర్టులు, న్యాయమూర్తులు జోక్యం చేసుకోవలసిన అవసరం వచ్చేట్టట్టు చేసింది మన ప్రవర్తన. ఇక్కడ మనంటే పురుషులనే కాదు కొంతమంది స్త్రీలు కూడా. గగనతలాన్ని తాకే అద్భుత సంస్కృతి అధఃపాతాళానికి దిగజారిందా? మన సంస్కృతి అద్భుతమైనదనా మన అహంభావం, మాతృదేవోభవ అంటూ తల్లికి పెద్ద పీట వేసి, గార్గి.. మైత్రేయిలను జ్ఞానమూర్తులుగా ఎంచి, ఝాన్సీ లక్ష్మీ బాయిని ధీర వనితగా చూసి పులకరించిన ఛాయలు కూడా లేనివిధంగా, స్ఫురణకు రాని విధంగా ఉందా పురుషుల ప్రవర్తన!? అతివల దుస్థితి గురజాడ, కందుకూరి, రాజా రామమెహన రారుల చేయూతను కోరింది. వారిపై శుష్క భక్తి కాదు, వారిపై ఉన్న ఉదాత్త భావనను ఆచరణలోకి తేవాలంటూ వారిని మాను, మాకులుగా కాక మనసున్న మనుషులుగా కాంచమని చలం విస్ఫులింగాలు కురిపించటానికి సమాజపు పోకడ అవకాశమిచ్చింది.
''మా అమ్మ అత్తింట భక్తి గౌరవాలతో మెలగాలని సుద్దులు చెప్పి పంపింది
నా భర్త కొంచెం భయాన్ని కూడ నేర్పి నన్ను పూర్ణవతిని చేసాడు...'' అంతర్భాష అనే ఓ కవితలో, ఈ వాక్యాలలో ఆ కవయిత్రి ఎంత క్లుప్తంగా, అలతి పదాలతో అనంతార్ధాన్ని స్ఫురించేటట్టు దేశంలోని ఎంతో మంది భార్యల మనోస్థితిని, భర్తల ఆధిపత్యపు ధోరణిని ఎంత బాగా చెప్పారో చూడండి.
విద్యావతి అయిన ఒక భార్యను ఆమె భర్త ఇంటికే పరిమితం చేస్తూ ఎప్పుడూ ఇంటిని శుచి, శుభ్రంగా ఉంచమని హెచ్చరిస్తాడు. ఆమె సమయమంతా వంటావార్పులతో, ఇంటి శుభ్రం చేయటంలో కరగిపోయి, చివరకు ఆమె తన పేరును సైతం మరచిపోతుంది. ఎంత ప్రయత్నించినా ఆమెకు గుర్తు రాదు... ఇది ఇల్లలకగానే.. అనే కథలో పి. సత్యవతి అనే గొప్ప కథా రచయిత్రి ఆడవారి పరాధీనతను, రసవిహీనమైన ఒక భార్య జీవితాన్ని అక్షర చిత్రంగా నిలిపారో చూడండి.
స్త్రీని ఆదిశక్తిగా భావించే గొప్ప సంస్కృతి మనది. శక్తి పీఠాలు స్థాపించి శక్తి స్వరూపిణిగా ఆరాధన చేస్తాం. ఈ సృష్టి మనుగడ స్త్రీ వల్లే అని మాటల ద్వారా, రాతల ద్వారా చెపుతాం. దసరా పండుగ సందర్బంగా శక్తి స్వరూపిణి గా నవరాత్రులూ పూజిస్తాం. సంక్రాంతి పండుగకు ధాన్యలక్ష్మిగా కొలుస్తాం. ఆడపిల్లలకు దేవతల పేర్లు పెడతాం. ఇంతటి భక్తి ప్రపత్తులు చూపుతూ స్త్రీ దేవతామూర్తులుగా పూజించే ఈ దేశం, సమాజం ముఖ్యంగా పురుష సమాజం చేతలలో అటువంటి గౌరవ, పూజ్య భావనను మగువలపై ఎందుకు చూపలేక పోతున్నదో అత్మవిమర్శ చేసుకువాలి. సంస్కృతి సారాన్ని ఇంకించుకోవాలి. మనసులు ప్రక్షాళన చేసుకోవాలి. అధిక్యత, అహంకారాలను వదలాలి. పారదర్శకత కావాలి. ఆ శుభా కాంక్షల తరుణం సమాజంలో వచ్చిన క్షణాన మన ఘన సంస్కృతికి, మన కావ్యాలకు అర్థం, పరమార్థం. అప్పుడే పండుగలకు అసలైన విశిష్టత వచ్చినట్టు. ఆ వైపు సమాజం అడుగులు వేయాలి. అపుడు భూతలమంతా ఆనందం వెల్లివిరుస్తుంది.
- డాక్టర్. చెంగల్వ రామలక్ష్మి
- బొడ్డపాటి చంద్రశేఖర్