Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏడ్చి సాధించే వాళ్ళు కొందరు. సాధించలేక ఏడిచే వాళ్ళు కొందరు. తాము బాగు పడలేదని ఏడ్చే వాళ్ళు కొందరు. పక్కవాడు బాగు పడ్డాడని ఏడ్చేవాళ్ళు కొందరు. నవ్వు గురించే మాట్లాడతారు కాని ఏడుపును పట్టించుకోరేం. నవ్వుకి ఉన్నట్లే ఏడుపుకీ ఎంతో పవర్ ఉందనే కదా ఓ మహానుభావుడెవడో 'బాలానాం రోదనం బలమ్' అని కొటేషన్ కొట్టాడు.
పెద్దోళ్ళ ఏడుపు సంగతి వదిలేసి ఈ పిల్ల రాక్షసుడి ఏడ్పు గురించి పట్టించుకుందాం. వీడు ఓ తండ్రికి కొడుకు, తల్లికి కూడా. ఓ సాయంత్రం వేళ ఉద్యోగులు ఇళ్ళకి చేరుకుంటున్న సమయాన వీడి ఏడుపు చిన్నగా సన్నగా మొదలయ్యి క్రమక్రమంగా శబ్ద కాలుష్యంగా మారసాగింది.
ఎప్పటిలాగే ఇంటి ఇల్లాలు కూడా అయిన వాడి తల్లి పిల్లవాడ్ని సముదాయించటం ఆరంభించింది. 'నాన్నా కన్నా బుజ్జీ' అని రకరకాలుగా ప్రేమకు పదరూపం కల్పించింది. ఆకలేమో అని తినుబండారాలు ముందుంచింది. ఆట వస్తువు కోసం ఏడుపేమోనని ఇంట్లో ఉన్న 'సాఫ్ట్ టాయిస్' అన్నీ వాడి ముందు కుప్పపోసింది.
అయినా వాడు ఏడుపు మానలేదు. ఇంటికి పై కప్పు కాంక్రీటుది కనక కాంట్రాక్టర్ సత్లెకాలపు వాడు కనక ఎగిరిపోలేదు.
బయటి తిరుగుళ్ళు ముగించుకుని తండ్రి ఇంటికి వచ్చాక వాడు ఏ హార్మోనియం పెట్టెకీ అందనంతగా శృతిని రెచ్చగొట్టాడు. సరిగమలని దాటిపోయిన వాడి ఏడుపును చల్లార్చడానికి తండ్రి 'రిపేరు' కార్యక్రమం మొదలుపెట్టేడు. పెద్దవాళ్ళు ఏడిస్తే ఆ ఏడుపుకు ఓ అర్థం ఉండేడ్చవచ్చు కానీ పిల్లల ఏడుపుకు కారణం కనుక్కోవడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. పరీక్ష తప్పితే విద్యార్థి ఏడవ్వచ్చు. ఉద్యోగం రాకపోతే నిరుద్యోగి ఏడవ్వచ్చు. ఎన్నికల్లో నిలబడ్డానికి సీటు రాకపోతే రాజకీయ నాయకుడు ఏడవ్వచ్చు. రకరకాల కారణాల వల్ల రకరకాల మనుషులు అనేక రకాలుగా 'పైకీ' 'లోపలా' ఏడవవచ్చు. ఏడ్చినా ఏడవనట్టు నటించనూ వచ్చు కానీ పట్టుమని రెండైదుల వయస్సు దాటని వాడి ఏడుపును 'డయగ్నైజు' చెయ్యడం అంత సులువేమీ కాదు.
తండ్రి కొడుకుని బుజ్జగిస్తూ అడిగాడు.. ఏరా కోతి బొమ్మడిగావు కొనిచ్చానా ఏనుగు బొమ్మ కూడా కొనిచ్చావు అన్నాడు కొడుకు. గది నిండా బొమ్మలున్నయి కదా అన్నాడు తండ్రి 'లేవన్నానా' అన్నాడు కొడుకు. ఎక్కి ఊగడానికి గుఱ్ఱపు బొమ్మ ఉంది కదా. లేదన్నానా అన్నాడు కొడుకు. పెద్దయ్యావని ఎక్కి తొక్కడానికి బుల్లి సైకిల్ కొనిచ్చానా కాదన్నానా అన్నాడు కొడుకు. కారు కారన్నావని బ్యాటరీ కారు కొనిచ్చానా అన్నాడు ఎక్కీ తిరిగీ 'బోరు' కొట్టిందన్నాడు కొడుకు.
మరింకేం కావాలోరు విసుక్కున్నాడు తండ్రి. పెద్దయ్యాక 'బైక్' కొనిస్తా కదా అన్నాడు తండ్రి. ఎవడిక్కావాలి అన్నాడు కొడుకు.
బైకూ వద్దు సైకిలూ బ్యాటరీ కారూ వద్దనే వద్దు, మరేం కావాలో ఏడవరాదూ అన్నాడు తండ్రి. అదే కదా చేస్తున్నది అనలేదు కొడుకు రాగం తీసి చూపించాడు.
పిల్లలూ దేవుడూ చల్లనివారే అని పాట రాసినాయనకు వీడు తెల్సి ఉంటే ఆ పాట రాయకనే పోవును అనుకున్నాడు తండ్రి. ఇక ఈ రూటు మార్చవలసిందేనని మరోరూటులో 'జర్నీ' చేశాడు. 'ఋణానుంబంధరూపేణా పశుపత్ని సుతాలయా:' అన్నారు. ఏ జన్మదయితనేం అప్పు అన్నాక తీర్చకపోవడానికి 'నీరవ్' నీ మరో 'మాల్యా'నీ కాదు గదా అనుకున్న నాన్న అడిగాడు కొడుకుని ఏం కావాలో చెప్పు అని. కొనిస్తావా అన్నాడు కొడుకు. నీ కోసం ఏమైనా చేస్తాను ఏదైనా యిస్తాను అన్నాడు అమాయకపు తండ్రి కొడుకు మనసులోని కోరిక ఏమిటో తెలీక.
ఏడుపు ఆపాడు కొడుకు. అంగీ చివరలో కళ్ళు తుడుచుకున్నాడు. కాస్కో అనుకున్నాడు లోలోపలే. కాస్కోలేనని తెలీలేదు పాపం తండ్రికి. 'కమాన్ స్పీకవుట్' అనేశాడు. నాకు... నాకు... నత్తి లేకపోయినా నత్తుతూ అన్నాడు కొడుకు 'నాకు విమానం' కావాలి.
విమానమా గాలిమోటరా ఏర్ప్లేనా అన్నాడు తండ్రి కొంచెం గారాభంగా.
అప్పుడు అందుకుంది తల్లి 'స్కూల్ నుంచి రాగానే ఇంటి మీది నుంచి ఎగిరెళ్ళిన విమానం చూసినప్పటి నుంచీ ఇదీ వరస. విమానం బొమ్మ కావాలేమో' అంది.
అంతేనా విమానం బొమ్మేనా ఊపిరి పీల్చుకున్నాడు తండ్రి.
'నో' అంటూ కెవ్వు కేక పెట్టాడు కొడుకు 'ఎగిరే విమానం' అని చించుకున్నాడు గొంతు.
బ్యాటరీతో ఎగిరే విమానమా? అన్నాడు తండ్రి కాదు విమానం నిజం విమానం ఆకాశంలో ఎగిరే విమానం కొనివ్వవా డాడీ అన్నాడు కొడుకు.
బ్యాంకు దోచుకోవాలి దారిదోపిడీలు చెయ్యాలి నిజం విమానం కొనడమే అని లోలోపల వాపోయేడు తండ్రి.
కొన్ని కథలు కంచిదాకా వెళ్ళవు. ఇదీ అంతే.
నేటి బాలురే రేపటి పౌరులు ఓటర్లే కాదు నాయకులు కూడా. వీళ్ళు బ్యాంకులు దోచుకోనక్కర్లేదు ఓటు బ్యాంకు దోచుకుంటే చాలు. వీళ్ళ దారి దోపిడీలు చెయ్యక్కర్లేదు. ఒంటి చేత్తో పార్టీలు నడిపితే చాలు. బూతు పురాణ ప్రవచనం గాలి కబుర్లు పోగెయ్యడం ఉత్తర కుమారుడ్ని 'ఇమిటేట్' చెయ్యడం వస్తే చాలు ఉట్టికెక్కలేకపోయినా స్వర్గానికెగరవచ్చు. ఇంటి ముంగిట గేదెను కట్టేసుకున్నట్టు విమానాన్ని కట్టేసుకోవచ్చు. నేల విడిచి సాము చేయవచ్చు. గగన విహారం చేయవచ్చు.
-చింతపట్ల సుదర్శన్, 9299809212