Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్ర తెలుసుకోవటానికి మనకు లభించే ముఖ్య ఆధారాలు, రాజులు, నాయకులు, దండనాయకుడులు జరిగిన వారి కాలంలో వ్రాసి ఉంచిన శిలాశాసనాలు, లోహపు పలకలపై వ్రాసిన శాసనాలు, తాళపత్ర గ్రంథాలు, కాగితపు గ్రంథాలు, అవి ఆనాటి సామాజిక, సాంస్కృతిక చరిత్రకు నిదర్శనాలుగా మనకు వారి కాలాన్ని వివరించి చెపుతాయి. రాసి ఉంచిన విషయాల ద్వారా తెలుసుకున్న కాలాన్ని ''చరిత్ర'' తెలిసిన కాలంగా పరిగణిస్తే, అంతకు పూర్వం రాయడం తెలియని కాలం మరొకటి ఉండేది. అది ''చరిత్రకంటే పూర్వకాలం'' ''pre History'' కాలంగా లెక్క కడతారు. మరి ఆనాటి విషయాలు ఎలా తెలుస్తాయి అనే ప్రశ్న రాకమానదు మనకు. ఆనాటి విషయాలనూ గ్రహించి రాసారు శాస్త్రవేత్తలు. అందుకు కారణం ఆనాడు ఆ మనుషులు వేసిన చిత్రాలు, శిల్పాలు. లిపి పుట్టకంటే ముందే, రాయడం తెలిసేకంటే ముందే దృశ్య కళలు తయారు చేసారు మానవులు. ఆనాటి చిత్రం, శిల్పం వంటి దృశ్యకళలే ఆ నాటి విషయాన్ని సేకరించటానికి ఉపయోగపడ్డాయి. రాతల ద్వారా తెలుసుకున్న విషయాన్ని ''చరిత్ర'' అని అంటే, చిత్రం, శిల్పం ద్వారా తెలుసుకున్న విషయాన్ని ''కళా చరిత్ర'' Art History అంటాము. చరిత్రకంటే కళా చరిత్రనే పురాతనమైనది, ఆ ఆదికాలం గురించిన విషయ సేకరణకు సహకరించింది.
క్రీ.పూ. 3 మిలియన్ల సం||ల క్రితమే భూమిపై జీవనం ఉండేదనీ, క్రీ.పూ. 2 మిలియన్ల సం||ల క్రితం చేయబడ్డ రాతి పనిముట్లు ప్రపంచంలో ఎన్నో చోట్ల దొరకటంతో ఆనాటికే మానవ జీవనం భూమిపై ఉండేదనీ తెలుసుకున్నారు. భారతదేశ:లోనూ ఎన్నో చోట్ల ఆ ఆదికాలపు మానవులు గుర్తులు దొరికాయి. సుమారు 1300ల ఆదికాలపు మానవుల గుహలు కనుగొనబడ్డాయి. అందులో 1000 కి పైగా మధ్య భారతంలో ఉన్నట్లు డా||వి.ఎస్. వాకంకర్ తెలిపారు. ఆనాటి మానవులు రాతి గుహల్లో, కొండరాయి పేర్చి, గుహలల్లే అమర్చి అందులో నివసించారు. అవి వారికి క్రూరమృగాల నుండీ, ఎండావానల నుండీ రక్షణ ఇచ్చేవి. అందువలన ఆ కాలాన్ని రాతి యుగమనీ, ఆదిమానవుల కాలమనీ అంటారు.
భూమిపై జన జీవనం ఇలాగే ఎప్పుడూ ఉన్నదని నమ్మారు ముందు. 1860 వ సం||లో డార్విన్ చెప్పిన సిద్ధాంతం ప్రకారం మానవులు చింపాంజీ వంటి జంతువుల నుండీ పరిణామం చెందిన జీవి అనీ, భౌతిక మార్పుల అభివృద్ధి ఒక విషయం అయితే మానవాభ్యుదయంలో సాంఘిక, సంస్కృతిక అభివృద్ధి మరొక విధానం అనీ పరిశోధనలు మొదలుపెట్టారు. చింపాంజీలు రాతితో కర్రతో కొట్టి పళ్లు, కాయలు తింటామని తెలుసు. కానీ ఆదిమానవులు ఆ రాతిని, కర్రని చెక్కి తనకు అవసరమైనవిధంగా పనిముట్లు తయారు చేసారు. అలాగే వారు, ఎముక చర్మం వంటి వస్తువులతోనూ అవసరమైన పనిముట్లు తయారు చేసుకున్నారు. అలాంటి వస్తువులు శిథిలమై ఉండవచ్చు. వస్తువులకు చెక్క వంటి వస్తువుల పిడి అమర్చి, అలాగే ఆభరణాలనూ తయారు చేసారు. చెక్కడం, అమర్చడం ఆకారాలు పొందుపరచటం శిల్పం తయారీ పద్ధతులు అంటే ఆదిమానవులు శిల్పం తయారీలో పాల్గొన్నారు. అవే భూమిపై మొదటి శిల్పాలు.
భారతదేశంలోనూ పలుచోట్ల ఆదిమానవులు రాతి గుహలల్లో వేసిన చిత్రాలూ కనిపించాయి. జంతువులను వేటాడిన రక్తంతో అచ్చుగా ఆకారాలను వేసేవారట. వారు ఎర్ర మట్టి రంగు, సుద్ద ముక్క చీనీ మట్టి, ఎరుపు, నలుపు, పసుపు, నారింజ రంగులు, అలాగే జంతువులను వేటాడే దృశ్యాలు, ఏనుగులు, జింకలు, దుప్పలు, కోతులు, ఆవులు, ఎద్దులు, ఆనాటి మానవ ఆకారాలు, ఇలా వారు వాడిన వస్తువులు, రంగులు విషయపరంగా వారు వేసిన చిత్రాలను 20 రకాలుగా గుర్తించారు. భోపాల్కి దగ్గర రైసన్ అనే గుహలో ఒక గర్భవతి ఆవు చిత్రం కనిపించింది. ఆవు కడుపులోని 4 రాళ్ల దూడ, ఆవు, రెండింటి అస్థిపంజరాలు చూపుతూ X-ray పటంలా చిత్రం వేసారు. అది క్రీ.పూ. 8000 నుండీ క్రీ.పూ. 2500 సం||ల కాలం నాటిది. అలాగే ఖారవాయి అనే మధ్యప్రదేశ్ లోని మరో గుహలో జేబూ అనే మూపురపు ఎద్దు బొమ్మ, నల్లరాతిపై, తెల్లని రంగు పులిమి ఎంతో సహజ సిద్ధంగా వేసిన బొమ్మ కనిపిస్తుంది. ఇది క్రీ.పూ. 2500 నుండీ క్రీ.పూ.300 సం||ల కాలం నాటిది. ఉత్తర కర్ణాటకలోని మస్కీ ((maski)) అనే ప్రాంతంలో కొన్ని రాతియుగపు గీతల్లో చిత్రాలు కనిపించాయి. కొండరాయిపై గీతలు చెక్కి అందులో కొన్ని ఆకారాలను సృష్టించారు. అందులో పెంపుడు జంతువులు, మానవులు గుంపులుగా కనిపిస్తారు. అదే చిత్రంలో కింది భాగంలో ఒక చక్రం బొమ్మ కూడా కనిపిస్తుంది. ఆదిమానవులు మొదట చేతితో తట్టు మట్టిపాత్రలు చేసినా ఆపై కాలాల్లో చక్రం తిప్పి కుండలు చేసారు. ఈ బొమ్మ ఆనాటిది కావచ్చు. శాస్త్రవేత్తల ప్రకారం ఆదిమానవుల గుహలలోని చిత్రాలు అన్నీ ఒకే కాలానికి చెందినవి కావు. ఒకే చోట వేరు వేరు కాలాలల్లో గీయబడ్డాయి.
కళాచరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు ఆదిమానవుల చిత్రాలు, శిల్ప చాతుర్యం చూసి కొన్ని విశేషాలు చెప్పారు. మొదటగా ఆదిమానవులకు మాట్లాడే శక్తిలేదు. కొన్ని యుగాల తర్వాత చిన్న మాటలు పలకటం ఆపై మాట్లాడటం తెలిసిందట. ఆదిమానవుల కంఠంలోని ఎముకల అమరిక పట్టీ ఈ విషయాలను కనుగొన్నారు. వారు గీతలు, బొమ్మలు, రాతిపై చిత్రాలు, శిల్పం చెక్కి విషయ సూచన చేసేవారట. ఆదిమానవుల చిత్రం, శిల్పం తయారీలో సౌందర్య పిపాస ఉన్నా, చిత్రాలను, శిల్పాన్ని వారు గుర్తులుగా వాడారు. వారు వలసజీవులు. ఒక చోట నుండీ మరొక చోటుకు వలస పోయినపుడు ఆ స్థలంలో మరొకరి చిత్రాల గుర్తులు కనిపిస్తే అది నివాస యోగ్యంగా గుర్తించేవారట. వారి బొమ్మలే వారికి విషయం తెలియచేసే భాషగా మారాయి.
అంతేకాదు, తరువాత కాలంలో అభివృద్ధి చేసిన లిపికి రాతకు, ఆనాటి వారి గుర్తులే ఆధారం. మనం ఈనాడు రాస్తున్న లిపి చరిత్ర చదివితే ఆదిమానవులు ఉపయోగించిన గుర్తుల నుండీ భాష వెలువడిందని తెలుస్తుంది. ఆదిమానవులు వారు వేసి చిత్రాలను, శిల్పాలను ఒక మాయ చేయగల మత పద్ధతిలో కూడా వాడారని మరొక వాదన ఉంది. ఏది ఏమైనా వారు వాడిన ఆ చిత్రాల గుర్తులే ఈనాటి మన లిపికి పూర్వ చరిత్ర.
ఆదిమానవులు మట్టిపాత్రలు, కుండలు, ఆభరణాలు ఆపై కాలాలల్లో చేసారు. వాటిపై గీసిన చిత్రాలు చదవటం మరొక అధ్యాయం శాస్త్రవేత్తలకి. మట్టికుండలపై చతురస్రపు ఆకారంలో డిజైనులు, జంతువులు, రావి ఆకు చిత్రాలు గీయబడి ఉన్నాయి. ఇవికాక మట్టితోచేసిన స్త్రీ,పురుష, చిన్న చిన్న బొమ్మలు, ఆభరణాలు చిత్రించి కనిపించాయి. అలాగే చిన్న మూపురపు ఎద్దుల ఆకారాలు దొరికాయి. రావి ఆరకు ముందు తరాలలో మతపరంగా ఎంత ప్రాముఖ్యమో అలాగే ఈ స్త్రీ, పురుష ఆకారాలు చూసి మత సంబంధ కార్యక్రమాలకు వాడేవారని అనుమానం.
ఆదిమానవుల కాలాన్ని లేదా రాతి యుగాన్ని మూడు భాగాలుగా విభజించారు. రేడియోకార్బన్ పద్ధతి ద్వారా భూమిలోని పొరలను లెక్కకట్టి కాల నిర్ణయం చేసారు. అట్టడుగు కాలాన్ని పాత రాతియుగం, ఆపై మధ్య రాతియుగం, కొత్తరాతియుగం అని పేరు పెట్టారు. కొత్త రాతియుగం మనకు దగ్గరికాలం. ఈ పొరలన్నీ వరుసగా క్రీ.పూ. 2 మిలియన్ల నుండీ వరుసగా క్రీ.పూ. 10,000 సం||ల వరకూ ఉన్నాయని అంచనా. ఆదిమానవుల జీవనం అభివృద్ధి లెక్కకడుతూ వెళితే, మొదటి కాలంలో వీరు వలస జీవులు, రాతి పని ముట్లని చేసుకుని ఆహార సేకరణలో నిమగమై ఉన్నారు. ఆ కాలంలో కొడవలి ఆకారపు పనిముట్లు, చెక్క పని ముట్లు కనిపించాయి. మధ్య రాతియుగంలోని నాజూకైన పనిముట్లు కనిపించాయి. వీరు మత్స్యకారులు మరియు వేటాడారు. వ్యవసాయం చేసిన ఛాయలూ కానవస్తాయి. తాత్కాలిక స్థావరాలలో నివసించారు. కొత్త రాతి యుగంలో రెండు వైపులా పదునుపెట్టిన పరికరాలు కనిపించాయి. ఆగేయ భారతదేశంలో వీరి స్థావరాలు ఎక్కువగా కనిపించాయి. వీరు పెంపుడు జంతువులను పెంచారు. పాడి పంట సాగు చేసారు. రోలు కవ్వం వంటి పరికరాలు వాడారు. దక్షిణ భారతంలోని బళ్లారి లోనూ ఒక రాతి పనిముట్లు చేసే కారాగారం కనిపించింది.
ఆదిమానవుల పరికరాలు, స్థావరాలు, భారతదేశం చుట్టు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బలూచిస్తాన్ వంటి దేశాల్లోనూ కనిపించాయి.
పురాతనం అంటే నవ్యతకు విరుద్ధమనీ, అభివృద్ధి లేని కాలమనీ మన ఊహ. ఆదిమానవులు వారికి ప్రకృతిలో దొరికిన రాయిని, చెట్టుని ఉపయోగించి ఎంతో సృజనాత్మకంగా జీవనాన్ని అల్లుకున్నారు. ఈనాటి మన లిపికి మూలం వారే. ఇది ''చరిత్ర పూర్వం'' కాలం అయితే ఆనాటి ఆదికాలానికి, చరిత్రకాలానికి వారధి వేసిన కళా చరిత్ర మరొకటి ఉంది మనకు మరోసారి తెలుసుకోవటానికి.
mbalamani@gmail.com
- డా|| ఎం.బాలమణి, 8106713356