Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజామాబాద్ జిల్లాలో కోడూరుగా ప్రసిద్ధిగాంచి కాకతీయుల కాలంలో కాకతీయ గుండన నేలిన నేల, దోమకొండ సంస్థాన ప్రతినిధి చిన్న కామిరెడ్డి 1600 నుండి 1640 వరకు పరిపాలించిన ప్రాంతమిది. అనేకమంది స్వాతంత్ర సమర యోధులు, ఉద్యమ కారులు క్విట్ ఇండియా ఉద్యమంలో, ఆంధ్ర మహాసభలలో, తెలంగాణ సాయుధ పోరాటంలో, నిజాం వ్యతిరేక పోరాటంలో, మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమంలో పాల్గొని ఈ కామారెడ్డి నేల పౌరుషాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు.
కామారెడ్డి ప్రాంతం దాని చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్యనందించాలని చేసిన ప్రయత్నాలలో భాగంగా కామారెడ్డిలోని విద్యావంతులు ఉన్నతులు కలిసి కమిటీని ఏర్పాటు చేసుకుని, కళాశాల కోసం ప్రయత్నం చేశారు.
నేడు ఎగ్జిక్యూటివ్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న కేఆర్ రాజారెడ్డి ప్రోద్భలంతో జీడిపల్లి విట్టల్‌రెడ్డి, కే.ఆర్. రాజారెడ్డిలను పిలిపించుకున్నారు. వారితో పాటు కె.పి.రాజిరెడ్డి, నర్సాగౌడ్, బాదల్చంద్, నారాయణరావులతో కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఒక సొసైటీ ఏర్పాటు చేయించారు. నాటి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ బి.ఎన్.రామన్ గారు సహాయ సహకారాలతో 265 ఎకరాల విస్తీర్ణంలో ఈ విజ్ఞాన కోవెలను (డిగ్రీ కళాశాలను) స్థాపించారు. కామారెడ్డి ప్రాంతంలో ఉన్న రైతులు, లోకల్గంజ్ వ్యాపారవేత్తలు, బీడీ పరిశ్రమ కాంట్రాక్టర్లు కళాశాల అభివృద్ధికి ప్రోత్సాహం అందించారు. నాడు ఈ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయం అనుబంధంగా ఏర్పాటైంది.
1978-79 ప్రాంతంలోనే రూరల్ ఇండిస్టియలైజేషన్, ఫారెస్ట్రి, ఫిషరీస్, ఎలక్ట్రానిక్స్, డైరీ టెక్నాలజీ వంటి ఉపాధి అవకాశాలు ఉన్నటువంటి కోర్సులను విద్యార్థుల కోసం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం డైరీ టెక్నాలజీనీ శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తర్వాత శ్రీ పీవీ నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీకి అనుమతులు ఉన్నాయి.
ఈ కళాశాలను జనవరి 30, 1987లో ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించి గవర్నమెంట్ పరిధిలోకి తీసుకువచ్చింది. సాంప్రదాయ కోర్సులతో పాటు సెల్ ఫైనాన్స్ కోర్సులు, కంప్యూటర్ అప్లికేషన్, చార్టర్ ఎకౌంటింగ్, ఎంపీసీఎస్, స్టాటిస్టిక్స్, బయోటెక్నాలజీ వంటి ప్రస్తుత కాలానికి ఉపయోగపడే వృత్తి విద్యా కోర్సులు అందించారు.
2000లో విద్యార్థుల అవసరాలను గుర్తించి నాలుగు పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సులు ఎం కామ్, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ తెలుగు, మాస్టర్ సోషల్ వర్క్‌లకు అనుమతులిచ్చారు. ఇలా ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థుల ఉన్నత విద్యకు ఇతోథికంగా సేవలందిస్తున్నది. నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతంలో ఉవ్వెత్తున లేచిన 1969 తొలి తెలంగాణ పోరాటంలో విశ్వనాథ్‌గౌడ్ హరికృష్ణగౌడ్ వంటి ఉద్యమ కారులను ఈ కళాశాల అందించింది.
గ్రంథాలయం
కళాశాల ఆవిర్భావం నుంచి నేటి వరకు దాదాపు 40 వేలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో చరిత్ర, భౌగోళిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం, తెలుగు, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఆంగ్లం, హిందీ, సంస్కృతం వంటి పుస్తకాలతో పాటు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, ఎన్ సైక్లోపీడియా అమెరికానా, హూ ఇస్ హూ ఇన్ ఇండియా వంటి ప్రాముఖ్యత కలిగిన పుస్తకాలూ ప్రాచీన తెలుగు సాహిత్యం, అభ్యుదయ తెలుగు సాహిత్యం, వందల సంఖ్యలో నవలలు (తెలుగు, ఇంగ్లీష్) భాషలలో కలవు.
పీజీ విద్యార్థులకు, పరిశోధన చేసే విద్యార్థులకు రీసెర్చ్ స్కాలర్స్ అందుబాటులో ఉన్న ఏకైక ప్రభుత్వం డిగ్రీ కళాశాల గ్రంథాలయం కావటం విశేషం. వివిధ కోర్సులకు సంబంధించిన 34 రకాల జర్నల్స్, మ్యాగజైన్సు, 12 దినపత్రికలు అందుబాటులో ఉన్నాయి. నిత్యం ఈ గ్రంథాలయానికి విద్యార్థులు వస్తూ విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటున్నారు.
వీటితో పాటు పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ వన్, గ్రూప్ టు, పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్సై, పోస్ట్ ఆఫీస్, బ్యాంక్ క్లర్క్, ఫారెస్ట్, గ్రూప్ ఫోర్త్, సివిల్ సర్వీసెస్‌కు సంబంధించిన పుస్తకాలు , విజేత కాంపిటీషన్స్, యూనివర్సిటీ న్యూస్, ఉద్యోగ సోపానం, ఆర్ సి రెడ్డి పబ్లికేషన్స్, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ, యోజన, ఎంప్లాయ్మెంట్ న్యూస్, క్యారియర్ గైడెన్స్ వంటి అన్ని రకాల మ్యాగజైన్సు అందుబాటులో ఉన్నాయి.
యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ వారి సహాయ సహకారాలతో నడపబడుతున్న ఎనలిస్టు డాటా బేస్‌లో సభ్యత్వం కలదు. దీని ద్వారా దాదాపు 3లక్షల ఎలక్ట్రానిక్ పుస్తకాలు, 30 వేల జర్నల్స్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందుబాటులో ఉన్నాయి. మారుతున్న కాలంతో పాటు విద్యార్థులకు కావలసిన లేటెస్ట్ ఆన్లైన్ పుస్తకాలు, జర్నల్స్, వివిధ మాధ్యమాల ద్వారా నేషనల్ డిజిటల్ ఆఫ్ ఇండియా, ఈ పీజీ పాఠశాల, విద్యా మిత్ర, సిఇసి, హాతి ట్రస్ట్, వరల్డ్ డిజిటల్ లైబ్రరీ, అర్కివ్స్, పిడిఎఫ్ డ్రైవ్ వంటి అత్యాధునిక ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విద్యార్థులకు, అధ్యాపకులకు సమాచారాన్ని అందిస్తోంది.
ఈ గ్రంథాలయానికి తొట్ట తొలి గ్రంథపాలకునిగా కృపాకర్, తర్వాత గ్రంథ పాలకునిగా అత్యధిక కాలం రణజిత్ మోహన్ సేవలందించి గ్రంథాలయ ఉన్నతికి తోడ్పడ్డారు. ప్రస్తుతం గ్రంథ పాలకులుగా డాక్టర్ లక్ష్మణచారి సేవలందిస్తూ గ్రంథాలయానికి నూతన హంగులు దిద్దుతున్నారు.
ఈ కళాశాల గ్రంథాలయంలో బి సత్యనారాయణ ఐఏఎస్ (డైరెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్) వెంకటేశ్వర్లు ఐపీఎస్, సోమశేఖర్ రెడ్డి ఐఆర్ఎస్, శ్రీనివాసులు నిజాంబాద్ కమిషనర్, చంద్రశేఖర్ రెడ్డి ఐఎఫ్ఎస్, కృష్ణగౌడ్, ఐయఫ్ఒ వంటి అనేక మంది అధికారులు ఈ కళాశాల గ్రంథాలయంలోని పుస్తకాలతో కుస్తీలు పట్టిన వారే.
ప్రముఖ కవులు రచయితలు డా. ఆయాచితం శ్రీధర్, నలిమెల భాస్కర్ లాంటి ఉద్ధండులు కళాశాల గ్రంథాలయ ఆవరణలో కవిత్వపు ఓనమాలు దిద్దనవారే.
ఈ గ్రంథాలయాన్ని కోహా అనే అంతర్జాతీయ గ్రంథాలయ సాఫ్ట్వేర్ ద్వారా ఆటోమేషన్ చేశారు. ఈ కాలిబ్రే అనే డిజిటల్ లైబ్రరీ సాఫ్ట్వేర్ కూడా అందుబాటులో ఉన్నది. ఈ గ్రంథాలయంలో 14 కంప్యూటర్లతో ఉచిత అంతర్జాల సౌకర్యం విద్యార్థులకు కావలసిన సమాచారాన్ని, పోటీ పరీక్షలకు అప్లై చేసుకోవడానికి, ఎలక్ట్రానిక్ పుస్తకాలను ఎలక్ట్రానిక్ జర్నల్ను అందిపుచ్చుకోవడానికి ఇ- కార్నర్ విభాగం పనిచేస్తుంది.
బాలరాజు గౌడ్ ఆర్థిక సహకారంతో చక్కటి 600 మంది కూర్చుని ఆడిటోరియం నిర్మించారు. ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ ఫైడి ఎల్లారెడ్డి ఈ కళాశాల విద్యార్థే. వారు ప్రతి సంవత్సరం ఉన్నత విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహకంగా పారితోషకం, గోల్డ్ మెడల్స్‌ను అందిస్తున్నారు.
మాజీ మంత్రి మృత్యుంజయ, ఎమ్మెల్యే గంప గోవర్ధన్, మాజీ మంత్రి షబ్బీర్ అలీ వంటి నికార్సైన రాజకీయ నాయకులను, ఉద్యమ నాయకులను ఈ కళాశాల ఉత్పత్తి చేసింది.
ఈ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థాయిలో వివిధ విభాగాలను జిజ్ఞాస ప్రాజెక్టులను ఉత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత విద్య కమిషనర్ చేత బహుమతులు అందుకున్నారు. నందనవనం లాంటి రాశి వనం(తొమ్మిది రాశుల మొక్కలు) అనే చక్కటి బొటానికల్ గార్డెన్ ఈ కళాశాల ఆవరణలో కొలువు తీరింది. కళాశాల ముందుభాగంలో దాదాపు ఎనిమిది ఎకరాల్లో ఏర్పాటుచేసిన రాశివనం డా.యన్.సత్యనారాయణను కళాశాలనే కాక పట్టణ ప్రజలు కూడా చిరస్థాయిగా గుర్తుంచుకునేలా చేసింది. అక్కడక్కడా కొన్ని తంగేడు మొక్కలు, ముండ్ల మొక్కలు తప్ప మరేమీ పెరిగే అవకాశం లేని రాళ్ళ నేలలో అమూల్యమైన ఔషధ విలువలు గల రాశుల మొక్కలు మొలిపించారు. దాంట్లో సగభాగంలో పండ్ల మొక్కలు నాటించారు. పూల మొక్కలు, ఉద్యానవన మొక్కలతో పాటు చుట్టూ 750 మీటర్ల పొడవైన నడక మార్గం ఏర్పాటు చేయించారు. దీని ఉన్నతికి కళాశాల అధ్యాపకులు డాక్టర్ సుధాకర్ డాక్టర్ రనజిత్ మోహన్ డాక్టర్ కృష్ణయ్య కృషి చేశారు.
ఈ కళాశాల తరగతి గదులలో తెలుగు అధ్యాపకులు కసిరెడ్డి వెంకటరెడ్డి, కేఎల్ వ్యాస్ లాంటి ప్రబుద్ధుల పాఠాలు ధ్వనిస్తుంటాయి. ప్రముఖ న్యాయవాది సురేందర్‌రావు గత దశాబ్ద కాలంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను పారితోషికాన్ని అందిస్తున్నారు.
ఈ కళాశాలలో మూడు జాతీయ సేవా పథకం విభాగాలు పనిచేస్తున్న వి.ఎన్.సి.సి రెండు విభాగాలు అందుబాటులో కలువు. 1984 నుండి జాతీయ స్థాయి పేరడుకు ఈ కళాశాల విద్యార్థులు ఎంపిక అవుతున్నారు. దీని ద్వారా పదుల సంఖ్యలో విద్యార్థులు మిలిటరీ అనుబంధ విభాగాలలో ఉద్యోగాలు సంపాదించారు.
ఈ కళాశాలలో తొలుత నుండి 1984 వరకు ప్రతి సంవత్సరం విద్యార్థి ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరిగేవి. తొలుత వేణుగోపాల్, గౌడ్ బాలరాజుగౌడ్, రంజిత్ మోహన్ వంటి ఉద్దండులు కళాశాల విద్యార్థి సంఘం అధ్యక్షులుగా కార్యదర్శులుగా కళాశాల ఉన్నతికి సేవలందించారు.
ఈ కళాశాల గొప్పదనం ఏమిటే ప్రశ్నించే వామపక్ష భావాజాలానికి, జాతీయవాద భావ జాలానికి కేంద్రంగా విద్యార్థి సంఘాలు అనేక ఉద్యమాలు నిర్వహించారు. ఈ కళాశాలకు ఏ నరసింహారెడ్డి రాజనీతి శాస్త్ర అధ్యాపకులు ఎక్కువ కాలం ప్రాచార్యులుగా కళాశాల ఉన్నతికి సేవలందించారు. వారి తర్వాత డా. కిష్టయ్య వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. 2018 సంవత్సరంలో 2 ఎఫ్ 12 బి కింద యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్, రూసా నిధుల కింద రెండు కోట్ల రూపాయలను ఈ కళాశాలకు కేటాయించారు. 70 మంది విద్యార్థులతో ప్రారంభమైన ఈ కాలేజీ వినూత్న కోర్సులతో దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 2500 మంది విద్యార్థులతో వర్ధిల్లుతోంది.
ఆ రెండు కోట్ల రూపాయలు నూతన భవనాల కోసం, కాలేజీ ఉన్నతీకరణ కోసం ఉపయోగించారు. ప్రస్తుత మీ కళాశాల 180 ఎకరాల విస్తీర్ణంలో 13 యూజీ కోర్సులు నాలుగు పీజీ కోర్సులతో నిజాంబాద్ జిల్లాలో రెండవ అతిపెద్ద కళాశాలగా మన్ననలు పొందుతూ ఎంతో మంది విద్యార్థులకు కల్ప తరువుగా జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
వాటి నాడు నేడు భవిష్యత్తులోనూ ఈ కళాశాల చరిత్ర ఘనమే. ఈ కళాశాల వారసత్వాన్ని కాపాడి కొనసాగించి భవిష్యత్ తరాలకు అందించవలసిన బాధ్యత విద్యార్థులపై ఉపాధ్యాయులపై ఉన్న ది.
ఆనాడు బి.ఎన్. రామన్ కలెక్టర్‌గా దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం, చొరవ వల్ల ఒక అద్భుతమైన విద్యా ప్రాంగణం నిర్మాణమైంది. అది దశాబ్దాలుగా విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దుతూ ఈ ప్రాంతంలో వెలుగులు నింపింది. నింపుతూనే ఉన్నది. 59 వసంతాలుగా అనేక విజ్ఞాన కుసుమాలను ఈ సమాజానికి అంతే అందజేసిన ఈ కళాశాల భవిష్యత్తులో కూడా దాని పరిమళాలను విస్తృతంగా వెదజల్లాలని దాని ఉన్నతికి విద్యార్థులు మేధావులు రాజకీయ నాయకులు తోడ్పడాలని ఆశిద్దాం.
- డా|| రవి కుమార్ చేగొని, 9866928327