Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్ర పూర్వయుగం ఆనవాళ్ళకు పేరుగొన్న మహబూబు నగర్ జిల్లాలో ఎంతో విలువైన చారిత్రక సమాచారం లభించింది. తెలంగాణ రాష్ట్రం, మహబూబ్ నగర్ జిల్లా, మూసాపేట్ మండలం నందిపేట్ గ్రామం సమీపంలోని గజ్జెలోని గుట్ట కింది భాగంలో ఉన్న పెద్దగుహ 30మీ ఎత్తున్న పెద్దబండ మీద మరొక బండరాయితో ఏర్పడింది. గుహలోనికి ప్రవేశించే మార్గం సొరంగంలాగా వుంటుంది. లోపలికి చేతుల మీద పాకుతూ వెళ్ళాలి. చివర గుహలో పది, పన్నెండు మంది నివసించేంత ఖాళీ స్థలముంది. ఈ గుహ పురా మానవుని ఆవాసమై వుంటుంది. అందులో 10మీ. ఎత్తున్న పులిగుండు మీద ఎరుపు రంగులో చిత్రించిన రాతి చిత్రాలలో పొడవైన తోక ఉన్న ఒక చిరుతపులి, దానికి ఎదురుగా విల్లమ్ములు ధరించిన వేటగాడు, అక్కడే అతనికి కుడివైపున పొడవైన కొమ్ములతో దుప్పి, దానికి ఎదురుగా పొడువాటి తోక గల జంతువు కనిపిస్తున్నాయి. చరిత్రబృందం కన్వీనర్, శ్రీ రామోజు హరగోపాల్ రాతి చిత్రాల శైలిని బట్టి చిరుతపులి, పురుషాంగంతో దుప్పి, వేటగాడు తామ్రయుగం (చాల్కోలిథిక్) లో చిత్రించినవని. రంగు నింపిన ఈ రాతిచిత్రాలు కోకాపేట రాతి చిత్రాలను పోలి వున్నాయని అభిప్రాయపడ్డారు. చరిత్ర బృందం రాతిచిత్రాల నిపుణులు బండి మురళీధర్ రెడ్డి ఈ రాతి చిత్రాలు చాల్కోలిథిక్ కాలానికి చెందినవని, గతంలో రాతి చిత్రాలలో పెద్దపులి బొమ్మలు లభించాయి కాని, ఇక్కడ చిరుతపులి చిత్రం కనిపించడం అరుదైనదని అభిప్రాయపడ్డారు.
గజ్జెలోనిగుట్ట మీద నలుచదరంగా ఉన్న ఉపరితలంపై పదుల సంఖ్యలో డోల్మన్ సమాధులున్నాయి. వీటి కొలతలు ఒక్కొక్కటి 2మీ. పొడవు, వెడల్పు 1.5మీ. పైన రాతికప్పు 2.5మీ.లుంటాయి. ప్రతి సమాధికి ముందువైపు 30.సెం.మీ. వెడల్పున్న గుండ్రని కంతలున్నాయి. పదుల సంఖ్యలో సమాధులు కూలిపోయి కనిపిస్తున్నాయి. డోల్మన్లు పెద్దరాతి (ఇనుప)యుగానికి చెందినవి. వీటిలో ఏ పురాతన అవశేషాలు లభించలేదు. ఎక్కువగా కూల్చబడడం వల్ల, వాటిలోని వస్తువులన్నీ మనుషులు తొలగించినారనిపిస్తుంది.
అదే మూసాపేట్ మండలం చెన్నంపల్లి గ్రామం దగ్గర పడిగెరాతిగుండు మీద ఎరుపురంగులో గీసిన రాతిచిత్రంలో గాడిద (గుర్రం?) మీద కుడిచేత డాలుతో, ఎడమచేత కత్తితో వీరుడున్నాడు. ఇది చారిత్రక కాలానికి చెందినటువంటిది. మొదటి చిత్రిత శిలాశ్రయానికి, రెండవ రాతి చిత్రాలతావుకు మధ్య 1 కి.మీ. దూరం మాత్రమే వుండడం విశేషం.
క్షేత్ర పరిశోధన, ఫోటోగ్రఫీ:
వేమారెడ్డి హనుమాన్ (గద్వాల), 7013036983,
విషయ నిపుణులు :
బండి మురళీధర్ రెడ్డి, 7093378522
విషయ రచన: శ్రీ రామోజు హరగోపాల్, 9949498698, కొత్త తెలంగాణ చరిత్ర బృందం