Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హేమామాలిని... డెబ్బై ఏళ్లు దాటినా ఈనాటికీ భారతీయ సినీ ప్రేక్షకుల మదిలో 'స్వప్నసుందరి' గా నిలిచే ఉంది. నిండైన వదనం, ఆకట్టుకునే చక్కని రూపం, కాలంతో పాటు తరగని అందం.. ఆమె సొంతం. 1948 అక్టోబర్ 16న చెన్నైలో పుట్టిన హేమమాలిని బాలీవుడ్ డ్రీమ్ గర్ల్‌గా గుర్తింపు పొందింది. హేమామాలినిని చూడగానే 'ఏ దివిలో విరిసిన పారిజాతమో' అనిపిస్తుంది. 'హరివిల్లు దివి నుండి దిగివచ్చినట్టూ' భావిస్తాము. అసలు బ్రహ్మ ప్రత్యేక సష్టి అని కూడా అనిపించక మానదు. 'అందానికి అందం' అన్న ఉపమానం అన్ని విధాల సరితూగే రూపం హేమామాలిని సొంతం. ఆ నాటి నుండి ఈ నాటికీ ఎంతో మంది రసికుల స్వప్నసుందరిగా రాజ్యమేలుతూనే వుంది. ఏడు పదులు దాటినా అందమంటే ఆమెదే అనే రీతిన హేమామాలిని సాగుతూ ఉండడం విశేషం! వెండితెరపై వెలిగిపోవడమే కాదు, రాజకీయాల్లోనూ హేమామాలిని తనదైన ముద్రను వేసుకుంది. నటిగా, నర్తకిగా, నిర్మాతగా, దర్శకురాలిగా, రచయిత్రిగా తనదైన బాణీ పలికించిన హేమామాలిని ప్రస్తుతం... పార్లమెంట్ సభ్యురాలిగానూ రాణిస్తోంది. ఈరోజు హేమామాలిని తన 74వ పుట్టిన రోజు జరుపుకుంటున్న సందర్భంగా ''సోపతి'' పాఠకుల కోసం అందిస్తున్న వ్యాసం.
తమిళనాడులోని శ్రీరంగంలో సాంప్రదాయ అయ్యంగార్ కుటుంబంలో జయలక్ష్మి, శ్రీశైలేశ రంగరామానుజ చక్రవర్తి దంపతులకు 1948 అక్టోబర్ 16న హేమామాలిని జన్మించింది. హేమకి కన్నన్, జగన్నాథ్ అనే ఇద్దరు సోదరులున్నారు. హేమామాలిని మద్రాసులోని ఆంధ్రమహిళాసభలో తొలుత విద్యనభ్యసించింది. ఆ తరువాత డి.టి.ఈ.ఏ. మందిర్‌లో 11వ తరగతి వరకు చదువుకుంది. అప్పటి నుంచే సినిమాల్లో నటించాలనే అభిలాషతో ఉన్న హేమామాలిని శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం సంపాదించింది. హేమామాలిని మొట్టమొదట తెరపై కనిపించింది 1963లో వచ్చిన 'ఇదు సత్తియమ్' అనే తమిళ చిత్రంలో. ఆ తరువాత సి.వి.శ్రీధర్ తన 'కాదలిక్కు నేర మిల్లై' చిత్రంలో ఓ పాత్ర కోసం పిలిచారు. కానీ, ఆమెను చూసి ''అందంగా ఉందే తప్ప, అభి నయం శూన్యం'' అనడమే కాక, సినిమా రంగా నికి పనికిరాదనీ శ్రీధర్ తేల్చి చెప్పాడు. కానీ, హేమలోని అందం అందరినీ అలరించేలా చేసింది తెలుగు సినిమా. 1965లో విడుదలైన 'పాండవ వనవాసం' పౌరాణిక చిత్రంలో ''మొగలీరేకుల సిగదానా...'' అనే పాటలో తనదైన ఆటపాటతో ప్రేక్షకులను కనువిందు చేసింది.
ఆ తర్వాత దేశరాజధాని ఢిల్లీ చేరిన హేమామాలిని అప్పటి నుంచీ హిందీ చిత్రసీమలో రాణించే ప్రయత్నం చేసింది. ఆమె అదృష్టం వల్ల తొలి హిందీ చిత్రం 'సప్నోంకీ సౌదాగర్'లో రాజ్‌కపూర్ లాంటి మేటి నటుని సరసన నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాతోనే 'డ్రీమ్‌గర్ల్' అన్న పేరు సంపా దించింది. హిందీ చిత్రసీమలో రాజ్ కపూర్‌తో నటించిన వెంటనే అప్పటి స్టైలిష్ హీరో దేవానంద్‌తో 'జానీ మేరా నామ్'లో నటించగా, ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో తరువాత దేవానంద్‌తో కలసి ''తేరే మేరే సప్నే, జోషీలా, చుప్పా రుస్తుమ్, షరీఫ్ బద్మాష్, అమిరీ గరీబ్, జానేమన్, సచ్చే కా బోల్ బాలా, అమన్ కే ఫరిస్తే'' వంటి చిత్రాలలో నటించింది. ధర్మేంద్రతో హేమామాలిని ''షరాఫత్, తుమ్ హసీన్ మెయిన్ జవాన్, నయా జమానా, రాజా జానీ, సీతా ఔర్ గీతా, పత్తర్ ఔర్ పాయల్, దోస్త్, షోలే, చరస్, జుగ్ను, త్రిశూల్, అప్నా ఖూన్, దిల్లగీ, ఆలీబాబా చాలిస్ చోర్, బఘావత్, సమ్రాట్, రజియా సుల్తాన్, రాజ్ తిలక్'' వంటి 28 చిత్రాలలో కలిసి నటించారు. వీరిద్దరి జోడీని జనం మెచ్చి బ్రహ్మరథం పట్టారు. హేమామాలిని ఇతర హీరోలతోనూ సూపర్ హిట్ మూవీస్‌లో నటించింది.
బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా రాజ్యమేలుతున్న హేమా 1970 లో తెలుగులో 'శ్రీకృష్ణవిజయం' అనే చిత్రంలో నటించి తన నాట్యంతో మురిపించింది. 1971లో వచ్చిన ''అందాజ్, లాల్ పత్తర్'' చిత్రాలు ఆమెను ప్రముఖ నటిగా నిల బెట్టాయి. 1972లో, ఆమె ''సీతా ఔర్ గీత'' లో ధర్మేంద్ర, సంజీవ్ కుమార్ల సరసన ద్విపాత్రాభినయం చేయగా, ఈ చిత్రానికి ఆమెకు ''ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటి అవార్డు'' లభించింది. ఆమె నటించిన విజయ వంతమైన చిత్రాల జాబితాలో ''సన్యాసి, ధర్మాత్మ, ప్రతిజ్ఞ, షోలే, త్రిశూల్'' ఉన్నాయి. 'ఆజాద్, దిల్లగి' చిత్రాలలో రాజేష్ ఖన్నాతో నటించింది. ''మెహబూబా, జంట హవాల్దార్'' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కాగా, 80వ దశకంలో హేమామాలిని ''క్రాంతి, నసీబ్, సత్తే పే సత్తా, రాజ్‌పుత్, అంధ ఖానున్'' వంటి భారీ బడ్జెట్ చిత్రాలలో నటించింది. వీటిలో చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమ య్యాయి. ఆమె తల్లి అయిన తర్వాత ''ఆంధీ తూఫాన్, దుర్గా, రాంకలి, సీతాపూర్ కి గీత, ఏక్ చాదర్ మైలీసి, రిహయీ, జమై రాజా'' చిత్రా లలో నటిం చింది. ఈ సమ యంలో ధర్మేంద్ర తో ఆమె నటించిన చిత్రా లలో ''అలీబాబా ఔర్ 40 చోర్, భాగ వత్, సామ్రాత్, రజియా సుల్తాన్, బాఘవత్, రాజ్ తిలక్'' ఉన్నాయి. ఆమె ''దర్ద్, బందీష్, కుద్రత్, హమ్ దోనో, రాజ్ పుత్, బాబు, దుర్గా, సీతాపూర్‌కి గీతా, పాప్ కా యాంట్'' వంటి చిత్రాలలో రాజేష్ ఖన్నాతో జత కట్టినది. వాటిలో కొన్ని చిత్రాలు నిరాడంబరమైన విజయాన్ని సొంతం చేసుకోగా, మరి కొన్ని చిత్రాలు ఘన విజయం సాదించాయి. 1990లో దివ్య భారతి, షారూఖ్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన 1992 చిత్రం ''దిల్ ఆష్నా హైని'' ఆమె నిర్మించి, దర్శకత్వం వహించింది. ఆమె తన రెండవ చిత్రం ''మోహిని'' ని నిర్మించి, దర్శకత్వం వహించింది. ఇందులో ఆమె మేనకోడలు మధుతో పాటు, సుదేష్ బెర్రీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆ తర్వాత నృత్య ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు, టెలివిజన్ రంగంపై దృష్టి సారించి, సినిమాలలో అప్పుడప్పుడు మాత్రమే పాత్రలు పోషించింది.1997లో వినోద్ ఖన్నా నిర్మించిన ''హిమాలరు పుత్ర''లో నటించింది.
హేమామాలిని కొన్ని సంవత్సరాలు సినిమాల నుండి విరామం తీసుకున్న తర్వాత, 2003లో వచ్చిన 'బాగ్బాన్' చిత్రంతో మళ్ళీ నటిగా తన కెరీర్‌ను ప్రారంభించి, ''వీర్-జారా, లాగా చునారి మే దాగ్'' చిత్రాలలో అతిథి పాత్రలు చేసింది. 2006లో బాబుల్ చిత్రంలో సహాయక పాత్రలో నటించింది. 2010లో ఆమె తన సహచరనటి రేఖతో కలిసి 'సడియాన్' చిత్రంలో నటించింది. 2011లో నిర్మాతగా తన మూడవ చిత్రం 'టెల్ మీ ఓ ఖుదా' ను నిర్మించి, దర్శకత్వం వహించింది, ఇందులో ఆమె భర్త ధర్మేంద్రతో పాటు కుమార్తె ఈషా డియోల్ కూడా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసుకోలేక పోయింది. ఇదే ఏడాది అమితాబ్‌తో కలిసి ''బుడ్డ హోగా తేరా బాప్, అర క్షణ్'' చిత్రాలలో నటించింది. 2013 లో ''మహా భారత్ ఔర్ బార్బరెక్'' చిత్రం లో, 2016 లో దేవానంద్‌తో ''అమన్ కే ఫరిష్టే'' చిత్రం లో గీత పాత్రలో నటిం చింది. 2017లో ఆమె 'ఏక్ థీ రాణి ఐసి భీ' చిత్రంలో గ్వాలియర్ కు చెందిన విజయ రాజే సింధి యా పాత్రలో వినోద్ ఖన్నాతో కలిసి నటిం చింది. ఇది ఖన్నా చివరి చిత్రమయ్యింది. ఈ చిత్రానికి గుల్ బహర్ సింగ్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సంవత్సరం ఎన్టీఆర్ నట వారసుడు బాలకృష్ణ నూరవ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో గౌతమి పాత్రలో నటించి అలరిం చింది. 2020లో రాజ్‌కుమార్ రావు, రకుల్ ప్రీత్ సింగ్‌ల చిత్రం ''సిమ్లామిర్చి''లో నటించింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో విజయవంతమైన చిత్రాలలో హేమామాలిని వయసుకు తగ్గ పాత్రల్లో నటించి, మురిపించింది.
టెలివిజన్ రంగంలో...
2000 సంవత్సరంలో పునీత్ ఇస్సార్ దర్శకత్వంలో వచ్చిన ''జై మాతా కి'' టీవి ధారావాహిక లలో మాలిని నటించింది. ఇందులో ఆమె దుర్గా దేవి పాత్రను పోషించింది. ఇతర ధారావాహికలలో ఆమె కవల సోదరీ మణులుగా నటించిన సహారా వన్‌లో కామిని దామిని, మాలిని దర్శకత్వం వహించిన నూపూర్లో ఆమె భరతనాట్యం నర్తకిగా నటించింది. మలినియల్ కూడా యుగ్ అనే కల్పిత ధారా వాహికలో నటించింది, ఇది భారత స్వాతంత్య్ర సమరయోధుల కథను, భారతదేశానికి స్వాతంత్య్రం సాధించడానికి వారి పోరాటాన్ని వర్ణిస్తుంది.
రాజకీయ జీవితం
దక్షిణాది తమిళ నాడు రాష్ట్రానికి చెందిన హేమామాలినికి సినిమా రంగంతో పాటు రాజకీయరంగంపైనా ఆసక్తి ఉండేది. దీంతో 1999లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి, తన సహ నటుడు వినోద్ ఖన్నా తరపున ప్రచారం చేసి రాజకీయ ఆరంగ్రేటం చేసింది. 2003లో బీజేపీ తరుపున హేమాను అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం రాజ్యసభకు నామినేట్ చేశారు. ఆ తర్వాత 2004లో హేమామాలిని అధికారికంగా బిజెపిలో చేరింది. 2010లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన హేమమాలిని 2014లో లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా ఉత్తర ప్రదేశ్‌లోని 'మథుర' పార్లమెంటు నియేజకవర్గం నుండి పోటీ చేసి ఆర్ఎల్డి అభ్యర్థి జయంత్ చౌదరిని ఓడించి లోక్ సభకు ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుండి 2019లో మరోమారు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా రెండోసారి ఎం.పి. గా గెలుపొందింది.
నర్తకిగా....
భరతనాట్యంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన హేమామాలిని వెంపటి చిన్న సత్యం వద్ద కూచిపూడి, కళామండలం గురువు గోపాలకృష్ణన్ వద్ద మోహిని అట్టం అభ్యసించింది. ఆమెకి శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎంతో భక్తి. ఆమె ఇస్కాన్ జీవిత సభ్యురాలు. తన నృత్యంలో ఎక్కువగా కృష్ణ భక్తి గీతాలకే ప్రాధాన్యమిస్తూ, తులసిదాస్ రామచరితమానస్లో నరసింహ, రామ వంటి అనేక నృత్య పాత్రలను పోషించింది. 2007లో దసరా సందర్భంగా మైసూరులో ప్రదర్శన ఇచ్చింది. అక్కడ ఆమె సతీ, పార్వతి, దుర్గ పాత్రలను పోషిం చింది. హేమ తన కుమార్తెలు ఈషా డియోల్, అహానా డియోల్‌లతో కలిసి స్వచ్ఛంద కార్యక్రమాల కోసం 'పరంపర' అనే ప్రొడక్షన్లో నటించింది. వారితో కలిసి కలిసి ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్లో నృత్య ప్రదర్శన ఇచ్చిన హేమ ఇప్పటికీ, తన నృత్యాభినయంతో అలరిస్తూనే.. దేశవిదేశాల్లోని అభిమానులను తన నర్తనంతో ఆకట్టుకుం టున్నా రామె. 74 ఏండ్లు పూర్తి చేసు కుంటున్నా, ఇప్ప టికీ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించడానికి తన నృత్యా భినయమే కారణమని ఆమె చెబుతూ ఉంటారు.
ధర్మేంద్ర-హేమామాలినిల వివాహం
ధర్మేంద్రతో 28పైగా సినిమాల్లో కలిసి నటించిన హేమమాలిని ఇరువురు ప్రేమించుకున్నా, వారి వివాహం జరిగిన తీరు మాత్రం చాలా ఆసక్తికరంగా జరిగింది. నిజానికి హేమమాలిని జితేంద్రను ప్రేమించారట. జితేంద్ర, హేమా మాలినిలు వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యి మద్రాస్ వెళ్లారని కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, అప్పటికే జితేంద్ర శోభతో ప్రేమలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మేంద్ర శోభని తీసుకుని మద్రాస్ వెళ్ళడం.. శోభ ఒత్తిడితో జితేంద్ర, హేమల పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత కొంతకాలానికి ధర్మేంద్ర, హేమమాలినిలు పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే ధర్మేంద్రకి అప్పటికే వివాహం కావడం, హిందూ మత ఆచారాల ప్రకారం రెండో పెళ్లి చేసుకోవడం కుదరకపోవడంతో ధర్మేంద్ర ఇస్లాంని స్వీకరించి 1980లో హేమమాలినిని పెళ్లిచేసుకున్నారు. ఆ తర్వాత వారిద్దరికీ ఇషా డియోల్, అహనా డియోల్ అనే ఇద్దరు కూతుళ్ళు జన్మించారు. అయితే ధర్మేంద్ర కంటే ముందు హేమామాలినికి ప్రేమ ప్రపోజ్ చేసింది సంజీవ్ కుమార్, జితేంద్రలు. ఈ డ్రీమ్ గర్ల్‌ని పెళ్లి చేసుకోవాలని వీరిద్దరూ తహతహ లాడినవారే. కాగా, 'షోలే' సినిమా చిత్రీకరణ సమయంలో హేమామాలిని ప్రేమలో పడ్డ ధర్మేంద్ర ఆమెని పెళ్లి చేసుకున్నాడు.
జీవిత చరిత్ర పుస్తకాలు
బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న దక్షిణాదికి చెందిన హేమమాలిని జీవిత చరిత్ర పై ఇప్పటి వరకు మూడు పుస్తకాలు ప్రచురించబడ్డాయి. వాటిలో 2005 లో రామ్ కమల్ ముఖర్జీ ''హేమ మాలిని-దివా అన్వెయిల్డ్'', 2007 లో భావన సౌమ్య ''హేమ మాలిని-ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ''. 2017 లో రామ్ కమల్ ముఖర్జీ ''హేమ మాలిని-బియాండ్ ది డ్రీమ్ గర్ల్''
2005లో ముఖర్జీ మొదట ప్రచురించిన హేమామాలిని: దివా అన్వెయిల్డ్, హేమామాలిని జీవితంపై కాఫీ టేబుల్ బుక్, అది వాణిజ్యపరంగా, విమర్శనాత్మకంగా ప్రాచుర్యాన్ని పొందలేక పోయింది. దీని తర్వాత 2007లో హేమామాలిని జీవితం గురించి మరొక పుస్తకం వచ్చింది. చలనచిత్ర పాత్రికేయురాలు, రచయిత్రి భావన సౌమ్య రాసిన ''హేమామాలిని: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ'' హేమ జీవిత చరిత్ర పుస్తకం, ఇది హేమామాలిని జీవితం, యాభై ఏళ్ల సినీ, రాజకీయ జీవితాన్ని వివరించింది. భావన సౌమ్య రాసిన ఈ పుస్తకంలో తన మొదటి పుస్తకంలో వివరించని అనేక అంశాలు ఉన్నాయని గ్రహించిన ముఖర్జీ పూర్తి వివరాలతో కూడిన మరో పుస్తకాన్ని వెలువరించాలని హేమామలినిని సంప్రదించి ఆమె జీవితంలోని అన్ని అంశాలను వివరిస్తుందని వాగ్దానం చేసి, ''హేమ మాలిని: బియాండ్ ది డ్రీమ్ గర్ల్'' అనే పుస్తకాన్ని వెలువరించగా, ఈ పుస్తకం విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
అవార్డులు, పురస్కారాలు
హేమమాలిని నటిగానే కాకుండా, దర్శకురాలిగా, నిర్మాతగా, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్‌గా రాజకీయవేత్తగా పనిచేసిన తన కెరీర్లో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డుకు 11 సార్లు నామినేట్ చేయబడగా, అందులో 1972లో ''సీతా ఔర్ గీత'' చిత్రంలో కవల-సోదరీమణులుగా నటించినందుకు ఒకసారి మాత్రమే ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకుంది. 2000 సంవత్సరంలో సినిమాలకు చేసిన కృషికి ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకుంది. అదే సంవత్సరం భారతదేశ నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన ''పద్మశ్రీ'' అవార్డుకు ఎంపికయ్యింది. 2012లో ''నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్'' చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఇదే ఏడాది సర్ పదంపట్ సింఘానియా విశ్వవిద్యాలయం హేమామాలినికి భారతీయ సినిమాకు చేసిన సేవలకు గుర్తింపుగా గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.
1998 లో 18వ ఉజాలా సినిమా ఎక్స్‌ప్రెస్ అవార్డులలో గెస్ట్ ఆఫ్ హానర్ అవార్డు,
2004 లో 'స్పోర్ట్స్ వరల్డ్' బాగ్బన్ చిత్రంలోని నటనకు అమితాబ్ బచ్చన్‌తో పాటు హేమా ''జోడి ఆఫ్ ది ఇయర్'' అవార్డు అందుకున్నారు.
2004 లో ఐకాన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం.
2004 లో భారతీయ సినీపరిశ్రమకు చేసిన కృషికి గుర్తింపుగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ హేమామాలిని కి ''లివింగ్ లెజెండ్ అవార్డు''ను ఇచ్చి సత్కరించింది.
2006లో ఢిల్లీలో ''సోపవరి అకాడమీ ఆఫ్ మ్యూజిక్ అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్'' సంస్థ హేమా కు శాస్త్రీయ నృత్యానికి చేసిన సేవకు గాను 'విశిష్ట' అవార్డు ప్రదానం చేసింది
2007లో బ్యాంకాక్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో హేమ మాలిని నటించిన అనేక చిత్రాలను ప్రదర్శించారు.
2009 లో పూణే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జీవితకాల సాఫల్య పురస్కారం ప్రదానం
2010లో రజనీకాంత్ లెజెండ్ అవార్డు
2010లో రాజీవ్ గాంధీ అవార్డు
2011లో అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు
2012లో ఏషియన్ అచీవర్స్ అవార్డ్స్‌లో 'ఇంటర్నేషనల్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు'
2012లో బాలీవుడ్ ఫెస్టివల్లో నార్వే ప్రభుత్వం పోస్టల్ స్టాంప్ విడుదల
2012లో కళ మరియు సాంస్కృతిక రంగానికి అత్యుత్తమ సహకారం అందించినందుకు ''భరత్ ముని సమ్మాన్'' అవార్డు
2013లో భారతీయ సినిమాకు ఆమె చేసిన కృషికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ''ఎన్టీఆర్ జాతీయ అవార్డు''ను అందుకుంది.
2018 లో లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డ్స్‌లో ''లక్స్ గోల్డెన్ రోజ్ ఐకానిక్ బ్యూటీ ఓవర్ ది డికేడ్స్ అవార్డు'' ను గెల్చుకుంది.
2021లో 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ''ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు''తో సత్కరించబడింది.
(అక్టోబర్ 16న హేమామాలిని 74వ పుట్టినరోజు సందర్భంగా..)
-పొన్నం రవిచంద్ర, 9440077499