Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనోహర్కి మనోహర్ అని పేరుంది కానీ మనిషి మనోహరంగా యేమీ ఉండడు. మనిషికి అందం కన్నా తెలివి ముఖ్యం అనే వాళ్లున్నారు కదా కానీ మనోహరానికి అదీ లేదు. అమాయకుడు నోట్లో నాలిక ఉన్నా వాడుకోవడం తెలీనివాడు. అందం చందం లేదు. తెలివీతేటా లేదు. గాడిద కొడుక్కి అని తండ్రి తిడుతూ వుండేవాడు. ఇండైరెక్టుగా తనని తాను తిట్టిపోసుకుంటున్నానని తెలీక.
తెలివి తక్కువ వాళ్ళు ఏమేం తెలివి తక్కువ పనులు చేస్తారో అవన్నీ చేసేవాడు మనోహరుడు. వీడి అవకతవక పనులు తట్టుకోలేక తండ్రి ఓ నాడు వాడి వీపు విమానర మోత మోగించేడు దుడ్డుకర్రతో. నువ్విక జన్మలో బాగు పడవు ఇంకో ఏడయితే పాతికేళ్ళు వస్తయి. ఏం చేసుకోను అని తిట్ల దండకం చదివాడు.
మనోహరుడు ఏడుస్తూనే 'నేనింత తెలివి తక్కువ వాడ్ని ఎందుకయ్యాను' అన్నాడు. 'ఎందుకో నాకేం తెలుస్తుంది. వెళ్ళి దేవుడ్నడుగు' అంటూ మనోహర్ని ఇంట్లోంచి గెంటేసి తలుపు వేసుకున్నాడు తండ్రి.
తండ్రి అన్నమాట వాడి బుర్రలోకి దూరిపోయింది. అవును తను ఇంత తెలివి తక్కువ వాడవటానికి దేవుడే కారణం వెళ్ళి ఆ దేవుణ్ణే అడిగేస్తాను. సంగతి తేల్చుకుని కానీ గడప తొక్కను అంటూ బయల్దేరేడు దేవుడనే వాడ్ని పట్టుకుందామని.
మనోహరుడు ఊళ్ళూ, వాడలూ, పేటలూ, పట్నాలూ గాలించాడు. మనుషులంతా దేవుడు దేవుడు అంటూ దేవుళ్ళాడుతుండే వాడ్ని కాలర్ పట్టుకుని అడగాల్సింది అడిగేద్దామని.
అలాగలాగ తిరుగుతూ తిరుగుతూ ఓ చీమలూ, కాకులూ దూరే అడవి లోకి వెళ్ళాడు. దేవుడి కోసం తెగ వెదుకుతుంటే తనలాగే దేవుడికోసం వెదుకుతున్న సన్యాసి కనిపించేడు ఓ చెట్టు కింద. కిందికి సాగిన గడ్డమూ పైకి లేచిన జుట్టూ మూసుకున్న కళ్ళూ ఉన్న సన్యాసి ముందు చేతులు కట్టుకు నిలబడ్డాడు. ఈయనే దేవుడా అని అనుమానపడ్డాడు. ఆ ముఖంలో సూర్య కిరణాల వెలుతురు చూసి సన్యాసి కండ్లు తెరిచాడు. వెంటనే మనోహరుడు ఆయన కళ్ళల్లో కళ్ళుపెట్టి 'నువ్వేనా దేవుడివి?' అన్నాడు. 'నేను దేవుడ్నేమిట్రా ఆ దేవుడి కోసమే తపస్సు చేస్తుంటే' అని అరిచాడు సన్యాసి. ఆ అరుపుకి జడుసుకుని అక్కడ్నించి పారిపోయాడు మనోహరుడు.
దేవుడి కోసం దేవుళ్ళాడుతూ అంతా మహిమ గల దేవుడు, కోరిన కోరికలు తీరుస్తాడు అని చెప్పుకుంటున్న గుళ్ళోకి వెళ్ళేడు. లోపల చప్టామీద రాతిబొమ్మకు అందరూ దండాలు పెడుతు న్నారు. లెంపలు వేసుకుంటున్నారు. ఈయన దేవుడా మరి రాయి లాగా నిలబడ్డాడేం ఉలుకూ పలుకూ లేకుండా. తను దేవుడ్ని అడగదల్చుకుంది అడగడం ఎలా అనుకున్నాడు. అంతమంది జనంలో ఎవరితో మాట్లాడతాడు. ఎవరూ లేనప్పుడైతే కదుల్తా డేమో, మాట్లాడ్తాడేమో అనుకున్నాడు. ఎవరికీ కనపడకుండా వెళ్ళి దేవుడి వెనక నక్కి దాక్కున్నాడు.
గంటలూ, చెంపలూ వాయించడం మాని జనం వెళ్ళిపోయారు. పూజారి కూడా గుడికి తాళం వేసి డ్యూటీ అయిపో యిందనుకుంటూ నిష్క్రమించాడు. నేతి దీపం వెలుతురులో ఒంటరిగా దొరికిన దేవుడ్ని ఊపుతూ అడిగాడు మనోహర్ 'నువ్వు దేవుడివే కదా' అని. దేవుడు బదులివ్లలేదు. విసుగు లేకుండా అడిగాడు మనోహర్ అనేక సార్లు అదే ప్రశ్నను. అయినా అందరూ దేవుడన్నవాడు పలకలేదు. ఉలుకూ పలుకూ లేనివాడు దేవుడు కాడనుకున్నాడు మనోహరుడు వెనకవైపు నుంచి బయటపడ్డాడు.
మళ్ళీ దేవుడి కోసం బయల్దేరేడు మనోహరుడు. అలా వెళ్తూ ఉంటే ఓ పట్నం కనిపించింది. ఏ పట్నంలో ఏ దేవుడున్నాడో ఎవరికెరుక అనుకుంటూ జనంలోకి జొరబడ్డాడు.
ఒక చోట జనం గుంపులుగా కనపడ్డారు. ఇక్కడే ఎక్కడో దేవుడు ఉండి ఉంటాడు. తనలాగే వీళ్ళంతా దేవుడ్ని చూడ్డానికి వచ్చి ఉంటారు అనుకున్నాడు మనోహరుడు. వాడి ఆలోచననను బలపరుస్తూ అక్కడ ఉన్న కొందరు 'ఆయన మా దేవుడు' 'ఆయన మా దేవుడు' అని అరవసాగారు.
'అబ్బ! ఇన్నాళ్ళకి దొరికాడ్రా దేవుడు!' అని సంబరపడ్డాడు మనోహరుడు.
'ఎక్కడ ఎక్కడీ దేవుడు ఎక్కడీ' అనడిగాడు మనోహరుడు.
'చూడు ఎంత మంది జనం. వందల్లో కాదు వేలల్లో కాదు లక్షల్లో. అంతా ఆ దేవుడ్ని చూడ్డానికే వచ్చారు. అంత తేలిక కాదు దేవుడు కనపడ్డం' అన్నాడొకడు. ఒక చోట ఓ గుంపు ఒకణ్ణి చెట్టుకు కట్టి బాదుతున్నారు, దేంతో పడితే దాంతో.
'వాణ్ణి ఎందుకు బాదుతున్నారు?' అనడిగాడు మనోహరుడు ఒకడ్ని. 'వాడు మన దేవుడ్ని తిట్టాడు. దేవుడ్ని తిడితే ఊరుకుంటామా, మళ్ళీ మళ్ళీ తిడతాం ఇంకా ఇంకా బూతులు తిట్టీ తిట్టీ అలిసిపోయేక చెట్టుకి కట్టి కొడుతున్నాం. మా దేవుడ్ని ఎవరూ పల్లెత్తు మాట అనడానికి వీల్లేదు. మా దేవుడు నంబర్ వన్. మా దేవుడు మాకు తండ్రి. మా తండ్రి కోసం అంగీలు చించుకుంటాం. పెట్రోలు పోసుకుని ఒళ్ళు కాల్చుకుంటాం. ఏం చెయ్యమన్నా చేస్తాం. ఎవడి మీద బురద చల్లమంటే వాడ్ని బురదలో ముంచెత్తుతాం. ఎవడ్ని తన్నమంటే వాడి మక్కెలిరగదంతాం' అన్నాడు వాడు పూనకం వచ్చి ఊగిపోతూ.
అంతమంది జనంలో దేవుడ్ని చూడలేనని వెనక్కి తిరిగి వస్తూ అడిగాడు మనోహరుడు ఓ భక్తుడ్ని. ఆ దేవుడి పేరేమిటని. వాడు మనోహరుడుని పైకీ కిందకీ చూస్తూ 'సినిమాలు చూడవా?' అన్నాడు. నువ్వు మా హీరో అభిమానివి కాదా? అన్నాడింకొకడు. ఇక అక్కడ ఉంటే దేవుడికి బలయిపోతానని, దేవుడ్ని చూడాలనే ఆలోచన మానుకుని ఇంటి దారి పట్టాడు మనోహరుడు. డాన్సులూ, ఫైట్లూ చేసే దేవుడ్ని కళ్ళారా చూడలేకపోయాడు పాపం మనోహరుడు!!!