Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లిపి లేని ఆదిమానవులు రాతి యుగానికి, చరిత్ర రాయగల తరువాత యుగాలకు మధ్య వారధి కట్టిన మరో కాలం ఉంది. అందులో లిపి తప్పటడుగులు వేసింది. ఆ కాలాన్ని ఆది చరిత్ర లేదా Proto - History గా పిలుస్తారు. తప్పటడుగులతో పాటూ అర్థం కాని మాటల్లా, అక్షరాలా అనిపించే కొన్ని గుర్తులు అక్షర మాలలా రాయబడ్డాయి. అందువలన లిపి లేని అ కాలానికీ ఆనాడు వారు వేసిన చిత్రం, శిల్పమే మనకు వారి జీవన విధానాన్ని తెలిపాయి. ఈ ఆది చరిత్ర సమయం క్రీ.పూ. 2100 నుంచీ క్రీ.పూ 1750 వరకూ లెక్క కడతారు.
ఆగ్నేయ భారతంలో మొదటగా ఈ కాలపు గుర్తులు కనిపించాయి. మొదట కన్పించింది హరప్ప అనే ప్రాంతంలో అవటం వలన, దీనికి హరప్ప సంస్కృతి అనీ, మొహంజదారో అనే ప్రాంతంలో ప్రాముఖ్యంగా కనిపించడం వలన మొహంజదారో సంస్కృతి అనీ, అది సింధు లోయ అవటం వలన సింధు లోయ చరిత్ర అనీ ఈ కాలానికి పేరు పెట్టారు. British వారి కాలంలో ఆ ప్రాంతంలో రైలు మార్గం వేస్తున్నప్పుడు, ఒక ఇంజనీరుకి కొన్ని ముద్రలు దొరికాయట. ఆపై అక్కడ తవ్వకాలు చేసి మొత్తం విషయ సేకరణ చేసారు. ఆ తరువాత గంగా తీరంలో, హిమాలయాల పాదాల వద్ద కూడా కనుగొన్నారు.
హరప్ప - మొహంజదారో కాలానికి జీవన శైలి ఎంతో అభివృద్ధి చెందింది. వారి ఇండ్ల కట్టడాలు ఇందుకు సాక్ష్యం. వీరు ఉత్తర, దక్షిణం, తూర్పు పడమర దిక్కులు లెక్క కట్టి నడిచే వీధులు, వాటికి అనుగుణంగా ఇండ్లు కట్టారు. భట్టిలో కాల్చిన ఇటుకలు వాడారు. ఇంటికి ఎత్తైన గోడలు, మరుగు స్థలం, మధ్యన చతురస్త్రపు సావిడి, వంటగడి, స్నానపు గది, నీటి కాల్వలు (Drainage) ఏర్పరచిన పద్ధతి చూస్తే ఎంతో పద్ధతిగా వీరు కుటుంబ జీవనం గడిపారని తెలుస్తుంది.
గుజరాత్లోని లోథల్ (Lothal) అనే ప్రదేశంలో ఆనాటి ఒక స్థావరం శిథిలావస్థలో కనుగొనబడింది. ఈ ప్రదేశాన్ని పరిశీలించిన పరిశోధకులు కొన్ని కొత్త విషయాలు కనుగొన్నారు. అది ఒక ప్రాతిపదికలో కట్టబడిన చిన్న పట్టణం. ఇండ్లు, సౌకర్యాలతో పాటు అక్కడ ఒక పెద్ద చతురస్త్రపు నీటి తొట్టి కనుగొనబడింది. దీనికి కొన్ని నీటి కాల్వలు తవ్వి సముద్రంతో కలుపబడింది. ఇది వారి ఓడరేవు అయి ఉంటుంది. పక్కనే వస్తువుల ఎగుమతి, దిగుమతులల్లో సామాన్లు భద్రపరిచే స్థలం, అలాగే దానిని ఆనుకుని ఒక market, దుకాణాలు ఉన్న ప్రాతిపదికలు కన్పించాయి. ఆ పక్కనే లోహపు పని చేసే భట్టీలు, ఆలు చిప్పలు వంటి వస్తువులతో పూసలు, ఆభరణాలు చేసే చిన్న భట్టీలు కన్పించాయి. అవి వారి కళా నైపుణ్యతను, వ్యాపార దక్షతను తెలియజేస్తున్నాయి. ఆ స్థలాలు దొరికిన వస్తువులని పక్కనే ఒక మ్యూజియం (museum) ఏర్పాటు చేసి భద్రపరిచారు. అందులో చిన్న తరాజు, గురివింద గింజంత తూనిక / కొలతల రాళ్లు కూడా కనిపిస్తాయి. పూజల ఆభరణాలు, ఎర్రమట్టిపై నల్ల డిజైన్లు వేసిన కుండలు, మట్టి పాత్రలు, మట్టి బొమ్మలు అన్నీ అక్కడ చూడ వీలుంది. ఆ కాంలో వారు మృత దేహాలను పాతి పెట్టగా దొరికిన అస్థి పంజరాల తీరును బట్టి అప్పుడు నాలుగు రకాల తెగల వారు జీవించి ఉండేవారనీ తెలుస్తుంది. అంటే సంఘంలో వైవిధ్యం కూడా ఉండవచ్చు.
హరప్పా మొహిం జదారో సంస్కృతిలో ఎన్నో రాతి విగ్రహాలు చెక్కబడ్డాయి. అన్నీ అతి చిన్నవి. అతి పెద్దది 40 సెం.మీ. మాత్రమే. వారు వాడిన రాయి చూస్తే వారు దిగుమతి చేసుకుని చెక్కిన రాయి అనీ అర్థం అవుతుంది. అక్కడ దొరికిన రాయితో పనిముగించలేదు. అంటే వారు సౌందర్యపిపాసులు కూడా. మందమైన ముఖ కవళికలు, గడ్డం, తలకు కట్టిన పట్టీ, ఒక భుజంపై కప్పిన అంగవస్త్రం, ఆలుచిప్ప ముక్క అమర్చిన చికిలించిన కళ్లు, నిజ రూపానికి దగ్గరగా ఉన్న ఈ శిల్పం మతగురువుది అయి ఉండవచ్చు. పద్మాసనంపై కూర్చున్న మరో మట్టి శిల్ప నిజరూపానికి దగ్గరి శిల్పం.
ఎన్నో స్త్రీ శిల్పాలు కూడా కనిపించాయి. ఇవి ఏమీ నిజ రూపాలకు దగ్గరగా చెక్కినవి కాదు. మట్టి శిల్పాలు అయితే గర్భిణీ స్త్రీ గానో, లేదా బిడ్డనెత్తుకునో కనిపిస్తాయి. అందుకని ఇవి దేవీ మాతృక శిల్పాలు అయి ఉండవచ్చు అని మన పరిశోధకుల ఊహ. అందుకు మరో కారణం అక్కడ దొరికిన మరికొన్ని శిల్పాలు, యోని పీఠం, అంగం ఆకారాల్లో ఉన్న శిల్పాలు. అలాగే పెంపుడు జంతువుల వరుసలో చెక్కిన ఎద్దు ఆకారాలు. ఇవి అన్నీ సృష్టికి ప్రతి రూపాలుగా కళా చరిత్ర గుర్తిస్తుంది. అందువలన వారికి కళా నైపుణ్యమే కాదు, ఒక భావనతో వారు కళలను తయారు చేసారని అర్థం అవుతుంది.
ఆనాడు లోహంతో చేసిన స్త్రీ శిల్పం ''నాట్యసుందరి'' `- Dancing girl గా ప్రఖ్యాతి పొందిన శిల్పం. పలుచని శరీరంతో, నడుముపై చేయి, ఒక కాలు ముందుకు పెట్టి జీవ కళతో ఉంటుంది. ఆమె తలకట్టు, ముఖ కవళికలు ద్రవిడ సంప్రదాయాన్ని గుర్తు చేస్తే, ఆమెకు ఉన్న ఆభరణాలు భారతీయ సింధు సంస్కృతిని గుర్తు తెస్తాయి.
ఆ నాటి సింధు సంస్కృతికి ముఖ్యమైన మరో గీటురాయి, వారు వాడిన ముద్రలు (seals) వేసే పలకల తయారీ. ఒకరి నుంచీ మరొకరికి సామాన్లు పంపినపుడు,
లేదా ఎగుమతి దిగుమతులల్లో వారి వారి గుర్తులను వస్తువులపై వేసే పరికరాలు ఈ పలకలు. ఎన్నో రకాల ముద్రల పలకలు బయటపడ్డాయి. ఆ పలకలపై కొన్ని చిత్రాలు చెక్కి, అక్షరాల వంటి గుర్తులు అన్నీ ఎవరివి వారే నిర్ణయించు కుంటారు. దీనిని బట్టి ఆలోచిస్తే ఆనాటికే వ్యాపారం ఎంతగానో అభివృద్ధి చెందిందన్న మాట. ముద్రలపై ఉన్న అక్షరాల వరుస మనం చదువలేకపోయినా లిపి రాతకు ఇదే నాంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పలకలపై ఉన్న చిత్రాలు ఆనాటి సాంఘిక, సాంస్కృతిక పరిస్థితికి అద్దం పడుతు న్నాయి. పెంపుడు జంతు వులు, వ్యవసాయం లో ఉపయోగ పడే జంతువులు అయిన ఆవు, ఎద్దు ఆకారాలను నిజరూపాలకు దగ్గరగా చెక్కారు. ఆనాటికే పాడి పంట సాగు చేసే పని బాగా వృద్ధి అయి ఉండవచ్చు. ఆ పశువులను దగ్గరగా గమనించి చిత్రిం చారని ఊహించవచ్చు. మరికొన్ని ముద్రల్లో ఒంటికొమ్ము
జంతువు (unicorn) చిత్రించి కనిపించింది. ఆ తరువాత కాలాల్లో ఆ గుర్తు జైన మత సంబంధ చిహ్నంగా అయింది. మరో ముఖ్యమైన బొమ్మ ఉన్న ముద్ర కనిపించింది. పశువుల కొమ్ములతో చేసిన కిరీటం ధరించి ఆసనంపై కూర్చుని ఉన్న పురుష రూపం ఎన్నో ఊహలకు దారి ఇచ్చింది. అతని రెండు పాదాలు ఒక దానికి ఒకటి తాకించి చేతులు మోకాళ్లపై ఉంచి యోగాసనంలో కూర్చుని ఉండగా, సగం మానవ ఆకారం సగం పశువు ఆకారంలా కనిపించే ఆ పురుషుని చుట్టూ ఏనుగు, పులి, ఖడ్గమృగం, ఎద్దు జంతువులు చెక్కి వున్నాయి. ఈ ఆకృతిని పశుపతికి మొదటి రూపం అనీ, ఆ పై కాలాలల్లో వచ్చిన శివారాధనకి మొదటి చిత్రంగా ఊహించారు. యోని పీఠం, అంగం వంటి శిల్పాలు కూడా కనిపించటం వలన, ఈ ఆలోచన చేసారు.
ఆ పురుషుడి ఆసనంపై జింక బొమ్మలు చెక్కి ఉండటం, ఇంతకుముందే కొన్ని వారి ఆకుల చిత్రాలు కనిపించటం చూసి, ఇవి బౌద్ధ మతానికి పూర్వ రూపాలని ఊహించారు పరిశోధకులు. ఆనాడు ఈ మూడు మతాలు కలిసి ఒకే ఆలోచనగా ఆనాటి సంస్కృతిలో ఉన్నా, రాబోయే కాలానికి ఇవి నాంది పలికి ఉండవచ్చు.
చిత్ర కళ మూగది. కానీ బలమైన భావ ప్రకటన కలది. విషయాన్ని ఎన్నో కోణాలల్లో వివరించి చెప్పగలదు. వాక్యం తన కోణాన్ని మటుకే చెపితే, చిత్రం మన కోణాలు కూడా ఆలోచించుకోవటం కోసం మౌనంగా ఉంటుంది.
- డా|| ఎం.బాలమణి, 8106713356