Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచంలో అతివేగంగా విస్తరిస్తున్న రంగం ఏదైనా ఉంది అంటే సాంకేతిక రంగం అని చెప్పచ్చు. గ్రామీణ స్థాయి నుంచి మొదలుకుని దేశంలో ఏమూలన ఉన్న విషయమైనా అరక్షణంలో తెలుసుకునేంత వీలుగా అంతర్జాలం అల్లుకు పోయింది. ఒకప్పుడు పత్రికల్లో, టీవీల్లో వచ్చే వార్తలను బట్టే మనచుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకునే వీలుండేది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ప్రపంచాన్ని చుట్టేసి రావచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంటర్నెట్ వాడనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు నేడు నెట్‌ను వినియోగిస్తున్నారు. ఇంకా చదువు, ఉద్యోగం, ఉపాధి కోసమని ఎల్లలు దాటిన వారితో కూడా మన పక్కనే ఉన్నట్టుగా వీడియోకాల్‌లో మాట్లాడటం చూస్తూనే ఉన్నాం. మనిషి బతకడానికి శరీరంలో అవయవాలు ఎంత ముఖ్యమో నేడు సమాజంలో అంతర్జాలానికి అంత ప్రాధాన్యత ఉన్నది. అంతగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ప్రజల జీవన విధానంలో భాగమైంది. అసలు అంతర్జాలం అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది?.. దాని ఉపయోగమెంత?. నష్టమెంత..? తెలుసుకునేందుకే ఈ వారం 'సోపతి' ప్రత్యేక కథనం...
అంతర్జాలంను ఇంగ్లీష్‌లో ఇంటర్నెట్గా పిలుస్తాం.ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లను కలిపే వ్యవస్థను ఇంటర్నెట్ అంటారు. ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఇకదానితో ఒకటి మాట్లాడుకు నేందుకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తారు. దీన్ని ఇంకాస్త లోతుగా అర్థం చేసుకోవాలంటే ఒక ఊరు లేదా వీధి నుంచి మరో వీధికి వెళ్లాలంటే దారి అవసరం. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లాలంటే రెండు ఊర్లను కలిపే దారులుంటాయి. అక్కడి నుంచి పట్టణానికి వెళ్లేందుకు మరో రోడ్డు, ఆ చోటు నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు హైవే ఉంటుంది. ఈ వీధులు, రహదారులు జాలరివాడి వలలాగా కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే దేశంలో ఎన్నో ఊర్లను కలిపే రైల్వే మార్గాలున్నాయి. దీన్ని మనం పటంలో చూస్తే అల్లికల్లాగా గజిబిజీగా ఉంటాయి. దీన్ని రైల్వే నెట్వర్క్ అంటాం. మనకు స్వాతంత్య్రం రాకముందు రైలు మార్గాలను ప్రయివేటు కంపెనీల ద్వారా నడిపింది బ్రిటీష్ ప్రభుత్వం. అనేక రైళ్లు ఒక రైలుకు మరో రైలుకు ఇబ్బంది లేకుండా పట్టాల మీదుగా నడిచేవి. ఈ రకం ఏర్పాటునే 'అంతర్‌వలయం' అంటారు. అనేక దేశాల ఉమ్మడి సంస్థలకు పేర్లు పెట్టాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్‌లో 'ఇంటర్' అనే పదాన్ని వాడతాం. అదే విధంగా అనేక వలయాలని ఉమ్మడిగా ఉపయోగించినప్పుడు 'అంతర్ వలయం' లేదా 'ఉమ్మడి వలయం' అని పిలవచ్చు. పైన చెప్పుకున్నట్టు ఇంటర్నెట్ను వలతో పోల్చినప్పుడు వలని జాలం అని, పట్టేవాడిని జాలరి అన్నట్టుగానే, రైలు మార్గాల అమరికని అంతర్జాలం అని వాగే వారిని అంతర్‌జాలరులు అని కూడా అంటారు. అందుకే ప్రపంచంలో ఉన్న కంప్యూటర్లు అన్నీ కూడా అంతర్జాతీయంగా అల్లుకుపోయిన వలలాగా కనిపిస్తాయి. అందుకే దీన్ని ఇంటర్నెట్గా చెబుతారు.
ఎలా పనిచేస్తుంది..?
ఇంటర్నెట్ అనేది కంప్యూటర్లకు సమాచారం చేరవేసే సాధనం. అన్ని కంప్యూటర్లకు అందుబాటులో ఉండే కమ్యూనికేషన్ టెక్నాలజీ సాధనమే ఇంటర్నెట్. నెట్ ఓపెన్ చేసి గూగుల్ అని టైప్ చేస్తే చాలు ఏ సమాచారమైనా ఇట్టే తెలుసుకోవచ్చు. ఇప్పుడు ప్రభుత్వ, ప్రయివేటు, బ్యాంకింగ్ రంగాలే కాదు చిన్న సంస్థల నుంచి మొదలుకుని కిరాణా దుకాణాల వరకు తమకు అవసరమైన సాంకేతికాన్ని వాడుతున్నారు. ఇంటర్నెట్ పని చేయాలంటే మెషిన్లు, శాటిలైట్లు, సర్వర్లు, కంప్యూటర్లు అవసరం. ఒకదానితో మరొకటి అనుసంధానించిన అసంఖ్యాకమైన సాఫ్ట్్వేర్ ప్రోగ్రామ్‌లు దీన్ని నడిపిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంప్యూటర్లలో నిక్షిప్తమైన నెట్వర్క్ ఇవన్నీ నెట్లో భాగాలే. ప్రతిరోజూ కోట్లాది మంది సమాచారాన్ని తీసుకునే అధునాతనమైన కమ్యూనికేషన్‌గా ఇది పని చేస్తుంది.
ఎక్కడ పుట్టింది..?
అమెరికాకు చెందిన నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఈ నెట్‌వర్క్‌ను మొదట ప్రారంభించింది. 1973లో ఇంగ్లాండ్, నార్వే మధ్య ప్రపంచ మొట్టమొదటి కమర్షియల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ప్రారంభమైంది. 1982లో ఇంటర్నెట్ ప్రోటోకాల్ అన్న మాట వాడకంలోకి వచ్చింది. 1896లో స్థాపించబడిన జపాన్ కమ్యూనికేషన్స్ రీసెర్చ్ లాబొరేటరీ, టెలీ కమ్యూనికేషన్స్ అడ్వాన్స్మెంట్ ఆర్గనైజేషన్‌తో 2004లో విలీనం అయినప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఎన్ఐసీటీ) స్వతంత్ర పరిపాలనగా స్థాపించబడింది. ఎన్ఐసీటీ ప్రధాన లక్ష్యం సమాచారం, సమాచార సాంకేతిక రంగంలో పరిశోధన చేయడం, తద్వారా మరింత అభివృద్ధి పరచడం. జపాన్ రెడియో చట్టం ఆధారంగా గ్లోబల్ మారిటైమ్ డిస్ట్రెన్ సిస్టమ్ (జీఎండీ ఎస్ఎస్), మెరైన్ రాడార్ కోసం రేడియో పరికరాల రకం ఆమోద పరీక్షలను నిర్వహించడం, అయానోస్పియర్, అంతరిక్ష వాతావరణంపై సాధారణ పరిశీలనను అందించడం, అలాగే జపాన్‌లో ఉన్న తక్కువ ప్రీక్వెన్సీ టైమ్ సిగల్ రేడియో స్టేషన్ (జేజేఐ)ని కూడా నిర్వహిస్తుంది. ఆగష్టు 2015 చివరలో, సంస్థ అభివృద్ధి చేసిన టెరాహెర్ట్ రేడియోషన్ స్కానర్ ఈఎస్ఎ జూపిటర్ ఐసీ మూన్స ఎక్స్‌ప్లోరర్ ద్వారా తీసుకువెళ్లే పరికరాలలో ఒకటిగా ఉంటుందని ప్రకటించబడింది. ఇది 2022 అంటే ఈ ఏడాదిలో ప్రారంభించబడుతుంది. మనదేశంలో ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో చాలా పరిశోధనలు చేస్తున్నారు. రాకెట్లను నింగిలోకి పంపి కొత్త టెక్నాలజీని కనుక్కొంటున్నారు. మార్కెటింగ్‌లో ఇంటర్నెట్ ద్వారా నిమిషానికి వేల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ప్రపంచానికి కావాల్సిన సమాచారం అవలీలగా మనకు లభ్యమవుతుంది.
విస్తరిస్తున్న ఇంటర్నెట్..
సాంకేతికరంగంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు డబ్బులున్నవారి దగ్గరే కంప్యూటర్ వాడకం ఉండేది. ఇప్పుడు తమ పిల్లల చదువులు, ఉద్యోగాలు, ప్రిపరేషన్స్ అన్నీ ఇంటర్నెట్తో ముడిపడి ఉన్నందున ప్రతి ఇంట్లో ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ అనేది నిత్యావసరంగా మారింది. పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నెట్వర్క్ వల్ల అనేక కంపెనీలు పోటీపడి మరీ నెట్‌వర్క్‌ను అందజేస్తున్నాయి. పీసీలకు మొబైల్ఫోన్లకు ఇంటర్నెట్ వేగాన్ని వివిధ రకాలుగా 100ఎంబీపీఎస్ నుంచి మొదలుకుని 2జీ, 3జీ ఇప్పుడు 4జీ, 5జీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చాయి. కొన్ని నెట్‌వర్క్‌లు అన్లిమిటెడ్ డేటాతో కూడా ఆఫర్లు ఇస్తున్నాయి. 2019లో ఆస్ట్రేలియా అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని నమోదు చేసింది. సెకనుకు 44.2 టెరాబైట్స్ (టీబీపీఎస్). 2021 జులైలో జపాన్‌కు చెందిన ఎన్ఐసీటీ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ) ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ను విజయవంతంగా పరీక్షించి రికార్డు నెలకొల్పింది. దీని ద్వారా సెకనుకు 319 టైరా బైట్స్ స్పీడ్‌తో ఇంటర్నెట్ సేవలు అందించవచ్చని తేల్చారు. 2020లో ఇది 178 టెరాబైట్ సెకన్‌గా నమోదైంది. ఈ ప్రయోగంలో అత్యాధునిక పైబటర్ ఆప్టిక్ టెక్నాలజీతో పాటు స్టాండర్డ్ అవుటర్ డయామీటర్, 4-కోర్ ఆప్టికల్ పైబర్‌ను ఉపయోగించారు. అలాగే ఎర్బియం, థులియం కలయికతో రూపొందించిన ఫైబర్ యాంప్లిఫయర్, రామన్ యాంప్లిఫికేషన్ ద్వారా 3,001 కిలోమీటర్ల సుధీర్ఘ దూరం ఇంటర్నెట్ను ట్రాన్స్మిట్ చేశారు.
వరల్డ్ వైడ్ వెబ్...
ఉదాహరణకు ఒక ఊరిలో మామిడిపండ్లు నిల్వ చేసిన గిడ్డంగి, మరో చోట సరుకులు, ఇంకో ప్రదేశంలో బియ్యం ఇలా అన్ని చోట్ల ఉన్న గోడౌన్లకు బండి వచ్చి వాటిని రవాణా చేస్తూ ఎగుమతులు, దిగుమతులు చేసి దాచేందుకు గిడ్డంగులు ఉంటాయి కదా. ఇలాగే ప్రపంచ వ్యాప్తంగా అల్లుకుపోయిన గిడ్డంగులను 'విశ్వ వ్యాప్త గిడ్డంగులు' అల్లిక అందాం. ఇదే ఇంగ్లీష్‌లో 'వరల్డ్ వైడ్‌వెబ్' అవుతుంది. ఇక్కడ వెబ్ అన్న పదం 'స్పైడర్ వెబ్' లాంటి ప్రయోగం కనుక్కున్నప్పటికీ దీన్ని తెలుగులో 'సాలె గూడు' లేదా 'సాలె పట్టు' అంటాం. రైలు పట్టాలు లేకుండా కేవలం గిడ్డంగులు ఉంటే ఏం లాభం?. అలాగే సరుకులు ఉండి గిడ్డంగులు లేకుండా ఏం ఉపయోగం? అంటే రైలు మార్గం లాంటి ఇంటర్నెట్, అల్లుకుపోయిన గిడ్డంగినే సాంకేతిక పరిభాషలో వరల్డ్ వైడ్ వెబ్‌గా చెబుతాం. ఇప్పుడు రైలు మార్గాలకు బదులు ప్రసార మార్గాలు అనుకున్నట్లయితే దీన్ని బాగా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. మనదగ్గర ఉన్న సమాచార వలయాన్ని ఇంటర్నెట్లో వెబ్‌పేజీకి అటాచ్ చేస్తే ఇతరులతో పంచుకోవాలనుకున్న వ్యాసాలు, కథలు, ఛాయాచిత్రాలు, పాటలు ఇతరత్రా మన కంప్యూటర్లోని మనం కేటాయించుకున్న 'గిడ్డంగి'లో పెడితే అవన్నీ కూడా సమాచార వలయం ద్వారా అందుబాటులోకి వస్తాయి. మనం ఇతరులతో పంచుకోవాల్సిన సమాచారాన్ని, లేదా దాచాల్సిన సమాచారాన్ని నిల్వ చేసుకునే స్థలాన్ని 'మన వెబ్సైట్' అంటారు. ఈ వెబ్‌సైట్‌కు పేజీలను పుస్తకంలా అమర్చుకుంటే చదివేవారికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనికి ముఖ పత్రం అంటే 'హోమ్ పేజీ' వస్తుంది. వెబ్సైట్లో హోంపేజీకి వెళ్తే వెబ్‌పేజీని కూడా సృష్టించుకోవచ్చు.
వెబ్‌సైట్‌కూ అడ్రస్..
ఇండ్లకు చిరునామాలు ఎలాగో వెబ్సైట్లకూ అడ్రస్లుం టాయి. చిరునామాలో వ్యక్తి పేరో, సంస్థ పేరుతో పాటు ఊరు, పేరు, ప్రాంతం, దేశం అన్ని వస్తాయి. కానీ వెబ్సైట్ చిరునామాని URL (univerce resource locator) అంటారు. ఉదాహరణకు https://web.archive. org/web/20170926174924/http://friendsoftelmgu.org/ అనేది తీసుకుందాం. ఇందులో http అనేది ఇది ఏ రకం వెబ్సైటో చెబుతుంది. అంటే వెబ్సైట్లలోనూ రకాలుంటాయన్న మాట. ఇంగ్లీష్‌లో (domain name) అంటారు. దీన్ని తెలుగులో 'ఇలాకా పేరు' అని చెప్పొచ్చు. దీన్ని ఇంకాస్త అర్థవంతంగా చెబితే అధికార పరిధి అని అర్థం. ఎక్కువ దీనిని వ్యాపార సంస్థలకు కేటాయించారు. విద్యా సంస్థలు వాడేవాటిని 'డాట్ ఇడియు' (.edu) అంటారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు బయటి ఇలాకా పేరు తర్వాత ఆయా దేశాల పేర్లు, రెండక్షరాల సంక్షిప్త రూపంలో వాడతారు. ఇండియాలో ఉన్న సంస్థల పేర్ల చివర 'డాట్ ఇన్' (.in) అని ఉండటం గమనించే ఉంటారు. ఇక నుంచి తెలుగులోనూ వెబ్సైట్ డొమైన్ పేరు రాసుకోవచ్చు. విదేశీ డొమన్లపై లాభపేక్షలేని సంస్థ 'ద ఇంటర్నేషనల్ కార్పోరేషన్ ఫర్ ఆసియాన్డ్ నేమ్స్ అండ్ నంబర్స్' (ఐసీఏఎన్ఎన్) భారత్‌కు చెందిన ఏడు భాషలకు ఆమోదం తెలిపింది. ఆంగ్లేతర భాషల్లోనూ డొమైన్ల పేర్లకు ఆహ్వానం పలికిన ఆ సంస్థ తెలుగు, హిందీ, తమిళం, బెంగాళీ, ఉర్దూ, గుజరాతీ, పంజాబీ భాషలనూ అనుమ తించింది. ఇంటర్నెట్కు డొమెయిన్ నేమ్‌కు, ప్రోటో కాల్ (IP) అడ్రస్ మధ్య తేడా ఉంటుంది. మనుషులకు మధ్య తేడాలున్నట్టే యంత్రాలకు (IP) అడ్రస్ అర్థమయ్యే విధంగా రూపొందించింది. ఐపీ అడ్రస్‌కు ఉదా హరణలు .192.168.0.167, .203.178.193.23 ఈ సంఖ్య మనకు అర్థమయ్యేందుకు సృష్టించింది కాదు. కానీ ప్రతీ కంప్యూటర్‌కి ఈ రకం సంఖ్యలు కేటాయించబడి ఉంటాయి.
ఇంటింటా.. నెట్
మనం జీవించడానికి హృదయానికి శ్వాస ఎంత ముఖ్యమో జీవన విధానానికి ఇంటర్నెట్ అంతా ప్రాధాన్యత గా మారింది. ఏది కావాలన్నా, ఏం చేయాలన్నా ఇంటర్నెట్ తప్పనిసరి. చేతిలో మొబైల్ ఫోన్, ఇంట్లో కంప్యూటర్ ఉంటే చాలదు. దీనికి నెట్ అవసరం. ఇప్పుడు అనేక కంపెనీలు సెల్ టవర్, ఫైబర్ఆక్ట్, బ్రాడ్‌బ్యాండ్ ద్వారా ఇంటర్నెట్ను అందిస్తున్నవి. దీన్ని ఉపయోగించుకుని ఇంట్లోనే ఉండి ఇప్పుడు అన్ని రకాల సేవలు పొందుతున్నారు. ఒకప్పుడు మార్కెట్‌కు వెళ్తే తప్ప మనకు ఇంట్లోకి వస్తువులు వచ్చేవి కావు. కానీ ఇప్పుడు ఆమెజాన్లాంటి సైట్లో సరుకులు నేరుగా ఇంటికే తెప్పించుకోవచ్చు. ఇదంతా వినిమయ సంస్కృతిలో ఒక భాగమైపోయింది. ఇంకా చెప్పాలంటే మనం ఎక్కడికైనా టూర్ వెళ్లాలన్నా బస్ టికెట్స్ నుంచి విమానం టికెట్ వరకు ఇంటర్నెట్లో బుక్ చేసుకోవచ్చు. గతంలో ఆకలైతే మెస్‌కు వెళ్తే గానీ భోజనం దొరకని పరిస్థితి. ఇప్పుడేమో ఎలాంటి ప్రదేశంలో ఉన్నా, ఏ సమయంలోనైనా నెట్ ద్వారా ఫుడ్ ఆర్డర్‌చేస్తే అరగంటలో మన ముందుంటుంది.ఒకప్పుడు పబ్లిసిటీ కోసం ఎక్కువ బ్యానర్లను వాడేవారు. సాంకేతిక అభివృద్ధి తర్వాత ప్లెక్సీలను వాడుతున్నారు.ప్లెక్సీలు రావడం ద్వారా పెయింటర్స్ ఉపాధి కోల్పోయారనే విమర్శ లేకపోలేదు. నెట్ ఉంటే చాలు మనకు కావాల్సిన పద్ధతిలో ఇష్టమైన రీతిలో సౌకర్యవంతమైన సేవలు మాత్రం చాలావరకు పొందవచ్చు. ఆన్లైన్లో ఇప్పుడు విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు వారికి కావాల్సిన సర్టిఫికెట్స్ తీసుకుంటున్నారు. చివరకు అత్యవసరమైన మందులు కూడా ఫార్మసీ సైట్లో ఇంటికే తెప్పించుకునే అవకాశం ఇప్పుడుంది. ఇంటర్నెట్ అభివృద్ధి అయిన తర్వాత ఇంజినీరింగ్ వ్యవస్థ కూడా మరింత వేగం పుంజుకుంది. ఇండ్లు కూడా తమకు నచ్చినట్టు సైట్స్‌లోకి వెళ్లి వారి ప్లానింగ్ ద్వారా నిర్మించుకుంటున్నారు. ఇలా అనేక రకాల సౌకర్యాలు, సేవలు నెట్ ద్వారా పొందే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ప్రయివేట్ సెల్ నెట్‌వర్క్‌లు ఇష్టారీతిన ఫ్రీక్వెన్సీ పెంచడంతో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ రోజురోజుకీ నిర్వీర్యం అవుతోంది. జియో, ఎయిర్టెల్ లాంటి కార్పొరేట్ కంపెనీలకు కేంద్రమే వెన్ను దన్నుగా నిలవడం పట్ల పలు విమర్శలు వ్యక్తమౌతు న్నాయి. అలాగే ఇంటర్నెట్ అందు బాటులో ఉండడంతో వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్టా, ట్విట్టర్, టెలి గ్రామ్, ఈ మెయిల్స్ ఎక్కువ వాడటంతో తపాలా రంగం పైనా తీవ్ర ప్రభావం పడింది.
వెబ్ బ్రౌజర్..
వెబ్ బ్రౌజర్ అంటే కంప్యూటర్ యుగానికి ముందే ఈ మాట ఇంగ్లీష్ భాషలో వాడుకలో ఉంది. గ్రంథాలయానికి వెళ్లినప్పుడు, పుస్తకాల దుకాణానికి వెళ్లినప్పుడు కానీ మనం సాధారణంగా అట్టమీద బొమ్మ చూసో, పేరు చూసో ఒక పుస్తకాన్ని గుర్తుపట్టి చూస్తాం. తర్వాత తిరిగి మళ్లీ బీరువాలో పొందుపరుస్తాం. చూస్తాం.. మళ్లీ పెట్టేస్తాం.. దీన్నే 'బ్రౌజింగ్' అంటారు. దీన్ని తెలుగులో చూడటం, పరిశీలించడం, వీక్షించడంగా చెప్పచ్చు.
- నమిలికొండ అజయ్‌కుమార్