Authorization
Mon Jan 19, 2015 06:51 pm
75 ఏండ్ల తెలంగాణ ఉద్యమ పోరాటంలోని తొలి, మలి దశల ఉజ్వల ఘట్టాలు ఊహకందని పోరాట పంథాలను అనుసరించి తమ లక్ష్యసాధనను అడ్డుకోవాలని చూసిన పాలకవర్గాల దిమ్మ తిరిగేలా, గద్దె దిగి సామాన్యుల వద్దకు వచ్చేలా చేసింది. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎనలేని త్యాగాలను చేసిన యోధులకు కాకిరెట్టలపాలై కాలం అలల దెబ్బలకు శిథిలమైపోయే కంచు, సిమెంట్ బొమ్మల సాంప్రదాయాన్ని పక్కకు నెట్టింది. అక్షరాల్లో వారి ఆత్మలను నిక్షిప్తంచేసి, అజరామరంగా నిలబెట్టాలన్న దృఢ సంకల్పంతో ఒక సామాన్యుడు తీసుకున్న దీక్షలో నుంచి ఈ బృహత్ గ్రంథం నెలవంకలా పొడిచింది. మరి ఆ సంకల్పం తీసుకున్న వాడేమైనా పేరుగడించిన కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలల్లో డిగ్రీలకు డిగ్రీలు చదువుకున్నవాడా? వర్గ, వర్ణ, ధన ఆభిజాత్యంతో పాపం! లౌక్యం ఎరుగని కవులకు నాలుగు కాసులు విదిల్చి పదుగురి సమక్షంలో ఘనమైన వేదికల మీద గ్రంథాలను అంకితం పుచ్చుకోవడానికి అచ్చేయించినవాడా? పుట్టుకతో ధనవంతుడా? ఇవేవీ లేనివాడు. కేవలం తను పుట్టిన మట్టి మీద గుండెల్లో పిడికెడు అనుబంధాన్ని నాటుకుని లోలోపలే వటవృక్షంగా పెంచుకున్నవాడు. సామాజికంగా అట్టడుగు మట్టి పొరల్లో నుంచి మర్రి విత్తనంలా మొలుచుకొచ్చినవాడు...
అటువంటి సామాన్యుడు తన మనసులో ఎన్నాళ్ళు, ఎంత ఆలోచనా మధనాన్ని సాగించాడో!? ఎంత శారీరక శ్రమకు లోనయ్యాడో? బంగారం మెరవాలంటే నిప్పుల కుంపటిలో దాన్ని పుటం పెట్టాలన్నట్టు తనకు తనే, తన చరిత్రకు తానే అక్షరాలయాన్ని నిర్మించాలని దీక్ష తీసుకున్నాడు. అందులో జాతిరత్నాలను ప్రతిష్టించాలి అనుకున్నాడు. నిజంగా ఒక సామాన్యుడు తల్చుకుంటే ఎంత అసామాన్య చరిత్రను సృష్టించగలడో ససాక్ష్యంగా ఈ 'నిప్పులవాగును' ఉప్పెనలా మన ముందు పారించడంతో కృతకృత్యుడయ్యాడు.
ఆ అసామాన్య సామాన్యుడు మరెవరో కాదు లోక కవిగా మనమెరిగిన మన అందెశ్రీనే...!
''ఈ నిప్పులవాగు' 75 ఏండ్ల కాలగతిలో 1306 పేజీల ప్రవాహంలో మలి, తొలి ఉద్యమాలకు చెందిన 790 మంది కవులు, 790 పాటలు, వచన కవితలు ఉద్యమాన్ని కదం తొక్కించిన తీరు సంపుర్ణంగా ఆవిష్కృతమైంది. మొత్తం గ్రంథాన్ని నాలుగు ఖండికలుగా విభాజితం చేశారు. అవి వరుసగా (1) తెలంగాణ మలి దశ ఉద్యమ పాట (2) మలిదశోద్యమ కవిత (3) 1969 ఉద్యమ పాట (4) సాయుధ తెలంగాణ ఉద్యమ పాట. ఈ 'నిప్పులవాగు'లో కణకణలాడుతూ ఎలి బూడిద పట్టని కణికల్లాంటి కొన్ని పాటలను, కొన్ని వచన కవితలను జాగ్రత్తగా తాకి చూసి, వాటి ఉష్ణ తీవ్రతను తెలుసుకుందామన్న నా చిరు ప్రయత్నమే ఈ వ్యాసం.
తెలంగాణ మలిదశ ఉద్యమ పాట:
ఈ బృహత్ గ్రంథాన్ని తెలంగాణ రాష్ట్ర గీతమైన ''జయ జయహే తెలంగాణ...''తో ఆరంభించడం ఎంతైనా ముదావహం. అదీ ఈ గ్రంథానికి కర్త, కర్మ, క్రియా అన్నీ తానే అయిన అందెశ్రీ రాసిందే కావడం ఓ మంచి ఆరంభంగా చెప్పుకోవచ్చు.
పన్నెండు చరణాలుగా విరచితమైన ఈ గీతంలో... ''ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం/ తరతరాల చరితగల తల్లీ నీరాజనం'' అంటూ తెలంగాణ తల్లి స్తుతితో ఆరంభించిన కవి, ఆ వెంటనే జాతిజనుల నాలుకల మీద చిరంజీవులై నిలిచిన పంపన, బద్దెన, భీమన, హాల, సోమన, గోపన, మల్లినాథ, ధిష్టాగ, పోతన మొదలైన మహాకవులను స్మరించుకున్నారు. వారి తరువాత ఈ నేలను ఏలిన రాజులను, రాణులను వారి రాజ్యాలను తల్చుకున్నారు. ఆ తరువాత బళ్ళను, గుళ్ళను, జీవ నదులను, కళామూర్తులైన జానపదులను గుర్తుచేసుకున్నారు. అట్లా తెలంగాణ సమగ్ర స్వరూపాన్ని పటం కట్టి మనకు చూపించారు. గళమెత్తి దశదిశలూ హోరెత్తిపోయేలా వినిపించారు.
మరొక మంచిపాట కె.వి.నరేందర్ రాసిన 'నువ్వులేని నీ పాట' ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించే సందర్భంలో అమరులైన వారిని స్మరించుకుంటూ రాసింది.
నువ్వులేని తెలంగాణ ఎవడి కోసం/నీ ఉనికి లేని ఉద్యమాలు ఎవడి కోసం బలిదానం గొప్పకాదు.. త్యాగమంటే చావుకాదు/ రామున్నే నిలదీసిన రామదాసు వారసులం/ నిజామోన్ని ఎదురొడ్డిన వీరులకే వారధులం/నరనరాన తెలంగాణ కవితవై వినిపించు/ మరణమే ఇల శరణమని ఉత్తరాలు రాయొద్దు.
రాముడంతటి దేవుణ్ణే తేడావస్తే నిలదీసి కడిగేసిన రామదాసు బాటమనది. నిజామును తరిమికొట్టిన చరితమనది. అటువంటి యోధులం పిరికివాళ్ళ మాదిరిగా మరణవాంగ్మూలాలు రాయొద్దు అని గొప్ప పాటను ఉద్యమానికి అందించిన కె.వి.నరేందర్ కవిగా ఒక స్ఫూర్తిదాయక పాత్రను పోషించారని చెప్పవచ్చు.
మలి దశోద్యమ వచన కవిత:
''వాళ్ళు కష్టపడ్డర్సార్...'' ఈ కవిత రాసింది ఏనుగు నరసింహారెడ్డి. ఎవరు ఏ విధంగా కష్టపడతారో, ఆ కష్టంలో వున్న గమ్మత్తేంటో తేట తెల్లంగ వివరించిన బలమున్న కవిత ఇది. వాళ్ళు... కోనసీమ కొబ్బరాకులమ్మి/ ప్రజాపురంలో పత్తితోట కొంటరు/ కుడికాలువ ఎడమ కాలువల్ని/ రెండున్న జిల్లాలకు మల్పుకొని/ ముక్కారుపంటల రైతన్నలైతరు/ ఫ్యాక్టరీల మిషతో ద్రవ్యసంస్థల్ని ముంచేసి, నింపాదిగ జండాలేపేస్తరు.. వాళ్ళు కష్టపడ్డర్సార్...
ఈ పాట తెలియజేసే క్రమంలో వాళ్ల కపటత్వాన్ని, మనవాళ్ళ అమాయకత్వంతో కూడిన మంచితనాన్ని హృద్యంగా విప్పి చెప్పిన ఈ కవి ప్రాత:స్మరణీయుడు.
''గన్ పార్క్'' - ఈ కవిత రాసింది ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్. కవిత ఎలా ప్రారంభమై, ఎలా పరుగులు తీసి, ఎలా ముగిసిందో మనసు పెట్టి చదవండి!
స్థూపం మాటలై మాట్లాడుతుంది/ పాటలై పాడుతుంది/ స్థూపాన్ని తగిలితే/ సలసల కాగే విద్యార్థుల నెత్తురై/ చురుక్కు మంటుంది/ గుండెలకు హత్తుకుంటే/ బిడ్డలను కోల్పోయిన తల్లిలా/ బోరుమంటుంది/ కాళ్ళకు మొక్కితే తెలంగాణ పోరాట తొవ్వను చూపుతుంది/ తెలంగాణ సాధన కోసం అమరులైన యోధుల స్మారక స్థూపాన్ని ఆలంబనగా చేసుకున్న కవి ఎంత బలమైన కవితను, ఎంత సూటిగా చెప్పారో! అర్థం చేసుకోవచ్చు.
1969 ఉద్యమ పాట:
ఈ ''తెలుగు సోదరి'' గేయ రచయిత పేరు 'గిరి' 69 అని మాత్రమే ఇచ్చారు. బహుశా ఇతను ఒక అజ్ఞాత కవి కావచ్చు నేమో! కవి అజ్ఞాతమా! ఔతమా మనకు అవసరం లేదు. ఒకానొక చారిత్రక దశలో అక్షరాన్ని ఆయుధంగా మల్చుకుని స్వలాభం, కీర్తి కాంక్ష లేకుండా కదన రంగంలో దూకిన కలం యోధులందరినీ మనం 'వీరగల్లులు'గా నిలుపుకోవాలి, కొలుచుకోవాలి, గౌరవించుకోవాలి. ఈ కవి అసలు చరిత్ర దొరికితే బాగుండు. ఏ యుద్ధంలోనైనా వేతనాలకు పనిచేసే సిపాయిలకన్నా, ఆ ఉద్యమంతో ముడిపడి వున్న బడుగు జీవులు ఎందరో అజ్ఞాతంగా కదనరంగంలో దూకి స్థానికంగా దొరికే పనిముట్లనే ఆయుధాలుగా చేసుకుని పోరుసాగించిన వీరులే ఎక్కువగా వుంటారు. వారు ఎటువంటి కీర్తి ప్రతిష్టలు ఆశించకుండానే జాతిజనుల కోసం రక్తం పారబోస్తారు. ఆ త్యాగాల ఫలితంగా గద్దెలనెక్కిన నాయకులు, వాళ్ళ చరిత్రను శోధించి, అక్షర బద్ధం గావించే కార్యక్రమాన్ని చేపట్టిన దాఖలా ప్రపంచం మొత్తంలో ఎక్కడా మనకు కనబడదు.
కవి ఈ పాటను అనాడే స్త్రీ ప్రధానంగా ఎంత గొప్పగా రాశాడో! చదువుతుంటే సంతోషంతో పులకింతకు లోనవుతాము.
పాటను చదవండి! పగవారల పొగరణచగ పరాక్రమము తోడ యుద్ధ భూమిలోన విహరించెడు 'రుద్రమ్మ'వు నీవమ్మా! అబలవని అధైర్యమేల? సబలనంచు చాటవమ్మ/ తెలంగాణ సాధనకై తెలుగువీర పౌరులతో 'కత్తి దూసి కదలిరావే'. చూశారా! ఈ గేయాన్ని కవి ఎంత గొప్పగా రాశాడో.. వారికి ఈ జాతి ఏమిచ్చి రుణం తీర్చుకోగలదు. అందెశ్రీ లాంటివారు కొందరు పూనుకోని అందిస్తే ఇలా చదవడం తప్ప..
మరొక మంచిపాట ''తెలంగాణ వస్తుంది'' రచన మంత్రి శేషభూషణ్. పాట పది చరణాలుగా సాగుతుంది. తెలంగాణ వస్తుంది. తొలి వెలుగులు ఇస్తుంది/ మన జీవన పయనంలో మంచి మలుపు వస్తుంది. ఈ కవి ద్రష్ట కాబట్టే నలభై ఏండ్ల తరువాత తెలంగాణ కచ్చితంగా వస్తుందని, వచ్చిన తరువాత అది ఎట్లా ఉండబోతుందోనని కూడా ముందుగానే చెప్పాడు. నిజంగా అట్లాగే జరిగింది. అందుకే మరి కవి క్రాంతదర్శి అంటారు.
సాయుధ తెలంగాణ పోరాట పాట:
''తెలంగాణ తొలి అమరత్వం'' ఇది పాట శీర్షిక, కవి కా.కె.ఎల్.నరసింహారావు. ఈ పాట నేపథ్యాన్ని ఒకసారి పరిశీలిస్తే నిజాం కాలంలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాత తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రభుత్వం తరుపు నుంచి జరిగిన మొట్టమొదటి మరణం దొడ్డి కొమరయ్యది. ఆ ఘటనను పాటగా కూర్చి రాసిన కవి అమరుని పట్ల తన సంతాపాన్ని వ్యక్తం చేయడం కన్పిస్తుంది.
అమరజీవివి నీవు కొమరయ్యా అందుకో జోహార్లు కొమరయ్యా అంటూ పల్లవిని అందుకున్న కవి ఆ వెంటనే న్యాయమనునది లేని నైజాము రాజ్యాన/ విశ్వరాక్షసుడైన విసు నూరు దేశముఖు/ పాలించు చున్న యా పల్లె కడివెండిలో ప్రజల హక్కుల కొరకు కొమరయ్యా/ ప్రాణాలనిచ్చావు కొమరయ్యా/ అంటూ అతని మరణం ప్రాముఖ్యతను ఎత్తిచూపాడు.
నిను బలిగొన్నట్టి నీచులను దునుమాడి/ నినుగన్నయట్టి యీ తెలుగు గడ్డను మేము/ స్వాతంత్య్రముగ జేసి, శాంతించెదమెగాని నీ పేరు నిలుపకనే కొమరయ్యా/ నిదురైనపోమోయి కొమరయ్యా/ అంటూ కొమరయ్య మరణానికి ప్రతిగా నిజాము కబంధ హస్తాల నుంచి తెలంగాణను విముక్తం చేస్తామని శపథం తీసుకోవడంతో ముగిస్తాడు కవి.
ఇంకా ఈ విభాగంలో తిరునగరి రామాంజనేయులు, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, వయ్య రాజారాం, వానమామలై వరదాచార్యులు, కాళోజీ, దాశరథి, నల్ల నరసింహులు, కోగంటి గోపాల కృష్ణయ్యలాంటి ఎందరో ఉద్ధండులు రాసిన ఎన్నో పాటలున్నాయి.
మొత్తం మీద ఈ పుస్తకాన్ని తీసుకురావడంలో అందెశ్రీ పడిన శారీరక, మానసిక, ఆర్థిక శ్రమ విలువ కట్టలేనిది. తెలంగాణ ఉద్యమం పట్ల ఆర్తి ఉంటే తప్ప ఇంత శ్రమించి పుస్తకాన్ని తేవడం సాధ్యం కాదు. అందెశ్రీ సాహసం, తెలంగాణ బిడ్డడు ఏదైనా అనుకుంటే సాధించేదాకా విశ్రమించడని ఈ పుస్తకాన్ని వెలువరించడం ద్వారా మరోసారి నిరూపించి నట్టయ్యింది. అందుకు అతనితో పాటు ఈ యజ్ఞంలో అతనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు.
- శిరంశెట్టి కాంతారావు, 9849890322