Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నైనిటాల్... ఉత్తరాఖండ్‌లోని హిమాలయ శ్రేణులలోని కుమావొన్ హిల్స్ మధ్య భాగంలో ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతం అందమైన సరస్సులకు నెలవు. 'నైనీ' అంటే నయనం, 'తాల్' అంటే సరసు. కంటి ఆకారం కలిగిన ఉన్న పర్వత శిఖరాల మధ్య ఉన్న ఈ ప్రదేశం సముద్రమట్టానికి 2084 మీటర్ల (6,837 అడుగుల) ఎత్తున ఉంది. ప్రశాంత వాతావరణం ఉండటంతో ఈ ప్రాంతాన్ని టూరిస్టులకు స్వర్గధామంగా చెప్పవచ్చు.
చూడదగిన ప్రదేశాలు...
రాజభవన్.. ఉత్తరాఖండ్ గవర్నర్ నివాసం. 113 గదులతో అందమైన తోట వంటివి ఉన్నాయి. దీనిని బకింగ్ హాం పాలస్ తోపోలుస్తారు. ఈ భవన ప్రవేశానికి ముందస్తు అనుమతులు కావాలి.
కిల్బరీ... నైనిటాల్ నుంచి 10 కి.మీ. ల దూరంలో ఉన్న అందమైన పిక్నిక్ ప్రదేశం కిల్ బరీ. పచ్చటి ఓక్, పైన్, రోడోడెండ్రాన్ అడవులతో ఈ ప్రాంతం చక్కటి విశ్రాంతి ప్రదేశంగా ఉంటుంది. ఈ అడవులలో సుమారు 580 జాతులకు పైగా వివిధ రకాల వృక్ష జాతులు, రంగు రంగుల పక్షులు ఉన్నాయి. సముద్ర మట్టానికి 2481 అడుగుల ఎత్తున ఉంటుంది. నైనిటాల్లో రెండవ అత్యధిక ఎత్తు కలిగిన ప్రాంతం.
నైనా దేవి ఆలయం... నైనిటాల్ పేరుకు కారణమైన నైనాదేవి ఆలయం ఒక శక్తి పీఠం అని చెపుతుంటారు. నైని లేక్ కు ఉత్తరదిశగా ఉంది.
చైనాశిఖరం... నైనా శిఖరాన్ని చైనా శిఖరం అని కూడా అంటారు. ఇది నైనిటాల్లో ఎత్తైన శిఖరం. సముద్ర మట్టానికి 2611 మీ. ల ఎత్తున ఉంటుంది. దీనిని చేరాలంటే, గుర్రం పై వెళ్ళాలి. ఇక్కడే ఒక ఎకోకేవ్ గార్డెన్ ఉంది. ఇది మరొక పేరొందిన ప్రధాన ఆకర్షణ.
రోప్... రోప్ వే మరోకి ప్రసిద్ధ టూరిస్ట్ ఆకర్షణ. ఇది కుమావొన్ మండల వికాస్ నిగం చే నిర్వహించబడుతోంది. ఇది ఇండియాలో స్థాపించబడిన మొదటి కేబుల్ కార్. సుమారు 705 మీటర్ల దూరం 300 మీ.ల ఎత్తున కవర్ చేస్తుంది. ప్రతి కేబుల్ కార్ 12 మందిని మోయగలుగుతుంది.
నైనీ సరసు... నైనిటాల్లో నైని సరస్సు ప్రధానాకర్షణ. చుట్టూ పచ్చని కొండలతో కన్ను ఆకారంలో వుంటుంది. ఈ సరస్సుపై ఒక వంతెన, దానిపై ఒక పోస్ట్ ఆఫీస్ వుంటాయి. సమీపంలో ఒక బస్సు స్టేషను, టాక్సీ స్టాండ్, రైల్వే రిజర్వేషన్ల కౌంటర్, షాపింగ్ సెంటర్లు ఉన్నాయి.
ఖృపాతాల్ సరస్సు... నైనిటాల్‌కు 10కిలోమీటర్ల దూరంలో దూరంలో రోడ్డుమార్గంలో లేక 5కిలోమీటర్ల దూరంలో ఎత్తులో ఖృపాతాల్ సరస్సు (ట్రావెల్ లేక్) ఉంది. ఇది సముద్రపు మట్టానికి 1,635 మీటర్లు (5,364 అడుగులు) ఎత్తులో ఉంది.
నౌకుచియా సరస్సు... నైనిటాల్‌కు 4కిలోమీటర్లు దూరంలో అలాగే భీమ్తాల్ సమీపంలో 1,200 మీటర్లు ఎత్తులో ఉంటుంది. కిలోమీటర్ పొడవు, 0.5 కిలోమీటరు వెడల్పు, 40మీటర్లు లోతులో ఉండే ఈ సరస్సుని ఇక్కడి అత్యంత లోతైనదిగా చెబుతారు.
ఇంకా హనుమాన్ ఘరీ, ఘోరకల్, అరబిందో ఆశ్రమం, పాన్గోట్, బారా బజార్, స్నోవ్యూ, గుహలతోట, హార్స్‌రైడింగ్, పాంగోట్, గుర్నీ హౌస్, సరియతాల్, టండి సడక్, పారా గ్లైడింగ్, బోటు హౌస్, టిఫిన్ టాప్, జంతుప్రదర్శన శాల, ట్రెక్కింగ్ వంటి ఎన్నో ఆసక్తిదాయకమైన, ఆకర్షణీయమైన ప్రదేశాలు ఉన్నాయి.
రవాణా....
ఢిల్లీ, అల్మోర, రానిఖేట్, బద్రినాథ్‌ల నుంచి బస్సు సర్వీసులున్నాయి. రైలు మార్గం ద్వారా అంటే... సుమారు 23 కి. మీ.ల దూరం లోని కాత్గోడం రైల్వే స్టేషన్ ఉంది.ఇక్కడికి లక్నో, ఆగ్రా, బారేలీల నుంచి రైళ్ళ రాకపోకలున్నాయి. 55 కి. మీ. దూరంలో పంత్ నగర్ ఎయిర్పోర్ట్ నైనిటాల్‌కు సమీప ఎయిర్పోర్ట్. న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్‌కు విమానాలు ఉన్నాయి.