Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హన్మంతుణ్ని చెయ్యబోతే బోడకోతైంది. మారువేషం వేస్తే ఉన్న పదవి ఊడేటట్లుందని లత్కోర్ అనుకొన్నాడు.
మహామంత్రి జాడ చెబుతానంటూ విలేకరులను హోటల్‌కు పిలిచాడు. వారి ముందు తన మారు వేషాన్ని విప్పాడు.
''మీరు మారు వేషమెందుకు వేసారు'' అని విలేకరులడిగారు.
''నా ప్రభుత్వం గురించి ప్రజలేమంటున్నారో తెలుసుకోవడానికి''
''ఇక ముందు కూడా ఇలాగే మారువేషాలేస్తారా?''
''వేస్తాను''
''మారు వేషం వల్ల ప్రజలు మీ గురించి ఏమనుకొంటున్నారో తెలిసిందా?''
''కొంతవరకు తెలిసింది''
''ఏం తెలిసింది''
''ఏం తెలిసిందో మీకు చెప్పాల్సిన అవసరం లేదు''
''దోమల నిర్మూలనకు మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది''
''దోమలకు ఫ్యామ్లీ ప్లానింగ్ చేయిస్తున్నాం. జెనాలకు చవగ్గా దోమతెరలిస్తున్నాం.''
''రోజూ కరెంటు కోత బెడుతున్నారు. జెనాలను చీకట్లోనే ఉంచుతారా?''
ఎందుకుంచుతాం. జెనాలకు కందిళ్లు ఇస్తున్నాం. ఎక్కాలి స్తున్నాం. ఎక్కబత్తిని రూపాయికీ కందిలిబత్తిని రెండు రూపాయలకూ అమ్ముతున్నాం. మోం బత్తీలు ఫిరీగ ఇస్తున్నాం. గ్యాస్ నూనె అగ్వకు అమ్ముతున్నాం.''
''ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయాయి. ఫైళ్ల క్లియరెన్స్‌కు ఏం చేస్తున్నారు?''
ఆఫీసుల్లో ఎలుకలనూ; బొద్దెంకలనూ పెంచుతున్నాం. అవి ఫైళ్లు క్లియర్ చేస్తున్నాయి.
''కరెంటు కోత వల్ల పిల్లలు చదువుకోలేక పోతున్నారు. బండెడు పుస్తకాలు మోయలేకపోతున్నారు''
''పిల్లలు చదువుకొని ఏం చేస్తారు? ఉద్యోగాలు చెయ్యాలా? ఊళ్లేలాలా? బండెడు పుస్తకాలు మోయడం అలవాటైతే రేపొద్దున బస్తాలు మోసుకొని బతుకుతారు''
''రాజధానిలో కుక్కలెక్కువయ్యాయి. అవి ఎవర్ని పడితే వారిని కరుస్తున్నాయి. ఆస్పత్రుల్లో కుక్కకాటుకు మందుల్లేవంటున్నారు. దీని మీద మీ ప్రభుత్వం ఏం చేస్తున్నది''
''ఆస్పత్రులన్నిటికీ చెప్పులు సరఫరా చేస్తున్నాం. కుక్కలంటే సాక్షాత్తు కాలభైరవుడు. ఆ దేవుడు కరిచి జెనాలకు మోక్షమిస్తున్నాడు.''
''మీ మంత్రుల్లో ఒకరు తను పిచ్చి కుక్కనంటున్నాడు''
''అలా వెళ్లడం వల్లే అతని జోలికి ఎవ్వరూ వెళ్లడం లేదు''
''ఈ మధ్య మీరు కొత్త గురుకులాన్ని ప్రారంభించారు. అక్కడేం నేర్పుతారు''
''అప్పు చెయ్యడమెలాగో నేర్పుతారు''
''అప్పెందుకు చెయ్యాలి''
అప్పు చేసి పప్పు కూడు తినాలని మన పురాణాలు చెబుతున్నాయి''
''అప్పు చేస్తే పరువుంటుందా?''
''అప్పు చేసే వాళ్లకే పరువు ప్రతిష్టలుంటాయి. ఎప్పుడూ పది మంది వాళ్ల చుట్టూ తిరుగుతుంటారు''
''మన రాష్ట్రానికి వచ్చినప్పుడు అమెరికా అధ్యక్షుడు మిమ్మల్ని ఏమడిగారు''
''వాళ్లిచ్చిన అప్పులు ఎప్పుడు తీరుస్తారని అడిగారు. కనీసం వడ్డీ అయినా కట్టమని గడ్డం పట్టుకొని బతిమిలాడాడు''
''క్లాసుల్లో వేంకటేశ్వరుని ఫొటోలు ఎందుకు పెట్టారు?''
''అప్పులు చెయ్యడంలో వేంకటేశ్వరుని మించిన వారెవరూలేరు. మొదట ఆయనకు మొక్కిన తరువాతే క్లాసులో పాఠాల్ని మొదలెడతారు''
''కొత్త గురుకులాల్లో చదువుకొన్న వారికి సర్టిఫికేట్లిస్తారా?''
''సర్టిఫికేట్ల బదులు తలా ఒక బొచ్చె ఇస్తాం. దాని మీద నా సంతకంతో పాటు సర్కార్ మొహర్ ఉంటుంది. అలాటి బొచ్చె ఉన్నవారికే ఎక్కడ పడితే అక్కడ అడుక్కోవడానికి అవకాశముంటుంది''
''రాష్ట్రంలోని మూడు ప్రాంతాల అభివృద్ధికి ఏం చేస్తున్నారు?''
''ఏది పెట్టినా, ఏది కట్టినా మూడు ప్రాంతాలకూ సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నాం.''
''అంటే''
''ఒక ప్రాంతంలో గుడి కడతాం. మరో ప్రాంతంలో ఆ గుడికి చెందిన మూల విరాట్ పెడతాం. ఇంకో ప్రాంతంలో ధ్వజస్తంభం నిలబెడతాం. ఒక చోట బడి పెడతాం. మరో చోట ఆ బడికి చెందిన టీచర్లను నియమిస్తాం. ఇంకో చోట విద్యార్థులుండేలా చూస్తాం. ఇలా మూడు ప్రాంతాలకూ న్యాయం చేస్తాం.''
''పది మంది పల్లేరుగాయాల పార్టీ ఎమ్మెల్యేలను మీ పార్టీలోకి ఎందుకు గుంజారు? పార్టీఫిరాయింపులు తప్పు కాదా?''
''ఎంత మాత్రమూ కాదు. ఎన్కటి నుంచే పార్టీ ఫిరాయింపులున్నాయి. విభీషణుడు పార్టీ ఫిరాయించి రాముని వైపు వెళ్లాడు. పార్టీ ఫిరాయించడం వల్లే లంకకు రాజయ్యాడు.''
''నీటి ఎద్దడి నివారణకు ఏం చేస్తున్నారు?''
''అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్ వంటి విదేశాల నుంచి కాకుల్ని రప్పించాం. అవి మన కాకులకు శిక్షణ ఇచ్చాయి. శిక్షణ పొందిన కాకులు బావుల్లోనూ, కాలువల్లోనూ రాళ్లు వేసి నీటిని పైకి తెస్తున్నాయి.''
''నేను నిద్రపోను. జెనంను నిద్ర పోనియ్యను అని ఎందుకంటున్నారు?''
''నేను నిద్రపోతే మహామంత్రి కుర్చీ నుంచి నన్ను కిందకి గుంజుతారు. జెనం నిద్రపోతే నా లత్కోర్ వేషాన్ని ఎవరు చూస్తారు?''
''మీరు నెలకోసారి విదేశాలకు ఎందుకు వెళుతున్నారు?''
''అప్పుల కోసం, రాష్ట్రం ముందుకు పోవాలంటే అప్పులు తప్పనిసరి''
టీ, టిఫెన్లతో విలేకరుల సమావేశం ముగిసింది.
**********
తెల్లవారుజాము నాలుగ్గంటల ప్రాంతం. చీకటింకా పోలేదు. మంచు తెరలింకా కరగలేదు. నిద్ర మత్తు ఇంకా దిగలేదు. గుడి గంటలింకా మోగలేదు.
లత్కోర్ లేచి కూర్చున్నాడు. తెల్లవారే లేవడమతనికి అలవాటు. ఆ సమయంలో అతనికి కొత్త ఐడియాలొస్తాయి. అవి కొత్త పథకాలవుతాయి.
పార్టీలో కొంతమందిని ఎంపిక చేసి వాళ్లకు శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందని లత్కోర్ అనుకొన్నాడు. ఎవరితో శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందని కొంతసేపు ఆలోచించాడు. మొదట బిచ్చగాళ్లతో తమ పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇప్పించాలనుకొన్నాడు. శిక్షణ కోసం పార్టీలో కొంతమందిని ఎంపిక చేసారు. వారిని రాజధానికి రప్పించారు. హోటల్లో వసలి కల్పించారు.
మొదట భిక్షపతి అనే బిచ్చగాడు క్లాస్ తీసుకొన్నాడు. ఒక్క అయిదు రూపాయలు దానమియ్యి. నీ పేరు జెప్పుకొని బత్కుత. దానమిస్తే పుణ్యమొస్తది. నీ పెండ్లాం, పిల్లలు సల్లగుంటరనుకుంట బిచ్చమడ్గాలె. ఎవలు తిట్టినా, సీదరిచ్చుకున్నా ఊకోవద్దు. బిచ్చమేసే దాంక సతాచించాలె.
ఇండ్లల్ల అడ్కునేటప్పుడు 'గింత బిర్యాని పెట్టమ్మా, సోర్వ పొయ్యమ్మా' అని పాడాలె. ధర్మతల్లీ! నాకు బిచ్చమేస్తె మీ ఇంటికి లచ్చిందేవొస్తది. నీ మొగని జీతం బెర్గుతది. నీ బిడ్డ పెండ్లయితది. నీ కొడ్కుకు కొల్వు దొరుక్తది. నీ మెడలకు బంగారి గొల్సు, నడ్ముకు వొడ్డానం వొస్తయి. నీ చేతులకు బంగారి గాజులు చెవులకు కమ్మలొస్తయి.
నీ మొగుడు దినాం నిన్ను మోటర్ల దిప్పుతడు. గాలి మోటర్ల అమెరికగొంచబోతడు. రొండంత్రాల బంగ్ల గట్టిస్తడు. నువ్వు ఏం గావలన్నా ఇస్తడు. 'గింత ఉడుకుడుకు బువ్వెయమ్మా! గింత కూర, మామిడి తొక్కు బెట్టమ్మా! నా గిలాసల జెరంత సల్ల బొట్టు బొయ్యమ్మా' అనాలె. బిచ్చం బెట్టె దాన్క గా ఇంటి ముంగటే ఉండాలి. ఇయ్లా బిచ్చమడ్గొస్తె రేపు ఓట్లడుగుడు మీకు అల్కగైతది'' అంటూ భిక్షపతి పాఠం చెప్పాడు.
థియరీ క్లాసయ్యాక ప్రాక్టికల్స్ మొదలయ్యాయి.
చిరుగుల చొక్కా, ప్యాంటూ, కట్టే, బొచ్చే పట్టుకొని కొందరు బొచ్చెపార్టీ కార్యకర్తలు గుడిమెట్ల మీద కూర్చుని అడుక్కొన్నారు. రైల్వేస్‌లోనూ బస్టాండుల్లోనూ కొందరు బిచ్చమెత్తారు. గుడ్డివాళ్లలా, కుంటి వాళ్లలా నటిస్తూ కొందరు అడుక్కొన్నారు.
సాయంత్రం వారు హోటల్‌కు వచ్చారు. తాము అడుక్కొని తెచ్చిన వాటిని భిక్షపతికి చూపెట్టారు. వాటిని చూసి అతను మార్కులేసాడు.
రెండో రోజు తిట్లపై పాఠం చెప్పడానికి నర్సమ్మ అనే ఆమె వచ్చింది. ఆమెకు నోటి దురుసెక్కువ. నోరు తెరిస్తే చాలు గంగా ప్రవాహంలా తిట్లు వస్తాయి.
''నీ నోట్లె మన్నుపడ. నీ ఇంట్ల పీన్గెల్ల. నీ దౌడల్ దగ్గరబడ. నీ తల పండు బల్గ. నీకు పిండం బెట్ల. నీ చేత్ల జెట్టమొల్వ. నీకు గజ్జి లెవ్వ. నీ పెండ్లాం ముండమొయ్య. నీ ముక్కుల దూదిబెట్ట. నీ ఇంట్ల దొంగలు బడ. నీ యాపారం చెడ. నువ్వు ఆకల్తోని సావ. నువ్వు లంగవు. లఫంగవు. బట్టెబాజివి. బద్మాష్వు. బేకార్గానివి. నక్కవు. గజ్జికుక్కవు. గాడ్దివి. పందివి. తోక దెగిన కోతివి. నీ కాష్టం గాల. నీ ఇల్లు గూల. నీ పండ్లురాల. నీ కాల్లు చేతులిర్గ. నువ్వు జిల్ల పుర్గువు. ఉచ్చల శాపవు. బర్రె పెండవు. పుచ్చు పన్నువు. బాడ్కావ్. దేడ్పావు. ఏం బే! ఏం సాలె. నీకు గత్తర్ దల్గ'' అంటూ నర్సమ్మ తిట్ల దండకం చదివింది.
అచ్చువేసిన తిట్ల దండకం కాపీలను తలా ఒకటిచ్చారు.
మూడో రోజు ఒక గూండా వచ్చాడు. ప్రత్యర్థుల సభల్ని ఎలా వాడుకోవాలో చెప్పాడు. కోడిగుడ్లూ, కుళ్లిన టమాటాలూ, పాత చెప్పులూ గురి తప్పకుండా సభలో ఎలా వాడాలో నేర్పాడు. అసెంబ్లీ లో మైకుల్ని ఏం చెయ్యాలో చెప్పాడు. మజాక్ సభ ఏర్పాటు చేసారు. వాన్ని చెడగొట్టేందుకు తర్ఫీదుగా, కోడిగుడ్లూ, కుళ్లిన టమాటలిచ్చారు. మైకుల పని పట్టమన్నారు. ప్రాక్టికల్స్ చేయించి మార్కులిచ్చారు.
నాల్గో రోజు ఓ బూరుపులోడు వచ్చి మేకప్ లేకుండా ఎలా నటించాలో నేర్పాడు. ఎప్పుడు నవ్వాలో, ఎప్పుడు ఏడ్వాలో, బక్వాస్లతో జెనాలను ఎలా బుట్టలో వేసుకోవాలో నటించి చూపాడు.
ఐదో రోజు ఒక ఉపన్యాస కేసరి వచ్చి సబ్జెక్ట్ లేకపోయినా ఎలా మాట్లాడాలో నేర్పాడు.
థియరీతో ప్రాక్టికల్స్‌లో ప్యాసైన వాళ్లకు మహామంత్రి సంతకం ఉన్న బొచ్చెనిచ్చాడు.
**********
తరువాయి వచ్చేవారం...
- తెలిదేవర భానుమూర్తి
99591 50491