Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిత్రం, శిల్పం, జ్ఞాన బోధనలో ఎంత ప్రాముఖ్యం వహించినా, విద్యా రంగంలో భాషా, సాహిత్యం అగ్రస్థానం సంపాదించాయి. కానీ వెనుకటి ఒక కాలంలో భాషా, సాహిత్యం ఉన్నా, చిత్రం, శిల్పం లేక, ఆ కాలం ఆనవాలు లేకుండా అంతరించిపోయింది. దానిని ఆర్యుల కాలం లేదా వైదిక కాలం అంటారు. రాగియుగం, హరప్ప సంస్కృతి ఉన్న ఆది కాలంలో లిపి, భాష లేకపోయినా ఆ నాడు వారు వేసిన చిత్రాలే వారి చరిత్రని మనకు తెలిపాయి. ఇది మనం వెనుకటి సంచికలో చూసాము.
ఆ ఆదియుగాలు వారి జీవనం అంతరించిపోవటానికి కారణం ప్రకృతి వైపరీత్యాలతో పాటు, మరో కారణం, ఆర్యులు ఆక్రమించటం. వీరు పశ్చిమ ఆసియా ఖండం నుంచీ రెండు విడతలుగా వచ్చి థార్ ఎడారికి దక్షిణం, ఉత్తరంలోకి పాకారు. ఆగేయ భారతంలోని ఈ ఆదియుగం మనుషులను దక్షిణానికీ, తూర్పుకి నెట్టివేసారని నమ్మకం. ఆర్యులు బయటి వారు కాదు. ఆగేయ భారతంలోని ఒక తెగ వారు అనీ, వారే ప్రబలి ఈ ప్రదేశాలన్నీ ఆక్రమించారనీ, మరో ఆలోచనా ఉంది. ఏది ఏమైనా దక్షిణ, తూర్పు ప్రాంతాలలో ఆనాటి సింధు ప్రజల ముఖ కవళికలు కనిపిస్తాయని ఒక మాట ఉంది. ఆర్యులు వేదాలు చెప్పారు. భాషా, సాహిత్యం నేర్చి, వారిది అగ్రస్థానం అన్నారు. అయితే వారు ఏ చిత్రం, శిల్పం తయారు చేయలేదు. ఆ కాలం అంతరించాక, వారి చరిత్ర చెప్పే వస్తువులూ ఏమీ మిగలలేదు. ఆ కాలం గురించి ఏమీ తెలియకుండా మాయమైంది. వారి వైదిక సాహిత్యం మాత్రం మాటల్లో వల్లెవేసే చరిత్రలా మిగిలింది. ఈ ఆర్యుల కాలం 1500 బిసి నుంచీ 450 బీసీ వరకు లెక్కకడతారు.
ఆపై కాలం, మహావీర జైనుడు (540 బీసీ నుంచి 463 బీసీ); బౌద్ధుడు (563 బీసీ నుంచీ 483 బిసి) అనే మత గురువుల కాలం. ఈ రెండు కాలాలు సాహిత్యంతో పాటూ చిత్రానికీ, శిల్పానికి గూడా ప్రాముఖ్యం ఇచ్చాయి. ఈ రెండు మతాలు తూర్పు భారతంలోని మగధలో పుట్టి పెరిగాయి. ఆనాటి మగధలోని సాంఘిక, రాజకీయ పరిస్థితులు కూడా అందుకు సహకరించాయి.
క్రీ.పూ. 4వ శతాబ్దంలో చంద్రగుప్త మౌర్యుడు, నందులను తొలగించి, మగధలో మౌర్యుల సామ్రాజ్యం నిర్మించాడు. అతని రాజకీయ నైపుణ్యం వలన సాంఘిక అభివృద్ధి చెంది మగధ సాంస్కృతికంగా కూడా ముందడుగు వేసింది. భారతదేశంలోని 16 మహా జనపదాలలో మగధ కూడా ఒకటైంది. ఆ కాలంలో అలెగ్జాండర్ అనే గ్రీకురాజు దండెత్తి వచ్చినా, ఆ గ్రీకు రాజుకు మగధలో జయం అందకపోయినా, గ్రీకు వారి సంస్కృతి, కళలు మగధకు కొత్త మలుపులు తెచ్చింది. మగధ వద్ద తక్షశిలా పట్టణం గ్రీకు ప్రభావంతో నిర్మితమైంది. గ్రీకు ప్రభావాలు దక్షిణాన ఒరిస్సా వరకూ, ఆగేయ భారతంలోనూ గ్రీకు సమాజాలు ఏర్పడ్డాయి. సింధు నాగరికత కాలంలోని సముద్ర వ్యాపార మార్గాలు మళ్లీ బలపడ్డాయి. గ్రీకు దేశం నుంచీ కొందరు కళాకారులు మగధ చేరి మౌర్యుల శిల్పకళకు కొత్తమెరుపులు దిద్దారు. గ్రీకులతో, చంద్రగుప్త మౌర్యుడి వైవాహిక సంబంధాలు మరిన్ని కొత్త ఆలోచనలు మగధకు తెచ్చాయి. మెగస్తనీసు అనే గ్రీకు పౌరుడు మగధలోనే ఉండి అక్కడి ఎన్నో విషయాలను తన రాతలల్లో పదిలపరిచాడు. అతను రాసిన ప్రకారం మగధ రాజధాని అయిన పాటలీపుత్రం (నేటి పాట్నా) లోని భవంతులు, ఆస్థాన కళలు విదేశీ ప్రభావితం అని చెప్పాడు. కానీ మనం ఆనాటి చిత్రాన్ని, శిల్పాన్ని పరీక్షించి చూస్తే, ఈ దృశ్య కళలు మాటలకందని ఎన్నో నిజాలను కంటికి అందిస్తాయి.
చంద్రగుప్తుడి మనుమడు అశోకుడు. అభివృద్ధి కార్యక్రమాలలో ఇతడు తాతని మించిన మనుమడయ్యాడు. అశోకుడి కాలం క్రీ.పూ. 272 నుంచీ క్రీ.పూ. 231 వరకూ ఈతని రాజ్యాంగ శాసనాలు ప్రాకృతంకు దగ్గరగా ఉన్న మగధి లిపిలో రాతి గుహలపై, రాతి స్తంభాలపై చెక్కబడి, మనకు ఆనాటి చరిత్రను అందిస్తాయి. అశోకుడు, ప్రజలకు ప్రియమైన చక్రవర్తిగా, 'ప్రియదర్శిని' అనే మాటతో పిలువబడ్డాడు. ఆనాడు చెక్కిన స్తంభాలు శిల్పకథలో ఒక ఘట్టం. బీహారులోని రామపూర్వ అనే ప్రాంతంలో ఒక రాతి స్తంభంపై చెక్కిన ఒక ఎద్దు ఆకారం నునుపైన మెరుపుతో నిజరూపానికి చాలా దగ్గరగా ఉంది. మనం పరీక్షించి చూస్తే, హరప్ప నాగరికతలో దొరికిన ఆది చరిత్ర కాలంలోని ముద్రికలపై చెక్కిన ఎద్దు ఆకారానికి దగ్గరగా కనిపిస్తుంది. సుమారు 205 సెం.మీ. పొడువు ఉన్న ఈ శిల్పం ఢిల్లీలోని రాష్ట్రపతి భవనంలో భద్రపరచబడింది.
12 మీటర్ల ఎత్తు ఉన్న ఒక స్తంభం నందన్ఘర్ వద్ద లైరియా అనే చోట ఉంది. ఈ స్తంభంపై ఉన్న సింహపు ఆకారం, కమలం ఆకారంలోని వేదికపై కూర్చుని ఉంటుంది. ఈ స్తంభం కూడా అతి నున్నటి మెరుపు పెట్టబడి ఉంటుంది. ఇది అశోకుడి కాలానిది. సారనాథ్‌లోని అశోక స్తంభం పేరుపొందింది. ఇక్కడ బుద్ధుడు మొదట ప్రవచనం ఇచ్చాడు. ఆ గుర్తుగా ఏర్పరచిన స్తంభం ఇది. కమలం పువ్వు ఆకారంలో ఉన్న వేదికపై నాలుగు సింహాలు అమర్చి ఉంటాయి. ఆపై ఒక చక్రం ఉండేదట కానీ కాలంతో పాటూ అది విరిగిపోయింది. అది ధర్మచక్రంగా గుర్తించారు. నోరు తెరిచి నిల్చున్న సింహాలను రెండు రకాల అర్ధాలతో మనం గుర్తించవచ్చు. బుద్ధుడి ప్రవచనాన్ని 'సింహఘోష' అంటారు. సింహం, అశోకుడి రాచరికపు గుర్తుగానూ చూడవచ్చు. సింహం కాలికింద వేదికపై ధర్మచక్రం గుర్తుగా, చక్రాలు, ఎద్దు, గుఱ్ణం, సింహం, ఏనుగు చెక్కబడి ఉన్నాయి. ఈ జంతువులు ఆ చక్రాన్ని తిప్పుతున్నాయి అనే భావన కోసం చెక్కారా అనిపించినా, ఇలా నాలుగు రకాల పశువులను చెక్కిన ఒక ముద్రిక అని, పశుపతి మూసగా హరప్ప సంస్కృతిలో ఇది వరకే చూసాము. ఆ స్తంభం అశోకుడి కాలానికి గుర్తు అనీ, స్తంభం అతినున్నటి మెరుపుతో ఉందనీ, సింహపు కళ్లు రత్నాలు అమర్చినట్టు మెరుస్తూ ఉంటాయని, చీనీ ప్రయాణీకుడైన హుయాన్‌త్సాంగ్ కూడా రాసాడు. ఈ స్తంభాలు అశోకుడు తన బౌద్ధ దర్మ ప్రచారణకు సాధనాలుగా, స్తంభాలపై ప్రవచనాలు చెక్కించాడు.
అలాగే చెక్కించిన రాతి గుహలు కూడా మౌర్యుల ధర్మ ప్రచారానికి సాధనాలయ్యాయి. వారు చెక్కించిన ఏడు గుహలు అశోకుడి కాలం నుంచీ అతని మనుమడు దశరథుడి కాలం వరకూ కనిపిస్తాయి. ఇందులో ముఖ్యమైనది ఒంటిగా నిల్చున్న లోమస ఋషి గుహ. రెండు గదులు ఉండి గుడిసె ఆకారంలో ఉన్న ఈ గుహ, ద్వారానికి ఉన్న జల్లెడ వంటి నగిషీ ఉన్న తోరణం, చెక్కిన పద్ధతి అంతకుముందు నుంచీ వారి వద్ద ఉన్న చెక్క కట్టడాలను ఆధారంగా చూసి తొలిచిన గుహ అనిపిస్తుంది. ఈ గుహలను జైన, బౌద్ధ మత ప్రచారకులు, గురువులు, వర్షాకాలంలో నివసించటానికి వాడారు.
బుద్ధుడు ఏ రావిచెట్టు కింద జ్ఞానప్రాప్తి పొందాడో, అశోకుడు ఆ చెట్టు కింద వేదిక కట్టించి, అక్కడ మందిరం ఏర్పాటు చేసాడు. బుద్ధగయలోని ఈ మందిరం ఈ మధ్య కాలాల్లో కొన్ని మరమ్మతులు, కొత్త రూపాలు దిద్దుకున్నా, వేదిక మాత్రం అశోకుడి కాలం నాటిదే అని అక్కడ బ్రహ్మి లిపిలో రాసి ఉన్న అశోకుడి శాసనం ద్వారా కనిపిస్తుంది. అంతేకాదు ఆ వేదిక మీద ఉన్న పూలు చెక్కిన వరుస, నునుపు తేలిన శిల్పం మౌర్యుల కాలాన్ని గుర్తుతెస్తాయి.
మౌర్యుల శిల్పాలు మరో ఎత్తు. ఆనాడే ఇంత కళానైపుణ్యం ఉండేదా అని ఆశ్చర్యం కల్గుతుంది. 'దీదర్‌గంజ్ యక్షి' అనే పేరుతో ఒక స్త్రీ శిల్పం సంచలనం రేపింది. దదర్గంజ్ (బీహార్) గ్రామస్థులు ఒక తొర్రలో దూరిన పాముని పట్టపోతే అక్కడ ఈ శిల్పం చిక్కిందట. వింజామర చేతపట్టి ఉన్న ఈ స్త్రీ రూపం, ఆ అతి నున్నటి మెరుపు పాపడిబిళ్ల, నుదుటిపై ముడి, చేతులకు, మెడకు, కాలికి, చెవులకు ఉన్న ఆభరణాలు, జారిపోతూ కట్టిన వస్త్రం మడతలు ఉన్న ఈ అందమైన స్త్రీ రూపం వింజామర చేతపట్టి ఉండటం వలన పరిచారిక శిల్పంగా గుర్తించారు. ఆ ప్రాంతాల్లోనే మౌర్యుల ఇటుకలు కూడా దొరకటంతో ఈ శిల్పం మౌర్యుల కాలానిదని రూఢ చేసుకున్నారు. అక్కడే ఈ స్త్రీ శిల్పం అంత సుందరంగా లేకపోయినా, పురుష పరిచారిక శిల్పాలూ, అలాంటివే దొరికాయి. ఈ శిల్పాలు చునార్ రాతితో చెక్కబడ్డాయి. ఈ శిల్పాలు, నిజమానవ ఆకారాలకు దగ్గరగా ఉంటాయి. ఒక మాటు మనం వెనుకకు చూస్తే హరప్ప నాగరికతలోని చెక్కడాలు కూడా, చిన్నవే అయినా, నిజరూపాలకు దగ్గరగా ఉంటాయి.
మౌర్యుల కాలంనాటి ఎర్రమట్టి స్త్రీ శిల్పాలలు కూడా మనల్ని ఒకసారి వెనక్కి తిరిగి హరప్పా కాలాన్ని గుర్తు చేసుకోమంటాయి. పాట్నా వద్ద బులందిబాగ్ వద్ద కొన్ని స్త్రీ రూపాలు దొరికాయి. వాటి తలకట్టు, అమర్చిన కిరీటం వంటి పెద్ద అలంకారం, వెడల్పైన ఆకర్షణీయంగా ఉన్న వస్త్రం ఎంతో నేర్పుగా దిద్దినట్టు కనిపిస్తుంది. ఈ శిల్పం కనుముక్కు తీరు ఎంతో అందంగా ఉంటుంది. సహజ సిద్ధంగా కొంచెం తలపక్కకి తిప్పి ఉంటుంది. ఇలాటి స్త్రీ శిల్పాలు మరిన్ని అక్కడ దొరికాయి. ఇవి తక్కువ సెగలో కాల్చిన శిల్పాలవటం వలన ఎన్నో విరిగిపోయి కనిపిస్తాయి. ఈ మట్టి శిల్పాలను చూస్తే హరప్ప నాగరికతలో మనం కిందటి సంచికలో చూసిన దేవీమాతృకలు గుర్తుకొస్తాయి. ఈ పోలికలన్నీ మనకు తెలిపే మాట ఒకటే. ఆది చరిత్ర అయిన ముందు యుగాల హరప్ప సంస్కృతి నుంచీ, కళలు, నిపుణత ముందుకు, భారతీయ కళా సంప్రదాయాలుగా సాగిన ఆనవాలు కనిపిస్తుంది. రాసి ఉంచిన శాసనాలు, పత్రాలు అవి మెగస్తనీసువి అయినా, మరొకరైనా చీనీ యాత్రికులవైనా, వారు చెప్పినట్టు మౌర్యుల కాలం విదేశీప్రభావితం మాత్రమే కాదు, భారతీయ అనాది సంస్కృతిముందుకు సాగిందని చిత్రం, శిల్పం వివరిస్తున్నాయి.
- డా|| ఎం.బాలమణి, 8106713356