Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వనటుడు, తొలి పాన్ ఇండియా స్టార్ కమల్ హాసన్. విలక్షణ నటనకు ఆయన ఆలవాలం, విభిన్న పాత్రలకు ఆయన విశేష బహుమానం. నాట్య మయూరానికి ఆయన కొలమానం, వైవిధ్యమైన కథలకు ఆయన వైవిధ్య మానం, ఎన్ని ప్రయోగాలు చేసినా తీరని కళాదాహం. ఉప్పొంగే అద్భుత హావభావాల నటప్రవాహం. అంత తేలిగ్గా అంతుపట్టని మర్మయోగి. ఎంత అభివర్ణించినా పట్టుబడని ప్రజ్ఞాశాలి. అనుకున్నది సాధించి ఎవ్వరూ ఛేదించలేని శిఖరంలా ఎదిగిన ఓ స్వచ్ఛమైన భారతీయుడు. నేటి తరంలో నటన విషయంలో ఆయనకు సాటి లేరు ఇంకెవరూ.. పోటీకి రారు మరొకరెవరూ..
ఎందుకంటే అభినయాన్ని అను భవాన్ని ఓ సాగర సంగమంలో కలిపి ఆ శుభసంకల్పం తోనే తన నటననూ, తన నాట్యాన్ని వెండితెరపై అద్భుతంగా అద్దగలిగిన ధీశాలి. అతి సామాన్యుడిలా ఒదిగాడు. తన మల్టీ టాలెంట్‌తో ప్రసిద్ధ నటుడిగా ఎదిగి భారతీయ సినిమాను విశ్వవ్యాప్తం చేసిన వారిలో ఒకరు. భారతీయ సినిమా గర్వించదగ్గ విశ్వనటుడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న సామెతను నిజం చేస్తూ బాల నటుడిగానే తనలోని సత్తాను వెండితెరకు పరిజయం చేసిన ఆయన హీరోగా మారిన తర్వాత తనలోని నట విశ్వ రూపాన్ని ప్రదర్శించారు. నటుడిగా ఆయన చేసినన్ని ప్రయోగాలు దేశంలో మరే నటుడూ చేయలేదు. నటనలో అరుదైన ప్రయోగాలు చేసిన ఘనత ఆయనది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళీ, హిందీ ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేసి లోక నాయకుడయ్యాడు. నటుడిగానే కాకుండా దర్శకుడు, డ్యాన్సర్‌గా, నిర్మాత, స్క్రీన్ రైటర్, సింగర్, రాజకీయ నేతగా ఇలా బహుముఖ ప్రజ్ఞాశాలిగా రాణిస్తున్న కమల్ హాసన్ నవంబర్ 7న 68 వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా సోపతి పాఠకుల కోసం అందిస్తున్న ప్రత్యేక వ్యాసం.
1954, నవంబర్ 7న తమిళనాడు రామనాథపురం జిల్లా పరమకుడిలో లాయర్ శ్రీనివాసన్, రాజ్యలక్ష్మి దంపతు లకు కమల హాసన్ నాలుగో సంతానంగా జన్మించారు. సినిమాల్లోకి అడుగు పెట్టక పూర్వం కమల్ హాసన్ పేరు పార్థసారధి. అతని తోబుట్టువులు చారుహాసన్, చంద్రహాసన్, నళిని. శ్రీనివాసన్ దంపతులు కొడుకులందరికి చివరి పదం ''హాసన్'' అని వచ్చేలా పేరు పెట్టారు. ఇది హాసన్ అనబడే ఒక మిత్రుడితో వారికి ఉన్న అనుబంధానికి గుర్తుగా చెబుతారు.
బాలనటుడిగా సినీరంగ ప్రవేశం
కమల హాసన్ తన ఆరేండ్ల వయసులోనే చిత్ర రంగంలోకి ప్రవేశించారు. ఆయన మొదటి చిత్రం ''కలత్తూర్ కన్నమ్మ''. ఈ చిత్రంలో సావిత్రి, జెమినీ గణేశన్‌ల కొడుకుగా నటించి సత్తా చాటుకున్నారు. మొదటి సినిమా తోనే జాతీయ స్థాయిలో ఉత్తమ బాలనటుడి అవార్డ్ అందుకున్న కమల్ వైవిధ్యమైన నటనతో సినీ అభిమానుల మనసు దోచుకున్నాడు. బాల్యంలోనే ఆయన శాస్త్రీయ కళలను అభ్యసించారు. నూనుగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పనిచేశారు. బాల నటుడిగా శివాజీగణేశన్, ఎంజీ రామచంద్రన్ వంటి తమిళ అగ్రనటులతో సైతం కలసి పనిచేశారు.
ఆ తర్వాత ఏడేండ్ల విరామం తర్వాత కమల్ హాసన్ డ్యాన్స్ అసిస్టెంట్‌గా సినీ పరిశ్రమకు తిరిగివచ్చి కొరియోగ్రాఫర్ థంకప్పన్ వద్ద శిష్యరికం చేశాడు. ఈ సమయంలో హాసన్ కొన్ని చిత్రాలలో అతిథి పాత్రల్లో కనిపించాడు. 1970లో వచ్చిన 'మానవన్', 1973లో వచ్చిన ''వేలంకణి, కాసియతిరై'' చిత్రాలలో అతిథి నటుడుగా, సహాయ దర్శకుడిగా పనిచేశాడు. కమల్ 1973 లో ప్రసిద్ధ తమిళ సినీ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన తమిళ చిత్రం 'ఆరంగేట్రం'లో హీరోగా నటించిన, ఆ తర్వాత బాలచందర్ చిత్రం ''సొల్లతాన్ నినైక్కిరెన్''లో విలన్‌గా నటించాడు. 1974లో 'గుమాస్తావిన్ మగల్', 'అవల్ ఒరు తొడర్ కథై', 'నాన్ అవనిల్లై' వంటి తమిళ చిత్రాలలో సహాయ పాత్రలు పోషించాడు. అదే ఏడాది హీరోగా నటించిన మలయాళ చిత్రం ''కన్యాకుమారి''లో కమల్ నటనకు మొదటి ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. బాలచందర్ ''అపూర్వ రాగంగల్'' (తెలుగులో తూర్పుపడమర) లో ప్రధాన నటుడిగా, ఒక పెద్ద వయసున్న మహిళతో ప్రేమలో పడే యువకుడిగా నటించాడు. ఈ పాత్ర చిత్రణ కోసం, కమల్ హాసన్ మృదంగం వాయించడం నేర్చుకున్నాడు. ఈ చిత్రంలోని పాత్రకు కమల్ రెండవ ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నాడు. ఇదే సమయంలో దర్శకుడు కె.బాలచందర్‌తో ఏర్పడిన అనుబంధం తరువాత ఇరువురి మధ్య సుదీర్ఘ గురుశిష్య సంబంధంగా మారింది. 1976లో బాలచందర్ 'మన్మధ లీలాయి'లో నటించాడు. దీని తర్వాత ముత్తురామన్ దర్శకత్వం లో 'ఒరు ఊదప్పు కన్ సిమిట్టుగిరదు' నటించి, మూడవ ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచు కున్నాడు. 1977లో మహిళాభ్యు దయం ఇతివృత్తంగా వచ్చిన 'అవర్గల్' చిత్రంలోని పాత్ర కోసం కమల్ వెంట్రిలా క్విజం నేర్చుకున్నాడు. ఈ చిత్రం తెలుగులో ''ఇది కథ కాదు'' పేరుతో 1979లో రీమేక్ చేయగా, కమల్ తన పాత్రను తిరిగి పోషించాడు. విలేజ్ బంప్కిన్గా నటించిన '16 వయత్తినిలే' చిత్రం ద్వారా కమల్ వరుసగా నాల్గవ ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నాడు. 1977లో బాలు మహేంద్ర దర్శకత్వం వహించిన తొలి చిత్రం కమల్ తన మొదటి కన్నడ చిత్రం 'కోకిల'లో నటించాడు. 1978లో కమల్ బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన 'మరో చరిత్ర' చిత్రం ద్వారా తెలుగు చలనచిత్ర రంగ ప్రవేశం చేశాడు. 'సిగప్పు రోజక్కల్' చిత్రా నికి ఐదవ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందు కున్నారు. ఇందులో అతను సైకోపతిక్ లైంగిక కిల్లర్‌గా నటించాడు. అతను మలయాళ చిత్రం 'ఈటా' లోని నటనకు ఆరవ ఫిల్మ్‌ఫేర్ అవార్డు ను గెలుచుకున్నాడు. 1977లో పిజి విశ్వంభరన్ దర్శకత్వం వహించిన మల యాళ చిత్రం 'సత్యవాన్ సావిత్రి' లో శ్రీదేవి సరసన తొలిసారిగా నటించాడు. 1979 సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెలుగు చిత్రం 'సొమ్మొకడిది సోకొకడిది' లో డ్యూయల్ రోల్ పోషిం చారు. 1980లో తమిళంలో 'వరుమయిన్ నిరమ్ శివప్పు' తెలుగులో 'ఆకలి రాజ్యం' పేరుతో ఈ రెండు చిత్రలు ఏకకాలంలో చిత్రీకరించ బడ్డాయి. ఈ చిత్రం తెలుగులో అతనికి మొదటి ఫిల్మ్ ఫేర్ అవార్డును సాదించి పెట్టింది. ఆ తర్వాత 'ఉల్లాస పరవైగల్', 'గురు', 'మరియా మై డార్లింగ్' లో నటించాడు. 1981 లో తొలిసారిగా కె. బాలచందర్ దర్శకత్వం వహించిన హిందీ సినిమా 'ఏక్ దుయుజే కే లియే' (మరో చరిత్ర రీమేక్). కమల్ 1981లో నిర్మాతగా రంగప్రవేశం చేసి తన 100వ సినిమా 'రాజ పార్వై' నిర్మిం చాడు. అయితే ఈ చిత్రం బాక్స్-ఆఫీస్ వద్ద ఫెయిల్ అయినప్పటికీ ఒక బ్లైండ్ సెషన్ వయోలిన్ వాద్యకారుడిగా అతను పోషించిన పాత్రకు ఫిల్మ్‌ఫేర్ అవార్డును సంపాదించిపెట్టింది. బాలుమహేంద్ర 'మూండ్రమ్ పిరారు'లోని పాత్రకు కమల్ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు గెలుచు కున్నాడు, తరువాత హిందీ వెర్షన్ 'సద్మా' లో తన పాత్రను తిరిగి పోషించాడు. ఆ తరువాత కమల్ 'యే తో కమల్ హౌ గయా, 'జరా సి జిందగీ' తో సహా తన తమిళ చిత్రాల బాలీవుడ్ రీమేక్‌లపై దృష్టి సారించాడు. 1983లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'సాగర సంగమం' చిత్రంలో అతని పాత్రకి ఉత్తమ నటుడిగా మొదటి నంది అవార్డును, తెలుగులో రెండవ ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకు న్నాడు. 1984లో మల్టీస్టారర్ చిత్రం 'రాజ్ తిలక్' తర్వాత వచ్చిన 'సాగర్' చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. ఈ చిత్రం 1985 లో ఉత్తమ విదేశీ భాషా ఆస్కార్ అవార్డుకు భారతదేశానికి ప్రతినిధిగా నిలిచింది. 1986లో 'విక్రమ్' ను నిర్మించాడు. కోదండరామి రెడ్డి 'ఒక రాధా ఇద్దరు కృష్ణులు', కె. విశ్వనాథ్ 'స్వాతి ముత్యం' లో కమల్ ఉత్తమ నటుడిగా రెండవ నంది అవార్డును గెలుచుకున్నాడు. ఈ చిత్రం 1986లో అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా భారత దేశం నుండి ఎంపికయ్యింది. తరువాత కమల్ నటించిన తమిళ చిత్రాలు చాలా వరకు తెలుగులోకి డబ్ చేయబడ్డాయి. 1987 లో మణిరత్నం చిత్రం 'నాయకన్' లో నటనకు జాతీయ అవార్డును అందుకున్నాడు. నాయకన్ అకాడమీ అవార్డ్స్‌లో ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా భారతదేశం నుండి ఎంపికవ్వడమే కాకుండా టైమ్స్ ఆల్-టైమ్ 100 సినిమాల జాబితాలో నమెదు అయ్యింది. కమల్ 1987 లో వచ్చిన మూకీ చిత్రం 'పుష్పక విమానం'లో నటించాడు. 'అపూర్వ సగోధరార్గల్', 'ఉన్నల్ ముడియుమ్ తంబి', మలయాళ చిత్రం 'డైసీ', 'సత్యా' చిత్రాలలో నటించాడు. కమల్ నిర్మించిన ఈ నాలుగు చిత్రాలు పెద్ద విజయాన్ని సాధించాయి, తెలుగులో 'ఇంద్రుడు చంద్రుడు' చిత్రానికి ఫిలింఫేర్ ఉత్తమ నటుడి తో పాటు, నంది అవార్డును గెలుచుకున్నాడు. 1990లో 'మైఖేల్ మదన కామ రాజన్', 'గుణ', 'తేవర్ మగన్' కమల్ నటించిన సినిమాలు వచ్చాయి. 'తేవర్ మగన్' చిత్రం ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచు కుంది. ఆ తరువాత వరుస 'సింగర వేలన్, మహా రాసన్, కళైజ్ఞన్, మహానది, నమ్మావర్, సతీ లీలావతి' చిత్రాలలో కమల్ నటించాడు. తెలుగులో 'శుభ సంకల్పం' లో తమిళంలో 'పోలీస్ కథ కురుతిపునల్' నటించారు, అదే సమయంలో తెలుగులో అర్జున్ తో 'ద్రోహి' గా చిత్రీకరిం చాడు. ఇండియన్ తర్వాత, కమల్ 'అవ్వై షణ్ముగి' అనే కామెడీ చిత్రంలో మహిళగా నటించాడు. ఈ చిత్రాన్ని హిందీలో 'చాచీ 420' పేరుతో చేసిన రీమేక్‌కి కమల్ దర్శకత్వం వహించాడు. 1997లో మహ్మద్ యూసుఫ్‌ఖాన్ బయోపిక్ 'మరుదనా యగం' నలభై ఐదు నిమిషాల సినిమాతో పాటు ట్రైలర్ చిత్రీకరించ బడింది. మరుదనాయగం చిత్రాన్ని క్వీన్ ఎలిజబెత్ భారత పర్యటన సందర్భంగా ఒక బహిరంగ వేడుకలో ప్రారంభించారు. బడ్జెట్ పరిమితుల కారణం గా ఈ చిత్రం కార్యరూపం దాల్చలేక పోయినప్పటికీ, ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడానికి కమల్ ఇప్పటికీ ఆసక్తి తో ఉన్నాడు. కమల్ 'హే రామ్' చిత్రాన్ని తన దర్శకత్వం లో నిర్మించడమే కాకుండా, నృత్య దర్శకత్వం వహించారు. 'హే రామ్' భారతదేశంలో బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా విజయ వంతమైంది. 2004లో ''మున్నాభారు వీదీదీూ'' హిందీ సినిమాకు రీమేక్ అయిన 'వసూల్ రాజా వీదీదీూ'లో నటించాడు. ఈ సినిమా బాక్స్-ఆఫీస్ విజయం సాధించింది. ఆ తర్వాత కామెడీ 'ముంబై ఎక్స్‌ప్రెస్' లో, రమేష్ అరవింద్‌తో కన్నడ హాస్య చిత్రం 'రామ శామ భామ' గా, 'స్టైలిష్ పోలీస్ కథ', 'అయిన వేట్టయ్యాడు విలయ్యాడు' చిత్రాల లో నటించాడు. 2008లో భారత దేశంలో నిర్మించిన మొట్టమొదటి ఆధునిక సైన్స్-ఫిక్షన్ చిత్రామైన 'దశావ తారం' సినిమాలో కమల్ పది పాత్రలు పోషించాడు. ఈ చిత్రం భారతదేశంతో పాటు ఓవర్సీస్లో అనేక భాషలలో విడుదలైంది. కమల్ 'మన్మదన్ అంబు' తర్వాత తదుపరి చిత్రం 2013 లో విశ్వరూపం, (హిందీలో విశ్వరూపం పేరుతో) విడుదలైంది. ఇది 60వ జాతీయ చలనచిత్ర అవార్డులలో రెండు జాతీయ చలనచిత్ర అవార్డులను (ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్, ఉత్తమ కొరియోగ్రఫీ విబాగాలలో) గెలుచుకుంది. విశ్వరూపం విడుదలైన 2 సంవత్సరాల తర్వాత, 'ఉత్తమ విలన్' విడుదలైంది. 2015లో మల యాళం చిత్రం 'దృశ్యం' తమిళ రీమేక్ 'పాపనాసం' భారీ విజయాన్ని సాధించింది. కమల్ రాజకీయా ల్లోకి ప్రవేశించడం వల్ల సినిమాలకు సమయం కేటాయించలేకపోయాడు. అయితే 'భారతీయుడు 2' చిత్రంపై దృష్టి సారిస్తానని హామీ ఇచ్చిన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దర్శకుడు లోకేష్ కనగరాజ్ రూపొం దించిన కమల్ హాసన్ 232వ చిత్రం ''విక్రమ్'' విడుదలై భారీ వాణిజ్య విజయాన్ని సాధించి, అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన నాలుగో తమిళ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంలోని ''పాతాళ పాతాలా'' పాట యూట్యూబ్ లో అత్యధికంగా వీక్షించబడిన పాటగా నిలిచి, కమల్ హాసన్ అభిమానుల నుండి ప్రశంసలు అందుకుంది. కమల్ హాసన్ ఇప్పటివరకూ వివిధ భాషల్లో దాదాపు 260 కు పైగా సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి తనకు తానే సాటి అనిపించుకున్నారు.
నిర్మాతగా
కమల్ హాసన్ 1981లో ''రాజ్‌కమల్ పతాకం'' స్థాపించి సినీ నిర్మాణం ప్రారంభిం చాడు. నిర్మాతగా ఆయన మొదటి చిత్రం 'రాజ పార్వై'. ఆ తరువాత రాజ్ కమల్ సంస్థ నుండి ''అపూర్వ సహోదరగళ్, దేవర్ మగన్, కురుదిప్పునల్, విరుమాండి, ముంబై ఎక్స్ ప్రెస్'' లాంటి మంచి చిత్రాలు రూపొందాయి. కమల్ హసన్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన 'మరుదనాయగం' దశాబ్దం న్నర పైగా నిర్మాణంలోనే ఉంది. 19వ శతాబ్దపు మదురై నగర వాసియైన స్వతంత్ర పోరాట యోధుడు 'మొహ మ్మద్ యూసఫ్ ఖాన్ సాహెబ్' గురించిన ఈ చిత్ర నిర్మాణమ్ రెండవ ఎలిజబెత్ రాణి చేతుల మీదుగా మొదలయింది. 2005లో కమల్ రాజ్ కమల్ ఆడియో పేరుతో ఆడియో వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఆ మరుసటేడాది ఆయన సంస్థ మద్రాసులో మల్టీప్లెక్స్ సినిమా ధియేటర్ల నిర్మాణం కూడా చేపట్టింది. కమల్ హాసన్ ఖన హౌస్ ఆఫ్ ఖద్దర్ (ఖననఖ) పేరుతో తన వ్యక్తిగత ఫ్యాషన్ లైన్ బ్రాండ్‌ను ప్రారంభించాడు.
24 ఫ్రేమ్స్‌లో ప్రవేశం
కమల్ హాసన్ కేవలం నటనలోనే కాదు.. సినిమాకు సంబందించిన 24 ఫ్రేమ్స్‌లో ఆయన తన ప్రతిభను చాటుకున్నారు. నూనుగు మీసాల వయసులో సినిమాలలో నృత్య దర్శకుడిగా పని చేశారు. ''భరత నాట్యం'' ప్రదర్శించటంలో ఆయనకి ఆయనే సాటి! కమల్ నేపథ్య గాయకుడిగా కూడా శిక్షణ పొందారు. అలాగే కథకుడిగా, గీత రచయితగా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, దర్శకుడిగా, నిర్మాతగా తనదైన శైలిని చాటుకున్నారు. ఈ నూతన శతాబ్దంలో కూడా ఆయన యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ అన్నీరంగాల్లో దూసుకు పోతున్నారు. ఏ ఇతర హీరోలకు సాధ్యంకాని విభిన్న పాత్రలు పోషించడంలో తనదైన ముద్రను వేసుకున్న కమల్... నేటికీ ఆ ప్రతిభనే ప్రదర్శిస్తూ ప్రేక్షకుల నుంచి మనన్నలు పొందుతున్నారు. కమల్ అనేక చిత్రాలకు కథలు రాసారు. స్క్రిప్ట్ ని కూడా రాసారు. అయితే ఎవరికీ తెలియని విషయం ఏమి టంటే తమిళ సాహిత్యాన్ని పెంపొందించడానికి కృషి చేశారు. వివిధ తమిళ పత్రికల్లో అనేక వ్యాసాలు రాశారు.
బిగ్ బాస్ హోస్ట్‌గా
కమల్‌హాసన్ 2017లో 'స్టార్ విజరు టీవీ'లో ప్రసార మయిన బిగ్‌బాస్ తమిళం వెర్షన్‌కు మొదటి సీజన్‌ను హోస్ట్ చేసాడు. ఈ కార్యక్రమం తమిళనాడులో అత్యధికంగా వీక్షించబడిన టెలివిజన్ సిరీస్‌లలో ఒకటిగా నిలవడమే కాకుండా, ప్రేక్షకుల నుండి సానుకూల ప్రశంశలు, సమీక్షలను పొందింది. దీంతో 2018లో ప్రసారమైన బిగ్ బాస్ రెండవ సీజన్‌కు, 2019 మూడవ సీజన్‌కు, 2020లో నాలుగవ సీజన్‌కు 2021లో ప్రసారమయిన ఐదవ సీజన్‌కు కమల్ హాసన్ హౌస్ట్‌గా వ్యవహరిం చారు, 2022 జనవరిలో ప్రారంభమై డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రసారమైన ''బిగ్‌బాస్ అల్టిమేట్'' మొదటి ఉుు వెర్షన్‌కు సైతం కమల్ హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే మూడు వారాల తర్వాత విక్రమ్ సినిమా షెడ్యూల్ కారణంగా హోస్ట్ స్థానం నుండి నిష్క్రమించాడు.
రాజకీయ నాయకుడిగా
లోక నాయకుడుగా పేరుపొందిన కమల్ హాసన్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నాడు. ఆయన ''మక్కల్ నీది మయ్యం పార్టీ- పీపుల్స్ సెంటర్ ఫర్ జస్టిస్'' పేరున రాజకీయ పార్టీ స్థాపించాడు. 2018 ఫిబ్రవరి 21న మధురై బహిరంగ సమావేశంలో పార్టీ ని ప్రకటించిన కమల్ అదే రోజు పార్టీ జెండాను ఆవిష్కరించాడు. అతని పార్టీ 2019లో జరిగిన భారత సార్వత్రిక ఎన్నికలలో 37 స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయింది. ఈ లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యం 3.72 శాతం ఓట్లను పొందింది. కాగా తమిళనాడులో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ''మక్కల్ నీది మయ్యం పార్టీ'' తీవ్ర పోరాటం చేసింది. తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తామని, ప్రజల్లోకి వెళ్లిన ఆ పార్టీని ఆదరించలేదు. కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గం నుంచి పార్టీ అధినేత కమల్ హాసన్ పై పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి వాసంతి శ్రీనివాసన్ మీద 1300 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయాడు.
సేవ కార్యక్రమాలు
కమల్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సేవ కార్యక్రమాలతోనూ తన మంచి మనసును చాటుకున్నారు. కమల్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతో కమల్ అభిమానులు పెద్ద ఎత్తున ఐ డొనేషన్ డ్రైవ్‌తో పాటు విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. మరోవైపు తన అమ్మకు గుర్తుగా రాజ్‌కమల్ నిర్మాణ సంస్థను స్థాపించి ఆ బ్యానర్?పై ఎన్నో విభిన్న కథలను తెరకెక్కించారు.
అర్థాంతరంగా ఆగిపోయిన 'మరుధనాయగమ్'
కమల్ హాసన్ కేవలం హీరో మాత్రమే కాదు.. దర్శకుడు, నిర్మాత కూడా.. అంతే కాదు.. 24 ఫ్రేమ్స్‌లో దాదాపు అన్నింటిలో కమల్‌కు అనుభవం ఉంది. అలా కమల్ హాసన్ చాలా ఇష్టంగా రాసుకున్న ఒక కథే 'మరుధనాయగమ్'. ఈ సినిమాను 1997లో ప్రారంభించారు కమల్. అప్పటికీ పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో ప్రేక్షకులకు తెలియక పోయినా.. ఈ సినిమాను ఆ రేంజ్లో ప్లాన్ చేశారు కూడా. 'మరుధనాయగమ్' సినిమా అప్పట్లో ఫిల్మ్ సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే.. ఈ సినిమా ఓపెనింగ్‌కు క్వీన్ ఎలిజెబెత్‌ను ఆహ్వానించారు. అంతే కాదు.. ఆయన ఆహ్వానాన్ని మన్నించి ఎలిజబెత్ ఆయన సినిమా సెట్‌కు వచ్చారు కూడా. ఓపెనింగ్ షాట్‌గా కమల్, పలువురు సీనియర్ నటులతో ఒక ఫైట్ సీన్‌ను ప్లాన్ చేశారు. 1997లోనే ఆ ఒక్క ఫైట్ కోసం కమల్ రూ.1.5 కోట్లు ఖర్చు పెట్టినట్టు టాక్. అంత ఇష్టంగా ప్రారంభించిన 'మరుధనాయగమ్' సినిమా కొన్నాళ్ల షూటింగ్ తర్వాత అర్థాంతరంగా ఆగిపోయింది. దీనికి కారణాలు ఏంటో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ కమల్ మాత్రం ఏదో ఒక రోజు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని ఇప్పటికీ పలుమార్లు వెల్లడించారు. దాదాపు రూ.50 కోట్ల బడ్జెట్‌ను 'మరుధనాయగమ్'పై వెచ్చించారట కమల్.
అవార్డులు, పురస్కారాలు
కమల్ హాసన్ మూడు దశాబ్దాలకు పైబడిన నట జీవితంలో మొత్తం 171కి పైగా అవార్డులను సొంతం చేసుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పురస్కారాలతో పాటు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏటా బహూకరించే ప్రతిష్ఠాత్మకమైన ఉత్తమ నటుడి పురస్కారాన్ని ''మూండ్రంపిరై, నాయకన్, భారతీయుడు'' చిత్రాలలోని నటనకుగానూ మూడు సార్లు, ఉత్తమ బాలనటుడిగా కేంద్ర ప్రభుత్వ పురస్కారాన్ని ''కలతూర్ కన్నమ్మ'' చిత్రానికి గెలుచుకున్నాడు. ''సాగరసంగమం, స్వాతి ముత్యం'' చిత్రాలకు వరుసగా 1983, 1985 లలో ఆసియా చిత్రోత్సవాల్లో ఉత్తమ నటుడి బహుమతి పొందాడు. ఆయన నటించిన ఆరు చిత్రాలు భారతదేశం తరపున అధికారికంగా ఆస్కార్ బహుమతికై పంపబడ్డాయి. 2005లో మద్రాసు లోని సత్యభామ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేటు ప్రదానం చేసింది. భారత ఉపఖండంలో మరే నటుడుకీ ఈ గౌరవం దక్కలేదు. తమిళ సినిమాకు చేసిన సేవలకుగాను తమిళనాడు ప్రభుత్వం ఆయన్ను ''కళైమామణి'' బిరుదంతో సత్కరించింది. వీటితో పాటు 19 ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ అందుకున్నాడు. భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలైన ''పద్మశ్రీ'' అవార్డును 1990లో, ''పద్మభూషణ్'' అవార్డును 2014లో అందించి కమల్‌ను గౌరవించింది.
వైవాహిక జీవితం
కమల్ హాసన్ నిజ జీవితంలో మూడు సార్లు ప్రేమలో పడ్డాడు. కెరీర్ తొలి నాళ్లలో 1978లో తన 24వ ఏటా నృత్యకారిణి వాణి గణపతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమె పెళ్ళికి ముందు 1975 'మేల్నాట్టు మరుమగల్' చిత్రంలో కమల్ హాసన్‌తో కలిసి నటించింది. వివాహానంతరం వాణి హాసన్ కాస్ట్యూమ్ డిజైనర్‌గా పలు సినిమాలకు పనిచేశాడు. పదేళ్లు కాపురం చేసిన తర్వాత విడాకులు తీసుకుని సహనటి సారికతో కలిసి జీవించడం ప్రారంభించాడు. వారికి మొదటి కూతురు శృతి హాసన్ పుట్టిన తర్వాత వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత మరో కూతురు అక్షరా హాసన్ జన్మించింది. అనంతరం 2004లో సారికతో విడాకులు తీసుకున్న తర్వాత 2005 నుండి గౌతమితో 13 ఏళ్ళ పాటు సహజీవనం చేశాడు. కమల్ నట వారసులుగా ఆయన కూతుళ్లు శృతి హాసన్, అక్షరా హాసన్‌లు హీరోయిన్లుగా రాణిస్తున్నారు.
-పొన్నం రవిచంద్ర, 9440077499