Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గృహహింస సాధారణం అని అనుకునే సమాజంలో, భర్త భార్యను హింసించడం, అతనికి వివాహం ఇచ్చిన హక్కు అని ఒప్పుకునే స్త్రీలు ఎక్కువగా ఉన్న సమూహంలో ఈ విషయంపై వివరంగా, లోతుగా మన సినిమాలలో చర్చ జరగలేదు. గృహ హింస వెనుక ఉండే మానసిక కారణాలు, ఆ హింసను భరించడానికి సిద్ధపడే స్త్రీల ఆలోచన తీరు, దానిని ప్రభావితం చేసే సామాజిక, ఆర్ధిక, మానసిక కారణాల గురించి ఇప్పటి దాకా ఏ సినిమా కూడా వివరంగా చర్చించలేదు. ఆ కొరతను ''అమ్ము'' సినిమా తీర్చిందని చెప్పవచ్చు. 2022లో వచ్చిన ఈ తెలుగు సినిమా కథను రచించి, దర్శకత్వం వహించింది చారుకెష్ శేఖర్. ఐశ్వర్య లక్ష్మి, నవీన్ చంద్ర, బాబీ సింహా ప్రధాన పాత్రలు పోషించారు. ఇది నేరుగా అమజాన్ ప్రైమ్‌లో విడుదల అయిన సినిమా. ఈ సినిమాకు సంభాషణలు అందించింది పద్మావతి మల్లాది. వీరి సంభాషణలు ఈ సినిమాకు మంచి బలాన్ని ఇచ్చాయి. అయితే సినిమాగా మనం గమనిస్తే ఇందులో కొన్ని లోపాలు కనిపిస్తాయి. కొంత వాస్తవికతకు అసమంజసమైన కొన్ని సంఘటనలు జోడించి సినిమాకు ముగింపు పలికినా మూల విషయంపై ఎక్కడా ప్రభావం పడకుండా సినిమా తీయగలిగారు. ముఖ్యంగా సినిమాలో రైల్వేస్టేషన్లో వచ్చే ఆ అర నిముషం సీన్‌తో దర్శకులు ఈ సమస్యకు అద్భుతమైన ఆలోచనాత్మకమైన ముగింపుని ఇచ్చారు. ఆ సీన్ ఎంత సహేతుకంగా ఉంటుందంటే ఇక దాని తరువాత చర్చించడానికి ఏమీ ఉండదు.
వివాహ బంధంలో భర్త భార్యపై పూర్తి అధికారాన్ని నియంత్రణను ప్రదర్శించే క్రమంలో ఈ గృహహింస మొదలవుతుంది. దీనికి ప్రత్యేకమైన కారణాలు ఉండవు. తన అనుకున్న ప్రతి దాన్ని పూర్తిగా తన అధీనంలో ఉంచుకోవాలనుకునే ఆలోచన ఈ హింస వెనుక పని చేస్తూ ఉంటుంది. బయటికి చాలా మంచిగా కనిపించే వ్యక్తులు తమ భార్యల వద్ద అతి కిరాతకంగా ప్రవర్తించడం కొన్ని చోట్ల కనిపిస్తుంది. ఇది ఆ స్త్రీలను ఏ స్థితికి నెట్టివేస్తుందంటే ఆ హింసను వాళ్ళు సహజంగా స్వీకరించాలనే ఆలోచనలోకి వెళ్ళిపోతారు. అంతగా ఆ స్త్రీలను మానసికంగా లోబర్చు కుంటారు ఆ భర్తలు. అంటే వారిని శారీరకంగానే కాదు మానసికంగా కూడా తమ నియంత్రణలో ఉంచుకోవడం ఈ గృహహింసలో జరిగే రాజకీయం. అందుకే ఎన్ని దెబ్బలు తిన్నా ఎంత క్రూరత్వాన్ని భరించినా ఈ భార్యలు ఆ భర్తలను వదలరు, పైగా ఇంకా ప్రేమిస్తారు. ఇంకా లొంగి ఉంటారు. ఎంత ఎక్కువగా తాము ప్రేమిస్తే ఆ భర్తలు తమను అంత బాగా చూసుకుంటారని తపిస్తారు. అందుకోసం తమ వ్యక్తిత్వాన్నే తాకట్టు పెడతారు. కొందరు స్త్రీలు ఈ దెబ్బలు తినడంలో ఒక రకమైన ఆనందాన్ని తమ కర్తవ్యాన్ని, ధర్మాన్ని నిర్వహిస్తున్నామన్న తృప్తిని పొందే స్థాయిలోకి వెళ్ళిపోతారు. ఇది అతి విషాదమైన స్థితి. తాము భరిస్తున్న హింసకు బదులుగా సమాజం నుండి లభించే సానుభూతిని కొందరు స్త్రీలు తమ జీవితాలకు లభిస్తున్న గొప్ప కాంప్లిమెంట్‌గా స్వీకరించే స్థాయిలోకి వెళ్ళిపోవడం కూడా చాలా సందర్భాలలో జరుగుతుంది.
సాధారణంగా భార్యను హింసించడానికి కొందరు భర్తలు ఎన్నుకునే మార్గాల గురించి ముందు తెలుసుకోవాలి. భార్యను స్నేహితుల మధ్య, కుటుంబం మధ్య లోకువగా చేయడం, భార్య సాధించిన విజయాలను తక్కువ చేయడం, అసలు ఏ నిర్ణయం తీసుకోగలిగే స్థాయిలో భార్య లేనట్లుగా ప్రవర్తించడం, ప్రతి విషయంలోనూ బెదిరింపును ఉపయోగించడం, తాను లేకపోతే భార్యకు గౌరవం లేదనే ఆలోచనను భార్య మనసులోకి ఎక్కించడానికి ఎన్నో ప్రయత్నాలు చేయడం, భార్యతో మాట్లాడాలంటే కొడుతూ నెడుతూ గిచ్చుతూ తోస్తూ ఆమె బలహీనురాలని ఆమె నమ్మేలా ప్రవర్తించడం, భార్యపై అన్ని వేళలా నిఘా పెట్టడం, తాగుడును సాకుగా తీసుకుని ఆమెని హింసించడం, తన కోపానికి కూడా భార్య ప్రవర్తనే కారణం అని ఆమె నమ్మేలా సమర్ధించుకోవడం, సెక్స్‌లో అధికారాన్ని చూపుతూ భార్య ఇష్టపడని చర్యలు చేయడం, ఆ బంధంలో నుంచి ఆమె బైటపడలేదనే ఆలోచనను ఆమెలో కలిగించడం, భార్య ఇష్టపడే వ్యక్తుల నుంచి పరిస్థితుల నుంచి ఆమెను దూరం చేయడం, ఏదో గొడవ జరిగినప్పుడు ఆమెను ఎక్కడో ఒంటరిగా వదిలేసి ఆమె అసహాయతను ఎత్తి చూపించడం.
పైన చెప్పిన అంశాలన్నీ కూడా సైకాలజిస్టులు భార్యను హింసించే మగవారి లక్షణాలుగా చర్చిస్తూ వాటిని గుర్తించి స్త్రీలు తమ జీవితంలో నిర్ణయాలు తీసుకోవాలని చెపుతారు. ఈ లక్షణాలున్న మగవారితో జీవించే స్త్రీలు తమ అస్థిత్వాన్ని మరచిపోయి జీవించేస్తూ ఉంటారు. వీరు ఆ జీవితాన్ని అంగీకరించే క్రమంలో తమను తాము కోల్పోతారు. కాని అది ఒప్పుకోరు. అందువలనే గృహహింసను గుర్తించడానికీ, అది అమానవీయం అని, హేయమని చర్చించడానికి కూడా చాలా మంది ముందుకు రారు. అటువంటి వ్యక్తులు ఇంకా ఉన్న నేటి పరిస్థితులలో 'అమ్ము' సినిమా గృహహింసను విపులంగా చర్చిస్తుంది. హింసించే భర్త మనస్తత్వాన్ని, ఆ మనస్తత్వాన్ని ఒప్పుకునే స్థితిలోకి వెళ్ళిపోయే స్త్రీ మానసిక స్థితిని ఎంతో పరిశీలనతో సైకలాజికల్ స్టడీని ఆధారం చేసుకుని ప్రతి విషయాన్ని స్పృశించిన సినిమా ఇది. గృహహింసను భర్త ఎన్ని రకాలుగా ప్రయోగిస్తాడో పైన ప్రస్తావించడం జరిగింది. ఆ లక్షణాలన్నీ కూడా మానసిక వైద్యులు ప్రస్తావించినవి. వాటిలో ప్రతి అంశాన్ని, లక్షణాన్ని ఈ సినిమాలో చూపించారు దర్శకులు. అందువలన ఈ సినిమా వెనుక చాలా స్టడీ జరిగించని చెప్పక తప్పదు.
అమ్ము వివాహం ఓ పోలీస్ ఆఫీసర్‌తో జరుగుతుంది. కొన్ని రోజులు ఆనందంగా గడిచిన తరువాత క్రమంగా అతని హింసించే నైజం బైటపడుతుంది. అమ్ము ఏమీ చేయలేకపోతుంది. ఆ హింసను ఎలా ఎదుర్కోవాలో కూడా అర్ధం కాని పరిస్థితిలోకి ఆమె భర్త ఆమెను నెట్టేస్తాడు. అతని నుండి పారిపోలేదు. అక్కడ ఉండలేదు. చివరకు అతన్ని ప్రేమతో మార్చుకోవాలనే ధోరణిలోకి వెళ్ళిపోతుంది. అది తన విజయంగా భావిస్తాడు ఆమె భర్త. తానెందుకు ఇంతలా లొంగిపోతుందో, ఎందుకు అశక్తురాలిగా మారిపోయిందో ఆమెకు కూడా అర్ధం కాదు. కొన్నిసార్లు భర్తకు కోపం రావడానికి తనే కారణమేమో అని తనను తాను నిందించుకుంటుంది కూడా. కాని చిరవకు ఆ జీవితం నుండి బయటపడాలని నిశ్చయించుకుంటుంది. ఇక్కడ కొన్ని నాటకీయ పరిస్థితు లను కథకు జోడించి చివరకు ఆమె తనను తాను రక్షించుకు న్నట్లు కథను మలచారు దర్శ కులు. గృహహింసను భరించే స్త్రీలకు తమకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఎవరి వద్దా చెప్పుకోలేని పరిస్థితులను కల్పించే వివాహ వ్యవస్థ పట్ల ఆలోచన కలిగించే ప్రయత్నం ఈ సినిమా చేస్తుంది.
సినిమాలో వచ్చే ఒక సీన్ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. భర్తతో బెల్టు దెబ్బలు తిని ఆ ఇంటి నుండి పారిపోవాలని రైల్వే స్టేషన్‌కు వెళుతుంది అమ్ము. ఆమె స్థితి గమనించిన ఓ బిచ్చగాడు ఆమెతో సంభాషణ మొదలెడతాడు. అతనితో మాట్లాడుతూ, బహుశా తన భర్త తప్పు ఇందులో లేదేమో, తన ప్రవర్తనే ఈ హింసకు కారణమేమో అని అంటూ ఆ భర్తను ఇంకా ఇంకా ప్రేమించి అతన్ని తన వాడిని చేసుకుంటాను అని అక్కడి నుండి లేచి వెళ్ళిపోతుంది అమ్ము. ఆమె వైపు జాలిగా చూస్తుంటాడు ఆ బిచ్చగాడు. చివరి సీన్లో కొత్త జీవితాన్ని కోరుకుంటూ స్టేషన్‌కు వచ్చిన అమ్ము అతన్ని చూసి తాను ఇంతకు ముందు చేసింది తప్పు అని తెలిసి ఎందుకు తనను ఆపలేదని ఆ బిచ్చగాడినికి అడుగుతుంది. దానికతను ''ఎవరి జీవితపు నిర్ణయాలు వారే తీసుకోవాలి'' అని చెప్పి చిరునవ్వు నవ్వుతాడు. ఈ సినిమా ఇచ్చే సందేశం ఇదే కావచ్చు. వివాహం అనే వ్యవ్యస్థలో జీవిస్తున్న స్త్రీ చుట్టూ ఎన్నో బంధాలు, ఎన్నో చిక్కుముడులు ఉండి తీరతాయి. వాటిని ఆమె మాత్రమే పరిష్కరించుకోవాలి. స్త్రీలు ఎవరి జీవితాలను వారే నిర్ణయించు కోవాలి. మరొకరు వారి జీవితంలో జోక్యం చేసుకోలేరు. హింసను భరిస్తున్న స్త్రీ తీసుకున్న నిర్ణయానికి అనుగుణం గా చుట్టూ ఉన్న వారు సహాయపడగలరేమో కాని ఆమె నిర్ణయా లను వారు తీసుకోలేరు. ఈ విషయాన్ని స్పష్ట పరుస్తూ సినిమాను ముగించడంలో దర్శకులు ఈ విషయానికి పూర్తి న్యాయం చేసారని అనిపిస్తుంది.
'అమ్ము' పాత్రను ఐశ్వర్య లక్ష్మి పోషించారు. చాలా బాగా నటించారామె. ఆమె భర్త రవీంద్రనాధ్గా నవీన్ చంద్ర ఉత్తమ స్థాయి నటన ప్రదర్శించారు. ఆయన ముఖంలో క్షణంలో వచ్చీ పోయే భావాలను ఆయన అద్భుతంగా పలికించారు. ఇక ప్రభు పాత్రలో బాబీ సింహ అలరిస్తారు. అమ్ముకు సహాయపడే ఓ ఖైదీగా ఇతను నటిం చారు. ఓ ఖైదీగా అధికారంలో ఉన్న పోలీస్ చేతిలో అతను అనుభవి స్తున్న హింస, భార్య స్థానంలో ఉండి అమ్ము అనుభ వించిన హింసలో ఏ మాత్రం తేడా లేదని చూపుతూ వచ్చే సీన్లు బావుంటాయి. సినిమాలో ప్రథమ స్థానంలో సంభాషణలు నిలుస్తాయి. ఎక్కడా ఒక డైలాగ్ కూడా అతిగానో అనవసరంగానో ఉండదు. అంత బాగా రాయబడిన సంభాషణలే సినిమాను ఓ స్థాయిలో నిలబెట్టాయని చెప్పవచ్చు.
- పి.జ్యోతి, 9885384740