Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సింగారానికి బంగారం ఒక్కడే కొడుకు. ఒక్కడే కదా అని గారాబం చేశాకె తల్లీతండ్రి. పనీ పాటా లేకుండా ఇంట్లో తిని తొంగుంటున్న బంగారానికి ఏదైనా పని అప్ప చెప్పరాదుటయ్యా అని భార్య సింగారం చెవిలో డబుల్ బెడ్రూం ఇల్లే కట్టింది.
సింగారానికి భార్య చెప్పింది వినగా వినగా విషయం అర్థమైంది. ఓ నాడు కొడుకుని పిలిచి నాయనా బంగారం ఇదిగో డబ్బు మూట. పట్నంలో సంతకు వెళ్ళి ఇంట్లోకి కావల్సినవి కొనుక్కురాగలవా అన్నాడు. ఇల్లు వదిలి బయట తిరగాలంటే బద్ధకంగానే ఉన్నా డబ్బు మూట పట్టుకుని సంతలో తిరగడం భలేగా వుంటుందనుకున్న బంగారం అదెంత పని నాన్నారు. నాకసలు ఏ పనీ చెప్పటం లేదని తెగ బాధపడిపోతున్నా. ఇక చూస్కోండి నా ప్రతాపం అంటూ బయలుదేరాడు బంగారం. జాగర్త నాయనా అన్నది తల్లి డబ్బు మూట జాగ్రత్త అన్నాడు తండ్రి.
ఎలాగైతేనేం నడిచీ పరుగెత్తీ, వాళ్ళనూ వీళ్ళనూ వాకబు చేసి పట్నం చేరాడు బంగారం డబ్బు మూట ఊపుకుంటూ.
ఇదే సంత అన్నారెవరో! హమ్మయ్య సంత దాకా వచ్చాం సరుకులఱు కొనలేమా అనుకున్నాడు బంగారం.
అవాళ అక్కడ జరుగుతున్న సంత పప్పు, ఉప్పు, మిరియాలు, మిరపకాయల సంతకాదు. వారంలో ఆ రోజున జరిగే ప్రత్యేకమైన సంత పశువుల సంత.
ఎప్పుడూ తిండి యావేనా అవెక్కడైనా ఎప్పుడైనా కొనవచ్చు. ఇప్పుడీ సంతలో చిత్ర విచిత్రమైన పశువులున్నవి. తెగ బలిసింది బాగా పనికొచ్చేదీ కొనుక్కుపోయి సింగారం కొడుకుననిపించుకోవాలనుకున్నాడు.
మ్యావ్ మ్యావ్ చప్పుళ్ళతో పిల్లి స్టాల్ అదిరిపోతున్నది. రంగురంగుల పిల్లులు ఒకటి పట్టుకుపోతే పోలా ఇంట్లో ఎలుకల బాధ తప్పుతుంది అనుకున్నాడు బంగారం. తెల్లటి తెలుపూ నుదుటి మీద రూపాయి కాసంత నల్ల మచ్చ ఉన్న పిల్లి బాగా నచ్చింది బంగారానికి. దాని ప్రత్యేకతలేమిటో తెల్సుకోవాలనుకుని అడిగాడు. అది ఎలుకల్ని అలా చూస్తూ ఉండగానే గుటకాయ స్వాహా చేస్తుందని అందుకే దాని పొట్ట బాగా పెరిగిందని మరొక విశేషమేమిటంటే అది గోడ మీదిపిల్లి అనీ అది ప్రహరీ గోడ మీద కూచున్నప్పుడు ఇటు దూకుతుందా లేక అటు దూకుతుందా అన్నది హరిహరులైనా చెప్పలేరని అన్నాడు పిల్లులమ్మేవాడు. ఈ గోడ మీది పిల్లిని గోడమీద కూచోబెట్టి ఇటా అటా అని బెట్టింగులు కట్టి బోలెడు సంపాదిచవచ్చు అనుకుని బేరం చేయబోయేడు బంగారం. పిల్లికి విశ్వాసమనేదే లేదు. పాలు పోసిన వాడినే రక్కుతుంది. అసలు విశ్వాసంలో కుక్కను మించింది లేదు. రండి బాబు రండి. విశ్వాసానికి పెట్టింది పేరైన కుక్కనే కొనండి, పిల్లిని కొని మోసపోకండి అని పక్క స్టాల్లో వాడరవసాగాడు. బంగారానికి అది కరెక్టేననిపించింది. పిల్లిని చంకన పెట్టుకు పోవడం కంటే కుక్కను పట్టుకుపోవడం మేలు అనుకున్నాడు. కుక్కల స్టాల్కు వెళ్ళాడు.
భౌభౌ మంటున్న కుక్కల్లో ఓ తెల్లమచ్చల గోధుమ రంగు కుక్క బాగా నచ్చింది బంగారానికి. ఆ కుక్క గురించి అడిగాడు. తమరు చాలా తెలివైన వారులా ఉన్నారు. మంచి సెలక్షన్. ఇక్కడ ఇన్ని కుక్కలు ఉన్నాయా వాటిల్లో అన్నింటికంటే విశ్వాసం ఉన్న కుక్క అన్నాడు కుక్కలు అమ్మేవాడు. ఏవిటి గ్యారంటీ అనడిగాడు బంగారం తన తెలివికి తానే మూర్ఛపోతూ. దీని విశ్వాసం సంగతి చూపిస్తా చూడండి అంటూ కుక్కలవాడు దాని వెనుకకు వెళ్ళి నిలబడ్డాడు. కుక్క అదే పనిగా తోక ఊపసాగింది. చూశారా తోక ఊపడమే విశ్వాసం అన్నమాట అంటూ అమ్మేవాడు ముందుకువచ్చి బంగారాన్ని కుక్క వెనక్కు పంపాడు. అది తక్షణమే తోక ఊపసాగింది. ఇదేమిటి నన్ను చూసి కూడా తోక ఊపుతున్నది అన్నాడు బంగారం అనుమానంగా. ఎవరు కొంటే వారికి తోక ఊపుతుంది. మీరు మరొకరికి అమ్మండి వారికీ ఊపుతుంది. డబ్బిచ్చి కొన్నవారెవరైనా సరే తోకూపుతూ విశ్వాసం ప్రకటిస్తుంది అన్నాడు డాగ్ సెల్లర్. ఇలా డబ్బు ఇచ్చి ఎవరు కొంటే వారికి తోక ఊపే కుక్క అవసరమా అనుకుని పక్క స్టాల్లోకి వెళ్ళాడు బంగారం.
రండి బాబూ రండీ బూడిద రంగూ పలుగు రాళ్ళలాంటి దంతాలు ఉన్న ఈ జీవాల్ని గాడిదలు అని అంటారు. గాడిద గుర్రానికి మేనమామ. మనుషులు స్వారీ చేయడానికి దానికి ట్రైనింగ్ ఇచ్చింది ఇదే. దీని వల్ల లాభాలు అనేకం. తడి చెత్త పొడి చెత్త అనే బేధం లేదు. ఏ చెత్తనయినా నమిలేస్తుంది అన్నాడు. ఉన్నట్టుండి గాడిద ఓండ్ర పెట్టసాగింది. జడుసుకున్నాడు బంగారం. భయపడకండి అసెంబ్లీలో అవతలిపార్టీ వాడు మాటలు వినపడకుండా చేస్తుంది దీని సౌండ్. ఇంట్లో పెళ్ళాం అరుపులు వినపడకుండా సేవ్ చేస్తుంది. టీవీలో చర్చలకు మా బాగా పనికొస్తుంది. డబ్బిచ్చి కొన్నా సరే పొరపాటున దీని వెనక్కు వెళ్ళద్దు. రెండు వెనక కాళ్ళు ఝాడించిందనుకోండి మిగిలిన పళ్ళెన్నో డెంటిస్టు లెక్క పెట్టాల్సిందే అన్నాడు గాడిలమ్మేవాడు.
ఇది కొని పళ్ళూడగొట్టించుకోవడం అవసరమా అనుకుని పక్క స్టాల్లోకి అడుగు పెట్టాడు. ఇప్పటిదాకా తను చూసింది నాలుగు కాళ్ళ జీవాలైతే ఇవి రెండు కాళ్ళజీవులు. తనలాగే ఉన్నారు మమూలు మనుషులే కదా అనుకున్నాడు బంగారం. మనుషుల్ని అమ్ముతున్నావేమిటి అనడిగాడు అమ్మేవాడితో.
వీళ్ళు మామూలు మనుషులు కారు అంటూ బంగారం చెవిలో గుసగుసలాడాడు మనుషుల్నమ్మేవాడు. చాలా సేపట్నించి నిలబడి కాళ్ళు పీక్కుపోతున్నాయి. నువ్వే పార్టీవాడివో నాకు తెలీదు. ఏ పార్టీ అయినా నాకొకటే. కొనుక్కున్నావంటే నీకు నీ పార్టీకి జై కొడతాను కొనుక్కోరాదూ అన్నాడు ఓ మనిషి. మనుషుల్ని కొనడమేమిటో పార్టీ ఏమిటో అర్థం కాలేదు. వీళ్ళు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నుంచి ప్రజల్ని పరిపాలిస్తారు. పిండి కొద్దీ రొట్టె. ఏ పార్టీ వాడు డబ్బు ఎక్కువ ఇస్తే వాడి పార్టీలో చేరతారు. ప్రతి ఎన్నికలకీ అమ్ముడు పోతుంటారు. నువ్వు ఏ పార్టీ వాడివీ కాకపోతే ఇక్కడున్న వాళ్ళందర్నీ కొనేసి ప్రభుత్వం ఏర్పాటు చేసుకో అన్నాడు. మామూలు కాని కాస్ట్లీ మనుషుల్ని అమ్మేవాడు.
అంతడబ్బు నా దగ్గర లేదులే అంటూ తిండి సామాన్లు అమ్మే బజారెక్కడో కనుక్కుని అక్కడికి బయలుదేరాడు బంగారం!!!
-చింతపట్ల సుదర్శన్, 9299809212