Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక మనిషి ఏర్పర్చుకున్న లక్ష్యానికి అనుగుణంగానే ఆయన లేదా ఆమె సామర్థ్యం పెరుగుతుంది. ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో అనేక అడ్డంకులు, కష్టాలు, కన్నీళ్లు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసం అనే ఆయుధాన్ని ధృడంగా స్వీకరించినట్లయితే అననుకూల పరిస్థితులు కూడా అనుకూలంగా మారతాయి. జీవితం ఎవరికీ వడ్డించిన విస్తరి కాదు. ప్రతి మనిషి జీవితంలోనూ అనేక కష్టాలు, కడగండ్లుంటాయి. జీవితం అంతా సాఫీగా జరిగే సుఖ ప్రయాణం కాదు. జీవితమంటే నిత్య జీవిత పోరాటం. ప్రతి మనిషి వ్యక్తిగత సమరం.
వాస్తవానికి ఏ మనిషికైనా తరగతి గదిలో నేర్చుకున్న పాఠాల కంటే జీవితమనే విశ్వవిద్యాలయం లో నేర్చుకున్న పాఠాలే విలువైన అనుభవాన్ని నేర్పుతాయి. ఆ అనుభవమే ప్రతి మనిషి ఎలా జీవించాలో దారి చూపుతుంది. అది ఇతరులకు దిక్సూచి అవుతుంది. అందుకే పెద్దలు ప్రతి మనిషికి అనుభవమే గురువు లాంటిదని చెబుతారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను కన్నీళ్లను ఎదుర్కొనేందుకు ఆత్మ విశ్వాసానికి మించిన ఆయుధం లేదని మెక్సికో దేశానికి చెందిన కెప్టెన్ సాల్వడార్ అల్వరెంగా నిరూపించారు. సరైనా తిండి నీరు లేకుండా ఆకాశం అనే పందిరి కింద ఆయన చిన్న పడవలో 438 రోజులు గడిపారు. ఎండకు ఎండి, చలికి వణుకుతూ, వానకు నానుతూ పచ్చి చేపలనే ఆహారంగా స్వీకరించి అతి కష్టంమ్మీద తన ప్రాణాలు నిలుపుకున్నాడు. సగటు మనిషి ఏ చిన్న కష్టం ఎదురైనా విల విల లాడిపోయి తన జీవితం ఇక ముగిసి పోయిందని భావిస్తున్న రోజులివి. అలాంటి వారు సాల్వడార్ జీవిత గాథ నుంచి స్ఫూర్తి పొందాలి. రాత్రి తరువాత పగలు, పగలు తరువాత రాత్రి కాలం ఎలా మారుతుందో కష్టాల తరువాత కచ్చితంగా ప్రతి మనిషి జీవితంలోనూ మంచి రోజులుం టాయని విశ్వసించాలి. సాల్వడార్ ఒక సామాన్య జాలరే కావచ్చు. కానీ ఆయన విశ్వ మానవులకు గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. ఎంతో స్ఫూర్తిమంతమైన ఆయన నిజ జీవిత గాథ ఇలా సాగింది.
ఇజిక్విల్ కారోడోబా అనే మరో జాలరితో కలిసి సాల్వడార్ నవంబర్ 17, 2012 సంవత్సరంలో మెక్సికో నుంచి ఫసిఫిక్ సముద్రంలో చేపలు పట్టేందుకు బయలు దేరాడు. అయితే ఆ రాత్రి ఫసిఫిక్ సముద్రంలో వచ్చిన ఒక పెద్ద తుపాను సాల్వడార్, ఇజిక్విల్ ప్రయాణిస్తున్న పడవను తీరం నుంచి 80 మైళ్ల లోపలకు లాక్కెల్లింది. పెద్ద పెద్ద రాకాసి అలలకు వారి చిన్న పడవ అతలాకుతలం అయింది. దీంతో వారికి తీరంతో రేడియో సంబంధాలు తెగిపోయాయి. పడవలోకి చేరిన నీటిని ఇద్దరు ఎత్తిపోసి అతికష్టంమ్మీద అది మునిగిపోకుండా కాపాడు కున్నారు. 5 రోజుల భీకర తుపాను అనంతరం సముద్రం శాంతించింది. జాలరుల కోసం విమానాలు, హెలికాప్టర్లు అనేక రోజుల పాటు గాలించినా వారి జాడ లభించలేదు. వందల మైళ్లు సముద్రం లోపలకు పడవ కొట్టుకుపోయింది. మధ్యలోనే సాల్వడార్తో పాటు చేపల వేటకు వెళ్లిన ఇజిక్విల్ మరణించాడు. సాల్వడార్కు భయమేసింది. సహచరుని మరణం ఆయనను మానసికంగా కృంగదీసింది. అయినా ధైరాన్ని కూడగట్టుకుని ఎలాగైనా తాను బతికి తీరాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. తాను సజీవంగా ఇంటికి తిరిగి వెళ్లకపోతే తన 12 సంవత్సరాల కూతురు అనాథ అవుతుందని సాల్వడార్ మదనపడ్డాడు. ఆ మదనమే ఆయనను ధృడ సంకల్పుణ్ణి చేసింది. ఇక పరిస్థితులకు ఎదురొడ్డి పచ్చి చేపలను, ఇతర సముద్ర జీవులను ఆహారంగా తీసుకుంటూ 438 రోజులు జీవించాడు. ఆ మనిషి రూపు రేఖలే పూర్తిగా మారిపోయాయి. తల వెంట్రుకలు, గడ్డం పెరిగిపోయాయి. చివరకు జనవరి 29న 2014న ఆయన మార్షల్ అనే చిన్న ద్వీపానికి చేరుకున్నాడు. మెక్సికో దేశంలో సముద్రంలోకి వెళ్లిన సాల్వడార్ ఏడు వేల మైళ్ల దూరం ప్రయాణించాడు. నడవలేని స్థితిలో అచేతనంగా పడి ఉన్న సాల్వడార్ను కొంత మంది వ్యక్తులు కనుగొన్నారు. వారు స్థానిక ప్రభుత్వ అధికారులకు సమాచారమిచ్చారు. అనేక వైద్య పరీక్షల అనంతరం సాల్వడార్కు చికిత్స చేసి వైద్యులు మామూలు మనిషిని చేశారు. 2014లో జరిగిన ఈ యదార్థ సంఘటన ఆధారంగా జొనాథన్ ఫ్రాంక్లిన్ అనే పాత్రికేయుడు '438 డేస్' ఒక పుస్తకాన్నే రాశారు. తాను ప్రాణపదంగా ప్రేమించే ముద్దుల కూతురుని ఎలాగైనా కలుసుకోవాలనే తపనే సాల్వడార్ను బతికించింది. ఆత్మవిశ్వాసం ఆయనకు తోడ్పడింది. ఎంతో స్ఫూర్తినిచ్చే ఈ పుస్తకం అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో వేల కాపీలు అమ్ముడుపోయింది.
- జి.గంగాధర్ సిర్ప, 9010330529