Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నటశేఖరుడిగా.. సూపర్ స్టార్‌గా.. తెలుగు రాష్ట్రాలలో తనదైన ముద్ర వేసి, పలువురి అభిమానాన్ని చూరగొన్న కృష్ణ మరణంతో తెలుగు చిత్రపరిశ్రమ ఒక్కసారిగా మూగబోయింది. ఎనబై ఏళ్ల జీవితంలో ఎన్నో ఎత్తు పల్లాలు చూసిన కృష్ణ ఆత్మవిశ్వాసమే ఆయుధంగా, సాహసమే ఊపిరిగా, పట్టుదల, దైర్యంతో తెలుగు సినిమా సూపర్‌స్టార్‌గా ఐదు దశాబ్దాలు కృష్ణ నట ప్రస్థానాన్ని కొనసాగించారు. హేమహేమీలయిన ఎన్టీఆర్, అక్కినేనిలు చలనచిత్ర పరిశ్రమని ఏలుతున్న సమయంలో పరిశ్రమలో అడుగుపెట్టి, సాహసమే ఊపిరిగా, పట్టుదలే సోపానంగా, ఓటమే విజయానికి పునాదిగా నమ్మి.. అంచలంచలుగా సూపర్‌స్టార్ స్థాయికి ఎదిగిన సుకుమారుడు, నటశేఖరుడు, పద్మవిభూషణుడు కృష్ణ. తెలుగు చలనచిత్ర రంగంలో నూతన ఒరవడి సృష్టించి, అధునాతన సాంకేతిక విలువలకు పట్టం కట్టి, సినిమాలు నిర్మించి నష్టపోయి, పడిలేచిన కెరటంలా విజృంభించి, నాలుగు దశాబ్దాల పాటు తనదైన ముద్రతో 350 పైచిలుకు సినిమాల్లో నటించి అభిమానులను అలరించిన కృష్ణ నవంబర్ 16 వ తేదీన మహాభినిష్క్రమణతో తెలుగు సినిమా చరిత్రలో ఓ శకం ముగిసింది. ఓ సువర్ణాధ్యాయానికి తెరపడింది.
గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో 1943 మే 31వ తేదీన ఘట్టమనేని రాఘవయ్యచౌదరి, నాగరత్నమ్మ దంపతులకు జన్మించారు కృష్ణ. ఆయన అసలు పేరు శివరామకృష్ణమూర్తి. ఐదుగురు సంతానంలో ఆయనే పెద్దవాడు. తెనాలి తాలూకా హైస్కూల్లో పదోతరగతి వరకు విద్యనభ్యసించిన అనంతరం ఏలూరు సి.ఆర్.రెడ్డి కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. చిన్నతనంలో చూసిన 'పాతాళభైరవి' సినిమా ఆయన మనసుపై చెరగని ముద్రవేసింది. ఏలూరు కళాశాలలో చదువుకుంటున్నప్పుడు అక్కినేని నాగేశ్వరరావు 60 చిత్రాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాలేజీ ప్రాంగణంలో సన్మాన సభ ఏర్పాటు చేశారు. అక్కడకు వచ్చిన అభిమానుల కోలాహలం, అక్కినేనికి జరిగిన సన్మాన వైభవాన్ని చూసిన కృష్ణకు నటుడు అంటే ప్రజలకు ఎంత ఆరాధనో అర్థమైంది. ఆ సంఘటనతో కృష్ణ మదిలో వెండితెరపై వెలిగిపోవాలనే కోరికకు అంకురార్పణ జరిగింది. డిగ్రీ పూర్తి చేసిన అనంతరం ఇంజనీరింగ్‌లో సీటు రాకపోవడంతో ఇక సినిమాలే తన జీవితమని నిర్ణయించుకున్నాడు. సొంత ఊరు తెనాలికి చెందిన నటుడు జగ్గయ్య, నిర్మాత చక్రపాణి తన తండ్రికి పరిచయస్తులు కావడంతో వారి మీద భరోసాతో మద్రాస్ నగరంలో అడుగుపెట్టి తెలుగు చిత్రసీమలో ఎన్నో ప్రయోగాలకు పెద్దపీట వేసి, అనేక రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. సాంకేతికంగా పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించాడు. నటుడిగానే కాకుండా నిర్మాత, దర్శకత్వం, పంపిణీరంగం, స్టూడియో సెక్టార్... ఇలా పలు విభాగాల్లో ప్రతిభ చూపించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న కృష్ణ 17 చిత్రాలకు దర్శకత్వం వహించాడు. వీటిలో 'శంఖారావం', 'కొడుకు దిద్దిన కాపురం', 'బాల చంద్రుడు' వంటి ఘన విజయాలున్నాయి. తన సతీమణి విజయ నిర్మలతో కలిసి 48 చిత్రాల్లో హీరోగా నటించాడు. తర్వాత అత్యధికంగా జయప్రదతో 47 చిత్రాలు చేశాడు. కృష్ణ కెరీర్లో మైలురాయిగా చెప్పుకునే 'అల్లూరి సీతారామరాజు' చిత్ర రూపకల్పనలోనూ దర్శకుడి బాధ్యతలు తీసుకున్నాడు కృష్ణ. ఈ చిత్ర దర్శకుడు వీ రామచంద్రరావు చిత్రీకరణ మధ్యలోనే కన్నుమూశారు. దీంతో కృష్ణ మిగిలిన సినిమాను తన సారథ్యంలోనే పూర్తి చేశాడు.
నిర్మాతల హీరో కృష్ణ
కృష్ణ మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా పేరుతెచ్చుకున్నాడు. క్లుప్తంగా, ముక్కుసూటిగా, నిజాయితీగా మాట్లాడే ఆయన తన సినిమా ఫ్లాప్ అయితే నిర్మొహమాటంగా ఆ సంగతి అంగీకరించేవాడు. తన బలాలతో పాటు లోపాలపైనా, తనకున్న పరిమితులపైనా కూడా చక్కని అవగాహన ఉండేది. తనతో సినిమా తీసి నిర్మాత ఆర్థికంగా నష్టపోయినప్పుడు తానే నిర్మాత వద్దకు వెళ్ళి వాళ్ళు దెబ్బతినకుండా ఉండేందుకు వెంటనే మంచి సినిమా ప్లాన్ చేయమని, అడ్వాన్స్ అక్కర్లేదని డేట్లు ఇచ్చేవాడు. విడుదలకు ముందు నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే తన పారితోషికం వదులుకునేవాడు. సినిమా ఫ్లాప్ అని అయి నిర్మాత ఆర్ధికంగా బాగా నష్టపోయాడని తెలిస్తే.. తన పారితోషికాన్ని సైతం వెనక్కిచ్చేసిన సందర్భాలు కోకొల్లలు. అందుకే ఆయన నిర్మాతల హీరో అయ్యి ఎంతో మంది నిర్మాతలను నిలబెట్టాడు.
సినిమాల్లో కొత్తదనం పరిచయం చేసిన కృష్ణ
తెలుగు సినిమా రంగంలో కొత్తదనాన్ని పరిచయం చేయడమే కాకుండా పలు సాంకేతిక మార్పులను ప్రవేశపెట్టడం, విభిన్నమైన జాన్రాలతో ప్రయోగాలు చేసింది కృష్ణ అని చెప్పాలి. తెలుగులో తొలి సాంఘిక రంగుల చిత్రం 'తేనె మనసులు', తొలి జేమ్స్‌బాండ్ సినిమా 'గూఢచారి 116', తొలి కౌబారు సినిమా 'మోసగాళ్ళకు మోసగాడు', తొలి స్కోప్ సినిమా 'అల్లూరి సీతారామరాజు', తొలి 70 ఎంఎం సినిమా 'సింహాసనం' ఇలా తెలుగు చిత్రసీమ సగర్వంగా చెప్పుకొనే మైలురాళ్లన్నీ కృష్ణ చలవే. ఆయన చేసిన ప్రయెగాలు తెలుగు చలన చిత్ర రంగంలో ప్రత్యేక స్థానాన్ని నిలిపి, 1976 -1985 మధ్యకాలంలో ఎవరూ అందుకోలేని స్థాయికి కృష్ణ చేరుకున్నాడు. 1964 -1995 మధ్య ఏడాదికి 10 సినిమాల చొప్పున 300 సినిమాలు పూర్తిచేసిన నటుడు మరొకరు లేరు.
రాజీవ్ గాంధీ పిలుపుతో రాజకీయాల్లోకి..
రాజీవ్ గాంధీ పిలుపుతో 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణ 1989 ఎన్నికలలో ఏలూరు లోకసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 1991 ఎన్నికలలో మరోసారి పోటీచేసి ఒడిపోవడంతో రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు. అయితే ఎన్టీఆర్ ను విమర్శిస్తూ కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచాడు.
సాధించిన దానితో తృప్తి..
సాధించిన దానితో తృప్తి పడడం, ఆ విజయాలను భావి తరాలకు కానుకలుగా అందించడం గొప్పవాళ్ళ లక్షణం. కృష్ణ కూడా అంతే. ఆయన నట ప్రయాణం సాఫీగా సాగిపోయింది. ఎత్తుపల్లాలున్నా పరాజయాలు బాధించినా విమర్శలు ఎదుర్కొవలసి వచ్చినా అలుపెరుగని బాటసారిగా ప్రయాణం సాగించి, విజయతీరాలకు చేరాడు. 2010 దశకంలో కృష్ణ సినిమాలకు దూరంగా నటనను విరమించుకుని విశ్రాంతి జీవితం గడుపుతున్నాడు. మరోవైపు తనయుడు మహేష్ బాబు సాధిస్తున్న విజయాల్ని చూసి ఆయన తండ్రి హృదయం గర్వించింది. ఇప్పటికీ ఆయనలో నటించాలన్న కోరిక మంచి పాత్ర వస్తే తనదైన శైలి చూపించాలన్న తపన ఉన్నాయి. అందుకే.. ''నాకు సరిపడే పాత్రలు వస్తే, మనవడు గౌతంతో కలిసి నటించాలని ఉంది'' అంటూ ఈ మధ్య తన మనసులోని మాట బయటపెట్టిన కృష్ణ ఆ కోరిక తీరాకుండానే కన్ను మూసాడు.
మెమోరియల్ ఏర్పాటుకు సన్నాహాలు
సూపర్ స్టార్ కృష్ణ గుర్తుగా మెమోరియల్ ఏర్పాటు చేయాలని ఆయన కుటుంబ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆ మెమోరియల్‌లో కృష్ణకు సంబంధించిన అవార్డులు, షీల్డ్‌లు, క్యాస్టూమ్స్ ఇంకా ఆయనకు నచ్చిన అనేక వస్తువు లతో
పాటు, కృష్ణ నటించిన 350 సినిమాల్లో కీలకమైన పాత్రల లైఫ్ సైజ్ ఫొటోలు అక్కడ ప్రదర్శనకు అనుకూలంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మెమోరియల్ ఏర్పాటు చేసి అభిమానుల సందర్శనార్థం ఉంచితే మంచి ఆలోచనే అవుతుందని కృష్ణ సన్నిహితులు, అభిమానులు, సినీ పరిశ్రమలోని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ మెమోరియల్‌ను పద్మాలయా స్టూడియోస్ వద్ద ఏర్పాటు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.
50 యేళ్ల క్రితమే ప్యాన్ వరల్డ్ మూవీ
తెలుగు సినీ చరిత్రలో సంచనాలు సృష్టించిన సూపర్‌స్టార్. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగానే కాకుండా తెలుగు సినిమాకు సరికొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనుడూ ఈయనే. అన్నింటికి మించి ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సాహసి. అంతేకాదు తెలుగు సినీ ప్రేక్షకులకు ఆయనే ఫస్ట్ కౌబాయ్, జేమ్స్ బాండ్ హీరో కూడా అతనే. టెక్నికల్ గా తెలుగు సినిమాను ఎన్నో ఎత్తులకు చేర్చిన నటుడు సూపర్ స్టార్‌కృష్ణ. ఎన్నో సినిమాల విషయంలో డేరింగ్ అండ్ డాషింగ్ నిర్ణయాలతో రియల్ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాడు. ఇపుడు మనమందరం ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ కృష్ణ 50 యేళ్ల క్రితమే ప్యాన్ వాల్డ్ మూవీ చేసిన ఘనత కృష్ణకే దక్కుతుంది.
-పొన్నం రవిచంద్ర, 9440077499