Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మౌర్యుల కాలం ఒక ఘాతుకంతో అంతమైంది. ఆఖరి మౌర్యుడైన బృహద్రధ రాజు వద్ద ఉన్న పుష్యమిత్ర శుంగ అనే సైనికుడు, క్రీ.పూ. 185లో రాజుని చంపి తానే రాజై క్రీ.పూ. 151 వరకూ పాలించాడు. మౌర్యుల సామ్రాజ్యంలోని చాలా భాగం ఈతని వద్దనే ఉండేది. చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు వంటి రాజులను చూసిన ప్రజలు ఈతనిని అంతగా అభిమానించలేక పోయారు. ఈతను రెండు సార్లు అశ్వమేథ యాగం చేసి తన ఆధిక్యతను చాటాడు. క్రీ.పూ. 73లో శుంగుల రాజ్యమూ అంతమైంది. వీరి కాలంలో చెక్కిన శిల్ప చిత్ర కళలకు శుంగుల కాలపు కళలుగా పిలువబడ్డాయి.
శుంగ కాలపు కళలను పరిశీలిస్తే, ఆనాటి చిత్రం ఒక కథ చెపుతుంది. ఆనాడు రాజులు ఒక్కరే కాదు, సామాన్య ప్రజలూ కళలను పోషించారు. చేయి తిరిగిన గొప్ప కళాకారులేకాదు, ఉత్సాహం ఉన్న కళాకారులూ మొదలుపెట్టి శిల్పం చేయటం ప్రారంభించారు. మధ్య భారతంలోని విదీష శుంగులకు రాజధాని, ఎన్నో కళలకు స్థానం అయింది. క్రీ.పూ. 120 - క్రీ.పూ. 100 సం|| ల నాటి గరుడ ధ్వజ స్తంభం ఒకటి విదీషలో బయటపడింది. 65 మీటర్ల ఎత్తు ఉన్న ఈ స్తంభంపై బ్రహ్మి లిపిలో 7 వరుసల్లో ఒక శాసనం రాయబడింది. హీలియోధోరస్ అనే గ్రీకు రాయబారి వాసుదేవుని ఆరాధన కోసం నిర్మించబడిన స్తంభం ఇది. ఈతడు ఆ నాటి భగభద్ర శుంగుని రాజ్యంలోని గ్రీకు రాయబారి. అంటే మౌర్యుల కాలం నుంచీ ఉన్న గ్రీకు సంబంధాలు శుంగుల కాలానికీ నిలిచి ఉన్నాయి. మౌర్యులకు మల్లే ఈ కాలంలోనూ స్తంభాలు నిర్మించి సమాజానికి అంకితం చేయటం కొనసాగింది. మార్పల్లా ఈ నాటి ఈ స్తంభం రాజులచే కాదు సమాజ ప్రముఖులచే నిర్మించబడింది. ఈ స్తంభం ఆనాటి స్తంభాలకు సగం పొడవు మాత్రమే. అలాగే స్తంభానికి మౌర్యుల కాలానికి లాగా నగిషీ మెరుపూ పెట్టలేదు. స్తంభంపై ఉన్న తామర పూ రేకుల వేదికపై గరుడుడు, వేదికకు పూలదండ చెక్కి ఉంటాయి.
కల్పవృక్షం ప్రతీకగా, ఎత్తు తక్కువగా చెక్కిన మర్రిచెట్టు ఒకటి విదీష (నేటి బేసనాగర్)లోనిదేను. ఇది ప్రస్తుతం కలకత్తాలోని ఇండియన్ మ్యూజియంలో భద్రపరచబడింది. 150 సెం.మీ.ల ఎత్తు ఉన్న ఈ ఆకృతి స్తంభమూకాదు, చెట్టు ఆకారమూ కాక, క్రీ.పూ. 100 సం||లో, గోధుమరంగు రాతితో చెక్కబడింది. ఈ చెట్టుకు ధనం మూటలు, నాణేలు, పూలు, శంఖాలు, కమలం పూలు చెక్కబడి వేలాడుతూ, చెట్టుకు చుట్టూ ''చైత్య'' అనే ప్రహరీ బుట్ట ఆకారంలో చెక్కబడి ఉంటుంది. ఇదీ నునుపు నగిషీ లేని శిల్పం. ఆకస్మిక ఆనందం కోసం చెక్కిన శిల్పం. క్రీ.పూ. 100 సం||ల దే ఒక కుబేర శిల్పం కూడా విదీషలో దొరికినదే. ఇది శుంగకాలపు చెక్కడాలను పోలి ఉందే కానీ, శాసనాలేమీ చెక్కి లేవు. ఎడమ చేతిలో ధనం మూట పట్టుకున్న, ఉత్తర దిక్కుకు అధిపతి అయిన యక్షరాజు కుబేరుడి శిల్పం. ఇది 343 సెం.మీ. పొడవు. మరో శిల్పం స్త్రీ శిల్పం 208.5 సెం.మీ., ఇదీ అక్కడే దొరికింది. ఎడమ చేతిలో పూలో, పళ్లో పట్టుకుని, మరో చేతిలో ఆయుధం పట్టుకుని కనిపిస్తుంది. ఈ రెండు శిల్పాలకూ మౌర్యుల మెరుపు నగిషీ లేదు కానీ, వస్త్రపు మడతలు, ఆభరణాల్లో పోలిక కనిపిస్తుంది. ఈ రెండు శిల్పాలను విదీషలోని పురావస్తు శాస్త్ర మ్యూజియంలో భద్రపరిచారు.
మౌర్యుల కాలంలో పాటలీపుత్రం, వారి రాజధానిలోనే కళలు చెక్కిన ఆనవాలు, అదీ రాజులే చెక్కించిన ఆనవాళ్లే కనిపిస్తాయి. శుంగుల కాలంలో విదీష, పాటలీపుత్రం, మధుర, అహిఛత్ర, అయోధ్య, కౌసంచి వంటి ఎన్నో ప్రదేశాలలో కళలు వికసించాయి. మధురకు దక్షిణాన పారఖమలో ఒక పురుష శిల్పం దొరికింది. ఇది మధుర మ్యూజియంలో భద్రపరచబడింది. బలంగా, బరువు ఉన్న ఈ శిల్పం 264 సెం.మీ.ల పొడవుతో, క్రీ.పూ. 2 లేదా 1వ శతాబ్దంలో చేయబడింది. ఈ యక్షుడి శిల్పం చెక్కిన వస్త్రం తక్కువ మడతలో, నునుపు లేని శిల్పం, మౌర్యుల కాలానికి భిన్నంగా ఉంటుంది.
శుంగ రాజులు కూడా బౌద్ధులే. వీరి కాలంలో బౌద్ధమతానికి సంబంధించిన శిల్పాలే కాదు, బౌద్ధ భిక్కుల సౌకర్యార్థం ఎన్నో ఆరామ స్థలాలు, అక్కడే వారి ఆరాధన కోసం బౌద్ధ స్థూపాలూ నిర్మించబడ్డాయి, ఇవన్నీ బుద్ధుడు తన జీవిత కాలంలో తిరిగిన ప్రదేశాలతో లెక్క కట్టి నిర్మించబడినాయి. అలాగే భిక్కులు వర్షాకాలంలో నివసించటానికీ, వారి ప్రయాణ బసల వీలు కోసం కట్టించారు. ఇవి రాజు పరివారమే కాదు, మంత్రులు, ధనవంతులు, ప్రజలూ కూడా నిర్మించారు. అందువలన బౌద్ధ స్థూపాలూ, భిక్కుల ఆరామ స్థలాలు శిల్పాలూ కూడా సంఖ్య పెరిగింది. తన దినచర్యలో భాగం చేసుకునే అవకాశాలూ పెరిగాయి.
మౌర్యుల కాలంలోని శిల్పాలు చక్కటి నైపుణ్యంతో చక్కటి మెరుపుతో అవి మహారాజ పోషక కళలని అర్థం అవుతుంది. శుంగుల కాలంలోని కళలపై రాజ శాసనాలు చెక్కిలేవు. అవి శుంగుల కాలానివి అనే సమాచారం మటుకే అందిస్తాయి ఆనాటి బౌద్ధ స్థూపాలైనా, శిల్పాలైనా. అలాగే నైపుణ్యంలోనూ కట్టుదిట్టమైన నిబంధనలు తగ్గి విశ్రాంతిలో, మనసుకు నచ్చినట్టు ఆనందంలో చెక్కిన ఆసక్మిక శిల్పంలా కనిపిస్తుంది. శుంగుల కాలంలోని శిల్పానికి సంబంధించి మనం మరో విషయం గమనించాలి. ఈ కాలానికి సంబంధించిన ధనాలకు అధిపతి అయిన యక్షరాజు, కుబేరుడి శిల్పం, మర్రిచెట్టు రూపంలో చెక్కిన కల్పవృక్షం, దానికి వేలాడే ధనం మూటలు, నాణేలు, కన్పిస్తాయి. కానీ ఈ శిల్పాల చుట్టూ చైత్యం అనే ప్రహరీ చెక్కి, బౌద్ధ శిల్పం అనే గుర్తూ మనకు తెలియజేస్తుంది. బౌద్ధం ప్రకారం, కష్టాలకు కారణం ధనాలు, కోరికలు. వాటిని విడిచిపెట్టమని బోధిస్తుంది. కానీ శుంగుల కాలం నాటి కల్పవృక్షం, కుబేర శిల్పాలు, సామాన్య మానవ జీవితమూ వారి అవసరాలకు సంబంధించిన గుర్తులు. బహుశా ఈ కాలంలో బౌద్ధ భిక్ష్కుల జీవితం వేరు, సమాజంలో సామాన్య మానవులు ఆధ్యాత్మిక చింతనతో జీవితం గడిపే మార్గాలు వేరు చేయబడి ముందుకు నడిచాయి. సామాన్య మానవులకు జీవితంలో భక్తి ఒక విషయంగా, జీవిత మార్గం సులభం చేసి ఉంటుంది బౌద్ధం. బౌద్ధ భిక్కులకే నియమ నిబంధనలు ఉన్న జీవితం అని చెప్పి ఉంటుంది మతం.
ఆనాడు బౌద్ధ భిక్కుల సౌకార్యార్థం కట్టిన స్థూపాలు, ఆరామాలల్లో ఒక ముఖ్యమైనది విదీష వద్ద ఉన్న సాంచీ స్థూపం. ఈ ప్రదేశం మధ్య భారతంలో ఉంది. అన్ని దిక్కులకు ప్రయాణించే వ్యాపారులకు, భిక్కులకు, అశోకుడి కాలం నుంచే ముఖ్యస్థానం అయింది. ఇక్కటి కట్టడాలు, శిల్పాలు శుంగుల కాలంలో నిర్మించబడ్డాయి. బౌద్ధ స్థూపం వారి ఆరాధ్య స్థలం. ముందు కాలంలో ఒక చిన్న గుట్టకో, ఒక చెట్టుకో, 'చైత్యం' అనీ, 4 గోడల ప్రహరీ కట్టి ఆరాధ్య స్థలంచేసారు. బుద్ధుడి నిర్యాణం తరువాత ఆయన భౌతిక ఎముకలు (బూడిద) 8 భాగాలుగా చేసి 8 రాజ్యాలకు పంపారు. వాటిని మధ్యలో ఉంచి వాటిపై స్థూప నిర్మాణం జరిగింది. ఆ పూ కాలంలో ముఖ్యమైన బౌద్ధ గురువుల గుర్తుగా కూడా స్థూపాలు నిర్మించారు. సాంచీ స్థూపం క్రీ.పూ. 100వ శతాబ్దానిది. చుట్టూ ప్రహరీ గోడ, స్థూపానికీ గోడకీ మధ్య ప్రదక్షిణా పథం నిర్మించబడింది. స్థూపంల చుట్టూ ఉన్న వేదికలో అమర్చిన ద్వారాలు మొత్తం మీద ఒక స్వస్తిక్ ఆకృతిలో అమర్చబడ్డాయి. వేదికపై గుండ్రటి డిజైనులు, లోతు తక్కువగా చెక్కిన చిత్రం వంటి శిల్పాలు చెక్కి ఉంటాయి. ఈ అమరిక పూర్వకాలపు చెక్క కట్టడాల ఆధారంగా చెక్కిన వేదిక అనిపిస్తుంది. ద్వారాలకు పక్క ఉన్న స్తంభాలల్లో ముఖ్యమైనది ఉత్తర ద్వారం వద్ద ఉన్న స్తంభం. అది అశోక స్తంభాన్ని గుర్తు తెస్తుంది. ఈ స్తంభంపై కూడా కమలం పూరేకుల వేదికపై జోడించి నిలుచున్న 4 సింహాలు, వాటిపై ఒక చక్రం చెక్కబడి ఉంటుంది. ఇది లోతు తక్కువగా స్తంభానికి ఒక వైపు బొమ్మలా చెక్కబడి ఉంటే మరో వైపు రావి చెట్టు ఒక వేదికపై ఉండగా ఆ చెట్టుకు పూల దండ వేయటానికి విద్యాధరులు, జ్ఞానానికి గుర్తు అయిన ఆకాశ సంచారులు వస్తున్నట్టు చెక్కబడింది. ఆ చెట్టు కింద భాగాన మరో భాగంలో కల్పలత, మరిన్ని పూల దండలు, ధనం, మణులు ఎత్తిన తొండంపై మోసే ఏనుగూ చెక్కి కనిపిస్తుంది. ఈ స్థూపం వద్ద మరి ద్వారాలపై చెక్కిన మానవరూపాలైనా, జంతు, వనం రూపాలైనా నైపుణ్యంతో చెక్కబడిన శిల్పాలు కాదు. ప్రదక్షిణా పథంలో ప్రదక్షిణ చేసేవారికి బౌద్ధం ప్రాముఖ్యం, భక్తి కలిగించే రూపాలు మాత్రమే. కల్పలతలు, ధనం, విద్య, జ్ఞానం అన్నీ కలిపి కలబోసి చెక్కించి సామాన్య మానవులకు ఆకర్షితమై ఉండవచ్చు ఈ ఆరాధ్య స్థలాలు.
మరింత ఆర్భాటంగా చెక్కిన బారూత్ స్థూపమూ మధ్య భారతంలోనిది. ఇది ఆనాటి సమాజంలో స్త్రీల స్థానమూ వివరిస్తుంది. ఆ విషయం వచ్చే సంచికలోనే చెప్పుకుందాం...
- డా|| ఎం.బాలమణి, 8106713356