Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు భాష సంస్కృతి, సంప్రదాయాలు హిందూ పండుగలు కోసం తెలంగాణ సమాజం కోసం శ్రమించిన వారిలో చిరస్మరణీయులు సురరవరం ప్రతాపరెడ్డి. నిజాం పాలనలో నలిగిపోతున్న భాషా సంస్కృతులకు దిశా నిర్దేశం చేసిన ప్రజ్ఞాశాలి. నిద్రాణమైన తెలంగాణ సమాజాన్ని తన కలంతో మేల్కొల్పి జాగరుకం చేసిన తెలంగాణ వైతాళికుడు ఆయన.
సురవరం తన కలంతో నిజాం రాజు పైన నిప్పుల వర్షం కురిపించాడు. జోగిపేటలో జరిగిన ప్రథమ ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా చేసిన ప్రసంగం మరపురానటువంటిది పాతికేళ్ళ వయసులో ''గోల్కొండ పత్రిక,'' సంపాదకుడుగా, ఎన్నో కథలు వ్యాసాలు, సమీక్షలు, వ్యాసాలు, కవితలు, కథలు, మొదలగు నవి ప్రచురించారు. ముఖ్యంగా తెలంగాణ ప్రజల బాధలను, గోసను చెప్పడానికి గోల్కొండ పత్రికను ఆయుధంగా మలిచి, కృత కృత్యుడయ్యాడనటంలో సందేహం లేదు.
సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి సందర్భంగా 126 కవితలతో ''గోల్కొండ సాహితీ కళా సమితి'' ఆధ్వర్యంలో ''సురవరం మనవరం'' శతాధిక కవితా సంకలనం రావడం ఆయన సేవలను గుర్తు చేసుకోవడమే.
''ఉర్దూ రాజ్యమేలుతున్న సమయాన / నిరాయుధమైన తెలుగు భాషను / తన పత్రిక ద్వారా పరివ్యాప్తం చేసిన / సంపాదక సమరవృక్షం అతడే'' అంటూ డాక్టర్ నాళేశ్వరం శంకరం సురవరంకు తెలుగు భాషా పట్ల ఉన్న ఇష్టాన్ని మా'నవతార' కవితలో వ్యక్తీకరించారు.
''సురవరం / సాహితీ సరోవరం / చిరస్మరణీయమైన మన వరం'' అంటూ గంటా మనోహర్ రెడ్డి ''సుర''వరం కవిత లో తన మనోగతాన్ని ఆవిష్కరించారు.
''స్థాపించెను గోలకొండ / కవులకు అదే అండదండ / వెలుగులోకి రాని కవుల/ మెడన వేసే పూలదండ''అని వెన్నెల సత్యం ''పాలమూరు సురవరం'' మణిపూసల్లో వర్ణించాడు.
''ఘన కీర్తి యున్నట్టి గద్వాల జిల్లాలో / ఇటిక్యాల పాడున నింపుగాను /సురవరమ్ము తెలంగాణ సురు చిరమ్ము'' అని యువకవి గంగాపురం శ్రీనివాస్ సీసపద్యంలో వర్ణించారు.
''సాహితి పరిశోధకులుగా శోధన చేసి / గోల్కొండ కవుల సంచికతో లోకానికి చాటారు రాజకీయాలలో అడుగిడిగి వాటి ఉందాతనం పెంచారు'' అని మరో కవి సతీష్ 'బహుముఖ ప్రజ్ఞాశాలి' లో వర్ణించాడు.
''గోల్కొండ కవుల సంచిక / వల్లనే కదా / కవుల ఇళ్లకు ఇంత వెలుగు దొరికింది'' అని ఒక కవి అభిప్రాయం.
''బహుభాషల స్నేహశీలిగా రామాయణంలోని విశేషాలను తెలిపిన ఆధునిక వాల్మీకిగా'' సురవరం ప్రతాపరెడ్డిని మరొకరు వర్ణించారు.
''కొండెక్కిన భాషా సంస్కృతులకు / వెలుగు దివిటీలెత్తిన యుగపురుషుడు'' అని ప్రసిద్ధ కవి కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి తన కవితలో అంటాడు.
''చైతన్యానికి మారుపేరు / సంస్కరణలకు మరో రూపు'' అని ''తెలంగాణ తేజం''లో డాక్టర్ బి.ఉమాదేవి అభిప్రాయ పడ్డారు.
ఈ ఏడాది సురవరం 126వ జయంతి ఉత్సవం పురస్కరించుకొని, అశేష సాహిత్య అభిమానుల కోరిక మేరకు తెలంగాణ సాహితి వైతాళికుడి సంస్మరణ కవితల తోరణాన్ని ఆవిష్కరించాలని గోల్కొండ కళా సమితి అధ్యక్షులు అర్థచంద్ర ప్రకాష్ రెడ్డి సంకల్పించడం అభినందనీయం. అంతేకాకుండా భారత రచనలో, నన్నయకు నారాయణ భట్ట్టు తోడైనట్టు తెలుగు భాష చైతన్య సమితి అధ్యక్షులు బడేసాబ్, లక్ష సాధన ఫౌండేషన్ అధ్యక్షుడు ప్రజ్ఞా రాజు, మనోహర్ రెడ్డి నిలబడడం నిజంగా అభినందనీయం. సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి సందర్భంగా 126 కవితలతో ఆ మహనీయుడికి నీరాజనాలు అందించాలనే ఆలోచన గొప్పది. ప్రతి కవిత ఆణిముత్యంగా చెప్పవచ్చు. కవితలన్నీ పుస్తక రూపంలో తీసుకొచ్చిన ప్రధాన సంపాదకులు డాక్టర్ చంద్రప్రకాశ్ రెడ్డికి, సంపాదకులు పడేసాబ్ గంటా మనోహర్ రెడ్డి ప్రజ్ఞా రాజులకు శతధా సహస్ర అభివందనాలు.
పుస్తకం ముఖచిత్రం సురవరం మహోన్నత చిత్రం తేజోవంతంగా ఆకర్షణీయంగా ఉంది.
సురవరం మనవరం
పేజీలు : 137, వెల : రూ.150/-,
ప్రతులకు : తెలుగు భాషా చైతన్య సమితి, 2-3-64 / ఎ/74, ప్రేమ్ నగర్ కాలనీ, అంబర్ పేట, హైదరాబాద్-13
సెల్ : 9160607662
- యాడవరం చంద్రకాంత్ గౌడ్
9441762105