Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ ప్రపంచంలో ప్రతిభ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు. ప్రతి మనిషిలోనూ ఆ సామర్థ్యం ఉంటుంది. ఆ ప్రతిభను గుర్తించి సానబెడితే మనుషులు ఈ విశ్వంలో మరిన్ని అద్భుతమైన నూతన ఆవిష్కరణలు చేయగలరు. ప్రతిభను గుర్తించి ప్రతి మనిషిని ప్రోత్సహిస్తే మన సమాజం ఎంతో మెరుగ్గా ఉండేది. ఈ విశ్వంలో ఇంకా ఎన్నో అద్భుతాలు జరిగేవి. కానీ మన దేశంలో ప్రతిభకు సరైన గుర్తింపు లేదు. 'వెధవ ఆ పని నీ వల్ల ఏమవుతుంది. నీకు అనుభవం లేని రంగంలో అడుగు పెట్టవద్దు, సమయాన్ని వృధా చేసుకోవద్దు' అని వెటకారంగా, కోపంగా మాట్లాడిన మాటలు విద్యార్థుల ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. నిజమే కావచ్చు అని విద్యార్థులు తమకిష్టమైన పనులు చేయకుండా మిన్నకుంటారు. ప్రతిభను గుర్తించి తగిన ప్రోత్సాహం అందిస్తే మన దేశ యువతీయువకులు ప్రపంచ మేధావులతో పోటీ పడగలరు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదు. అందువలన ప్రతిభ ఏ మనిషిలో ఉన్నా దానిని గుర్తిద్దాం. విద్యార్థులను ప్రోత్సాహిద్దాం.
ఉదాహరణకు థామస్ అల్వా ఎడిసన్ అనే శాస్త్రవేత్త జీవితాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఎంతో స్ఫూర్తివంతమైన ఆయన జీవితంలోని ఒక సంఘటనను ఇక్కడ ప్రస్తావించడం అవసరమని భావిస్తున్నాను.
'మీ అబ్బాయికి తెలివి తేటలు శూన్యం. ఎందుకు పనికి రాని వెధవ మీ వాడు.' అని రాసిన కాగితాన్ని ఆ పిల్లవాని చేతికిచ్చి ఇంటికి పంపాడు పాఠశాల ఉపాధ్యాయుడు. అది చదివిన పిల్లవాని తల్లి ఆ స్కూల్ టీచర్‌కు మరో కాగితం రాసి పంపింది. 'మా అబ్బాయిని మీరు సరిగా అర్థం చేసుకోలేదు. అంతేకాకుండా వాడి తెలివి తేటలను అర్థం చేసుకునే స్థాయి మీకు లేదని కూడా నాకు అర్థమైంది. ఐయామ్ సారీ టీచర్! వాడిని ఇక స్కూలుకు పంపను. ఇంట్లోనే అన్ని విషయాలు నేనే నేర్పించుకుంటాను.' అని ఆ కాగితంలో రాసింది ఎడిసన్ తల్లి.
ఎందుకు పనికిరాని మొద్దబ్బాయిగా ఆ స్కూల్ టీచర్ ముద్ర వేసిన ఆ వ్యక్తి ఎవరో కాదు విశ్వవిఖ్యాత శాస్త్రవేత్తగా గుర్తింపబడిన థామస్ అల్వా ఎడిసన్. అనేక ప్రయోగాలు చేసి ఎంతో శ్రమకోర్చి, రాత్రింబవళ్లు పని చేసి విద్యుచ్ఛక్తితో వెలిగే బల్పులను కనుగొని వినూత్న వెలుగులతో ప్రపంచ ప్రజలను ఆశ్చర్యపర్చిన ప్రగతిశీల శాస్త్రవేత్త అతను. కేవలం బల్బులే కాకుండా, ప్రజలకు ఉపయోగకరమైన ఎన్నో శాస్త్రీయ ఆవిష్కరణలు ఆయన చేశారు. 'నాకు సదా నా జీవితంలో అడుగడుగునా అండగా నిలిచి నాలోని అంతర్గత ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన నా తల్లికి నా మీద ఉన్న విశ్వాసాన్ని వమ్ము చేయరాదన్న గట్టి పట్టుదల, దృఢ సంకల్పమే నా విజయాలకు కారణమని' చాలా హుందాగా ఎడిసన్ తన డైరీలో రాసుకున్నారు. అమెరికా దేశానికి చెందిన ఎడిసన్ 1931లో తన 84వ యేట మరణించారు. ఆయన కుటుంబానికి చెందిన మనవలు, ముని మనవలు ఇంకా మన మధ్య ఉన్నారు.
విద్యుచ్ఛక్తితో వెలిగే బల్బును కనుగొనడం మన ప్రపంచంలో పెద్ద మార్పుకు దారి తీసింది. ఇక థామస్ అల్వా ఎడిసన్‌కు ఎదురైన అనుభవమే మన దేశంలోని పాఠశాలల్లో లక్షలాది మంది విద్యార్థులకు ఎదురవుతోంది. ఇది వాస్తవం. కల్పితం కాదు. అయితే విద్యార్థులను ఉపాధ్యాయులందరూ ప్రోత్సహించడం లేదనే విమర్శ చేయడం నా ఉద్దేశం కాదు. విద్యార్థులను ప్రోత్సహించే ఉపాధ్యాయులు, ప్రభుత్వ అధికారులు ఎంతో మంది మన సమాజంలో ఉన్నారు. వారికందరికీ వందనాలు. ఇక్కడ ఒక ముఖ్య విషయాన్ని ప్రస్తావించాలి. విద్యార్థుల ప్రతిభను సామర్థ్యాన్ని గుర్తించి, ప్రోత్సహించే విధంగా మన దేశంలోని ఉపాధ్యాయులకు తగిన శిక్షణ ఇవ్వడం లేదనే అభిప్రాయముంది. ప్రపంచంలో మారుతున్న పరిస్థితుల కనుగుణంగా, శాస్త్ర సాంకేతిక మార్పులను అనుసరించి టీచర్లకు ట్రైనింగ్ అంశాలను మరింత మెరుగు పర్చి ఉత్తమ ఉపాధ్యాయులను తయారు చేయాల్సిన అవసరమెంతో ఉంది. ముందుగా ప్రతి విద్యార్థి ప్రతిభ ఏమిటో, అతనికి లేదా ఆమెకు ఏ రంగంలో సామర్థ్యం ఉందో ఉపాధ్యాయులు, వారి తల్లిదండ్రులు కనుగొనాలి. విద్యార్థుల ఇష్టప్రకారమే బోధనా అంశాన్ని ఎన్నుకోనివ్వాలి. తల్లి దండ్రులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వారిపై రుద్దకూడదు. ప్రతి విద్యార్థి తాను నిర్ణయించుకున్న లక్ష్యానికి అనుగుణంగానే ఆయన లేదా ఆమె సామర్థ్యం మెరుగవుతుంది. ఎలాంటి కష్టం లేకుండా విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోగలుతారు.
- జి గంగాధర్ సిర్ప, 9010330529