Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోషల్‌మీడియా... ఈరోజుల్లో శక్తివంతమైన ప్రసార మాధ్యమం. భాషాసాహిత్యాలకు పరిమితం చేసి చర్చిస్తే వాటి విస్తృతికి సోషల్ మీడియా వాహికగా విశేషంగా ఉపయోగంలో ఉందనేది సుస్పష్టం. సోషల్మీడియాకి ముందు నుంచీ తెలుగు భాషాసాహిత్యాల వికాసంలో పత్రికలు ప్రధానపాత్రను పోషిస్తూ వస్తున్నాయి. తొలి రోజుల్లో వార్తలతో పాటూ సాహిత్యాన్నీ ముద్రించి రచయితలను ఎంతో ఉత్సాహ పరిచాయి. కథ, నవలల పోటీలను నిర్వహించి రచయితను ఆర్థికంగా ఆదుకున్నాయి. నేటికీ భాషాసాహిత్యాల కోసం ప్రత్యేక పేజీలను కేటాయించి తెలుగు లోకంలో భాష, సాహిత్య చైతన్యాన్ని పెంపొందింపజేస్తున్నాయి. కొత్త రచయితలను తయారు చేస్తున్నాయి. అయితే పత్రికలకు ఉండే పరిమితుల వల్లా రచయితలందరి రచనలను ముద్రించే అవకాశం లేదు. రచన పంపించిన ఎన్నో రోజులకి కానీ ముద్రణకు నోచుకోదు. కొన్నిసార్లు అసలు ముద్రణకు ఎంపికైందో లేదో కూడా స్పష్టంగా తెలియని సందిగ్ధంలో రచయితలు ఉంటున్నారు. ఈ పరిమితులను అధిగమిస్తూ ఎదిగి వచ్చిన మాధ్యమమే సోషల్‌మీడియా. భాష వినియోగింపబడుతున్న సమస్త సమాచార తలాలు భాషా వినియోగానికీ దాని అభివృద్ధికీ కారణమవుతున్నాయనే విశాలార్థంలోనిదే ఈ వ్యాసం...
జనబాహుళ్యంలోకి సోషల్‌మీడియా విస్తృత ప్రవేశం దృష్ట్యా, తెలుగు నేలమీద సోషల్ మీడియా వయసు కేవలం పదేళ్ళే. ఫేస్బుక్ రూపంలో అంతకుముందు మరో పదేళ్ళు. మొత్తంగా ఇరవయ్యేళ్లకు మించి ఉండదు. ముఖ్యంగా దశాబ్ది కాలంలో తెలుగు సమాచార, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. టెలీఫోన్, ఇతర సమాచార రంగాల్లోకి పెట్టుబడులు వెల్లువలా వచ్చాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ప్రసిద్ధ పెట్టుబడి సంస్థలు ప్రాంతీయ భాషల్లో సాప్టువేర్లను అభివృద్ధిచేయడం ప్రారంభించాయి. ఎయిర్టెల్, జియోవంటి టెలీఫోన్ సంస్థల మధ్య పోటీ పెరిగి సరసమైన ధరలకే ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. 5జి స్పీడ్‌తో జియో టెలికాం సంస్థ మరో విప్లవాత్మక మార్పుకు తెరలేపనుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ సౌకర్యం మారుమూల గ్రామానికీ చేరేవిధంగా తమ తమ సేవల్ని విస్తృతపరుచుకునే పనిలో పోటీపడుతున్నాయి. ఈ పనులన్నీ సమర్థవంతంగా వినియోగింపబడాలంటే ప్రజల చేతులకు ఆధునిక పరికరాన్ని అందించాలి. ఆ పరికరమే స్మార్ట్‌ఫోన్ రూపంలో ప్రతీ గడపను చేరుకుంది. కొన్నిసార్లు ప్రజల అవసరాలకు అనుకూలంగానూ, చాలాసార్లు అవసరంలేని వాటిని అలవాటు చేయించడంలోనూ స్మార్ట్‌ఫోన్ దోహదపడుతోంది. దీనికోసం ఆ స్మార్ట్ఫోన్లలో వినియోగించే వివిధ అనువర్తనాలను (applications-aaps) తయారు చేస్తున్నాయి. ముఖ్యంగా గూగుల్ సెర్చ్ ఇంజన్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విటర్, ఇన్స్ట్రా వంటి బహుళ జనాదరణ పొందిన వాటిని దేశీ భాషల్లో వినియోగించుకునేట్టు చేయడంలో బహుళజాతి సంస్థల మధ్య పోటీ తీవ్రతరమైంది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ ఈ పదేండ్ల కాలంలో జరిగిన విప్లవాత్మక పరిణామమిది. ఇది ఇంకా జరుగుతూనే ఉంది.
సోషల్‌మీడియా ఈ రోజుల్లో ఒక బలమైన, లాభసాటైన ప్రచార, ప్రసార మాధ్యమంగా నిలదొక్కుకొంది. ముఖ్యంగా సాంకేతికాభివృద్ధి కారణంగా జరిగిన ఈ ఎదుగుదల దేశీభాషా సాహిత్యాలను విస్తృతమైన కాన్వాస్ మీదకు తెచ్చింది. పదేండ్ల క్రితం వరకూ కేవలం ఆంగ్లం వచ్చిన విద్యాధికులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మాధ్యమం, నేడు నిరక్షరాస్యులకు కూడా ఉపయోగపడే నిత్యావసరంగా మారిపోయింది. ఇది ముఖ్యంగా ఫేస్బుక్, వాట్సాప్, ట్విటర్, కోరా, ఈమెయిల్, యూట్యూబ్, టెలిగ్రామ్, ఇన్‌స్టా, వికీసోర్సెస్ మొదలైన ఎన్నో వేదికల మీద తెలుగు భాషలో సమచారాన్ని అందించడానికీ, సాహిత్య వికాసానికీ దోహదపడుతుంది. కోవిడ్ తరువాత సోషల్ మీడియా వేదికమీద తెలుగు భాషాసాహిత్యాల వినియోగం ఎన్నో రెట్లు పెరిగింది. కేవలం అక్షరాల రూపంలోనే కాకుండా ఆడియో, వీడియో రూపాల్లో జ్ఞానం ప్రచారం, ప్రసారం అవుతుంది. ముఖ్యంగా యూట్యూబ్ వినియోగం చాలా పెరిగింది. అది చాలామంది ఔత్సాహికులకు ఉపాధి అవకాశంగా మారిపోయింది. అక్షరాల్లో వ్యక్తంచేయ వీలుకాని ఎన్నో సాంస్కృతికాంశాలను, వివిధ సమూహాల జీవన వైవిధ్యాలను వీడియోల రూపంలో యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం జ్ఞాన సంచయానికి, దాని ప్రసారానికి పరాకాష్ట దశగా చెప్పవచ్చు.
సమాచార, సాంకేతికరంగాల్లో సాధించిన ప్రగతివల్ల, అందరికీ సమాచారం వినియోగించుకునే వెసులుబాటు, సమాచారాన్ని ఉత్పత్తిచేసే అవకాశం రావడం ఈ కాలంలో జరిగిన పెనుమార్పు. సోషల్‌మీడియా పూరించిన అతిపెద్ద ఖాళీగా దీన్ని కొనియాడవచ్చు. ఇంటర్నెట్ వేదిక మీద తెలుగు సమాచారం పరిమితుల్లోనైనా ఉచితంగా పొందడం గొప్ప విజయం. సమాచార ఉత్పత్తిలో భిన్న సామాజిక వర్గాల ప్రజలు పాల్గొనడం వల్ల ఆయా సమాజాల, తెగల సకల జ్ఞాన సంచయం మన కండ్ల ముందు నిలుస్తోంది. ఇంటర్నెట్లో తెలుగు విజ్ఞానానికి సంబంధించిన సమస్తాంశాలు క్రమంగా చోటుచేసుకుంటుండం, అంతే సులువుగా దాన్ని వివిధ అవసరాలకోసం వినియోగించుకునే అనుమతి, ఉచితంగా ఉండటం ఆహ్వానించదగిన పరిణామం. ఇంతకుపూర్వం సమాచారం అందరికీ అందుబాటులో ఉండేదికాదు. దానిమీద కర్రపెత్తనాలు, గుత్తాధిపత్యాలూ ఉండేవి. సోషల్‌మీడియా ఈ సమాచార గుత్తాధిపత్య సంస్కృతిని బద్దలుకొట్టింది. సమాచార లభ్యతను సులభతరం చేసి, సమాజం మరొక అడుగు ముందుకు వేయడంలో తోడ్పడుతోంది.
ఔత్సాహికులకూ సృజనకారులకూ కల్సివచ్చిన మహోప కరణం - సోషల్‌మీడియా. ఔత్సాహికులంటే కేవలం ఔత్సాహిక రచయితలే కానక్కర్లేదు. వంట చేయడం దగ్గర్నుంచి ప్రాపంచిక విజ్ఞానం వరకు సమస్త విజ్ఞాన సంచయాన్ని మౌఖిక రూపంలో, లిఖిత రూపంలో చేసే ప్రతీ రచనా, ఆడియో, వీడియో కూడా దీనిలోకి వస్తాయి. పైన పేర్కొన్నట్టు కేవలం పత్రికలు మాత్రమే అందుబాటులో ఉన్నప్పుడు రచనలు ముద్రణకు నోచుకోవడం అతికష్టమైన పనిగా ఉండేది. పైగా రచయితలందరికీ చోటుదక్కేది కాదు. సోషల్‌మీడియా పూరించిన మరొక ఖాళీ ఏంటంటే, రచనకూ దాని ముద్రణకూ గల సమయంలో ఉన్న అంతరం. ముఖ్యంగా ముద్రితమైన ప్రతి రచనా సృజన కారునిలో సరికొత్త నమ్మకాన్నీ ధైర్యాన్నీ ప్రోది చేస్తోందనేది నిజం. యువ రచయితలకు సోషల్‌మీడియా అందివచ్చిన అవకాశం. వీరి కోసం 'కవి సంగమం'లాంటి ఫేస్బుక్ పేజీలు సాహిత్య సృజనకు కావల్సిన దిశానిర్దేశాన్ని అందించే వ్యాసాలను కాలమ్స్‌గా రాయిస్తున్నాయి. ఫేస్బుక్లో దాదాపు ప్రతీ సాహితీ ప్రక్రియకూ ఒక ఫేస్బుక్ నిర్వహణా పేజీలుండటం తెలుగు భాషాసాహిత్యాల విస్తృతిలో సోషల్ మీడియా చేస్తున్న దోహదాన్ని పట్టిచూపుతుంది.
యూట్యూబ్ ద్వారా మట్టిలో మాణిక్యాలుగా ఉన్న ఎంతో మంది వెలుగులోకి వచ్చారు. వారిద్వారా వారి భాష, జానపద బాణీలు, నటనా విశేషాలు విశేష ఆదరణను చూరగొన్నాయి. అంతేకాకుండా సదరు ఆడియో, వీడియోలపై శ్రోతల, వీక్షకుల నుంచి వెంటనే ప్రతిస్పందనల్ని పొందడం సులువైంది. వేగవంతమైంది కూడా. ఇది ఆయా రచయితలను, సృజనకారులను ఎంతో ప్రోత్సహించింది. వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపి మరిన్ని రచనలు, ఆడియో, వీడియోలు అప్లోడ్ చేయడానికి కావల్సిన ఆర్థిక శక్తినిస్తుంది. భాషా సంస్కృతుల రక్షణ, వాటి అభివృద్ధిలో ఉన్న ఖాళీల్ని సోషల్ మీడియా పూరిస్తోంది. 'గడిగోలు' (తెలంగాణ పదాలు, ఇసిరెలు, సంస్కృతి వాటి ఫోటోలు) అనే పేరుతో ఉన్న ఫేస్బుక్ పేజ్, తెలంగాణ భాష, సంస్కృతుల విస్తృతిలో విశేషమైన కృషిచేస్తోంది. గ్రూపులోని సభ్యులు ఎవరైనా ఒక పదం లేదా ఒక వస్తువును గ్రూపులోకి పోస్ట్ చేసి ''దీన్ని మీ ప్రాంతంలో ఏమంటారు''? అని మిగతా సభ్యులను అడగడంతో ఈ చర్చ ప్రారంభమౌతుంది. సభ్యులు వారి వారి ప్రాంతాల్లో వాడుకలో ఉన్న సమానార్థక పదాలను, రూప వైవిధ్యాలను రాయడం, అటువంటి పోలికలున్న మరో వస్తువును పోస్టు చేయడం, అది పనిచేసే విధానం గురించి కూడా వీలైతే ప్రస్తావించడం మొదలైన రూపాల్లో చర్చ ఆసాంతం ఎంతో ఉత్సాహభరితంగా కొనసాగుతుంది. కనుమరుగవుతోన్న వస్తు సంస్కృతినీ, ఆధ్యాత్మిక వైవిధ్యాన్నీ వెలుగులోకి తీసుకొచ్చే అద్భుతమైన కృషిని 'గడిగోలు' ఫేస్బుక్ గ్రూపు నిర్వాహకులు కొనసాగిస్తున్నారు.
అందివచ్చిన స్మార్ట్‌ఫోన్‌తో సామాన్య ప్రజలూ తమ మాతృభాషలో సమాచార ఉత్పత్తిలో పాల్గొనే సరికొత్త వాతావరణం సోషల్‌మీడియా కల్పించింది. సాధారణ సంభాషణల్లోనూ తెలుగు వాక్యాల ఉత్పత్తి, వినియోగాలు జరుగుతున్నాయి. ఈ పదాలు, పదబంధాలు, వాక్యాలద్వారా కొంతకాలానికి వైవిధ్యమైన, విస్తృతమైన పాఠ్యాలతో కూడిన పాఠ్యనిధి (corpus. ఈ మాటను తెలుగులో 'పాఠ్యనిధి'గా పిలవచ్చని ఆచార్య జి. ఉమామహేశ్వరరావు అన్నారు) తయారవుతోంది. దీన్నంతా ఒక క్రమపద్ధతిలో క్రోఢకీరించి, వివిధ స్థాయిల్లో ఈ భాషనంతటినీ విశ్లేషించే ఉపకరణాలు అభివృద్ధి చేయవచ్చు. తెలుగుభాషను, యంత్రాధారిత అనువాద ఉపకరణాలతో అనుసంధా నించుకొని వినియోగ దారుడు కోరుకున్న భాషలో పాఠ్యాన్ని రూపొందించడానికి వీలవుతుందనేది computational linguists చెబుతున్న విషయం. ఈ రకంగా చూసినప్పుడు సోషల్‌మీడియా తెలుగు భాషావిస్తృతికి ఎనలేని సేవ చేస్తుందనేది నిర్వివాదాంశం.
సోషల్మీడియో చేరుకోవాల్సిన గమ్యాలూ కొన్ని ఉన్నాయి. అది ఉత్పత్తిచేసే సమాచారం (content) వల్ల భాషా సాహిత్యాలకూ తద్వారా సామాజిక ప్రయోజనాలకు కొన్ని సందర్భాల్లో తీవ్రవిఘాతం కలిగే అవకాశం లేకపోలేదు. సోషల్మీడియో-ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్ వంటి భిన్న వేదికల ద్వారా సమాచారాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో ప్రజల్నందరినీ భాగస్వాములను చేస్తోంది. ఈ సమాచార ఉత్పత్తిలో పిల్లలు మొదలుకుని పండు ముసలి వరకు పాల్గొంటున్నారు. గ్రామం మొదలుకొని పట్టణం వరకు, నిరక్షరాస్యులు మొదలుకుని విద్యాధికుల వరకు భిన్నమైన అంతర్వుల్లో, విభిన్నమైన భాషాస్థాయిల్లో విజ్ఞానాన్ని తెలుగులో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ విజ్ఞానాన్ని ఎక్కడికక్కడ విభజించుకొని, విశ్లేషించుకుని ఒక క్రమపద్ధతిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఉన్నత ప్రమాణాలూ ఉన్నత విలువలూ కలిగిన సమాచారాన్ని వికీపీడియా వంటి విజ్ఞాన సర్వస్వాలకు అనుసంధానం చేయాల్సి ఉంది. సామాజిక బాధ్యత తీసుకొని వినియోగదారులకు స్వేచ్ఛ ఇస్తూనే, సమాజానికి హాని కలిగించే కంటెంట్‌ను నియంత్రించే యంత్రాంగాన్ని ఆధికారికంగా మనం ఇప్పటి వరకు రూపొందించుకోనే లేదు. దీని సాధ్యాసాధ్యాల గురించి సాంకేతిక నిపుణులతో చర్చలు జరపాలి. మనుషుల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే సమాచారం రోజురోజుకూ ఎక్కువైపోతోంది. సెక్సును ఉద్రేకపరిచే రచనల, వీడియోల సంఖ్యా క్రమంగా పెరుగుతోంది. అతివేల శృంగారం బోధించే క్షుద్ర సాహిత్యం సమాజాన్నీ యువతనూ ప్రమాదకరమైన స్థితిలోకి నెట్టేస్తోంది. భాషాసాహిత్యాలకు సంబంధించి క్రమబద్ధమైన వ్యాసంగానికి ప్రత్యేక ప్రణాళికల్ని రూపొందించుకోవాల్సి ఉంది. సోషల్ మీడియాలో తెలుగు టైపింగ్, దాని ప్రాసెసింగ్ కి కావల్సిన సాంకేతిక జ్ఞానాన్ని ప్రజల్లోకి మరింత ఎక్కువగా తీసుకెళ్ళాల్సి ఉంటుంది. దీని కోసం యూజర్ ఫ్రెండ్లీ ఆప్స్ రూపొందించడానికి కావల్సిన ప్రోత్సాహాన్ని అందించాలి. పరిపాలన, విద్యా మాధ్యమాల్లో తెలుగు భాష అమలుకు ప్రమాదం ఉన్నా కనీసం ఈ రకంగానైనా తెలుగు భాషాసాహిత్యాలు ఆధునీకరించబడి వాటి ఉనికిని కోల్పోకుండా ఉంటాయేమో.
- డా. ఎస్. చంద్రయ్య
తెలుగు అధ్యాపకులు, నిజాం కళాశాల, హైదరాబాదు