Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ ప్రాంతాన్ని వందల ఏండ్ల కిందటే కాకతీయులు, శాతవాహనులు, నిజాం నవాబులు పరిపాలించారు. తమ ఏలుబడిలో చారిత్రక వైభవాన్ని సృష్టించారు. ఈ ప్రాంతంలో ఎన్నో సాంస్కృతిక కట్టడాలు దాగున్నాయి. వందల ఏండ్ల నాటి శిలాజాలు, కోటలు, గుళ్లు, గోపురాలు, విగ్రహాలు ఎప్పటికప్పుడూ తమ విశిష్టతను చాటుతూనే ఉన్నాయి. అందులో ఇప్పటికే పాత వరంగల్ జిల్లాకు తలమానికమైన రామప్ప గుడికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. హనుమకొండలోని వేయిస్తంభాల గుడి ఇదివరకే తన ప్రాముఖ్యతను చాటింది.అదే బాటలో మరో రెండు చారిత్రక వారసత్వ కట్టడాలకు ఐక్యరాజ్యసమితికి చెందిన 'యునెస్కో' పురస్కరాలను ఇటీవల ప్రకటించింది. ఆసియా-పసిఫిక్ విభాగానికి మన దేశం నుంచి నాలుగు పురస్కరాలు దక్కించుకోగా అందులో రెండు తెలంగాణకు చెందినవే కావడం మనకు గర్వకారణం.
సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణ (ఆసియా- పసిఫిక్) కింద కుతుబ్‌షాహీ టూంట్ పరిధిలో గోల్కొండ మెట్ల బావి 'ఆవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్'కు, కామారెడ్డి జిల్లా దోమకొండ కోట 'అవార్డ్ ఆఫ్ మెరిట్'కు ఎంపికయ్యాయి.అలాగే మహారాష్ట్రలోని ముంబైలో ఉన్న తొలి రైల్వేస్టేషన్ బైకులా, ఛత్రపతి శివాజీ వస్తు సంగ్రహాలయ మ్యూజియం పురస్కారాల్లో చోటు దక్కించుకున్నాయి.
ఎంగ్ టెంగ్ ఫాంగ్ చారిటబుల్ ట్రస్టుతో యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) సంయుక్తంగా ఈ అవార్డులను ఎంపిక చేసి పురస్కారాలు అందజేస్తోంది. ఈ అవార్డుల కోసం 11 దేశాల నుంచి 50 చారిత్రక కట్టడాలకు సంబంధించిన దరఖాస్తులు అందాయి.కానీ అందులో ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి చివరికి ఆరు దేశాలకు సంబంధించిన కట్టడాలు ఈ ఘనతను సాధించాయి. ఐదు కేటగిరీల్లో ఎంపిక చేసిన ఈ అవార్డులకు 13కట్టడాలు పురస్కారాల జాబితాలో చోటు దక్కించు కున్నాయి. వీటిలో నాలుగు భారత్, మరో నాలుగు చైనాకు దక్కగా ఇరాన్‌కు రెండు, థాయిలాండ్, అప్ఘానిస్తాన్, నేపాల్‌కు ఒక్కొక్కటి దక్కాయి. ఇందులో ఇండియా నుంచి నాలుగు కట్టడాలకు పురస్కారాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన విభాగం 'అవార్డ్ ఆఫ్ ఎక్సెలెన్స్' ఈ కేటగిరీలో ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ మ్యూజియం ఒక్కటే చోటు దక్కించుకోవడం విశేషం.రెండో కేటగిరీ అయిన డిస్టింక్షన్లో గోల్కొండ మెట్లబావి చోటు దక్కించుకుంది.అలాగే ముంబైలోని బైకులా రైల్వే స్టేషన్ మెరిట్ విభాగంలో స్థానాన్ని కల్పించుకుంది.
గోల్కొండ మెట్లబావి..
హైదరాబాద్‌లోని గోల్కొండ కోటను 17వ శతాబ్దంలో నిర్మించారు. హైదరాబాద్ సంస్థానంగా ఉన్నప్పుడు ఈ కోట నుంచే నిజాం పరిపాలన కొనసాగింది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణతో మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. కుతుబ్‌షాహీల సమాధుల ప్రాంగణంలో ఉన్న ఈ మెట్లబావి అద్భుతమైన నిర్మాణ కౌశలంలో రూపుదిద్దుకుంది.ఈ తరహాలో మెట్లబావులు కాకతీయుల కాలంలోనే ఎక్కువ నిర్మించారు. చారిత్రక గుర్తింపు ఆధారాలుగా కొన్ని గ్రామాల్లో బురుజులు, మెట్ల బావులు చెక్కు చెదరకుండా నేటికీ అక్కడక్కడ దర్శనమిస్తూనే ఉన్నాయి. అయితే గోల్కొండ కోటను కాకతీయులే నిర్మించినందున ఈ మెట్లబావిని కూడా వారే నిర్మించి ఉంటారనే వాదన ఉంది. భారీ వర్షాలతో బావి కొంతభాగం కూలిపోవడంతో అగాఖాన్ ట్రస్ట్ తన సొంత నిధులతో పునరుద్ధ రించడం, దానికి ప్రభుత్వం సహకారం అందించడంతో మళ్లీ అందులో నీటి ఊట ఏర్పడి పూర్వపు రూపాన్ని చేరుకుంది. దీని నిర్మాణాన్ని పునరుద్ధరించిన తీరు అద్భుతమని యునెస్కో పురస్కారాల జ్యూరీ అభిప్రాయ పడింది.
దోమకొండ కోట..
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఉన్న ఈ కోట సుమారు 39 ఎకరాల 20గుంటల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. చుట్టూ ఎత్తయిన రాతి కట్టడంతో ప్రహరీ, దాని చుట్టూ తీసిన కందకం నేటికీ కోట చెక్కు చెదరలేదు. కోటకు తూర్పు, పడమర దిక్కుల్లో పెద్ద ద్వారాలున్నాయి. సంస్థానాదీశుల ప్రధాన నివాసంగా వెంకటరాజభవనం రాజసం ఉట్టిపడేలా ఉంది. ఇందులోని అద్దాల మేడ పర్యాటకులను ప్రతేకం. ఇంకా అశ్వశాల, బురుజులు, నాలుగు దశాబ్దాల కింద రాతితో నిర్మించిన మహదేవుని ఆలయం సర్వంగా సుందరంగా తీర్దిదిద్దబడ్డాయి.ఈ కోటలోనే ప్రముఖ సినీ హీరో చిరంజీవి తన యుడు రామ్‌చరణ్-ఉపాసనల వివాహం కూడా ఇక్కడే జరిగింది.ఈ కోటను కొంతమందికి షూటింగ్‌లకు కూడా వాడుతున్నారు. ప్రస్తుతం దోమకొండ సంస్థానానికి అనిల్ కామినేని, సతీమణి శోభ కామినేని వారసులుగా ఉన్నారు. అర్కిటెక్ట్ అనురాధ నాయక్ కోట పరిరక్షణ బాధ్యతలు చూస్తున్నారు.
- నమిలికొండ అజయ్‌కుమార్