Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మధ్య భారతదేశంలోని మరో ముఖ్యమైన శిల్పం, విదీషలోని బారూత్ స్థూపం. ఇది అక్కడి సాంచి స్థూపం కంటే నైపుణ్యంతో నిర్మించిన పెద్ద స్థూపం. ఇదీ మధ్య భారతంలో, అన్ని దిశలకు వెళ్లే వ్యాపారస్థుల మార్గ మధ్యంలోనే ఉంటుంది. 1873లో అలెగ్జాండర్ కునింగమ్ అనే బ్రిటీషరు ఈ స్థూపాన్ని కనుగొన్నాడు. ఇది శిథిలావస్థలో ఉన్నా ఆ స్థలాన్ని పరిశీలించి ఇది 20 మీటర్ల చుట్టుకొలత ఉన్న అందమైన ద్వారాలు, తోరణాలతో కట్టబడిన స్థూపంగా లెక్కగట్టాడు. ఇటుకలతో కట్టబడిన ఈ నిర్మాణం 3 మీటర్ల వేదికతో, తూర్పు తోరణం ఒక్కటే మిగిలి ఉంది. ఈ తూర్పు తోరణం పై చెక్కిన శాసనం ప్రకారం, ఇది శుంగుల కాలానిదనీ, క్రీ.పూ. 100 సం|| నుండీ క్రీ.పూ. 80 మద్య కట్టబడిందని తెలుస్తుంది. అంతేకాదు, అక్కడ రాసిన శాసనాలు ఈ స్థూపానికి సంబంధించి మరెన్నో విషయాలు తెలియజేశాయి. ఈ స్థూపానికి సంబంధించిన ఒక్కో భాగం ఎంతో మంది సామాన్య ప్రజలు కలిసి వారి ఆధ్మాత్మిక ఆనందం కోసం బహుమతిగా కట్టించినవే.
ఈ స్థూపం వేదిక తోరణం, తోరణంలోని జత కలుపబడిన ఆకృతుల మధ్య ఉన్న పద్ధతి కానీ, ఇదీ అంతకు ముందు ఉన్న చెక్క కట్టడాల పద్ధతిలోనే నిర్మించారని తెలుస్తుంది. మిగిలి ఉన్న తూర్పు తోరణం చూస్తే, తోరణానికి లోపలి వైపూ, బయటి వైపూ, రెండు వైపులా జంతువులూ, ప్రకృతి ఆకృతులు చెక్కబడి అందంగా తీర్చి ఉంటాయి. తోరణాల అంచులు మొసలి తోకలా తీర్చి అంతం అవుతాయి. మొసలి ఆకృతులు, నీటికి, పారే నదికీ చిహ్నంగా, ఒక శుభ సూచికంగా నిర్మాణాలపై చెక్కే వారు. ఈ తోరణం అడుగు భాగంలో ఉన్న కమలం పూరేకులు బోర్లించిన దిమ్మె, దానిపై కూర్చున్న సింహాలు, తోరణంపై భాగాన ఉన్న చక్రం, మౌర్యుల కాలం నాటి నుంచీ వస్తున్న బౌద్ధ గుర్తులనే ప్రతిబింబిస్తాయి. ఈ కట్టడానికీ మౌర్యుల కాలం నాటి నాణ్యమైన మెరుపు పెట్టబడలేదు. తోరణం అడ్డ పట్టలపై అటు ఇటూ ఏనుగులతో గజలక్ష్మి చిత్రం, కల్పలత అనే కోరికలు తీర్చే తీగ మొక్క, దానికి వరుసలల్లో పూలు, పళ్లు, రత్నాలు వేలాడుతుంటాయి. సాంచీ స్థూపంలో ఉన్నట్టే ఇక్కడా సామాన్య మానవులకు ఆనందం కల్గించే, చిత్రాలే కనిపిస్తు న్నాయి. తోరణం మీది ఈ చెక్కడాలు గొప్ప నైపుణ్యం చూపకపోయినా వేదిక మీది ఎన్నో శిల్పాలు మన ప్రశంసలు అందుకోవలసిన అవసరం ఉంది. ఆ శిల్పాలూ మనకు కొన్ని విషయాలు తనంతటా తానుగా చెపుతాయి. వాటిని పరీక్షించి చూడవలసిన బాధ్యత మనది.
వేదిక స్తంభంపై ఏనుగుపై సవారీ చేస్తున్న మానవ రూపం, ఇంకా ఏనుగు చిన్నదిగా ఉంటాయి. ఇది బహుశా శిల్ప కారులు మనకు చూపిన విషయం ఏంటంటే, ఆ సవారీ రాజు కాదు రాజకుమారుడిదని. ఖడ్గం ఢాలు పట్టి, ఉపవస్త్రం నడుముకు చుట్టి, తలకు చుట్టిన పట్టీ, కాళ్లకు బూట్లతో ఉన్న ఒక సైనికుడి శిల్పం కనిపిస్తుంది. ఇది గ్రీకుల కట్టు. ఆ శిల్పంలో ఉన్న బౌద్ధ చక్రం, త్రిరత్నం, అతని చేతిలోని ద్రాక్ష తీగ ఆకులు, ఈతను బౌద్ధం కాపాడే ధర్మపాలుడనీ, ఆతని కట్టు, బూట్ల వలన గ్రీకు వాడనీ తెలుస్తుంది. విశదంగా చెక్కబడిన మరో శిల్పం నాగరాజు శిల్పం. అక్కడ రాసి ఉన్న శాసనం ప్రకారం ఈతను 'చకవాక' అనే నాగరాజు. యక్షులకు మల్లే నాగదేవతలూ, వృద్ధీ, సంపత్తికీ చిహ్నాలు. బౌద్ధంలో నాగులకు ప్రత్యేక స్థానం ఉంది.
బారూత్ వేదిక స్తంభంపై, ఒక ఆరుతేరిన శిల్పకారుడి చేతి నుంచీ చెక్కబడిన ఒక స్త్రీ శిల్పం ఉంది. ఇది ఒక మేలైన శిల్పమేకాదు, జాగ్రత్తగా చూస్తే మరిన్ని విషయాలు మాట్లాడాలని పిస్తుంది. కొన్ని ప్రశ్నలూ వేయాలని పిస్తుంది. వంపులు తేలిన శరీర సౌష్ఠవం, ఎంతో వయ్యారంగా అశోక చెట్టు కాండం చుట్టూ వేసిన ఎడమ కాలు, ఎత్తి పట్టిన భంగిమలో ఎడమపాదం, కుడి చేయి పైకెత్తి అశోక చెట్టు కొమ్మని పట్టుకుని నిల్చుని ఉంటుంది. కొమ్మకు అందంగా ఆకులు, పూలు, ఆమె తలకు చుట్టి ఉన్న రుమాలుపై అందమైన డిజైన్లు, నుదుటి వరకూ మడతలు వేసి ఉన్న రుమాలు, పొడవైన వాలు జడ నడుముకు వెనుకకు జారి ఉండగా, అందమైన ఆభరణాలు ధరించిన స్త్రీ రూపం అందమైన శిల్పం. మెడలో ధరించిన వెడల్పైన ఆభరణంలో రెండు రావి ఆకుల డిజైను, త్రిరత్నం అనబడే పతకం ఉంటాయి. అంటే ఈ శిల్పం బౌద్ధానికి గుర్తు. ఈ స్త్రీ రూపం మకరంపై నిల్చుని ఉంటుంది. కొన్ని దేవతా రూపాలు వాహనంపై ఉన్నట్టు చూపుతారు. లేదా కాళీ, మహీషుణ్ణి చంపి ఆ రాక్షసుడిపై నిల్చుని ఉంటుంది. మకరం పారే నదికి గుర్తు. శుభ సూచకం. అక్కడి రాసి ఉన్న శాపనం ప్రకారం ఆమె 'చంద్ర యక్షిణి' అని గుర్తించారు. యక్షులు, నాగదేవతలు బౌద్ధంలో పూజార్హులు. అభివృద్ధికి, ఐశ్వర్యానికి గుర్తు. అశోక చెట్టుని చుట్టి ఉన్నందున ఆమెను 'అశోక దోహద' అని కూడా అంటారు. ప్రాకృత భాషలో దోహద అనేమాట గర్భిణులకు వాడతారు. ఆమె తన, మరి తన శిశువు స్పందించే గుండెని, రెంటినీ తనలో ఉంచుకుందనీ అర్థం. ప్రాచీన భారతంలో మరో నమ్మకం ఉంది. రాయబడింది కూడా. అందమైన స్త్రీ చెట్టుని వాటేసుకుంటే మోడుబారిన చెట్టు కూడా పూలు పూస్తుందని. అశోక చెట్టుని పట్టుకుంటే 'అశోక దోహద' అంటే సాల చెట్టుని పట్టుకుంటే 'సాల భంజిక'గా గుర్తించబడుతుంది. ఈ అశోక దోహద శిల్పం ఎదురుగా మరో అందమైన స్త్రీ శిల్పం 'సిరిమా దేవత' చెక్కబడింది.
20వ శతాబ్దపు స్త్రీ వాదం ప్రకారం ఈ అందమైన స్త్రీ శిల్పాల వైపు చూసి ఒక ప్రశ్న వేయవచ్చు. ఈ శిల్పాలు అలా వయ్యారంగా ఎందుకు చెక్కబడ్డాయి? పురుషులు తమ ఆనందం కోసం చెక్కించినవా? లేక పురుషుల దృష్టిని ఆకర్షించటం కోసం చెక్కించినవా? విద్యా దహేజియా అనే ఒక కళా చరిత్ర కారిణి విషయం రాస్తూ ఇలా అంది, ఆనాటి శిల్పాలను అర్థం చేసుకోవా లంటే, ఈ శిల్పాలు చెక్కించ టానికి దోహదం చేసిందెవరు, అలాగే ఈ శిల్పాలను చూసేదెవరూ అనే విషయం గుర్తించా లంది. ఈ శుంగుల కాలం నాటి శిల్పం, రాజులే కాదు, సామాన్య ప్రజలు, బౌద్ధ భక్తులూ చెక్కించారనే విషయం ఇది వరకే మనం మాట్లాడాము. బారూత్ స్థూపం 3 వంతుల్లో 2 వంతులు బౌద్ధ భిక్కులు, సామా జిక స్త్రీలు దానాలు ఇచ్చి కట్టించారు. సిరిమా దేవత శిల్పం ఒక స్త్రీ భిక్కు చెక్కిస్తే, చంద్రయక్షి బుద్ధ రఖిత అనే భిక్కుడు, సందర్శన యక్షికి, కన అనే భిక్కుడు, చులకోక దేవత అనే చెట్టు కింద నిలుచున్న యక్షి శిల్పం పమధక అనే భిక్కుడు దానా లిచ్చి చెక్కించారు.
అంతే కాదు సాంచిలోని శిలా ఫలకాల ప్రకారం, ఆ స్థూపం కట్టడానికి సగం పైన ఖర్చు స్త్రీలే దానం ఇచ్చి కట్టించారు. అలాగే 1 లేదా 2 వ శతాబ్దాలకు చెందిన అమరా వతి స్థూపం స్త్రీ భిక్కు ణీలు, నాగా ర్జున కొండ పూర్తిగా రాజ కుటుం బపు స్త్రీలు కట్టించారు. అంటే ఆ కాలంలో స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నదనే అర్థం. అలా అని విద్యా స్వాతంత్య్రం ఉందా అంటే ఆలోచించ వలసిన విషయం.
సాహిత్య పరంగా చెప్పిన విషయాలు పరిశీలించి చూస్తే రాజులు, ఆస్థాన పురుషులు సంస్కృతం మాట్లాడితే, రాణి వాసం స్త్రీలు అందరికీ అందుబాటులో ఉన్న ప్రాకృతమే మాట్లాడే వారట.
మళ్లీ వెనక్కి, ఎందుకు ఈ స్త్రీ శిల్పాలు చిక్కించి ఉంటారు అనే ప్రశ్నకు వెళితే, బౌద్ధ స్థూపాలు, బౌద్ధుల ఆరాధనల కోసం నిర్మించిన పవిత్ర స్థానాలు. ఇక్కడికి స్త్రీలు, పురుషులు, యువత, ముసలివారు అందరూ వస్తారు. చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నప్పుడు అక్కడి శిల్పాలు దేవతా స్వరూపాలుగా చూడటం కోసం నిర్మించిన శిల్పం ఇది. స్త్రీ శిల్పాలు, దేవీ మాతృకలని, హరప్ప సంస్కృతి నుంచీ కనిపిస్తాయి. ఇప్పుడే చెప్పుకున్నాము స్త్రీ ముట్టుకుంటే అశోకచెట్టు ఫలిస్తుందని. అంటే స్త్రీ రూపం అభివృద్ధికి, ఐశ్వర్యానికి గుర్తుగా చెక్కారు. స్త్రీలు తాకితే, చెట్టు, స్త్రీ, వారి స్త్రీత్వాన్ని, ప్రకృతిని ఒకరితో ఒకరు పంచుకుంటారు.
క్రీ.శ. 4, 5 శతాబ్దాలలో కాళిదాసు 'మాళవికాగ్నిమిత్ర' అనే నాటకం రాసాడు. క్రీ.పూ. 2వ శతాబ్దపు మనం ఇప్పుడు మాట్లాడుతున్న శుంగుల రాజు, పుష్యమిత్ర శుంగుడి కొడుకు అగ్నిమిత్రుడి గురించి ఈ నాటకం. ఆతని రాణి వద్ద ఆశ్రయంలో మాళవిక అనే ఒక రాకుమారి ఉంటుంది. మాళవికాగ్నిమిత్రులు ఒకరినొకరు ఆకర్షితులౌతారు. ఆమెతో ఒకసారి రాణి , 'నా కాలుకు దెబ్బ తగిలింది, నీవు అశోక వృక్షానికి విధులు చేసి, 5 రోజులలో కాతకు, పూతకూ తెప్పిస్తే నీవు అడిగినదిస్తానంటుంది'. ఆమె అలంకరించిన పాదాలతో చెట్టుని తాకటానికి సిద్ధమౌతుంది. సంస్కృత తంత్ర సారంలోనూ రాసిన ప్రకారం, వకుళ, కర్ణకార వృక్షాలు, స్త్రీ తన నోటి లాలా జలాన్ని చిలకరిస్తే, అది అమృతంలా మారి పూస్తుంది. కర్ణకార, స్త్రీల సంభాషణ విన్నా పూస్తుందంట. మామిడి, వేప స్త్రీల నవ్వుల కిలకిలతో పూతకొస్తుంది. తిలక (కుంకుమ పువ్వు), రుద్రాక్ష పిమాల పండు, స్త్రీ పాట విని పూస్తాయి. కురువకం, సింధువారం చెట్టు, స్త్రీ ఆ చెట్లను కౌగిలించుకుంటే పూస్తాయి. కదంబచెట్టు, చంపకం, స్త్రీ ముట్టుకుంటేనే పూస్తాయి.
మందిరాలు, ఇమారతాలు కట్టేటప్పుడు స్త్రీ చిత్రం తప్పక ఉండాలని శిల్ప శాస్త్రాలూ చెప్పాయి. శిల్ప ప్రకాశ అనే ఒడియా శిల్ప శాస్త్రం స్త్రీ చిత్రం లేకపోతే ఆ నిర్మాణం ఫలించదనీ, 16 రకాల స్త్రీ మూర్తులు, ఆలసకన్య, తలుపు వెనుక కన్య, దర్పణ సుందరి, పద్మగంధ, కేతకీబంధ, దళమాలిక, ముగ్ధ, మానిని, విన్యాసకన్య, గంధన, శుకసారిక, నర్తకి, మద్దెల సుందరి, నాట్య సుందరి, చామర ధరణి, మాతృమూర్తి, ఇలాంటి కొన్ని రకాల ప్రణాళికలతో స్త్రీ చిత్రాలు చెక్కటం శుభ సూచికం అని చెప్పింది. బారూత్ స్థూపమూ స్త్రీ మూర్తిని దేవతారూపంగానే చెక్కింది. ఆ నాటి నుంచీ ఉన్న నమ్మకాలే కదా శాస్త్రాలుగా రాయబడ్డాయి.
- డా|| ఎం.బాలమణి, 8106713356